ప్రేరణాత్మక నవల ‘అపజయాలు కలిగిన చోటే..’

0
3

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘అపజయాలు కలిగిన చోటే..’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా భారతీయ రైల్వేలో ఉన్నతాధికారిణి అయిన డా. చెళ్ళపిళ్ళ సూర్య లక్ష్మి రచించిన మొదటి నవల ‘అపజయాలు కలిగిన చోటే..’. ఆంధ్రభూమి వారపత్రిక నిర్వహించిన నవలల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన నవల ఇది.

దివ్యాంగురాలైన చేతన అనే ప్రభుత్వోద్యోగికి విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు, హేళనలు, – వాటిపై ఆమె పోరాడి, వాటిని అధిమగమించిన తీరు ఈ నవల సారాంశం. ఈ నవలలో ఆమెను అకారణంగా ద్వేషించే మనుషున్నట్టే, అర్థం చేసుకుని అండగా నిలిచే వ్యక్తులూ ఉంటారు. అటువంటి మంచి మనుషుల సహాకారంతో తాను గెలవటమే కాక, తన లాంటి మరికొందరికి ఆసరాగా నిలిచేలా ఓ సంస్థకి తోడు అవుతుంది చేతన.

ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి, జరుగుతున్న నిర్లక్ష్యం గురించి చేతన ఎంతో ఆవేదన చెందుతుంది. శారీరక వైకల్యాన్ని అడుగడుగునా గుర్తు చేస్తూ; సామర్థ్యాన్ని, మేధని పట్టించుకోని వ్యక్తులతో, అధికంగా అలాంటి వ్యక్తులతోనే నిండిన వ్యవస్థతో పోరాడుతుంది చేతన. గెలిచాకా, మరో ఉన్నత లక్ష్యం కోసం ఆ ఉద్యోగాన్ని వదులుకుంటుంది.

ఉన్నతాశయాలని సాధించే క్రమంలో ఆమె వ్యకిత్వం కాంతులీనుతుంది.

~

తన వైకల్యం పట్ల చిన్నతనం నుంచే హేళనలు చవిచూసిన చేతన బాగా చదుకుంటునే, శారీరక మానసిక ఆరోగ్యాలకి అవసరమైన వ్యాయామాలు, యోగా వంటివి చేస్తూ ఉంటుంది. పనిమనిషి నుంచి దగ్గర బంధువు వరకూ అందరూ ఆమెని గేలి చేసేవారే.

అలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మొదట్లో బాధపడినా, ఆ అవహేళనలనే జీవనపోరాటంలో తన అస్త్రాలుగా మార్చుకుని పోరాడుతుంది.

బాల్యం నుండి ఆమెకు తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించింది. ఏదైనా పని చేయలేకపోయినా, సక్రమంగా రాకపోయినా – తండ్రి గాని, తల్లి గాని ఆమెను ఎప్పుడూ నిరాశపరచరు. పైగా మంచిమాటలు చెప్పి మళ్ళీ కృషి చేసేలా చేస్తారు. చేతన చేసే ప్రయత్నంలో తామూ భాగమవుతారు.

సెర్చ్ ఇంజన్‍లు కొత్తగా వచ్చిన రోజులవి. కలిగిన వాళ్ళు ఇంట్లో అసెంబుల్డ్ పిసిలు కొనుక్కుని, పిల్లలకి అదనపు విజ్ఞానం అందేలా చూశారు. చేతన క్లాస్‌మేట్ ఆకాంక్ష అనే అమ్మాయి – తన విజ్ఞానం పెంచుకునే క్రమంలో వైకల్యం గురించి తెలుసుకుని ఆ మిడిమిడి జ్ఞానంతో చేతనని అడగకూడని ప్రశ్నలడిగి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఓ వైద్యుడిని సంప్రదిస్తే చేతనది – పోలియో కాదని, హెమీప్లీజియా అనే జబ్బు అని చెప్పి – కొన్ని ముఖ్యమైన సూచనలని చేస్తారు ఆయన.

చదువులు రాణిస్తూ, క్లాసులో టాప్ ర్యాంక్‍లో వస్తుండటంతో – క్లాసులో చాలామంది చేతన వైకల్యాన్ని హేళన చేస్తారు. ఇలాంటి వాళ్ళతో సమాధానపడుతూ – మేధని పెంచుకుంటూ – రాణించి – ప్రభుత్వోద్యోగం సాధిస్తుంది చేతన.

~

ట్రైనింగ్ పీరియడ్‍లోనూ కొన్నిసార్లు స్పష్టమైన, కొన్నిసార్లు అవ్యక్తమైన వివక్షని ఎదుర్కుకుంటుంది చేతన. ఉద్యోగం సాధించిన తొలి రోజుల్లో విశిష్ట్ అనే ఒకతను పెళ్ళిచూపులకి వస్తాడు, ఫొటోలో ఆమె ‘డిఫెక్ట్’ సరిగా తెలియలేదని, అయినా ప్రభుత్వోద్యోగి కాబట్టి ప్రయత్నించి చూద్దామని వచ్చిన అతను చేతనని బాగా డిస్ట్రర్బ్ చేస్తాడు. ‘మాణిక్యం’ అనే సినిమా చూసి మనసుని కుదుటపరుచుకుంటుంది.

‘ఓవర్సీస్ ట్రైనింగ్’లో భాగంగా అమెరికా వెళ్ళిన చేతనకి దివ్యాంగులకి అక్కడి సౌకర్యాలు, తోటివారు చేసే సహాయాలు నచ్చుతాయి. స్వదేశంలో జరిగిన ఓ శిక్షణా కార్యక్రమంలో – శిక్షణలో భాగంగా చదవాల్సిన పుస్తకాలని మోయలేక, చేతన సహాయం అడిగితే బ్యాచ్-మేట్స్ విభిన్నంగా ప్రవర్తించి తప్పుకుతిరుగిన వైనం గుర్తుచేసుకుంటుంది చేతన. స్వదేశానికి వెళ్ళాకా, మార్చాలినవి ఎన్నో ఉన్నాయని గ్రహిస్తుంది.

~

శిక్షణలో ఉండగా సహచరులతో కలిసి కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంది చేతన. మహాన్ అనే స్నేహితుడు ఆమెకి అన్ని విధాల తోడ్పతాడు. ఆ బృందంలోని ఒకరు హేళన చేస్తే, బదులుగా మహాన్ – చేతనకి నచ్చజెప్పి – గురుశిఖరం ఎక్కిస్తాడు. ఆమెలోని విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందా చర్య.

~

పోస్టింగ వచ్చాకా, ఎనో ఊర్లు తిరుగుతుంది చేతన. సౌకర్యాల విషయంలో తనకి వీలైన మార్పులు చేస్తుంది. మరోక ఊర్లో పిఫ్ డబ్బుల్ని సేవింగ్ బ్యాంక్ డబ్బుల్లా వాడుకునే ఓ తాగుబోతుకి పిఫ్ శాంక్షన్ చేయడానికి నిరాకరిస్తే – కుంటి ఆఫీసర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయిస్తాడతను. అతనిపై ఫిర్యాదు చేస్తే, లిఫ్ట్ లేని ఆఫీసుకు చేతనని బదిలీ చేస్తారు. ఆ ఆఫీసులో మరొక దివ్యాంగురాలిని చూసి ఆమె సమస్యలని తెలుసుకున్న చేతన వాటికి ఏదైనా పరిష్కారం చూపాలనుకుంటుంది. పై అధికారిని సంప్రదించి – దివ్యాంగుల చట్టం ప్రకారం పబ్లిక్ భవనాలలో ర్యాంప్‍ల సదుపాయం కల్పించవచ్చని చెప్పి లిఫ్ట్‌ ఏర్పాటుకి ఒప్పిస్తుంది. ఆయన అనుమతించినా, నియమ నిబంధనలలోని లోపాల వల్ల లిఫ్ట్ ఏర్పాటు చాలా ఆలస్యమవుతుంది.

మరొక ఊరిలో మహిళా అధికారిణి చేత అవమానాలు ఎదుర్కుంటుంది చేతన. ఆమె మనసు మొద్దుబారిపోతూ ఉంటుంది. ఒక బిల్లులోని అవకతవకల్ని గుర్తించి పై అధికారికి చెప్తే, ఆయన చూసీ చూడనట్టు పొమ్మంటాడు. అయితే ఆ ఫైల్‍ని వెంటనే తెచ్చివ్వమని అడుగుతాడు. ఆయన వద్దకి వెళ్ళి ఫైల్ ఇచ్చే క్రమంలో మెట్లు మీద నుండి పడిపోతుంది చేతన. ‘లిగమెంట్ టేర్’ అవుతుంది.

ఇలా తను పని చేసే చోటల్లా హేళనలు భరించి, తన హక్కుల కోసం పోరాడిన చేతనను వీలైనంత వేధింపులకు గురి చేస్తారు చాలామంది పై అధికారులు. కొద్దిమంది అధికారులు మాత్రం సిన్సియర్‍గా ఆమెకు సాయం చేస్తారు.

~

తన శారీరక సమస్యకి మందులు వాడుతూనే, మానసికంగా దృఢత్వం సాధించటం కోసం చేతన యోగా అభ్యసిస్తుంది. అయినా ఒకదశలో శరీరంపై అదుపు కోల్పోయి స్థూలకాయం వచ్చేస్తుంది. అప్పుడో వైద్యుడు చేసిన సూచనలు ఆమెకు మేలు చేస్తాయి.

~

ఇలా అడుగడుగునా పోరాడుతూ వస్తున్న చేతనకి మరో పెద్ద సవాలు ఎదురవుతుంది హర్షవర్ధన్ రూపంలో. ఆఫీసులో కనీస అవసరాలు కల్పించకుండా వేధిస్తే, చేతన కోర్టులో కేసు వేస్తుంది. జాయ్ అనే స్నేహితుడి సాయంతో దీర్ఘకాలం పోరాడి కేసులో విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో చేతన ‘బలం’ అనే సేవా సంస్థకి ఆలంబన అవుతుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన తన సంస్థకి బలం చేకూర్చాలని నిర్ణయించుకుంటుంది.

~

వివిధ కార్యాలయాలలో, బ్యాంకులలో, బహిరంగ స్థలాల్లో దివ్యాంగులు ఎంత హేళనని అవమానాల్ని ఎదుర్కుంటారో ఈ నవల ప్రస్తావిస్తుంది. దివ్యాంగుల పట్ల సమాజంలో చాలామందిలో పేరుకుపోయిన చిన్నచూపుని ఈ నవలలో చాలా నిశితంగా పేర్కొన్నారు రచయిత్రి.

ఓ ధీర పోరాటాన్ని చాటిన ఈ నవల సానుకూల దృక్పథంతో సాగి ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది.

“I’m officially disabled, but I’m truly enabled because of my lack of limbs. My unique challenges have opened up unique opportunities to reach so many in need.” అంటాడు Nick Vujicic.

దివ్యాంగులు చేతకానివారు కాదని, వారు ఇతరత్రా సమర్థులని నిరూపిస్తుంది ఈ నవల.

***

అపజయాలు కలిగిన చోటే.. (నవల)

రచన: డా. చెళ్ళపిళ్ళ సూర్యలక్ష్మి

పేజీలు: 188

ధర: ₹ 250 రూపాయలు. పోస్టేజ్‍తో కలిపి ₹ 286/-

ప్రతులకు: సెల్‌ 9731492299

(ఈ నెంబర్‍కి జీపె/ఫోన్ పే చేసి మీ చిరునామా పంపితే, పుస్తకం రిజిస్టర్‍లో పోస్టులో పంపబడుతుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here