కలవల కబుర్లు-43

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]కొం[/dropcap]దరుంటారు.. వాళ్ళని ఎవరైనా, ‘చాలా రోజుల తర్వాత కనపడ్డారు. ఎలా వున్నారు?’ అని అడిగారే అనుకోండి..

‘బానే వున్నామండీ!’ అనొచ్చు కదా! చచ్చినా అనరు..

ఇక హనుమంతుడి తోక లాగా వాళ్ళకి, వాళ్ళతో పాటుగా వారు కుటుంబ సభ్యులందరి అనారోగ్యపు చిట్టాలని చదవడం మొదలెడతారు.

‘ఏం చెప్పమంటారూ? కర్ణుడి కవచ కుండలాల లాగా ఆ బిపీ, సుగరూ అంటి పెట్టుకున్నాయండీ. ఆ డాక్టరేమో వాకింగ్ చేయమంటాడు. ఆయన సొమ్మేంపోయిందీ.. అలాగే అంటాడు. కానీ కాస్త నడిస్తే చాలు గుండె దడదడలాడిపోతుంది. పైగా ఎక్కువ నడిస్తే మోచిప్పలు అరిగిపోతాయేమోనని అనుమానం. వంగితే భరించలేని నడుం నొప్పి. కూర్చుంటే కాళ్ళు తెగ పీకుతాయి. వాటితోపాటు అరికాళ్ళు చురచుర మంటలు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం’.. ఇలా ఇది వందేభారత్ రైలంత స్పీడుగా వెడుతూనే వుంటుంది ఆ లిస్టు.

ఎందుకడిగామురా భగవంతుడా! అనిపిస్తుంది మనకి. కాసేపుంటే ఆ లిస్టంతా మనకి కంఠోపాఠం అయిపోతుందేమో కూడా.

ఇక మరోరకం వాళ్ళు.. మనమేం అడక్కపోయినా సరే.. వాళ్ళ వాళ్ళ రోజూవారీ కబుర్లు, వాళ్ళ పిల్లల సంగతులు, చుట్టాల ముచ్చట్లు.. ఇహ ఇలా అంతులేని కథలాగా, ఏళ్ళతరబడి సాగిపోయే టీవీ సీరియల్స్ లాగా చెపుతూనే వుంటారు.. చెపుతూనే వుంటారు. ఒకటి మొదలెట్టి, మరోదాంట్లోకి వెళ్ళి.. అక్కడ నుంచి మరెక్కడికో తిరిగి, మలుపులు తిప్పుతూ చివరకి ఏ టాపిక్‌తో ముగిస్తారో వాళ్ళకే తెలీదు.

పొరపాటున వీళ్ళని మనం పలకరించడమో లేదా ఏదైనా సమాచారం కోసం అడిగామే అనుకోండి.. పట్టుకున్న జలగైనా వదులుతుందేమో కానీ వీళ్ళు వదలరు.

మనింట్లోకి మనమేదైనా వస్తువు కొన్నామే అనుకోండి, మనం చెప్పకపోయినా.. వాళ్ళకి తెలుసుకునే, లేదా తెలియచేసుకునే తెలివితేటలు పుష్కలంగా వుంటాయి. వెంటనే మొదలెడతారు.

‘కొత్త సోఫా కొన్నారటగా! మాతో మాట వరసకైనా చెప్పనేలేదేం? ఎక్కడ మేమొచ్చి కూర్చుంటామనే? (నిష్టూరాలు కూడాను) ఏంటీ? లక్షరూపాయలైందా? బంగారం పోత పోసారా ఏంటి? ఈ మధ్యనేగా మా ఆడపడుచు కొందీ.. పదివేలయిందని చెప్పింది. అదే శుద్ధ దండగ అనుకున్నాను. మీది లక్ష అంటే మొత్తం బూడిదలో పోసిన పన్నీరేగా! అంత ఖరీదేంటీ? కడుపు నిండనా? కాలు నిండనా?’ ఇలా అంటోంటే.. ముందు మనకి కడుపు మండడం ఆ తర్వాత ఒళ్ళు మండడం ఖాయం.

ఏ పండక్కో ఏం చీర కొన్నారూ? అంటూ, వాళ్ళు అడక్కా మానరు.. మనం చూపించకా మానం..

‘దీనికి ఎనిమిది వేలు పెట్టారా? ఏముందండీ ఈ చీరలో.. సేమ్ ఇదే అంటే.. ఇంచుమించు ఇలాంటిదే.. నాకూ వుంది.. మీరు చూసే వుంటారు. మా పెద్దమ్మాయి తోడికోడలి గృహప్రవేశంకి కట్టుకున్నాను కూడా.. ఆ రోజు మేము వెడుతూంటే మీరు లిఫ్ట్‌లో ఎదురయ్యారు కూడా.. ఏం గుర్తులేదూ!’ ఇలా సాగుతూండగా.. ఏ రోజు లిఫ్ట్‌లో ఈవిడ నాకు ఎదురయిందబ్బా అని మనం ఆలోచనలో వుండగానే, మళ్లీ కంటిన్యూషన్ మొదలెడుతుంది. ‘నాది మరో రంగనుకోండి.. క్లాత్ వెరైటీ మాత్రం సేమ్ ఇదే.. బోర్డర్ కూడా ఇంతే వెడల్పు.. కాకపోతే నా చీర బోర్డర్‌లో నెమళ్లున్నాయి.. మీ చీరలో ఏనుగులున్నాయి..’ ఇలా ఇదంతా చెపుతోంది కానీ, నా చీర రేటుకీ, తన చీర ఖరీదుకీ ఎన్ని వేల తేడా చెపుతుందో.. అనవసరంగా ఎనిమిది వేలు తగలేసానా ఏంటి? అని మన ఆలోచనలో వుండగా చిన్నగా చెపుతుంది. ‘నేను వందనా సిల్క్స్‌లో ఏడువేల ఐదొందలకే కదా కొన్నాను. కొని నాలుగేళ్ళు కూడా కాలేదు. మీరు అనవసరంగా మరో ఐదొందలు ఎక్కువ పెట్టేసారు. నాకు చెపితే నేనూ వచ్చి.. బేరం చేసి తక్కువ రేటికి ఇప్పించేదాన్ని కదా!’ అంటూ తనకీ, నాకూ మధ్య వున్న ఐదొందలరూపాయల తేడాని చల్లగా చెపితే.. మనకి వేడెక్కక మానదు. ‘నాలుగేళ్ళకితం వున్న రేట్లు ఇప్పుడుండవు కదండీ! ఎప్పటికప్పుడు మారిపోతూవుంటాయి’ అంటూ మన చీరని లుంగచుట్టి ఇంట్లోకి తీసుకువెళ్ళి పోతాము.

అసలు కొందరు జనాలు.. తమ గురించి, తమ ఇంటి గురించి, ఇంట్లో పనుల గురించి ఆలోచనే వుండదు. కానీ ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్ళల్లో ఏం జరుగుతోందా అనే దుగ్ధ ఎక్కువగా వుంటూంటుంది.

మనం బజారుకి వెళ్ళడం చూస్తే చాలు.. మనం వచ్చేదాకా మన ఇంటి ముందు కాపలా కాచుకుని కూర్చుంటారు. మనం రాగానే.. మనల్ని ఇంట్లోకి కూడా పోనీకుండా.. మనం చేసిన షాపింగ్ మొత్తం వారికి తెలియచేయాలి.

ఇలా రకరకాల జనాలు మనచుట్టూ వుంటారు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు మనం కూడా వీటిలో కొన్నిటికి సరిపోయేలా వుండవచ్చేమో కదూ.. ఏంటో.. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టవుతుంది.

సరే వచ్చేవారం మరి కొన్ని కబుర్లు చెప్పుకుందాం కానీ.. రేపు దీపావళి పండగ కదా.. రాక్షసత్వం మీద దైవత్వం విజయం సాధించిన రోజు. చక్కగా సాయం సమయంలో లక్ష్మీదేవి పూజచేసుకుని, మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఇల్లంతా అలంకారం చేసుకువి.. గోగుకాడలకి నూనెలో తడిపిన వత్తులు కట్టి, వెలిగించి వాటి మీద గుగ్గిలం వేసి.. ‘దిబ్బు దిబ్బు దీపావళి.. మళ్లీ వచ్చే నాగులచవితి’ అంటూ ఆ కాడలను నేలకేసి కొట్టి, కాళ్ళు చేతులు కడుక్కుని, నోరు తీపి చేసుకుని.. ఎంచక్కా టపాకాయలు కాల్చుకోండి. జాగ్రత్త.. కాటన్ దుస్తులు ధురించాలి.

వాతావరణానికి హాని కలగించని టపాకాయలు మాత్రం కాల్చుకుందాము. పండుగని ఆనంద సంతోషాలతో గడుపుకుందాము.

సంచిక నిర్వాహకులకీ, పాఠక ప్రేమికులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here