మరుగునపడ్డ మాణిక్యాలు – 69: లవింగ్ విన్సెంట్

0
3

[సంచిక పాఠకుల కోసం ‘లవింగ్ విన్సెంట్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]కొం[/dropcap]దరు కళాకారుల జీవితాలు కష్టాలతో నిండి ఉంటాయి. వెనక ఆస్తి ఉంటే పర్వాలేదు. ఆస్తి లేనివారు తమ సృజనల ద్వారా సంపాదన లేకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగం చేసుకుంటూ కళాసృజన చేసేవారికి ఇబ్బంది ఉండదని అనిపిస్తుంది కానీ అది మరో రకం వేదన. ఉద్యోగమేదీ చేయలేని కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అదేమిటో కొత్త పద్ధతులు అవలంబించేవారికి త్వరగా ప్రశంసలు దక్కవు. అలాంటి ఒక కళాకారుడే విన్సెంట్ వాన్ గోగ్ (ఆయన పేరులో చివరి పదం ఎలా పలకాలి అనేది కొంచెం కష్టమైన వ్యవహారమే. డచ్ భాషలో ఆయన పేరు Vincent van Gogh. చివరి పదం గో అని పలికేవారున్నారు). ఆయన కంటే ముందు ఉన్న చిత్రకారులు మనిషిని కానీ, దృశ్యాన్ని కానీ ఉన్నదున్నట్టు చిత్రించటమే చిత్రకారుడి పని అనుకునేవారు. ఆయన ఆధునిక కళకి ఆద్యుడయ్యాడు. ఆయన చిత్రాల్లో సూక్ష్మత ఉండదు. ఆయన చూపించాలనుకున్నది స్థూలంగా ఉంటుంది. కానీ ముఖాల్లో హావభావాలు, ప్రకృతి దృశ్యాలలో సౌందర్యం స్పష్టంగానే ఉంటాయి. తర్వాత ఆధునిక కళ ఇంకా పరివర్తనం చెంది కేవలం రంగులతో భావాలను చెప్పటం కూడా మనం చూస్తున్నాం. విన్సెంట్ బతికి ఉన్నప్పుడు ఆయనకి రావలసిన పేరు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఖ్యాతి వచ్చింది. విషాదమేమిటంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 37 ఏళ్ళ వయసుకే!

ఆయన మరణానికి కారణాలు ఏమిటి అని విశ్లేషించిన చిత్రం ‘లవింగ్ విన్సెంట్’ (2017). విశేషమేమిటంటే ఈ చిత్రం మొత్తం పెయింటింగులతోనే రూపొందించారు. వంద మంది చిత్రకారుల తమ స్వహస్తాలతో వేసిన పెయింటింగులే అవన్నీ. కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్లు ఉపయోగించలేదు. నటీనటుల వెనక ఆకుపచ్చ తెర (green screen) పెట్టి షూటింగ్ చేశాక ఆ తెర స్థానంలో విన్సెంట్ పెయింటింగులని ముద్రించారు. తర్వాత నటీనటుల బొమ్మలను కూడా పెయింటింగులుగా మార్చారు. మొత్తం ప్రక్రియ పూర్తి కావటానికి ఆరు సంవత్సరాలు పట్టింది! ఈ పద్ధతి ఎందుకు అవలంబించారు? కళాకారుల సృజనకి ఇదో రూపం. సినిమా చూస్తున్నప్పుడు మొదట్లో పెయింటింగులకి అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. కానీ అదో వింత అనుభూతి. కళాకారులు పడిన శ్రమకి అబ్బురపడకుండా ఉండలేం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే.

విన్సెంట్ ఫ్రాన్స్‌లో ఒక ఊళ్ళో పెయింటింగులు వేసుకుంటూ ఉండేవాడు. అతనికి, అతని స్నేహితునికి ఒక వేశ్య విషయంలో గొడవ జరుగుతుంది. ఆ స్నేహితుడు దూరమైపోతాడు. విన్సెంట్ తన ఎడమ చెవి కోసి ఆ వేశ్యకు బహూకరిస్తాడు. ఆమె భయభ్రాంతురాలవుతుంది. విన్సెంట్ కోలుకున్నాక అతన్ని అందరూ ఒక పిచ్చివాడిలా చూస్తారు. పిల్లలు కూడా అతని మీద దాడి చేస్తారు. అతను వారి నుంచి పారిపోతాడు, కానీ ఎవరినీ ఎదిరించడు. చివరికి అతన్ని ఊరి నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకుంటారు. అతని ఇంటి యజమాని తనే స్వయంగా ఈ బహిష్కరణ జరిగేలా చూస్తాడు. రెండేళ్ళ తర్వాత విన్సెంట్ మరణించినట్టు తెలుస్తుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని ఒక ఉత్తరం తెచ్చి పోస్ట్ మ్యాన్‌కి ఇస్తాడు. అది విన్సెంట్ తన తమ్ముడు థియోకి రాసిన ఉత్తరం. విన్సెంట్ రోజూ తమ్ముడికి ఉత్తరాలు రాసేవాడు. అలా అతనికి పోస్ట్ మ్యాన్‌తో స్నేహం ఏర్పడింది. ఆ ఊళ్ళో ఉండగా విన్సెంట్ రాసిన చివరి ఉత్తరం ఆ ఇంటి యజమాని దగ్గరే ఉండిపోయింది. పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని ప్యారిస్‌లో థియో చిరునామాకి పంపిస్తాడు కానీ అని తిరిగివస్తుంది. అందుకని ఆ పోస్ట్ మ్యాన్ తన కొడుకుని ఆ ఉత్తరం థియోకి ఇచ్చి రమ్మని పంపిస్తాడు. బతికి ఉండగా విన్సెంట్ తనకి ఉత్తరం రాశాడని, తాను ప్రశాంతంగా ఉన్నానని అందులో రాశాడని, కానీ ఆరు వారాల్లోనే మరణించాడని వాపోతాడు. ప్రశాంతంగా ఉన్నవాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేనని అంటాడు.

పోస్ట్ మ్యాన్ కొడుకు పేరు ఆర్మాండ్. అతను మొదట వెళ్ళనంటాడు కానీ తండ్రి బలవంతం చేయటంతో ప్యారిస్‌కి వెళతాడు. థియో ఇంటికి వెళతాడు కానీ అక్కడ థియో ఉండడు. అక్కడున్న వ్యక్తి విన్సెంట్‌కి రంగులు సరఫరా చేసిన వ్యాపారిని కలుసుకోమంటాడు. ఆర్మాండ్ ఆ వ్యాపారిని కలుస్తాడు. అన్నయ్య మరణాన్ని భరించలేక థియో మనోవేదనతో మరణించాడని ఆ వ్యాపారి చెబుతాడు! విన్సెంట్ బాల్యం గురించి కూడా చెబుతాడు. విన్సెంట్ తొలి సంతానం కాదు. అతనికంటే ముందు ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. అతని తల్లి తన మొదటి బిడ్డని మర్చిపోలేక విన్సెంట్‌ని, థియోని నిర్లక్ష్యం చేసింది. విన్సెంట్ సున్నిత మనస్కుడు. అంతుచిక్కని బాధతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేకపోయాడు. తండ్రి కూడా అతన్ని పట్టించుకోడు. విన్సెంట్‌కి థియో ధైర్యం చెబుతాడు. “నీకు నచ్చిన పని చెయ్యి. నేను నీకు అండగా ఉంటాను” అంటాడు. విన్సెంట్ పెయింటింగులు వేయటం మొదలుపెడతాడు. అప్పటికి అతని వయసు 28 ఏళ్ళు. ఖర్చులకి డబ్బు థియో ఇస్తాడు.

విన్సెంట్ కొన్నాళ్ళు ప్యారిస్‌లో ఉండి తర్వాత పోస్ట్ మ్యాన్ ఉన్న ఊరికి వెళతాడు. బహిష్కరణ తర్వాత థియో అతన్ని మానసిక వైద్యశాలలో చేర్పిస్తాడు. అతని మానసిక స్థితి బాగు పడుతుంది. అక్కడి నుంచి మరో ఊరికి వెళతాడు. వెళ్ళే ముందు ప్యారిస్ వెళ్ళి రంగుల వ్యాపారిని కలుస్తాడు. అతన్ని చూసి వ్యాపారి సంతోషిస్తాడు. అతని ఆత్మస్థైర్యం చూసి ఇక అతన్ని ఎవరూ ఆపలేరు అనుకుంటాడు. కానీ ఆరు వారాల్లోనే అతని మరణవార్త తెలుస్తుంది. అతని అంత్యక్రియలకి గాషే అనే డాక్టర్ వస్తాడు. థియోకి కూడా అతను తెలుసు. అంత్యక్రియలు పూర్తయ్యాక గాషే విన్సెంట్ పెయింటింగులు కొన్ని తీసుకువెళతాడు. విన్సెంట్‌కి చికిత్స చేసినందుకు అది అతని జీతం అని వ్యాపారి అనుకుంటాడు. ఆ డాక్టర్‌ని కలిస్తే విన్సెంట్ ఎందుకు మరణించాడనేది తెలియవచ్చని వ్యాపారి ఆర్మాండ్‌తో అంటాడు. ఆర్మాండ్ తన తండ్రి కోసం ఆ డాక్టర్‌ని కలవాలని నిర్ణయించుకుంటాడు. విన్సెంట్ ఎందుకు చనిపోయాడో తెలియకపోతే తన తండ్రి ప్రశాంతంగా ఉండలేడని అతనికి తెలుసు.

ఆర్మాండ్ గాషే ఉండే ఊరికి వెళతాడు. ఆ ఊళ్ళోనే విన్సెంట్ మరణించాడు. ఆర్మాండ్ గాషే ఇంటికి వెళతాడు. కిటికీలో నుంచి చూస్తే ఒక అమ్మాయి పియానో వాయిస్తూ కనపడుతుంది. ఆమె గాషే కూతురు మార్గరీట్. ఆర్మాండ్‌కి బయట ఇంటి పనులు చూసుకునే పనావిడ (హౌస్ కీపర్) కనపడుతుంది. గాషే ఊళ్ళో లేడని, మర్నాడు వస్తాడని చెబుతుంది. విన్సెంట్ ఉత్తరం తన దగ్గర ఉందని ఆర్మాండ్ అంటే ఆమె “విన్సెంట్ దుష్టుడు. అతని కళ్ళలో అదో రకమైన ఉన్మాదం. అతన్ని మొదటిసారి చూసినపుడే నాకు ఏదో కీడు జరగబోతోందని అనిపించింది” అంటుంది. అప్పట్లో పురుషులంటే ఇలా ఉండాలి అని అభిప్రాయాలు ఉండేవి. విన్సెంట్ మొదటిసారి ఇంటికి వచ్చినపుడు మార్గరీట్‌ని తదేకంగా చూడటం పనావిడకి నచ్చలేదు. అతనికి ఆ అమ్మాయిలో ఒక విధమైన మెరుపు కనపడి ఉండవచ్చు. కళాకారుడు కదా. అతనికి ఒక చెవి లేకపోవటం కూడా ఆ పనావిడకి ఏహ్యభావం కలిగించి ఉండవచ్చు. పైగా పనీ పాటా లేకుండా బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడు. అతని మరణం తర్వాత ఆమె తన భావాలకి ఒక క్రూరమైన రంగు పులిమింది. తన అయిష్టాన్ని అతనికి ఆపాదించి ‘అతనిలో ఏదో దుష్టశక్తి ఉంది’ అన్నట్టు మాట్లాడుతుంది. ఆర్మాండ్ పెద్దగా పట్టించుకోడు. తర్వాత వచ్చి గాషేని కలుస్తానని వెళ్ళిపోతాడు.

విన్సెంట్ బతికి ఉండగా బస చేసిన హోటల్ కి వెళతాడు ఆర్మాండ్. హోటల్ యజమాని కూతురు అతనితో మాట్లాడుతుంది. “ఒక రాత్రి విన్సెంట్ పొట్ట మీద తూటా గాయంతో వచ్చాడు. మా నాన్న అడిగితే ‘ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాను’ అన్నాడు. తూటా శరీరంలోనే ఉండిపోయింది. తుపాకీ ఎక్కడుందంటే ఏమో అన్నాడు విన్సెంట్. విషయం తెలిసి గాషే వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకోలేదు. కోపంగా ఉన్న తోడేళ్ళలా అనిపించారు. గాషే డాక్టరయ్యుండి కూడా ఏమీ చేయలేదు. ఏం లాభం లేదు అని వెళ్ళిపోయాడు. మర్నాడు ఆందోళనగా థియో వచ్చాడు. కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. కానీ క్రమంగా విన్సెంట్‌కి జ్వరం పెరిగింది. రాత్రి ఒంటిగంటకి మరణించాడు” అని చెబుతుంది. ఎప్పుడూ పెయింటింగులు వేస్తూ ఉండేవాడని చెబుతుంది. అడవిలోకి వెళ్ళేవాడని, నది దగ్గరకి వెళ్ళేవాడని అంటుంది. నది దగ్గర పడవవాడిని అడిగితే ఇంకా చెబుతాడు అంటుంది.

చనిపోయే ముందు విన్సెంట్ థియోతో “నేను వాళ్ళలో ఒకడిని అయ్యుంటే బావుండేది” అంటాడు. అందరిలా సాధారణ జీవితం గడపగలిగితే బావుండేది అని అతని భావం. కానీ అతని తప్పు లేదు. తల్లి ప్రేమ దక్కలేదు. ఆమె బిడ్డని కోల్పోయిన బాధలో ఉంది. ప్రసవమంటేనే స్త్రీకి మరో జన్మ. నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాంటిది బిడ్డ దక్కలేదంటే ఎంత బాధ! ఆమె ఆ బాధని భరించలేకపోయింది. విన్సెంట్ పుట్టినా ఆమె కోలుకోలేదు. విధి ఒక్కోసారి కర్కశంగా ఉంటుంది. ఎవరినీ ఏమీ అనలేం. తండ్రి విన్సెంట్‌ని అప్రయోజకుడు అనుకుంటాడు. దేవుడు అలాంటివారికి ఏదో ఒక ఆసరా ఇస్తాడు. విన్సెంట్‌కి థియో ఆసరా దొరికింది. కానీ ప్రపంచం అతన్ని బతకనీయలేదు. ఒకప్పుడు కళాకారులకి రాజుల ప్రాపకం దొరికేది. కానీ విన్సెంట్ అందరి లాంటి కళాకారుడు కాదు. అతను బొమ్మలు వేసే పద్ధతి వేరు. అతని కళని ఎవరూ అర్థం చేసుకోలేదు. ఖర్చే కానీ రాబడి లేదు. దానికి తోడు అందరి సూటి పోటి మాటలు. గాషే అంత్యదశలో కూడా అతని మీద ఎందుకు కోపంగా ఉన్నాడు? అదే అతని చావుకి కారణమా?

కథలో కొన్ని సంఘటనలు రెండు సార్లు వస్తాయి. చెప్పేవారి దృక్కోణాన్ని బట్టి ఆ సంఘటనల్లో తేడాలుంటాయి. ఉదాహరణకి విన్సెంట్ మార్గరీట్‌ని తొలిసారి చూసినపుడు పనావిడ దృక్కోణంలో మార్గరీట్ చూపు మరల్చుకోలేదు. కానీ తర్వాత మార్గరీట్ ఆ సంఘటన గురించి చెప్పినపుడు ఆమె చూపు మరల్చుకున్నట్టు చూపిస్తాడు దర్శకుడు. చూసే వారి దృష్టిని బట్టి ఒకే సంఘటన వేరు వేరుగా కనిపిస్తుంది. కొందరు తమ బలహీనతలు దాచుకోవటానికి అబద్ధాలు కూడా చెబుతారు. హోటల్ యజమాని కూతురు విన్సెంట్, గాషే “కోపంగా ఉన్న తోడేళ్ళలా అనిపించారు” అంటుంది. తర్వాత అదే సంఘటన చూపినపుడు అక్కడ ఉన్నది కోపం కాదని, ఆవేదన అని తెలుస్తుంది. అయితే ఎవరు చెప్పింది నమ్మాలి? అది ప్రేక్షకుడే నిర్ణయించుకోవాలి.

చిత్రకారురాలైన డొరోటా కోబియెలా విన్సెంట్ పద్ధతులను, అతని ఉత్తరాలను అధ్యయనం చేసింది. అతని జీవితం గురించి తెలుసుకుని ఈ చిత్రకథ తయారు చేసింది. హ్యూ వెల్ష్మన్, జాసెక్ డెనెల్ ఆమెకి స్క్రీన్ ప్లే లో సహకరించారు. ఆమె, హ్యూ కలిసి చిత్రానికి దర్శకత్వం వహించారు. విన్సెంట్ గా రాబర్ట్ గులాస్చిక్, ఆర్మాండ్ గా డగ్లస్ బూత్, మార్గరీట్ గా సర్ష రోనన్, గాషే గా జెరోమ్ ఫ్లిన్ నటించారు. సర్ష రోనన్ చిన్న వయసులోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఆర్మాండ్ పడవవాడిని కలుసుకుంటాడు. అతను “విన్సెంట్ ఇక్కడికి వచ్చేవాడు. ప్రకృతిని చూస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడూ పెయింటుంగులు వేసేవాడు. అతని ఒంటరితనం చూసి జాలి వేసేది. కొందరు డబ్బున్న కుర్రాళ్ళు వేశ్యలని తీసుకుని వచ్చేవారు. విన్సెంట్ ఆ కుర్రాళ్ళతో మాట్లాడుతుండేవాడు. కానీ స్త్రీల దగ్గర బిడియంగా ఉండేవాడు” అంటాడు. ఆర్మాండ్ “స్త్రీలతో విన్సెంట్‌కి పొసగదని నాకు తెలుసు” అంటాడు. అతనికి తన ఊళ్ళో వేశ్యకి విన్సెంట్ చెవి కోసి ఇచ్చాడని తెలుసు. పడవవాడు “అదేం లేదు. గాషే కూతురితో మాత్రం బాగానే మాట్లాడేవాడు. ఇద్దరూ పడవలో విహరించటానికి వెళ్ళేవారు. ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదు. అతనితో మాత్రం చనువుగా ఉండేది. అతనిలో ఏం నచ్చిందో? అతని వయసులో సగం ఉంటుంది ఆమె వయసు. అతను ఆఖరుకి సంతోషంగా ఉన్నాడనుకున్నాను. ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు” అంటాడు. ఆర్మాండ్ హోటల్‌కి తిరిగి వస్తాడు. హోటల్ యజమాని కూతురు “మార్గరీట్ రోజూ విన్సెంట్ సమాధి దగ్గరికి పూలు తీసుకుని వెళుతుంది. వాళ్ళింటి పనావిడ మార్గరీట్ గురించి గాషే, విన్సెంట్ వాదులాడుకున్నారని చెబుతూ ఉంటుంది” అంటుంది. కథ ఈ విధంగా జటిలంగా మారుతుంది. కూతురి కోసం గాషే విన్సెంట్‌తో గొడవ పడ్డాడా? మార్గరీట్‌కి దూరం కావటంతో విన్సెంట్ ఆత్మహత్య చేసుకున్నాడా?

విన్సెంట్ గురించి చెప్పినపుడు పడవవాడు ఒకరోజు విన్సెంట్ నది ఒడ్డున పెయింటింగ్ వేసేటపుడు ఒక కాకి తిండి తినటానికి వాలిందని, విన్సెంట్ ఆ కాకిని తదేకంగా చూశాడని చెబుతాడు. “ఒక కాకిని చూసి అతను తన్మయత్వం చెందాడంటే అతనెంత ఏకాకి అని నాకనిపించింది” అంటాడు. సామాన్యులకి అలాగే అనిపిస్తుంది. ఒక కళాకారుడికి ప్రకృతిలోని ప్రతీదీ అపురూపంగా కనిపిస్తుంది. విన్సెంట్‌కి ఆ కాకికి ఉన్న స్వేచ్ఛ తనకి లేదు కదా అనిపించి ఉండొచ్చు. ఒక్కోసారి భగవంతుడు మనిషికి ఇచ్చిన బుద్ధి శాపమా అనిపిస్తుంది. బుద్ధి లేని జీవులు నిశ్చింతగా ఉన్నాయి అనిపిస్తుంది (తరచి చూస్తే పశుజన్మ దుఃఖమయం అని అర్థమవుతుంది). మరి విన్సెంట్ లాంటి వారికి దారేది? అతనికి దేవుడు థియో లాంటి తమ్ముడిని ఇచ్చాడు. కానీ కుంగుబాటులో ఉన్నప్పుడు ఆ బంధాలు గుర్తు రావు. వారి కోసం బతకాలి అనే ఆలోచన రాదు.

ఆర్మాండ్ మార్గరీట్‌ని కలవటానికి గాషే ఇంటికి వెళతాడు. ఆరోజు ఆదివారం కావటంతో పనావిడ చర్చికి వెళ్ళింది. మార్గరీట్ విన్సెంట్ గురించి మాట్లాడుతూ “అతని మీద గౌరవంతో అతని సమాధి దగ్గర పువ్వులు పెడతాను. మా ఇద్దరికీ పెద్ద స్నేహం లేదు. అతను మా నాన్న కోసం వచ్చాడు. మా నాన్న అతనికి డాక్టరు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఎందుకంటే ఇద్దరూ చిత్రకారులే. ఇద్దరి అభిరుచులూ ఒకటే. మా నాన్న థియోని, అతని భార్యని, బుజ్జి బాబుని భోజనానికి ఆహ్వానించినపుడు విన్సెంట్ మా నాన్నని తన సోదరుడని అన్నాడు. విన్సెంట్ అప్పుడప్పుడూ ఇక్కడ పెయింటింగ్ చేసేవాడు. నాన్న చేసే చికిత్సలో అదో భాగం. మా ఇద్దరికీ పెద్దగా మాటలుండేవి కాదు” అంటుంది. “మరి నదిలో పడవ విహారం?” అంటాడు ఆర్మాండ్. “ఈ ఊరివాళ్ళకి పుకార్లు పుట్టించటం సరదా. ఎవరో వేరే అమ్మాయి అయి ఉంటుంది” అంటుందామె. “మరి మీ నాన్న విన్సెంట్‌తో ఎందుకు గొడవ పడ్డాడు?” అంటాడతను. “మా నాన్న కారణంగా విన్సెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని నేరం మోపుతున్నారా? మీరు వెళితే మంచిది” అని ఆమె లోపలికి వెళ్ళిపోతుంది.

తర్వాత ఆర్మాండ్‌కి విన్సెంట్‌కి పరిచయమైన కుర్రాళ్ళలో ఒకడి మీద అనుమానం వస్తుంది. అతనే విన్సెంట్‌ని తుపాకీతో కాల్చాడని అనుకుంటాడు. దీనికి కారణం హోటల్ యజమాని కూతురు, పడవవాడు ఆ కుర్రాడి గురించి చెప్పిన విషయాలు, మాజెరీ అనే డాక్టర్ విన్సెంట్ గాయం గురించి చేసిన విశ్లేషణ. మాజెరీ అభిప్రాయం ప్రకారం ఆత్మహత్య చేసుకునేవారు తలకి గానీ, గుండెకి కానీ గురిపెట్టుకుంటారు, పొట్ట మీద కాదు. ఒకవేళ పొట్ట మీద కాల్చుకున్నా తూటా శరీరంలో ఉండిపోదు, బయటకి వెళ్ళిపోతుంది. విన్సెంట్ శరీరంలో తూటా ఉండిపోయింది కాబట్టి దూరం నుంచి ఎవరో కాల్చి ఉంటారు అంటాడు. కానీ అతని మాటల్లో పస ఉండదు. తన మీద తనకే నమ్మకం లేనట్టు మాట్లాడతాడు. కొందరు ప్రతీదీ అతిగా విశ్లేషిస్తారు. కానీ ఆర్మాండ్ అతని మాటలను నమ్ముతాడు. అతని తండ్రి విన్సెంట్ ఆత్మహత్య చేసుకోలేదని మొదటి నుంచీ అంటూనే ఉన్నాడు. దానికి ఇప్పుడు ఊతం దొరికింది. ఆర్మాండ్ బాగా తాగి కొందరు కుర్రాళ్ళతో గొడవపడి జైలుకి కూడా వెళతాడు. మర్నాడు బయటకి వస్తాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

విన్సెంట్ చనిపోయిన చోట అర్మాండ్ నిస్పృహతో కూర్చుని వుంటే మార్గరీట్ వస్తుంది. అతను జైలుకి వెళ్ళి వచ్చాడని ఆమెకి తెలిసింది. అతని మీద సానుభూతి కలుగుతుంది. ఆమె అతనికి నిజం చెబుతుంది. “నేను, విన్సెంట్ స్నేహం చేశామన్నది నిజం. అతని పెయింటింగులు చూస్తే అతను ఒక జీనియస్ అని నాకు తెలిసింది. మా నాన్నకి కూడా అర్థమయింది. మా నాన్న చిత్రకారుడు కావాలని కలలు కన్నాడు. విన్సెంట్ ఏ శిక్షణా లేకుండా గొప్ప పెయింటింగులు వేయటం చూసి మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆ పెయింటింగులు నకలు చేయటానికి ప్రయత్నించేవాడు. నేను విన్సెంట్ ఏకాగ్రతకి భంగం కలిగిస్తున్నానని నన్ను అతనికి దూరంగా ఉండమన్నాడు. గొప్ప కళాఖండాలు పుట్టకుండా అడ్డుపడవద్దన్నాడు. నేను ఆయన చెప్పినట్టే చేశాను. తర్వాత వాళ్ళిద్దరికీ గొడవ జరిగింది. ఆ గొడవ నా గురించి కాదు, కానీ నేను దూరంగా ఉండటంతో విన్సెంట్ బాధపడ్డాడేమో. ఆ తర్వాత మా నాన్న అతన్ని కలుసుకున్నది అతనికి తూటా గాయం అయ్యాకనే. నాదీ, మా నాన్నదే తప్పు. మా వల్లే అతను కుంగిపోయి తుపాకీతో కాల్చుకున్నాడు” అంటుంది. ఆర్మాండ్ ఒక కుర్రాడు అతన్ని కాల్చాడని అంటాడు. “ఏది ఏమైనా నేను అతనితో స్నేహంగా ఉండి ఉంటే అతను మా ఇంట్లోనే పెయింటింగ్ చేసుకునేవాడు. ఇలా జరిగేది కాదు” అని ఆమె బాధ పడుతుంది.

గాషేకి తన కూతురు విన్సెంట్ ప్రేమలో పడుతుందనే భయం కంటే విన్సెంట్‌కి గొప్ప పేరొస్తుందనే అసూయే ఎక్కువని నాకనిపించింది. విన్సెంట్‌కి తన కూతుర్ని దూరం చేస్తే అతను సరిగా బొమ్మలు వేయలేడని అతనికి తెలుసు. అందుకే ఆమెని అతనికి దూరం చేశాడు. దాని కోసం ఆమెతో “అతని ఏకాగ్రతకి భంగం కలిగించొద్దు” అని చెప్పాడు. తన అసూయని కప్పిపుచ్చుకోవటానికి కూతురిని దోషిని చేశాడు. ఎంత దారుణం! అతను అనుకున్నదే జరిగింది. విన్సెంట్ కుంగిపోయాడు. బొమ్మలు సరిగా వేయలేకపోయాడు. గాషే అతన్ని హేళన చేశాడు. వారిద్దరికీ గొడవ జరిగింది. కొన్నాళ్ళకి విన్సెంట్ మరణించాడు. మార్గరీట్ తాను విన్సెంట్‌కి దూరం కాకుండా ఉంటే అతను తమ ఇంట్లోనే బొమ్మలు వేసేవాడని, అతను చనిపోయేవాడు కాదని బాధపడుతుంది. అసూయ ఎంత మంది జీవితాలని పాడు చేస్తుందో కదా! విన్సెంట్ మార్గరీట్‌కి దూరమైనందుకే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఆ కుర్రాడు చంపాడా? అసలు నిజం గాషే ద్వారా తెలుస్తుంది.

గాషే ప్యారిస్ నుంచి తిరిగి రావటంతో ఆర్మాండ్ అతన్ని కలుసుకుంటాడు. “అతనికి గాయమైనపుడు నేను వెళ్ళాను. అతను తానే కాల్చుకున్నానని, ఎవరి తప్పూ లేదని అన్నాడు” అంటాడు గాషే. “అలా ఎవరు అంటారు? ఎవరినో కాపాడాలని అనుకునేవారే అలా అంటారు” అంటాడు ఆర్మాండ్. “ఔను. అతను నన్ను కాపాడాలని అనుకున్నాడు. నేను అన్న మాట కారణంగానే అతను కాల్చుకున్నాడు. అతను నాకు కోపం తెప్పించే మాట అన్నాడు. నేను కళని నమ్ముకునే దమ్ము లేక బూటకపు జీవితం గడుపుతున్నానని అన్నాడు. తాను తనకు నచ్చిన జీవితం గడపటానికి పోరాటం చేస్తున్నానని అన్నాడు. నిజమే. నేను చిత్రకారుణ్ని కావాలనుకుంటే మా నాన్న ఒప్పుకోలేదు. మెడిసిన్ చదవమన్నాడు. ఆయనకి ఎదురుచెప్పలేకపోయాను. కానీ విన్సెంట్ అన్నమాటకి నాకు రోషం వచ్చింది. “నీ పోరాటం కోసం నీ తమ్ముడు కరిగిపోతున్నాడు. అతను జబ్బు పడ్డాడు. నీ భారం భరించలేకపోతున్నాడు” అన్నాను. విన్సెంట్ శారాఘాతం తగిలినట్టు అయిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి కాల్చుకుని చనిపోయాడు. అతను నాతో అన్న చివరి మాటలు “ఇదే అందరికీ మంచిది” అని” అంటాడు గాషే. తమ్ముడికి తాను భారమయ్యానని విన్సెంట్ అనుకున్నాడు. కానీ అది గాషే అభిప్రాయం మాత్రమే. అతను అసూయతో అన్న మాట అది. అదే విన్సెంట్‌కి మరణశాసనం అయింది.

గాషే విన్సెంట్‌కి సాయం చేసి ఉండొచ్చు. డబ్బు రూపేణా కాకపోయినా అతని పెయింటింగులు అమ్మటానికి సాయం చేసి ఉండొచ్చు. ప్రపంచానికి అతని కళని పరిచయం చేసి ఉండొచ్చు. కానీ అసూయ పెద్ద భూతం. అతని అసూయ కారణంగా విన్సెంట్ ప్రపంచానికి దూరమయ్యాడు. మొజార్ట్ మీద అసూయతో ఆంటోనియో సెలియేరీ అతని చావుకి పరోక్షంగా కారణమయ్యాడు. ఎంత విషాదం! విన్సెంట్ చనిపోకుండా ఉంటే తానే డబ్బు సంపాదించి థియోకి చికిత్స చేయించేవాడేమో. ఎన్ని అనుకుని ఏమి లాభం? తర్వాత థియో కూడా చనిపోయాడు. మనోవేదనతో అతని జబ్బు మరింత ముదిరింది. మార్గరీట్ విన్సెంట్ మరణంలో తన పాత్ర ఉందని బాధపడుతోంది. అన్నిటికీ కారణం గాషే. ఆ నిజం ఆర్మాండ్‌కి మాత్రమే చెప్పాడు. ఎందుకు? ఎవరో ఒకరికి చెప్పుకుంటే కానీ మనసు భారం తగ్గదు. తెలిసినవారి కంటే తెలియని వారికి చెప్పుకోవటానికే మనిషి ఇష్టపడతాడు. అందుకే చాలా మంది మనోవైజ్ఞానికుల (సైకియాట్రిస్ట్) దగ్గరకి వెళతారు. తమ నుంచి ఏ సంజాయిషీలూ ఆశించని వారి దగ్గర తమ రహస్యాలు చెప్పుకోవటం తేలిక. గాషేకి అతని తండ్రి నుంచి ప్రోత్సాహం దక్కలేదు. పిల్లలు తమ ఆసక్తికి అనుగుణంగా చదువుకుని, పని చేసుకోనీయకపోతే వారిలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది. అది ఏదో విధంగా బయటికి వస్తుంది. చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. పిల్లల ఆనందం ముఖ్యం కానీ సంపాదన ముఖ్యం కాదని తలిదండ్రులు తెలుసుకోవాలి.

విన్సెంట్ ఉత్తరాన్ని థియో భార్యకి పంపిస్తాడు గాషే. ఆమె విన్సెంట్ ఉత్తరాలన్నీ ఒక పుస్తకంగా ముద్రిస్తుంది. ఆర్మాండ్ తన తండ్రికి మాత్రం కొందరు కురాళ్ళు ప్రమాదవశాత్తూ తుపాకీ పేల్చటంతో విన్సెంట్ మరణించాడని అబద్ధం చెబుతాడు. ఆత్మహత్య చేసుకున్నాడని చెబితే అతను తట్టుకోలేడు. ఏ ప్రయోజనం లేని నిజం దాచటమే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here