[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ఓ ఇల్లాలి కథ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]దయం ఆరున్నర సమయం. సూర్యుడు తూర్పు కొండల నడుమ నుండి ఉదయిస్తున్నాడు. సన్నగా వీస్తున్న చిరుగాలులు అక్కడి వాతావరణాన్ని ఆహ్లాద పరుస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలో వున్న చిన్న పట్టణం మల్లేపల్లి. హైదరాబాద్ నుండి నాంపల్లి దాటాక సాగర్ వెళ్తున్న దారిలో వుంటుందా ఊరు. చుట్టూ వున్న పచ్చని పంట పొలాలతో అందంగా వుంటుంది ఊరు. కష్టాన్ని నమ్ముకుని ఆ వూరు చేరిన వాళ్ళనెవ్వరినైనా ఆత్మీయంగా దగ్గరకు తీసుకునే నైజం ఈ నేల ప్రత్యేకం.
‘ఘుమఘుమలు’ అల్పాహార శాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎం.ఎల్.ఏ నారాయణ మూర్తి గారు రిబ్బన్ కట్ చేసి టేబుల్ ముందు కూర్చున్నారు. అతడి ఎదురుగా వినయంగా నించుని ఉన్నారు ఓంకార్, శివరాణి.
“సార్! ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, ఆనియన్ దోశ, మసాలదోశ, రవ్వదోశ, ఊతప్పం, వడ, గారె, ఉప్మా.. ఏం కావాలి సార్?”
“ఆనియన్ దోశ”
“అలాగే సార్” అంటూ ఆ దంపతులిద్దరూ హడావుడిగా వంటశాల వైపు నడిచారు.
శ్రద్ధగా ఆనియన్ దోశ వేస్తున్న భార్యవైపు మురిపెంగా చూస్తున్నాడు ఓంకార్. చట్నీ, సాంబార్, కారప్పొడి అందంగా ప్లేట్లో పేర్చి దోశ తీసుకుని వచ్చి నారాయణ మూర్తి గారి ముందు పెట్టాడు.
తిని, టిఫిన్ బాగుందని.. భవిష్యత్తులో మీరు అభివృద్ధిలోకి వస్తారని దీవించిన ఎం.ఎల్.ఏ. వైపు ఆనందంగా చూశారు.
దంపతులు ఆ చిన్న మాటలకే సంతోషపడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తొలిగా బిల్ చెల్లించి బోణీ చేసిన ఆయనకు నమస్కరించారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న అతిథులంతా హోటల్‌లో ఆశీనులై ఉండగా వెయిటర్ మల్లన్న అందరి దగ్గర ఆర్డర్స్ స్వీకరిస్తున్నాడు. గల్లాపెట్టి దగ్గర కూర్చున్న ఓంకార్ టిఫిన్ చేసిన వాళ్ళు ఇస్తున్న డబ్బులు తీసుకునే పనిలో వున్నాడు.
కొత్తగా ఏర్పాటు చేసిన హోటల్ ని అందంగా తీర్చిదిద్దారు. ఉదయం పదకొండుగంటలకే పనులు పూర్తయ్యాయి. హోటల్ సర్దుతూ సాయంత్రం వరకు ఉన్నారు. రెండు రోజుల తరువాత నుండి సాయంత్రం కూడా టిఫిన్ సెక్షన్ పెట్టాలనుకుని చర్చించుకుని తగిన ఏర్పాట్లు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
రాత్రి నిద్రిస్తున్న సమయంలో శివ రాణికి తన గతం కళ్లముందు కదిలింది. అప్పటికే ఆదమరిచి అమాయక వదనంతో నిద్రిస్తున్న భర్త వైపు చూసింది.
~
“అమ్మాయి! పెళ్ళి వాళ్ళు వస్తున్నారు. త్వరగా రెడీ అవ్వాలి”
తండ్రి చేస్తున్న హడావుడిని గమనించి ‘నాన్న ఎప్పుడూ ఇంతే..అన్ని పనులకీ కంగారు పడతారు’ అనుకుని మెల్లగా నవ్వుకుంది శివరాణి.
అప్పటికే తనకి నాలుగైదు పెళ్ళి చూపులు జరిగాయి. వచ్చిన వాళ్ళు కట్నం ఎక్కువగా అడగడం, అమ్మాయి జాబ్ చేస్తుందా, మీ ఆస్తులేంటి అని అడిగిన వాళ్ళే కానీ.. తనని తనుగా ఇష్టపడ్డవాళ్ళెవ్వరూ లేరే అనుకుని బాధపడింది.
ఎందుకో తెలియదు కానీ ఓంకార్ చూడగానే నచ్చేశాడు శివరాణికి!
తన తండ్రి మిర్యాలగూడలో రైస్ మిల్‌లో కూలిగా చిన్నతనం నుండి చేయడం.. ఆర్థికంగా వాళ్ళ జీవితాలు ఎదగక పోవడానికి కారణం. తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్‍లో అత్యుత్తమ ర్యాంక్ సాధించినా తండ్రి చదివించ లేడని తెలిసి డిగ్రీలో జాయినయింది. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా పెళ్లి సంబంధాలు చూడసాగాడు శివ రాణి వాళ్ళ నాన్న.
పదవ తరగతి కూడా చదవని ఓంకార్‍ని అమ్మాయి చేసుకుంటాననడం ఆమె తల్లిదండ్రులకు విస్మయం కలిగించింది. తమ ఆర్థిక స్థితి తెలిసి కూతురు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు పెద్దవాళ్ళు.
***
పెళ్ళయ్యాక భర్తతో కలిసి నల్గొండ జిల్లా గుర్రంపోడుకి పయనమయ్యింది. తన భర్త అద్దాల షాప్ నడిపిస్తున్నాడని తెలుసుకుంది. ఆర్థికంగా ఫర్వాలేదనే స్థితిలో ఉన్నాడని గ్రహించింది. కానీ వ్యాపారంలో లాభాలు నష్టాలు వుంటాయని అనుకుంది.
తను వచ్చిన రెండు నెలల తర్వాత ఓ రోజు భర్త దిగాలుగా ఉండడం గమనించి “ఎందుకలా ఉన్నారు?” అడిగింది.
స్నేహంగా ఉన్న వ్యక్తి మోసం చేశాడని, ఇంతకాలం ఇద్దరూ కలిసి చేస్తున్న షాప్‍లో నష్టాలు వస్తున్నాయని తను వైదొలుగుతున్నట్లు గా చెప్పి తన వాటా డబ్బులు తనకివ్వమంటూ ఒత్తిడి చేస్తున్నాడని చెప్పాడు.
డబ్బు ఎలా తేవాలో అర్థం కావడం లేదన్నాడు. రెండు రోజులపాటు ఆలోచించారు ఇద్దరు.
అతడు అడిగిన మొత్తం ఇవ్వాలంటే షాప్ లోని మెటీరియల్ అంతా అమ్మేయాల్సిన పరిస్థితి. అతనికి రాజకీయ పలుకుబడి ఉండడం కూడా వీళ్ళు అతడి మాటకు ఎదురు చెప్పలేక పోయారు. లేదా అతను సూచించిన ఓ చిన్న మొత్తం అందుకుని షాప్‌లో భాగస్వామ్యం నుండి తప్పుకోమంటూ బెదిరించసాగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రుల సలహా మేరకు షాప్ బాధ్యతల నుండి తప్పుకుని ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు ఓంకార్.
జరిగిందంతా తెలుసుకుని బాధపడింది శివరాణి.
***
తను వచ్చిన వేళా విశేషమే ఇదంతా అంటూ అత్తమామలు గేలి చేస్తున్న సహించింది. తన భర్త నిస్సహాయ స్థితిని తెలుసుకుని మరింత దిగులు పడింది. అనుకోకుండా తనకొచ్చిన ఆపద అబార్షన్ తలుచుకుని కృశించిపోయింది శివరాణి.
తనని పలకరించి పోదామని వచ్చిన తమ్ముడు శివప్రసాద్‌ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడని తెలుసుకుని అభినందించింది.
“అక్కా!”
“ఏంట్రా శివ?”
“ఈ డబ్బులు తీసుకో..” అంటూ అందిస్తున్న మొత్తాన్ని స్వీకరించకుండా వాడి జేబులోనే పెట్టింది.
“నా పేరు చెప్పుకుని కొత్త బట్టలు కొనుక్కో..” అంది.
“లేదక్కా! ఇవి నాన్న నాకు ఇచ్చిన డబ్బులు కాదు. నేను ఖాళీ సమయాల్లో, పరీక్షలు లేని సమయాల్లో నాన్న పనిచేసే రైస్ మిల్ కి వెళ్ళగా వచ్చిన డబ్బులు. నా జీతం తీసుకోకుండా రాజయ్య గారి దగ్గర అట్టిపెట్టి ఒకేసారి తీసుకున్నాను. ఈ పదివేలు కాదనకుండా తీసుకో అక్కా! తమ్ముడు చేసే ఈ చిన్ని సాయాన్ని కాదనవద్దు.”
బ్రతిమిలాడుతూ ఇస్తున్న తమ్ముడి అభిమానానికి సంబరపడిపోయింది శివ రాణి.
తన భర్త నెలరోజులుగా ఇంటిపట్టునే ఉండడం.. అత్తమామల సతాయింపులు, చివాట్లు కళ్లముందు మెదిలాయి. కళ్ళలో నిలిచిన సన్నని కన్నీటిపొర తమ్ముడికి కానరాకుండా చీర కొంగుతో తుడుచుకుంది.
పాలకి, అద్దె, కరెంట్ బిల్.. ఇంటి అవసరాలు గుర్తొచ్చాయి. మామగారు నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్మెంట్ అవగా వచ్చే పెన్షన్ అతి స్వల్పం. ఉన్నది రెండు గదుల ఇల్లు.
“సరేరా..” అంటూ శివ ఇచ్చిన డబ్బులు తీసుకుని దేవుడి ముందు పెట్టింది. భగవంతుడికి నమస్కరించింది మంచి రోజులు ప్రసాదించమని!
***
భార్య అడిగిన మాటలు విని మొదట కంగారు పడ్డాడు ఓంకార్.
“మనం గుర్రంపోడ్ వదిలి మల్లేపల్లి వెళ్ళాలంటే మా అమ్మానాన్న వాళ్ళు ఒప్పుకోరు!”
“నేను అత్తయ్య మామయ్య లని ఒప్పిస్తాను. మీరు సరే అంటే నే వాళ్ళని అడుగుతాను”
“మరి అక్కడ ఏం చేద్దాం..”
“అదే విషయానికి వస్తున్నాను.. అక్కడ మనం హోటల్ పెడదాం. మా తమ్ముడు ఇచ్చిన పదివేలు, నాకున్న బంగారు చైన్ బ్యాంకులో తాకట్టు పెడదాం. వచ్చిన డబ్బులతో వ్యాపారాన్ని ప్రారంభించి తప్పకుండా విజయం సాధిస్తాం. అందుకు మనకు ఎవరైనా పెద్దవాళ్ళ సహకారం అవసరం. మీరు అప్పుడప్పుడు ప్రజా పార్టీ ర్యాలీల నిమిత్తం వెళుతుంటారు కదా. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎం.ఎల్.ఏ గారిని ఓపెనింగ్‌కి పిలుద్దాం. అది మాత్రం మీ బాధ్యత. ఏమంటారు?”
అడుగుతున్న భార్య తెలివితేటలను మెచ్చుకుంటూనే “సరే “అన్నాడు అనునయంగా.
~
గతం నుంచి బయటకొచ్చిన శివ రాణి హాయిగా నిద్రపోయింది.
***
ఒకరోజు హోటల్ ముందు పోలీసులు నిలబడి ఉన్నారు.
ఏమైందో అనుకుంటూ వంటగదిలో నుండి బయటకు వచ్చింది.
“రోడ్ వైడ్‌నింగ్‌లో.. ఈ హోటల్ తొలగిస్తున్నాము. రెండు రోజుల్లో ఖాళీ చేయాలి.” అంటున్న పోలీస్ వైపు చూసింది.
షాప్ అద్దెకిచ్చిన బ్రోకర్‌కి ఫోన్ చేసింది సందేహంగా..
“అన్నా! మేము హోటల్ ఓపెన్ చేసి నెలేకదా అయింది. మీకు ఈ విషయం తెలియదా? అలాంటప్పుడు ఆరు నెలల అద్దె ఎలా తీసుకుంటారు?” అడుగుతున్న భార్యభర్తలతో..
“నాకదంతా తెలియదు ఓంకార్. సేట్ దుబాయ్‌లో ఉంటాడు. ఓ వారం రోజులుగా ఫోన్ కలవడం లేదు. కలవగానే మీ కష్టం చెబుతా. అప్పటి వరకు ఆగాల్సిందే.”
తాము మోసపోయామని వాళ్లకు అర్థమయింది.
ఆ పెద్దవాళ్లని ఎదిరించి డబ్బు తిరిగి పొందడం కష్టం. వాళ్ళకి వీలైనప్పుడు ఇచ్చిన డబ్బులు తీసుకోవాల్సిందే. ఎదురు మాట్లాడలేని నిస్సహాయ స్థితి వాళ్ళది.
దిగాలుగా గుర్రంపోడ్ తిరిగి వచ్చిన ఆ దంపతులపై.. ముఖ్యంగా కోడలిపై విరుచుకుపడ్డారు నాగయ్య, అతడి భార్య కాంతం.
కన్నీళ్లు పెట్టుకుని క్షమించమని వేడుకుంది. వినలేదు వాళ్ళు. అచ్చిరాని కోడలు తమ ఇంట ఉండడం వీలు లేదన్నారు వాళ్ళు. చుట్టాలు కూడా వాళ్లనే సమర్థించడం శివరాణి బాధని మరింత పెంచింది. రెండు రోజులు భారంగా గడిచాయి.
కన్నీళ్ళతో కొద్దిరోజులు తమ పుట్టింటికి వెళ్ళు వస్తానన్నది. వెళ్తే మళ్ళీ రావద్దన్న అత్త మాటలకు బిత్తరపోయింది.
చీర కొంగుతో కన్నీరు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది.
***
ఒకటే బాధపడుతున్న భార్య కష్టాన్ని చూసి తల్లడిల్లిపోయాడు ఓంకార్. చుట్టాలు, పక్క ఇళ్ళ వాళ్లు సైతం నిష్ఠురంగా మాట్లాడడం గమనిస్తున్నాడు ఓంకార్.
ఓ రోజు ఉదయమే త్వరగా రెడీ అయ్యాడు ఓంకార్. భార్యని పెట్టె సర్థుకోమన్నాడు.
మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది శివరాణి. ఎక్కడికి అని కూడా అడగలేదు. హైదరాబాద్ చేరుకున్నారు ఆ దంపతులు.
కొత్తగా కడుతున్న అపార్ట్‌మెంట్‌కి వాచ్‌మన్‌గా చేరాడతను. ఇంటి దగ్గర చిన్నపిల్లలని సంరక్షిస్తూ చిన్న హోమ్ కేర్ ప్రారంభించింది శివ రాణి.
ఖాళీ సమయాల్లో వృథాగా కాలం గడపకుండా తోచిన పుస్తకాలు చదువుతూ.. దగ్గరలో ఉన్న స్కూల్‌లో టీచర్‌గా చేరింది.
కొన్నాళ్ళ తరువాత ఓంకార్ కూడా దగ్గరలో ఉన్న ఆఫీస్‍లో డ్యూటీలో చేరడం, ఇద్దరి జీతాలు ఆర్థికంగా వృద్ధికి కారణం అయింది. అద్దె ఇంటికి మారారు ఆ దంపతులు.
సంవత్సరం పాటు అలిగిన అత్తమామలు కోపాన్ని పోగొట్టుకుని ఇంటికి రావడం సంతోషం కలిగించింది ఆమెకు. అత్తకు మంచి చీర, మామయ్య కి కొత్త బట్టలు కొనివ్వడమే కాకుండా స్కూల్‌కి రెండు రోజులు సెలవులు పెట్టి మరీ సిటీ చూపించింది.
ఆనందిస్తున్న అత్తమామల కాళ్ళకి నమస్కరిస్తూ చేతిలో డబ్బులు ఉంచింది. వాళ్ళు ససేమీరా అన్నా వినకుండా చేతిలో ఉంచింది.
“త్వరలో రాబోతున్న మా మనుమడినో మనవరాలినో తొందరగా చూసుకోవాలని ఉందమ్మా” అంటున్న అత్తమ్మ వైపు మురిపెంగా చూసింది.
“వచ్చే నెల మన ఇంటి దగ్గర శ్రీమంతం ఏర్పాటు చేద్దాం నాన్నా” అంటున్న కొడుకు మాటలు విని “సరే రా..అట్లనే చేద్దాం..” అన్నాడు నాగయ్య సంబరంగా.
సన్నని చిరుగాలి కిటికీలో నుండి వీస్తుంది.. అక్కడి వాతావరణాన్ని మరింతగా ఆహ్లాద పరుస్తూ..!
***
ఎవరమైనా కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోవడం సహజం! కానీ ఎవరైతే ఎదురైన కష్టాన్ని జయించి.. త్వరగా తిరిగి సరికొత్త జీవితాలు ప్రారంభిస్తారో.. వాళ్ళు తప్పకుండా సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారు.
అందుకు ఉదాహరణ ఓంకార్, శివ రాణి దంపతులు.