పాలస్తీనా.. (నా దేశం)

0
4

[పాలస్తీనా యుద్ధం మీద పాలి గర్ల్. ఎస్. రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Pali Girl S’s poem ‘Palestine (My Country)’ by Mrs. Geetanjali.]

~

[dropcap]గు[/dropcap]లాబీలు ఎర్రగా ఉన్నట్లే..
పాలస్తీనీయులు గోధుమ రంగులో ఉంటారు.
వాళ్లంతా నా జాతి.. నా మనుషులు!
అందుకే.. నా పాలస్తీనా గొప్పదనాన్ని
ఏ మాత్రమూ తక్కువ చేయలేను.
నా పాలస్తీనా జాతిని రహస్యంగా దాచి ఉంచలేను.
నా పాలస్తీనా రక్తాన్ని అగౌరవ పరచలేను..
ఎంత దుర్భరమైన.. కఠినమైన వాస్తవంలోనైనా..
ఎన్ని కష్టాల్లోనైనా..
నా పాలస్తీనా ప్రజలారా.. మీ పక్కన నేనుంటాను.
మన మరణం చివరి క్షణం వరకూ..
మన పాలస్తీనా జెండా సమున్నతంగా ఎగురుతూనే ఉంటుంది.
మిగతా వారిలా గుసగుస లాడకుండా దిక్కులు పిక్కటిల్లేలా
ఈ కవితని నేను అరిచి.. అరిచి మరీ చదువుతాను.
ఎందుకంటే.. ప్రతీ ఒక్కరికీ పాలస్తీనీయులు
ఎంత సహృదయులో బాగా తెలుసు!
నిజమేంటో కూడా తెలుసు!
పాలస్తీనీయుని రక్తం అచ్చం నా రక్తంతో పోలి ఉంది..
అందుకే పక్కకి తప్పుకోండి..
నన్ను వారి దగ్గరికి చొచ్చుకు పోనివ్వండి..
ఎందుకంటే ఇదంతా పాలస్తీనీయుల
యుద్ధ దళానికి కూడా సంబంధించినది కాబట్టి!
జీవితమెలాగూ నిన్ను మింగేస్తుంది.. మరణం అనివార్యం!
కానీ నువ్వు పాలస్తీనీయుడివైతే మాత్రం
నువ్వు సగర్వంగా అమరుడవుతావు!

~

మూలం: పాలి గర్ల్. ఎస్.

అనుసృజన: గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here