మిర్చీ తో చర్చ-7: మిర్చీ గ్రూప్!

0
5

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

వాట్సప్ నంబరు మ్రోగింది. తీసి చూశాను. మిర్చీ బజ్జీ ఫొటో ఒకటి మెరుస్తోంది. దాని క్రింద ‘కంగ్రాచులేషన్స్’ అని ఉంది. ముందుకెళ్ళాను. సుందరం నెంబరు అది.

“మిమ్మల్ని మిర్చీ గ్రూప్‌లోకి చేర్చుకోవడం జరిగింది”

అటూ ఇటూ స్క్రోల్ చేశాను. రకరకాల నంబర్లు, వ్యక్తులు అప్పటికే గ్రూప్‌లో కనిపిస్తున్నారు.

ఫోన్ ఒక్క క్షణం కూడా ఖాళీగా లేదు. మ్రోగుతూనే ఉంది.

“అయ్యా, దీని ప్రధాన ఉద్దేశమేంటి?” ఎవరో అడుగుతున్నారు.

“మిర్చీ బజ్జీ తినేవారు, తినిపించేవారు, ఇష్టపడేవారు సరదాగా వారి ఆలోచనలు పంచుకునే ఏకైక గ్రూప్ ఇది” గ్రూప్ ఎడ్మిన్ ఇచ్చిన వివరం.

ఇక అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెబుతున్న వారు కోకొల్లలు. ఇక ఫొటోల మాట అడక్కండి.

చెరో మిర్చీ బజ్జీ పట్టుకుని ఓ పెద్దాయన వాళ్ళవిడతో నిలబడ్డాడు.

“డాక్టర్ వద్దన్నా బజ్జీ తింటున్న శ్రీవారు!” దానిక్రింద కొన్ని కామెంట్స్…

“డాక్టర్లు అన్నింటినీ వద్దంటారు. పట్టించుకోకండి”

“కరెక్ట్. వాళ్ళకి నిన్న ఉన్న థియరీ ఇవాళ ఉండదు. జీవితాన్ని ఆనందించండి”

ఇంతలో ఒక వీడియో వచ్చింది ఎక్కడి నుంచో…

“మిర్చీలోని గింజలు ఆరోగ్యానికి మంచివి!”

ఇన్ని ఫొటోలతో నన్ను ఒకటి విశేషంగా ఆకర్షించింది.

ఒక పుస్తకం మీద ఒక మిర్చీ బజ్జీ కనిపిస్తోంది. దాని క్రింద ‘అనుభవాలు’ అనే శీర్షిక ఉంది.

“ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన పుస్తకం – ఇందులో ఎన్నో రుచులున్నాయి. చదివి కుండ బ్రద్దలు కొట్టినట్లు అభిప్రాయం చెప్పాలి – ఇట్లు కారం కాంతారావు.”

వెంటనే దాని క్రింద ఓ కామెంట్ –

“సార్ కారం కాంతారావు అంటే సారంగ అనే కలం పేరు మీదేనా?”

“కాదు నా కలం పేరు కారంగా!”

“బాగుంది. కాంప్లిమెంటరీ పంపండి…. నా చిరునామా…”

“క్షమించాలి. పుస్తకాన్ని కొని చదివితేనే రచయితలకి ఆనందం”

దీనిక్రింద ఓ ఏడుపు బొమ్మ తళుక్కున్న ప్రత్యక్ష్యమైంది.

“ఎడ్మిన్. ఇది రచయితల గ్రూపా? ఇలాంటి పోస్టులెందుకు?”

“రచయితలు అనగానే అంత వేళాకోళం పనికిరాదు. సమాజంలో రచయితలది కీలక పాత్ర! – వరహాలరావు”

“స్వాతంత్ర్య పోరాటంలో రచయితల పాత్ర మరువకండి – అవుతా దిగంబర శాస్త్రి”

“సార్… రచయితలే కాదు రచయిత్రులు కూడా…. ముద్దు మనోహరి”

“హి హి హి”

“అలాక్కాదు, రచయితల గోల ఈ గ్రూపులో ఎందుకు? ఉత్తి రమేష్ కుమార్”

“ఎడ్మిన్ మాట్లాడాలి – ఇది చాలా చిత్రంగా ఉంది.

“సమాజంలో కీలక పాత్ర కేవలం రచయితలదేనా?”

“పోరాటంలో ఉన్న గొప్ప వారందరూ రచయితలే”

“పొరపాటు. మంగళ్ పాండే వ్రాసేవాడా…?”

“అదిరింది సార్ – అసలు ఈ వాదన ఎందుకు?”

“సభ్యులందరూ సంయమనం పాటించాలి… మనం సరదాగా కలుసుకుంటున్నాం. వాదోపవాదాలు వద్దు – సుత్తి సురేష్.

“బాగా చెప్పారు. గ్రూపులో ఇంత కారం పనికిరాదు – ఆచార్య ఆదుర్దా.”

కొద్ది సేపు ప్రవాహం ఆగింది. మళ్ళీ మ్రోగింది.

“రచయితలు చేరగానే సరదాల బదులు సందేశాలు ప్రారంభమవుతాయి. ఇదీ సమస్య”

“అందరినీ ఒకే జట్టులో కట్టెయ్యకూడదు. రచయితల వలన ఎన్నో సాంఘిక దురాచారాలు దూరమైనాయి. ఆలోచించండి – రాజా రవివర్మ”

“అసలు రచన అనేదే ఒక సాంఘిక దురాచారం – రాజా కిరణ్ కుమార్”

“ఇది అన్యాయం”

“అరాచకం – కిరణ్మయి”

“ఎడ్మిన్ – ఏం జరుగుతోంది?”

‘9090909090 లెఫ్ట్’

ఇంతలో ఒక బొమ్మ ప్రత్యక్షమైంది. చార్‌మినార్ ఎక్స్‌ప్రెస్ ముందర ఓ అబ్బాయి మోకాలు వరకూ ఏదో తొడుక్కుని ఓ వాటర్ బాటిల్ చేతిలో పట్టుకున్నాడు.

“మా వరుణ్ చెన్నై ఐ.ఐ.టి.లో చేరటానికి వెళుతున్నాడు”

ఓ పది మంది గోరు చుట్ట వచ్చినవాళ్ళలా బొటనవ్రేలు చూపిస్తూ పోస్టులు పెట్టారు.

మరో చిత్రమైన ఫొటో వచ్చింది. ఓ పెద్దాయన నోరు పూర్తిగా తెరిచి కళ్ళు మూసుకుని ఉన్నాడు.

“నేను ఏం చేస్తున్నానో చెప్పుకోండి – నా పేరు సాంబశివ”

“మిర్చీ గ్రూప్‌లో పోస్టులు చూసి సంభ్రమాశ్చర్యాలలోకి వెళ్ళిపోయారు”

“రాగం తీస్తున్నారు”

“మిర్చీ కొరికే బదులు మింగేశారు!”

“ఎవరి మీదనో అరుస్తుంటే వాళ్ళు ఫొటో తీసి వెళ్ళిపోయి మీకు మొబైల్‌లో పంపించారు”

“నో”

“సార్… సమాధానం చెప్పండి”

“చెప్పేస్తున్నా!”

“ప్లీజ్. చెప్పండి సార్”

“ఒకే చెప్పేస్తున్నాను. రెడీ”

“యస్ సార్!”

“ఏం లేదు, సెల్ఫీ తీసుకుంటుంటే దీర్ఘమైన ఆవులింత వచ్చింది”

“ఎడ్మిన్! ఇందుకా గ్రూప్ పెట్టింది?

ఎవరో పోస్ట్ పెట్టారు – “సార్ మిర్చీ కూడా సరదాగానే తింటాం. ఆకలి తీర్చుకునేందుకు కాదు. సరదాగా ఇలాంటి పోస్ట్ పెడితే ఏంటి సమస్య?”

ఇంతలో ఒక మెనూ కార్డ్ ప్రత్యక్షమైంది. చాంతాడంత పొడవుగా ఉంది. దాని వెంటనే ఒక పోస్ట్…

“స్వచ్ఛభారతి కేటరర్స్ – అన్ని శుభకార్యాలకీ ఫోన్ చెయ్యండి”

కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. ఇంతలోనే దాదాపు ఇరవై మూడు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. లడ్లు… కాజాలు… ఒకటి కాదు.

చివరి పోస్టు – “కారాగృహ ఫుడ్స్ – జైళ్ళల్లో ఉంటూ మన కోసం ఖైదీలు తయారు చేసే స్వీట్స్”

“మీ సామాజిక బాధ్యతను చాటండి -కారాగృహ ఫుడ్స్ వాడండి”

“వివాహాలలో ఇవే వాడండి…” ఎవరో వ్రాసారు… “ఎందుకంటే మగవాళ్ళంతా జీవిత ఖైదీలుగా మారే ప్రక్రియలు ఈ వివాహాలు!”

“ఇది అన్యాయం….” ఓ మహిళ వ్రాస్తోంది, “ప్రతి గ్రూపులో స్త్రీల పట్ల వేళాకోళం ఎక్కువయిపోతోంది. స్త్రీలందరూ ఈ ఒరవడిని తీవ్రంగా ఖండించాలి.”

“మేడమ్! ఇది మిర్చీ గ్రూప్. కొంత కారా కిళ్ళీ తినక తప్పదు.”

“పైగా ఇది కారాగృహ ఫుడ్స్. ఆలోచించండి”

“ఎడ్మిన్‌! ఏమవుతోంది? ఈ గ్రూప్ సేల్స్ ప్రమోషన్‌కా, సెల్ఫ్ ప్రొమోషన్‌కా?”

“ఆయనెవరో ఆయన పుస్తకం పెట్టాడు. ఇది ప్రమోషన్ కాదా?”

“నాకు విసుగొచ్చింది. మొబైల్ పక్కన పెట్టాను. దాంట్లో పోస్ట్‌ల తాలూకూ శబ్దం మ్రోగుతూనే ఉంది. కొద్ది సేపు ఆగి మరల తీశాను.  ఒక ఆడియో వచ్చింది.

“నేను రోజూ చేసుకునే సూర్యాష్టకం…” ఇంతే సంగతులు. చిత్రం ఏంటంటే సూర్యాష్టకం అని ఒకటే చెప్పాడు. దాని వెనుక చాలా అష్టోత్తరాలున్నాయి. దానిని దాటి తరువాత పోస్ట్‌కి వెళ్ళాను.

“నిన్న డిన్నర్ చేస్తున్నప్పుడు శ్రీమతి వడ్డిస్తున్న చపాతీ” ఆవిడ చపాతీ ప్లేట్లో వేస్తోంది.  ఈయన కెమెరా వైపు చూస్తున్నాడు. ఆవిడ కూడా కెమెరా వైపు చూస్తోంది. కాకపోతే కొద్దిగా అనుమానంగా చూస్తోంది. ఎందుకయి ఉంటుందా అని జూమ్ చేసి చపాతీని క్లోజప్‌లో చూశాను. సరిగ్గా కాలినట్లు లేదు. ఇది కారణం అయి ఉంటుందనుకొన్నాను.

“మమ్మల్ని ఎప్పుడు ఇంటికి రమ్మంటారు?” ఎవరో అడుగుతున్నారు.

“ఎనీ డే! వెల్‌కమ్!”

ఆ అడుగున ఇంకో ఫొటో ఉంది. ఓ పెద్దావిడకి పూలదండ వేస్తున్నారు.

“ఈ రోజు రిటైరయిన శ్యమంతక మణి గారు!”

“ఎడ్మిన్! ఏం జరుగుతోంది? శ్యమంతకమణి గారి రిటైర్‌మెంట్‌కి, మిర్చీకి ఏంటి సంబంధం?”

“రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఆవిడ రెండే రెండు మిర్చీ బజ్జీలు తినేవారు. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఆవిడకు మిర్చీ శ్యమంతకమణి అని పేరు కూడా వచ్చేసింది. ఆవిడ ఇలా పదవీ విరమణ చేసి ఆఫీసు వదిలి వెళ్ళిపోవటం మిర్చీ బజ్జీలకే కాదు, మా అందరికి కూడా తీరని లోటు. ఇప్పుడప్పుడే ఈ లోటు ఎవరైనా పూర్తి చేయగలరని మేము అనుకోవటం లేదు.”

“కరెక్ట్. అప్పుడప్పుడు నేను కూడా ఓ రెండు బజ్జీలు తిన్న సందర్భాలు లేకపోలేదు. మనుషులు వెళ్ళిపోయాక వాళ్ళ విలువ ఎక్కువ తెలుస్తుంది.”

“కరెక్ట్. ఆవిడకి పదవీ విరమణ శుభాకాంక్షలు!”

వెంటనే ఓ పోస్ట్ తళుక్కుమంది.

“శస్త్ర చికిత్సతో పని లేకుండా పైల్స్, మూల శంకకు సత్వర చికిత్స – సంప్రదించండి. డాక్టర్ ప్రత్తి పాండురంగారావు…”

“ఎడ్మిన్! ఏం జరుగుతోంది?”

ఇంతకీ సుందరం ఎందుకు స్పందించడం లేదు? అర్థం కావడం లేదు.

ఇంతలో ఓ ఫొటో వచ్చింది. తన మిర్చీ బండీ ముందు మిర్చీ బజ్జీని మైకులా పట్టుకుని మాట్లాడుతున్నాడు. అదే టెక్స్ట్‌లా పోస్ట్ పెట్టాడు.

“మిర్చీ మిత్రులకు అభివాదములు. ఇంత సత్వరంగా ఇంతమంది స్పందించినందుకు ధన్యవాదములు. మిర్చీ గ్రూపులో ఇది చేయాలి, అది చేయాలి అని నేను చెప్పలేను.

మిర్చీ ఆద్యంత రహితం, విశ్వవ్యాప్తమైనది. మానవుడు తనను తాను వెతుక్కుంటూ మిర్చీ దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే ఇది కొరికితేనే నాలుక కాలుతుంది అనేది కొరికితే కానీ తెలియదు. దీనినే పెద్దలు ఆత్మజ్ఞానం అంటారు. ఏ సాధనలయినా ఉపాసనలయినా దాని తర్వాతనే అని అందరూ తెలుసుకోవల్సిన అవసరం ఉంది. పిండి పదార్థాన్ని తొలగించి మిర్చీ వైపు ప్రయాణించి ఇంద్రియాలనే గింజలను తొలగించి లోన ఉన్న మాయను అధిగమించటమే ప్రతి సాధనలో ఉన్న తత్వ రహస్యం.

మానవుడు పదిమందీ తనను గుర్తించాలని కోరుకోవడంలో అపరాధమూ లేదు, తప్పూ లేదు. మీ అందరిలో ఓ నటుడు, ఓ రచయిత, ఓ కళాకారుడు ఉంటాడు. మిర్చీ మీ లోని ఆంతరంగిక ప్రతిభను సునాయాసంగా ఇవతలకి లాగే ఓ అద్భుతమైన ప్రసాధనం.

ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ కవ్వించకుండా, అశ్లీలత లేకుండా సరదాగా ఉండే ఏ పోస్ట్ అయినా పెట్టండి మాకు అభ్యంతరం లేదు.

ఒకే ఒక కండిషన్ – సుందరం మిర్చీ మీ అందరి మిర్చీ అని మరవకండి. మిర్చీ బజ్జీ భవిష్యత్తును కాపాడుకుంటూ భిన్నమైన రుచులు మీకు ప్రసాదించే బజ్జీ… సుందరం మిర్చీ. మనందరం తినే మిర్చీ బజ్జీ.

అందరికీ వందనములు!”

వాట్సప్‌లోంచి ఇవతలకి వచ్చి మామూలు మెసేజ్ ఇచ్చాను.

‘నీ మొహం మండ’ అని టైప్ చేశాను.

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here