[శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి రచించిన ‘కాలం మింగిన కలం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]
[dropcap]కీ.శే.[/dropcap] అత్తలూరి లక్ష్మీనరసింహారావుగారు (1914-1996) స్వాతంత్ర్యసమరయోధుడు, ఉత్తమ పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకాలోని అత్తలూరు అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉద్ధండులు. ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఆయన తపనతో, ఆవేదనతో వందలాది వ్యాసాలు రాశారు. ఎమ్.ఎన్.రాయ్ గారి, నవ్యమానవతావాద వర్గీయులుగా పేరుపొందారు. రాయ్ గారి వ్యాసాలను అనువదించడమే కాకుండా వారి జీవన విధానాన్ని జీవితాంతం అనుసరించిన అత్తలూరిగారు నిరాడంబరమైన వ్యక్తిత్వం గలవారు. రాయ్ గారితో ఆయనకి సాన్నిహిత్యం ఉండేది. రాయ్ గారి సిద్ధాంతాల గురించి హైదరాబాద్‌లో మానవతావాదులు మాట్లాడే సభల్లో తరచుగా ప్రసంగిస్తూ ఉండేవారు.
వారి కుమార్తె అయిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు, తన తండ్రిగారి జీవనప్రస్థానాన్ని ఒక ఆదర్శవంతమైన వ్యక్తి యొక్క కథగా లిఖించారు. ఆయన జీవితచరిత్ర యొక్క విశ్వసనీయత మరింత పెరిగేటట్లుగా, తన తండ్రిగారితో పరిచయం, ఆత్మీయతా ఉన్నవారి మాటల్లోనే, ఆ వివరాలు యథాతథంగా ప్రచురించడం మంచి ఆలోచన.
స్వర్గీయ పోరంకి దక్షిణామూర్తి, శ్రీమండలి బుద్ధ ప్రసాద్ వంటి సాహిత్య, రాజకీయ ప్రముఖులు, కుటుంబ మిత్రులు శ్రీ కళాకృష్ణ, ఇంకా నరసింహారావుగారి కుటుంబసభ్యులు ఆయన గురించి చెప్పిన మాటల సారాంశం ప్రకారం, కీ.శే అత్తలూరిగారు భారతదేశ స్వాతంత్ర్యసమర సందర్భంలో కొన్ని ఉద్యమాల్లో పాల్గొని, జైలుకు వెళ్లారు. ఆ తర్వాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు. ఆయన పత్రికా రచయితలలో ఆణిముత్యం. నిష్కల్మష హృదయంతో, సునిశిత పరిశీలనతో సమకాలీన రాజకీయాలపై వారు రాసిన వ్యాసాలు ప్రామాణికమైనవి. ఆయన వ్యక్తిత్వం పటాటోపం లేనిది. వారి రచనావిధానం కూడా అలాగే ఉండేది. ఒక బాలవితంతువును (అనసూయమ్మగారిని) దండల పెళ్లి చేసుకుని తను ఆచరణలో కూడా అభ్యుదయవాదిని అని మౌనంగా లోకానికి వెల్లడించారు.
ప్రజాప్రభ సంపాదకవర్గంలో ఒకరుగా ఉన్న సమయంలో, ఏదైనా ప్రధాన వార్తగాని. మరొక విశేషంగానీ, రాయడానికి వారు పూనుకుంటే రాసేది పూర్తయ్యేవరకూ వంచిన తల ఎత్తకుండా, కలం పక్కకి పెట్టకుండా, పక్కవాళ్లు ఆశ్చర్యపోయేంత వేగంతో రాయడం వారి సమర్థత. చిరకాలపు అనువాద అనుభవం వారికి ఉండడంతో, ఏనాడూ నిఘంటువు చూడకపోవటం సంపాదక వర్గంలోని మిగిలిన వారికి కూడా మార్గదర్శనం చేయడం వారి ప్రావీణ్యత. ఆనాడు వార్తాపత్రికలు నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలు అందిస్తూ, వారి రాజకీయ అవగాహనాస్థాయి పెంచేవిగా ఉండేవంటే, వీరివంటి నిబద్ధత గల పాత్రికేయులుండడమే కారణం.
అత్తలూరిగారు గంభీరులు, సహృదయులు. అబ్బూరి రామకృష్ణారావుగారికి స్నేహితులు. తెలుగు స్వతంత్ర పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేసినప్పడు రావూరి భరద్వాజ, వావిలాల గోపాలకృష్ణ, గోరాశాస్త్రి వంటి వారితో కూడా మిత్రత్వం ఉండేది. ఇంకా వీరు గోల్కొండ పత్రికలోను, ఆంధ్ర జనత డైలీలోనూ, ఆంధ్రభూమి ఉపసంపాదకులుగానూ పనిచేసి ఈనాడులో రిటైర్ అయ్యారు. వారు రాసిన వందలాది విలువైన వ్యాసాలు నేడు అలభ్యాలుగా ఉండడం మనకి బాధ కలిగించే విషయం. అందువల్ల, కేవలం మూడు వ్యాసాలు మాత్రమే ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మొదటిది ఎమ్.ఎన్.రాయ్ గారి ప్రిన్సిపుల్స్‌ను ఉటంకిస్తూ ఆయన గురించిన ఆంగ్ల వ్యాసం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గొప్పతనం గురించిన వ్యాసం రెండవది. మూడవ వ్యాసంలో లక్ష్మీపార్వతిగారికి, ఆమెను రాజకీయాల బురద అంటించుకోకుండా మహిళల ఉద్ధరణ కోసం ఒక ఉద్యమం లేవదీసి, దానికి నాయకత్వం వహించమని చక్కని సలహా ఇవ్వడంలో, స్త్రీశక్తి యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించిన వైనం కనబడుతుంది.
నరసింహారావుగారు స్వయంగా, అన్యాయాలను ఎండగట్టే విప్లవ భావజాలం కలిగి ఉన్నప్పటికీ, సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించేవారు. భార్యని కూడా తన భావాలను అనుసరించమని ఏనాడూ ఒత్తిడి చేయలేదు. ఆడపిల్లలు చదువుకొని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అనుకునే ప్రగతిశీల దృక్పధం కలిగిన వారు. నిష్కామయోగి. నిత్యం రాజకీయాల గురించి విశ్లేషించే రంగంలో మునిగి తేలినా, రాజకీయం తెలియని మనిషి.
“నువ్వు దేశాన్ని కలంతో కాపలా కాసిన అక్షర సైనికుడివి, పోరాట యోధుడివి నాన్నా!” అంటూ విజయలక్ష్మిగారు, ఆర్తిగా తండ్రి జ్ఞాపకాలతో రాసిన కవితతో ఈ లఘు గ్రంథం మొదలైంది. తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను రచయితనయ్యానని చెప్పుకున్న విజయలక్ష్మిగారు ఈ నాటి ప్రముఖ నాటక రచయిత్రి. చెయ్యి తిరిగిన నవలా, కథా రచయిత్రి, కాలమిస్టు కూడా!
అత్తలూరి లక్ష్మీనరసింహారావుగారు, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ట్రేడ్ యూనియన్ ఒకప్పటి నాయకుడిగా కార్మికుల కోసం చేసిన సేవలకు, స్వర్ణోత్సవాల సందర్భంగా ట్రేడ్ యూనియన్ వారు చేసిన సత్కారం ఫోటోలు, ఇంకా ఇతర ప్రముఖులతో ఉన్న ఫోటోలు, కుటుంబసభ్యులతో ఉన్న ఫోటోలు తీపి జ్ఞాపకాలుగా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
కేవలం తన తండ్రిగా కాక, ఒక ఉత్తమ జర్నలిస్టుగా సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన శ్రీ అత్తలూరి నరసింహారావుగారి జీవన గమనాన్ని గ్రంథస్థం చేసిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు అభినందనీయులు, తండ్రి ఋణం తీర్చుకున్న ఆదర్శ తనయ.
నేడు ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన దినపత్రికలు, రాజకీయ పార్టీల నాయకుల యాజమాన్యంలో, అవి ఆ పార్టీ కరపత్రాలుగా ఉండడం చూస్తున్నాం. తమ నాయకుల తప్పుల్ని సమర్థించే న్యాయవాదులుగా కూడా పనిచేస్తున్న పత్రికల్ని మనం నిత్యం చదువుతున్నాము. అందుకే ఈ పుస్తకం ఒకనాటి ప్రత్రికా విలువలను గుర్తుచేసి, చదువరుల మనసులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి పట్ల అంకిత భావం గల ఒక ప్రముఖ పాత్రికేయుని జీవనయానం గురించి తెలుసుకోవడం ఆనందాన్నిస్తుంది. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది.
***
కాలం మింగిన కలం
(మా నాన్నగారు-కొన్నిజ్ఞాపకాలు)
శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి
వెల:రూ.100/-
ప్రతులకు: జె. చంద్రశేఖర్,
ఇంటి నెంబరు.1-4-880/2/11,
ఎస్.బి.హెచ్. కాలనీ, గాంధీనగర్
హైదరాబాద్ 500 080
ఈమెయిల్: rachayithri@gmail.com
ఫోన్: 9676881080