జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-72

3
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

మద్రరాజ దుహిత్రోః స చతురస్తనయాన్ నృపః।
యథా దశరథో రాజా జనకాంతానజీజజత్॥
(జోనరాజ రాజతరంగిణి 857)

[dropcap]యో[/dropcap]గిని హత్య చేసిన మ్లేచ్ఛుడికి సుల్తాన్ తగిన శిక్ష విధించినందుకు ప్రజలు సంతోషించారు. రాజును వేనోళ్ల పొగిడారు. స్వర్గం మంచి పరిమళభరితమైన పుష్పాల వర్షం కురిసి న్యాయబద్ధమైన తీర్పుకు నీరాజనాలర్పించింది.

ఈ శ్లోకం గతంలో జోనరాజు చెప్పిన శ్లోకాల్ని ఖండిస్తుంది. సుల్తాన్ ఏకపత్నీవ్రతం ఆచరిస్తూ పరాయి స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడలేదన్న భావనను ప్రదర్శించాడు జోనరాజు. కానీ ఆ వ్రతాన్ని భంగం చేస్తూ కీర్తి కాంతను చేపట్టాడన్నాడు. ఈ శ్లోకం అందుకు భిన్నమైన అర్థాన్నిస్తోంది. దశరథుడిలా రాజుకు నలుగురు కుమారులు కలిగారు. మాద్ర రాజు ఇద్దరు కూతుళ్ళ ద్వారా చెరో ఇద్దరు కొడుకులను పొందాడు అంటాడు జోనారాజు ఈ శ్లోకంలో. కాబట్టి సుల్తాన్ ఏకపత్నీవ్రతుడు కాడు. కానీ జోనరాజు ఆ శ్లోకాన్ని చెప్పిన విధానం పరిశీలిస్తే జోనరాజు సుల్తాను గురించి ఏం చెప్పాలనుకున్నాడో ఊహించే వీలు కలుగుతుంది.

పరుల స్త్రీల వైపు సుల్తాన్ కన్నెత్తి చూడలేదు. ఇతర సుల్తానుల్లా జనానాను ఏర్పాటు చేయలేదు అంటూ రాజు ఏకపత్నీవ్రతం చేశాడన్నాడు జోనరాజు. సుల్తానులు బహుభార్యలను చేపట్టటం, నచ్చిన స్త్రీని ఎత్తుకొచ్చి జనానాలో భాగం చేయటం చరిత్రలో నమోదయిన విషయం. జైనులాబిదీన్ ఇతర సుల్తాలకు భిన్నంగా – ధర్మబద్ధంగా చేపట్టిన భార్యల వైపు తప్ప ఇతర స్త్రీల వైపు దృష్టి సారించలేదు అన్నది జోనరాజు ఉద్దేశం కావచ్చు. సుల్తాన్ తాను వివాహమాడిన స్త్రీల వైపు తప్ప అన్యస్త్రీల వైపు ఆకర్షితుడు కాలేదన్నది భావం కావచ్చు. మొత్తానికి సుల్తానుకు ఇద్దరు భార్యలు, నలుగురు కొడుకులు అన్న విషయంలో ఎలాంటి వివాదాలు లేవు.  అయితే, అవకాశం దొరికినప్పుడల్లా, సుల్తాన్ ను భారతీయ పురాణ పురుషులతో పోల్చి ఆయనకు ఒకరకమైన ప్రామాణికతను ఆపాదించాలని జోనరాజు ప్రయత్నించటం తెలుస్తుంది. చరిత్రను పరిశీలిస్తే, సుల్తానులవద్ద పనిచేసిన వారిని ఇతర సనాతన ధర్మానుయాయులు చులకనగా చూడటం కనిపిస్తుంది. జైనులకు భిన్నంగా సనాతన ధర్మానుయాయులు తాము సుల్తానుల ఆదరణ పొందుతున్నట్టు చెప్పుకోవటానికి ఇష్టపడలేదు. బహుషా , తనవారినుంచి ప్రదర్శితమవుతున్న వ్యతిరేకను ఎదుర్కుంటూ, సుల్తాను దగ్గర పనిచేయటాన్ని సమర్ధించుకోవటంలో కూడా, ఇలా పురాణ పురుషుల పోలిక తేవటం ఒక భాగం కావచ్చు.

జ్యాయానాదమఖానః స హాజ్యఖానస్తథా పరః।
ఖానో జస్యరథః ఖానో బహరమశ్చ సంజ్ఞితః॥
(జోనరాజ రాజతరంగిణి 858)

జైనులాబిదీన్ సంతానంలో మొదటివాడు ఆదమఖాన్, రెండవ వాడు హజ్యాఖాన్. మిగిలిన ఇద్దరు జస్యరథ ఖాన్, బెహరమ్ ఖాన్‍లు.

క్షీరార్ణవస్థ మథనాత్ పరతః సుధాదిరత్నాని తాన్యనుపభోగనిరర్థకాని।
యో నీతవాన్ సఫలంతా కిల పాత్రదానాత్ స్తుత్యః స మందరగిరిరాజవర్గో॥
(జోనరాజ రాజతరంగిణి 859)

మందరగిరి పాల సముద్ర మథనం చేయటం వల్ల రత్నాలు, అమృతం వెలువడ్డాయి. ఇంతకాలం అవి నిరర్థకంగా ఉన్నాయి. ఇపుడు వాటిని సరైన వ్యక్తులకు అర్పించటం వల్ల సార్థకత లభిస్తోంది.

నదీరవటపాతేన భువశ్వాంబు వినాఫలాః।
సంయోగాత్ సఫలీకృత్య యశశ్విత్రమజీజనత్॥
(జోనరాజ రాజతరంగిణి 860)

అలాంటి మందర పర్వతం జైనులాబిదీన్. ఆయన జలపాతాలను నదులతో కలపటం వల్ల ఎండిపోయిన నదులు నీటితో నిండాయి. ఆయన ఎనలేని ఖ్యాతిని ఆర్జించాడు.

రాజ్ఞోత్పలపురక్షోణౌ కుల్యాం ప్రాప్తయ్య వాప్రిణీమ్।
సయోర్నిరర్థకత్వేన దూషణా వినివారితా॥
(జోనరాజ రాజతరంగిణి 861)

పొలాల వెంట ఉన్న కాలువలను ఉత్పలపురం వరకూ పొడిగించాడు. ఇందువల్ల కాలువలు, భూములు రెండూ లాభం పొందాయి. ఉపయోగకరం అయ్యాయి.

ఇక్కడి నుంచి జోనరాజు, జైనులాబిదీన్ నిర్మాణాల గురించి వివరిస్తూపోతాడు. అంతవరకూ కశ్మీరు సుల్తానులు మసీదులను నిర్మించారు. ఇస్లామీ  ప్రయాణీకులకు విశ్రాంతి కట్టడాలు నిర్మించారు. ఇందుకు భిన్నంగా జైనులాబిదీన్ ప్రజా సంక్షేమం కోసం నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాడు.

ఒక నీటి పాయను ఎడారి లాంటి నందశైల వరకూ ప్రవహింపచేశాడు. దాంతో ఆనంద పరవశులలైన ప్రజలు సముద్రంలోని చక్రధార ప్రాంతాన్ని గుర్తుచేసుకున్నారు. ‘కరాల’ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి సుల్తాను ప్రజల మన్ననలందుకున్నాడు.

సాగ్రహారా ద్విజా యత్ర సాగ్రహారాశ్చ యోషితః।
సాయ జైనపురీ రాజ్ఞా కరాలె నిరమీయత్॥
(జోనరాజ రాజతరంగిణి 864)

రాజు ఇలా నీటి పారుదల సౌకర్యాలను నీరు లేని ప్రాంతాలలో కల్పిస్తూ పోవటం వల్ల జైనపురి కూడా ‘కరాల’తో పోటీపడే స్థాయికి ఎదిగింది. అక్కడ బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చాడు రాజు. ఐశ్వర్యవంతులయిన బ్రాహ్మణుల భార్యలు పలురకాల ఆభరణాలు ధరించారు. ఒకప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోయినవారు ఇప్పుడు అగ్రహారాల్లో సుఖంగా స్వంత ఇళ్ళల్లో నివసించటం, ఐశ్వర్యంతో తులతూగటం, వారి భార్యలు విలువైన ఆభరణాలు ధరించటం సర్వం జైనులాబిదీన్ వల్లనే సాధ్యమయింది.

అవంతిపుర భూమౌ చ కాంతోదన్తేన భూభుజా।
కుల్యావతారితాతుల్యా శాలిసంపత్తిశాలినీ॥
(జోనరాజ రాజతరంగిణి 865)

అవంతిపుర భూములకు నీటి పారుదల వసతులు కల్పించటం వల్ల పంటలు విపరీతంగా పండటం వల్ల ప్రజలు ఐశ్వర్యవంతులయ్యారు.

గిరిమార్గేణ గంగాయ మానసం ప్రాపితే జలే।
కిం పూతం మానసేనేదమమునా కిము మానసమ్॥
(జోనరాజ రాజతరంగిణి 866)

పర్వతమార్గం ద్వారా గంగానది మానస సరోవరం నీటితో కలిసేట్టు చేశాడు రాజు. మానస సరోవరం నీటి వల్ల గంగనీరు శుభ్రపడిందా, గంగ నీరు వల్ల మానస సరోవరం నీరు పవిత్రమయిందా అంటున్నాడు జోనరాజు.

మానస సరోవరం ఒడ్డున ఒక అద్భుతమైన పట్టణం నిర్మించాడు జైనులాబిదీన్. ఆ పట్టణం సరోవరం నీటిలో ప్రతిబింబించటం వల్ల మరో నగరం వెలిసిందన్న భ్రమ కలుగుతుంది. వేడి వల్ల సుయ్యపురం అనుభవిస్తున్న బాధను, సుయ్యపురంను వితస్తతో కలపటం వల్ల తొలగించాడు సుల్తాన్. ప్రద్యుమ్నపురం నుడి అమరేశపురం వరకూ విస్తరించిన విపణి వీధులలో, అడుగడుగునా మఠాలతో సుల్తాను  జైననగరిని నిర్మించాడు. ఈ జైన నగరిలో విప్రులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేకుండా గృహాలను నిర్మించి ఇచ్చాడు. ఆ నగరంలో నాగులకు రాతితో అతి పెద్ద భవంతులను కట్టించాడు. ఆ భవంతులు జైనగంగ నీటిలో ప్రతిఫలిస్తూండటం, నీటిలోంచి భవనం ఆకాశాన్ని తాకేట్టు నిర్మితమైనదన్న భ్రమను కలిగిస్తోంది.

జైనగంగాం రణ స్వామి ప్రసాదే ప్రాపితాం కృతీ।
వ్యాసస్మరత్ స్మేరయశా హరి పాదకుతూహలమ్॥
(జోనరాజ రాజతరంగిణి 871)

విష్ణు పాదపూజను విస్మరించిన ప్రజలలో మళ్లీ దైవ భావనలను చిగురింపచేందుకు సుల్తాన్ జైనగంగను రణస్వామి మందిరం వరకూ విస్తరింప చేశాడు. ఇక్కడ జైనగిరి, జైన మందిరం అన్న పేర్లు చూసి  జైన మతస్తులకు చెందిన పేర్లు అని పొరబడకూడదు. ఇది జైనులాబిదీన్ లోని ‘జైన్’, not jain, ZAIN. ( ఇది ప్రత్యేకంగా చెప్పటం ఎందుకంటే, తెలుగులో చరిత్ర రచయితలు ఇది చూసి జైనులాబిదీన్ , జైనులను పండితుల అకృత్యాలనుంచి రక్షించాడని తమ ఊహలను నిజాలుగా ప్రచారం చేస్తారన్న వెరపువల్ల)

సుయ్యపురానికి మరో వైపున జైనులాబిదీన్ ‘జైనగిరి’ అన్న నగరాన్ని నిర్మింపచేశాడు. ఈ నగరం లోని అద్భుతమైన  కట్టడాలు కైలాసగిరితో సమానం అయ్యాయి. సూరేశ్వరి లోని సిద్ధక్షేత్రంలో సిద్ధపురిని నిర్మించాడు రాజు. అతని కీర్తి నలుదిశల వ్యాపించింది. శత్రువులను అణచి మహావీరుడైన రాజు, దిగంతాల  వైపు ప్రకాశం విస్తరించేట్టు మార్తాండ మందిరం, అమరనాథ్ మందిరాలను నిర్మించాడు.

పూర్వకాలంలో ప్రజల ఐశ్వర్యాన్ని పెంచటం ద్వారా అభివృద్ధిని సాధించాలని, సుయ్యరాజు ప్రయ్నంచాడు. అప్పటినుంచీ ఎందరో రాజులు ప్రయత్నించారు. వచ్చారు, పోయారు కానీ ప్రజల ప్రజల ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ కాలంలో ప్రజలు అంత దౌర్భాగ్యులు, అంతా విప్రులు వారు. ఆ కాలంలో చెట్లు మొలిచేవి కావు. పూలు పూసేవి కావు. పళ్ళు పండేవి కావు. ఎవరెంతగా తపస్సు చేసినా ఫలితం కలుగలేదు. కానీ జైనులాబిదీన్ పూజలలోని స్వచ్ఛత వల్ల ప్రజలు ఐశ్వర్యవంతులయ్యారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలన్న రాజు ఆకాంక్ష సఫలమయింది. ఆ కాలంలోని ప్రజల సౌభాగ్యానికి ఈ కారణాన్ని మరో రకంగా వివరించటం కుదరదు.

పూర్వపు రాజులు వారు  సంపాదించిన పుణ్యాన్ని అనుభవించగానే తమ ఉన్నత స్థానం నుంచి క్రిందకి దిగిపోయారు. కానీ సత్కార్యాల వల్ల జైనులాబిదీన్ పుణ్యం ఎంతగా సంపాదించాడంటే, ఈ జన్మ లోనే కాదు వచ్చే జన్మలో కూడా రాజ్యానికి తానే రాజయ్యేంత పుణ్యం సంపాదించాడు.

జైనులాబిదీన్ అధికారం స్వీకరించక ముందరి వరకూ పంటల కోసం వర్షంపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ జైనులాబిదీన్ ఆ పరిస్థితిని మార్చాడు. పంటలు నదులపై ఆధారపడేట్టు చూశాడు. కశ్మీరులో నదులు సజీవ నదులు. అంటే సంవత్సరం పొడుగునా పంటలు పండేట్టు చేశాడన్నమాట జైనులాబిదీన్. సంవత్సరం పొడుగునా పంటలు పండటం అంటే రాజ్యం ఎంత సుభిక్షంగా, ఐశ్వర్యవంతంగా ఉంటుందో ఊహించవచ్చు. రాజు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేరాడు. వరాహక్షేత్రం, విజయక్షేత్రం, ఈశానక క్షేత్రాలలో జైనులాబిదీన్ యజ్ఞాలు చేశాడు. పర్యాటకులకు ఉచిత సౌకర్యాలు కల్పించాడు. జైనులాబిదీన్ చేస్తున్న దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చూస్తూ ఇంద్రుడు భయంతో వణికిపోయాడంటాడు జోనరాజు.

ఇంకా ముందుకు వెళ్ళే కన్నా ముందు ఒక్క క్షణం ఆగి జోనరాజు వర్ణించిన కాలువల నిర్మాణం పై జరిగిన పరిశోధనలు, పరిశోధకులు జైనులాబిదీన్ కట్టించినట్టుగా నిర్ధారించిన కాలువల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

కశ్మీరులో నీటి సౌకర్యం లేని భూములు అనేకం ఉన్నాయి. వీటిని మ్యాదర్లు, కరేవాలు అంటారు. ఆధునిక భూగర్భ శాస్త్రజ్ఞులు ఈ ‘కరేవా’ అనే పర్షియన్ పదాన్ని ఈ రకమైన భూభాగాలను సూచించేందుకు వాడతారు. ఇవి హిమానీనదాల వల్ల ఏర్పడే భూములు. ఇక్కడ మొక్కలు మొలవవు.  లోయల్లో కానీ, పర్వత పాదాల వద్దల లోయల కన్నా వంద నుంచి మూడు వందల అడుగుల ఎత్తులో ‘కారవా’ భూములుంటాయి. షోపియన్ నుంచి బారాముల్లా నడుమ ఈ రకాల నేల అధికంగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండటం అన్నది దైవాధీనం. అలాంటి భూములకు నీటి పారుదల వసతులు కల్పించటం ద్వారా జైనులాబిదీన్ వీటిని సస్యశ్యామలం చేశాడు. కరిగిన మంచువల్ల ఏర్పడిన నదుల నుండి ఈ కాలువలను నిర్మించటం వల్ల నీరు ఎండిపోయే పరిస్థితి ఏర్పడనే ఏర్పడదు. జైనులాబిదీన్ నిర్మించిన కాలువలలో ఈనాటికి ఉపయోగపడుతున్న కొన్ని కాలువల వివరాలు:

  1. కాకాపూర్ కెనాల్: ఈ కాలువ కాకాపూర్ గ్రామం పరిసర ప్రాంతాలకు నీళ్లు అందిస్తుంది. పీర్‍పంజాల్ పర్వతాలలోని నందరాజు పాస్ నుంచి నీళ్లు అందుతాయి. జోనరాజు ఈ ప్రాంతాన్ని ‘ఉత్పలపురం’ అన్నాడు.
  2. చక్దార్ కెనాల్‍: ఈ కాలువకు నీళ్ళు నందమార్గం నుండి వస్తాయి. ఇది చక్దార్ మైదాన  ప్రాంతానికి నీళ్ళు అందిస్తుంది.
  3. అవంతిపుర కెనాల్: ఈ కాలువ అవంతిపుర పరిసర ప్రాంతాలకు నీళ్ళు అందిస్తుంది. ఈ కాలువ నుండి నీళ్ళు సుదూరంలో ఉన్న మిడ్పుర్, రాజ్పుర్   వరకూ ఈనాటికీ అందుతున్నాయి.
  4. కరాల కెనాల్: ఈ కాలువ షూపియన్, రాము ప్రాంతాలకు నీరు అందిస్తుంది. ఇక్కడే సుల్తాన్ జైనపురిని నిర్మించాడు.
  5. షాహ్‍కుల్ కెనాల్ (సలాల్‍పూర్ కెనాల్): ఈ కాలువకు నీరు సింధు నది నుండి లార్ ద్వారా నీరు అందుతుంది. మానస్‍బల్ నది నీళ్ళతో ఈ నీళ్ళు కలుస్తాయి. ఇక్కడ ‘ఇంద్రకోట’ అనే ప్రాచీన నగరం ఉండేది. సుల్తాన్ ఇక్కడ ‘సఫల్‍పూర్ ‘ అనే నగరాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని సుల్తాన్ ‘బాగ్-ఏ-సఫా’ అన్నాడు. అక్బర్‍నామా లోనూ ఈ ప్రసక్తి వస్తుంది.
  6. లాంచ్చమ్ కుల్: దీనినే జోనరాజు జైనగంగ అన్నాడు. సింధునది నుండి నీటిని నౌషహర్ (జైన్‍నగర్) వరకూ తీసుకువెళ్తుంది. ఇది జైనులాబిదీన్ రాజధాని నగరం. ఇక్కడి నుండి జామా మసీదు వరకు నీరు అందుతుంది. ఇక్కడి నీరు ‘కాడి కడల్’ వద్ద మార్ కెనాల్‍లో కలుస్తుంది. ఇప్పుడీ కెనాల్‍ను వాడడం లేదు. 20వ శతాబ్దం ఆరంభం వరకూ ఉపయోగపడిందీ కెనాల్.
  7. లాల్ కుల్: ఈ కాలువకి నీరు  బనగాం  లోని పోహ్రు నది నుంచి ఊలూర్ సరస్సు ద్వారా పోహ్రు ఎడమ ఒడ్డు వరకూ చేరుతుంది. ఇక్కడే సుల్తాన్ జైనగిరి నగరం కట్టింది.
  8. షాహ్ కుల్ కెనాల్ (మార్తాండ్ కెనాల్): ఈ కాలువ లిద్దర్ నది నీటిని ‘మార్తాండ్’ వరకు మళ్ళిస్తుంది. నిజానికి లలితాదిత్యుడి  కాలంలో ఈ కెనాల్ నిర్మితమైనదని, పెద్ద నగరం వెలసిందనీ, చరిత్రకారులు గుర్తించారు. షాహ్ కుల్ కెనాల్‍ను జైనులాబిదీన్ పునర్నిర్మించాడు. దీనివల్ల అనంత్‍నాగ్ ప్రాంతానికి నీరు అందుతుంది.
  9. మార్ కెనాల్: ఈ కాలువ నిర్మాణం వల్ల శ్రీనగర్, దాల్ సరస్సుల నడుమ ప్రయాణం సుఖవంతం అయింది. దాల్ సరస్సు నీరు ఝీలమ్ నదిలో కలవకుండా సుల్తాన్ అడ్డుకట్ట కట్టి, మార్ కెనాల్  నిర్మించి, దాని ద్వారా నీటిని ‘షాదిపూర్’ వరకూ నడిపించాడు. ఆపై ఝీలమ్, సింధునది సంగమంలో   కలిసేట్టు చేశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here