కలియుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా

1
4

[23 నవంబరు శ్రీ సత్యసాయిబాబావారి జయంతి సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు విడదల సాంబశివరావు.]

“సత్యధర్మమహింసయు శాంతి ప్రేమ
మానవుని పంచప్రాణాలు మహిని చూడ
పంచప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు”

నిర్మల నిస్వార్థ ప్రేమయే మానవుణ్ణి సంస్కరించగలదని భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు తమ అవతారోద్యమ కాలంలో తెలియజేశారు.

కలియుగంలో ధర్మం నశించు వేళ.. పాప పంకిలమైన మానవజాతిని ఉద్ధరించడానికి సకల దేవతాతీత స్వరూపుడై.. త్రిమూర్త్యాత్మకమైన దత్తాత్రేయుని అంశంగా.. అనంతపురం జిల్లాలోని కుగ్రామమైన ‘పుట్టపర్తి’ లో రత్నాకరం పెద్ద వెంకమరాజు ఈశ్వరమ్మ దంపతులకు, 1926వ సంత్సరం నవంబరు నెల 23వ తేదీన బ్రహ్మీ ముహూర్తంలో.. భరద్వాజ రుషి గోత్రంలో.. ఆరుద్ర నక్షత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జన్మించినారు.

తన జీవన విధానంలో బాల్యం నుండియే పలు ప్రత్యేకతలను కలిగివుండి, ఎన్నో మహిమలను చూపిన భగవాన్ 1940వ సంవత్సరం అక్టోబరు 20వ తేదీన తన 14వ యేటనే తన దివ్యత్వమును ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పటి నుండి భగవాన్ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. వారి మహిమలు విశ్వవ్యాపితమై ప్రపంచం నలుమూలలకు విస్తరించబడినాయి. ప్రపంచంలోని అన్ని దేశాలలోని స్వామిభక్తులు పుట్టపర్తికి రావడం ప్రారంభించారు. మహామహిమాన్వితమైన అద్భుతాలను ఆవిష్కరించి.. ఎన్నో లీలలను చూపి తన భక్తుల సమస్యలను పరిష్కరించారు. అంతేగాదు.. హస్త చాలనంతో విభూతి ప్రసాదమును సృష్టించి మొండి వ్యాధులను నయం చేసి భక్తులను సంతృప్తిపరిచారు.

లౌకికంకావచ్చు, పారమార్థికం కావచ్చు.. స్వామి సన్నిధికి వచ్చేవారు పలు కారణాలతో వస్తారు. లీలలు స్వామి వారి విజిటింగ్ కార్డులు. ఒకసారి పరిచయం అయ్యాక మనం సహాజంగానే వారి పరిధిలోనికి ప్రవేశిస్తాము. తమ అండలో మనం పరిపూర్ణులం కావడానికే వారు తమ ‘విజిటింగ్ కార్డ్’ ఇస్తారు. లౌకికమైన కోరికలతో తమ వద్దకు వచ్చేవారి మనసుల్ని.. మట్టికుండలను తీర్చిదిద్దన్నట్లుగా ‘ఆధ్యాత్మిక మార్గం’ లోనికి మలిచే ఒడుపు వారికే తెలుసు! వారు సాటిలేని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ప్రతి మనసు వారికి తెరిచిన పుస్తకమే! దాచేందుకేమీ ఉండదు. మూర్తీభవించిన దివ్యానందమే థగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు.

భగవాన్ మానవ రూపం ధరించి మనుష్యుల మధ్య నడయాడేది కేవలం వ్యక్తి శ్రేయసు కోసమే తప్ప ప్రచారం కోసమో, పొగడ్తల కోసమో కాదు. వారి వ్యవహార శైలి పరమాద్భుతం. ఆ రోజుల్లో స్వామివారు పుట్టపర్తికి వచ్చిన భక్తులతో యథాలాపంగా మాట్లాడేటప్పుడు గూడా, వాళ్ళు తమ సందేహాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చేవారు. వాటిని వెంటనే నివృత్తి చేసేవారు. అదే సమయంలో ఎంతో మందికి ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవారు.

సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆయుధములు. ఈ ఆయుధముల తోనే సమాజంలో దిగజారిపోతున్న నైతిక విలువలను పునరుద్ధరించాలని స్వామివారి అవతార లక్ష్యం. తన అవతార లక్ష్యము సిద్ధించడం కోసమే సకల మానవాళి తన వైపు నడిచివచ్చే విధంగా స్వామి అద్భుతాలను ఆవిష్కరించారు. లీలను, మహిమలను ఎన్నింటినో చూపారు. మానవజాతిలో మార్పు కోసం, విశ్వచైతన్యం కోసం భగవాన్ తన భక్తులను సాయి సైన్యంగా రూపొందించారు. విశ్వవ్యాపితమైన ‘శ్రీ సత్యసాయి సేవాదళ్’ ఈనాడు ఓ మహోన్నతమైన సేవాసంస్థగా రూపుదాల్చి-ప్రపంచంలోని ఏ ప్రాంతం, ప్రదేశంలో విపత్తులు సంభవించినా తన సహాయ సహకారాలను అందిస్తోంది.

“ప్రేమతో పలికే ప్రతి పలుకూ సత్యమే
ప్రేమతో ఆచరించే ప్రతి పనీ ధర్మమే
ప్రేమతో కూడిన తలంపులే శాంతి
ప్రేమతో కూడిన అవగాహనయే అహింస”

కావున, ప్రేమయే ప్రధానం. ప్రేమయే దైవము – దైవమే ప్రేమ. ప్రేమయే మన ‘conscience’ (అంతరాత్మ). దానిని అనుసరించి వర్తిస్తే వ్యక్తిగత, కుటుంబ, సామాజికపరమైన శాంతిని మనం అనుభవించవచ్చు. ‘Conscience’ ప్రేరణ కలిగించునట్లు మాట్లాడటమీ-— సత్యము. ‘Conscience’ చెప్పినట్లు చేయడమే ధర్మము. ‘Conscience’ను అనుసరించి సంకల్పములను మలచు కొనుటయే శాంతి. ‘Conscience’ను అనుసరించి ఇతరులతో వ్యవహరించడమే అహింస. ఆ ‘Conscience’ ను మనసా, వాచా, కర్మగా అనుసరించడం చిన్నప్పటినుండి అలవడాలి. అలా అలవడాలంటే మనిషికి ఈశ్వర సాన్నిధ్యం ఎంతో అవసరం. అందుకే సాక్షాత్తూ పరమేశ్వరుడే మానవ రూపం ధరించి, భూమిపై అవతరించి సామాన్య మానవుల మధ్య నడయాడి – వారి బాధలను తీర్చాడు. కష్టాల కడిలి నుండి ఒడ్డుకు చేర్చాడు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు.

“అంతరాత్మకన్న అధ్యాపకుడు లేడు
అరయ కాలమె మీకు పరమ గురువు
గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే
ఎవడు స్నేహితుండు? ఈశ్వరుండె!”

ఈశ్వరుడైన శ్రీ సత్యసాయీశ్వరుడే మానవుల అంతరాత్మను పరిశుద్ధము చేసి, గురువుగా జ్ఞానబోధ చేసి, సకల మానవాళికి హితుడిగా, సన్నిహితుడిగా మారి, సమాజ సేవలో తరించే విధంగా తీర్చిదిద్దారు. ఈ విధమైన పరిణామాన్ని విశ్వ మానవ ప్రపంచంలో ఎవరు తీసుకురాగలరు ఒక్క భగవంతుడు తప్ప!

భగవాన్, వ్యక్తులతో మాట్లాడే సమయంలో ప్రతి వ్యక్తిని ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించేవారు. వ్యక్తి అభ్యున్నతిపై ఉన్న తీవ్ర అభిలాషతో ఎవరికి తగిన సూచనలు వారికి ఇస్తూ, స్వయంగా వారిని సరైన దారిలో పెట్టి, వారి అభివృద్ధికి తోడ్పడుతారు. అదే భగవాన్ విశిష్టత. ప్రతివ్యక్తి మరింత ఉన్నతి సాధించాలని, వారికి వైయక్తికంగా బోధించడానికి వారు ఇష్టపడేవారు. ఇందుకు ఓ ఉదాహరణ ‘జాయ్’ ఐస్ క్రీం కంపెనీ యజమాని ‘జావా’. ఆ రోజుల్లో ‘జాయ్’ ఐస్ క్రీం బొంబాయి (ముంబై) లో బాగా ప్రసిద్ధి కెక్కింది. ‘జావా’కు మద్యం సేవించే అలవాటు వున్నది. ఓసారి, భగవాన్ ముంబై లోని గ్వాలియర్ పేలస్‌లో ఉన్నప్పుడు – ‘జావా’ బాబా దర్శనార్థం వచ్చాడు. తొలి సమాగమంలోనే స్వామి అతన్ని చూసి చిరునవ్వుతో “హలో జావా” అని పలకరించారు. అంతే! అతనిలో మానసిక పరివర్తన చోటు చేసు కోని, మద్యపాన వ్యసనానికి ఆ క్షణంలోనే స్వస్తి పలికాడు. త్రాగుడు వంటి వ్యసనాన్ని ఉన్న పళాన వదిలెయ్యడం ఆషామాషీ కాదు. బాబావారు మనోబలాన్ని, ఆత్మ స్థయిరాన్ని ప్రసాదిస్తారు.. ఏ వ్యక్తిని ఏ రకంగానూ నొప్పించడంగా.. మానవాళికి పుట్టుక నుండీ తాము ప్రాణ మిత్రులమన్నంతగా భగవాన్ ప్రతి ఒక్కరి ఎదుగుదల మీద శ్రద్ధ చూపిస్తారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అవతార లక్ష్యం సత్యధర్మశాంతి ప్రేమ అహింసల ద్వారా నేటి ఆధునిక సమాజంలో నైతిక విలువలను పెంపొదించడం. అందుకోసం విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దవచ్చు. మాతృమూర్తి ఈశ్వరమ్మ అభ్యర్థన మేరన స్వామి చిన్నవయసు లోనే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

శ్రీ సత్యసాయి వైభవం క్రమక్రమంగా విస్తరిస్తున్న రోజులలో ఒకనాడు ఈశ్వరమ్మ -”స్వామీ! మన గ్రామంలో ఒక చిన్నపాఠశాల యైనా లేకపోవడం చేత పిల్లలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. చదువు నిమిత్తం చిన్నచిన్న పిల్లలు బుక్కపట్నానికి నడిచి వెడుతున్న దృశ్యం చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. కాబట్టి, మన గ్రామంలో ఒక చిన్న స్కూలు కట్టించండి” అని కోరింది. ఆమె కోరిక ప్రకారం ఒక స్కూలు కట్టించారు స్వామి.

ఆ తరువాత.. “స్వామీ! చిన్నపిల్లకు జ్వరం వచ్చిందంటే చికిత్స కోసం బుక్కపట్నం వెళ్ళవలసి వస్తుంది. తల్లులు ఆ పిల్లలను ఎత్తుకోని అంత దూరం వెళ్ళడం చూస్తుంటే నాకు బాధగా వుంది. కాబట్టి, ఇక్కడ ఒక చిన్న ఆసుపత్రిని కట్టించండి.” అని కోరింది. తల్లి కోరిక మేరకు ఆసుపత్రిని కూడా కట్టించారు స్వామి. ఈనాడు శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీగా రూపాంతరం చెందింది ఆనాటి చిన్న పాఠశాలే! ఈనాడు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకున్నది ఆనాటి చిన్న ఆసుపత్రియే!

తల్లి యొక్క సత్యసంకల్పము, సాయి యొక్క నిత్యసంకల్పము – రెండింటి యొక్క కూడిక చేతనే ఇది సాధ్యమైంది.

శ్రీ సత్యసాయిబాబా వారు ‘సేవాదళ్’ను క్రమశిక్షణతో బాటు విలువలు గలిగిన సేవా సంస్థగా రూపొందించారు. ఈనాడు స్వామివారు మన మధ్య లేకపోయినా “మనం చేసే ప్రతి పని స్వామి చూస్తున్నారు” అనే భావనతోనే సేవాదళ్ కార్యకర్తలు నిబద్ధతతో తమ కర్తవ్యమును ఆచరణాత్మకంగా నిర్వహిస్తూ వుంటారు.

పల్లెలు బాగుండాలని, గ్రామాలు పచ్చగా వుంటేనే దేశం సుభిక్షంగా వుంటుందని స్వామి పలుమార్లు ఉద్బోధించారు. గ్రామాలకు వెళ్ళి సేవ చేయమని సేవాదళ్‌ను ఆదేశించారు. “దైవం ఆశించేది నిర్మలమైన ప్రేమ తత్వాన్ని మాత్రమే! ఇట్టి ప్రేమ తత్వాన్ని గ్రామ గ్రామానికి చేర్చడానికి కృషి చేయాలి, గ్రామాలలో మానవత్వ గుణములను బోధించాలి. వారియందున్న దుర్గుణములు, దురాచారములను మాన్పించాలి!”

ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా వున్న ‘శ్రీ సత్యసాయి సేవాదళ్’ స్వామి నిర్దేశించిన లక్ష్యాలను ఆచరణాత్మకం చేస్తూ స్వామి సేవలో, సమాజ సేవలో తరిస్తోంది.

భగవాన్ బాబావారి దివ్యావతార కాలంలో జన్మించి, వారిని దర్శించి, అమృతతుల్యపైన వారి పలుకులను విని తరించిన మనం – మన జీవనయానంలో స్వామి వారి వాక్కులను మార్గదర్శకాలుగా స్వీకరించి తరించాలని నిండు మనసుతో కోరుకుందాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here