[పద్మా దాశరధి గారు రచించిన ‘బలాబల ప్రదర్శన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]పె[/dropcap]ను అలలతో పొంగే సునామిలా నా సర్వస్వం ముంచెత్తి
నీలో కలిపేసుకోవాలని చూసే నువ్వు!
చలనం లేక, భూమిలో పాతుకుపోయిన
శిలా నిశ్చలతతో నిన్ను ఎదుర్కునే నేను!
కూకటి వేళ్ళతో నన్ను పెకిలించి అగాధాలలోకి విసిరేయాలనే
పెను ప్రయత్నం చేసే, ఝంఝామారుతంగా నువ్వు!
పెనుగాలిని ఆస్వాదించే చిరు మబ్బుతునకనై,
ఆ సుడిగాలిలో చేపలా తేలిపోయే నేను!
ఆకాశాన్ని ఆవరించి చంద్రుణ్ణి కూడా కబళించే
ధృఢ నిశ్చయంతో కారు మబ్బువైన నువ్వు!
చల్లని నా స్పర్శతో ఆ మబ్బుని ద్రవీభవింపచేసి
వర్షింపచేయాలని తపించే చిరుగాలిగానేను!
కట్టలు తెంచుకుని దూకి, నా అస్తిత్వాన్ని మటుమాయం
చేయాలన్న మహోగ్ర రూపంతో పెను వరదవైన నువ్వు!
ఆ వరద అలల మీద హాయిగా తేలిపోయే ప్ర
యత్నంలో తేలికైన తెప్పగా నేను!
నాకు ఎదిగే అవకాశం లేకుండా చేయాలని
యోజనాల మేర ఊడలు దించిన మర్రిలా విస్తరించిన నువ్వు!
ఆద్యంతం ఆ మానుని అల్లుకుపోయి,
పైకి ఎగబాకుతున్న సుకుమార, బలహీన తీగనై నేను!
ఇది రెండు అస్తిత్వాల మధ్య పోరాటం!!
రెండు వ్యక్తిత్వాల మధ్య విభేదం!
ఇది రెండు భిన్న ధృవాల మధ్య విరోధం!
దీనిలో ఓటమి ఉండదు
అలాగే గెలుపూ దక్కదు!
కేవలం బల ప్రదర్శనే!