జ్ఞాపకాల పందిరి-189

11
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

కనుచూపు కరువైన..!!

[dropcap]జీ[/dropcap]వితంలో మనిషి మనుగడ సాగించడానికి కూడు. గుడ్డ, నీడ ఎంత అవసరమో పరిపూర్ణమైన మనిషిగా బ్రతకడానికి అతని ఆరోగ్యం కూడా అంతే అవసరం! అనారోగ్యంతో మనిషి ఎంతకాలం మాత్రం బ్రతికి బట్టకట్టగలడు?

అందుచేత మనిషికి (ఆడైనా, మగైనా) ఆరోగ్యం తప్పని సరి. అది లేకుండా ఎన్ని వున్నా ఉపయోగం లేదు. మనిషి శరీరం అనేక అంగాలు, అంగ విభాగాలతో నిండి ఉంటుంది. అలా అంగాలలో గానీ, అంగ విభాగాలలో గానీ ఎక్కడ తేడా వచ్చినా అది యావత్ శరీర ఆరోగ్యంపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. దేని ప్రత్యేకత దానిదే అయినా, ఒకదానికి మరొకటి అనేక రూపాలలో సంబంధం కలిగి వుండడం మూలాన, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషిలోని ప్రతి అంగము, అంగ విభాగము ఆరోగ్యంగా ఉండవలసిందే! అందుకే మనిషి ఆరోగ్యం కాపాడుకునే విషయంలో నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.

మానవమాత్రుడు అన్నవాడు, పంచ జ్ఞానేంద్రియాలను కలిగి వుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే! ఆ జ్ఞానేంద్రియ పంచకం ఏమిటంటే, చర్మం (త్వక్కు), కన్ను (చక్షువు), నాలుక (రసన), చెవి (శ్రోతుం), ముక్కు (ఘ్రాణం). వీటిలో దేనికదే దాని ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో ఏది ముఖ్యం? ఏది గొప్ప? అని ప్రత్యేకంగా చెప్పే విధంగా ఉండదు. దేనివసరం దానిదే.

ఈ పంచ జ్ఞానేంద్రియాలూ సజావుగా ఉంటే తప్ప మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా మనజాలలేడు. ఇందులో దేనిలో లోపమైనా మనిషి ఆ జ్ఞానేంద్రియ వైకల్యాన్ని పొందక తప్పదు. అలా పంచ జ్ఞానేంద్రియాలలో ఒకటైన కన్ను (నేత్రం) గురించి ఇక్కడ చర్చించాలని ఆశ పడుతున్నాను. ‘సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం’ అన్నది లోకోక్తి. దీని అర్థం మిగతా జనేంద్రియాలు ప్రధానం కాదని చెప్పడం కాదు. కంటి యొక్క ప్రాధాన్యతను, మనిషికి దాని అవసరం గురించి, కన్ను యొక్క ప్రత్యేకతను గురించి వివరించడమే దాని అర్థం. మనిషికి అవసరాలు ఎన్నోవుంటాయి, వాటిని గుర్తించే విషయంలో, మనకు కావలసింది ఎంచుకోవడంలో, గుర్తించడంలో చూపు ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అది కనుచూపు తోనే సాధ్యం అవుతుంది.

అయితే కనుచూపు లేనివారు (పుట్టి గ్రుడ్డి అనుకుందాం) ఎలాంటి పనులు చేసుకోవడం లేదా? అని కొందరికి సందేహం కలగవచ్చు. బ్రెయిలీ లిపి వచ్చిన తర్వాత, గ్రుడ్డి వారు సైతం అనేక రంగాలలో రాణిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా అవుతున్నారు. అయితే మొత్తం జనాభాలో వీరిది అతికొద్ది శాతం అని చెప్పక తప్పదు. అది వేరే విషయం. కళ్ళు వున్నవాళ్లు, బ్రతికినంత కాలం, ఎలా కాపాడుకోవాలన్నది ఇక్కడ ప్రధాన విషయం. చూడడానికి, చదవడానికి, ఒక వస్తువు ప్రత్యేకతను గుర్తించడానికి, మంచి చెడ్డలు గమనించడానికి కంటి అవసరం ఎంతైనా వుంది.

మరి పుట్టినప్పుడు వున్న కంటి చూపు జీవితాంతం ఒకేలా ఉంటుందా? లేక ఏమైనా మార్పులు వస్తాయా? అని ఆలోచించినప్పుడు, తప్పక మార్పులు వస్తాయని గ్రహించక తప్పదు. ఒకసారి కంటిచూపుకు అలవాటు పడ్డ వ్యక్తికి కనుచూపు తరిగిపోతుంటే విలవిల లాడిపోతాడు. మసక కళ్ళతో ఏ పనీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కనుచూపును మెరుగు పరుచుకోవడానికి,  ‘కళ్ల అద్దాలు’ అవసరం అవుతాయి. చూపులో మార్పు వస్తున్నంత కాలం కళ్లద్దాలు మార్చవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే కంటికి సంబంధించి, వయసు మళ్ళిన వారిలో ఎదురయ్యే ప్రధాన సమస్య, కంటి పోర/కంటిశుక్లాలు, లేదా ‘కేటరాక్టు’. దీనివల్ల కనుచూపు మందగిస్తుంది, క్రమముగా, కంటి చూపు తగ్గిపోతుంది. వృద్ధులలో ఇది ఒక పెద్ద సమస్యగా అనిపిస్తుంది. అందుచేతనే అనేక స్వచ్చంద సేవాసంస్థలు (లయన్స్/రోటరీ క్లబ్బులు, వగైరా) తమ సేవాకార్యక్రమాలలో ‘కంటి’కి అధిక ప్రాధాన్యత నిచ్చి ఎన్నో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా! ఎన్ని ప్రభుత్వ కంటి ఆసుపత్రులు వున్నా, ఎన్ని సేవాసంస్థలు తమ సేవాకార్యక్రమాలలో కంటికి ప్రాధాన్యత నిచ్చినా, సామాన్యుడికి కంటివైద్యం ఇంకా అందని ద్రాక్షపండు స్థాయిలోనే వుండి, వృద్ధాప్యాన్ని ఒక శాపంగా ఊహించుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి ప్రధాన కారణం నిరక్షరాస్యత, అవగాహనా లోపం కావచ్చు.

కంటిని జాగ్రత్తగా కాపాడుకొనకపోతే, వయసు పెరిగాక ఎలాంటి ఇబ్బందులకు గురికావలసి వస్తుందో, ముందే తెలిసి ఉంటే కంటి సమస్యల శాతం కొంతమేరకు తగ్గించుకునే అవకాశం వుంది. దీనికి కావలసింది ఊరూరా ‘హెల్త్ ఎడ్యుకేషన్’ (ఆరోగ్య విజ్ఞానం) కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కంటి వైద్య శిబిరాల్లో, ఉచిత కంటివైద్యంతో పాటు, కంటి సంరక్షణకు సంబంధించిన అవగాహనా కార్యక్రమాల అవసరం వుంది. కంటిచూపు విషయంలోనే కొందరు జాగ్రత్తలు తీసుకుంటారుగాని, జన్యుపరంగా, వయసు పరంగా వచ్చే, రెటీనా సమస్యలు, గ్లకోమా, కేటరాక్ట్ వంటి సమస్యలు యాదృచ్ఛికంగా జరిగే కంటి పరీక్షలలోనూ, ముందుస్తు కంటి వైద్య పరీక్షలలో బయటపడతాయి తప్ప, సమస్య ముదిరే వరకూ లక్షణాలు కనిపించవు. అందుచేత ముందస్తు కంటి వైద్య పరీక్షలు, వయసుతో సంబంధం లేకుండా కనీసం సంవత్సరానికొకమారు తప్పనిసరి అని అందరూ గ్రహించాలి.

ఇక నా విషయానికి వస్తే, నేను కూడా కంటి సమస్యల బాధితుడినే! నేను 1982లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడు, అక్కడి ప్రయివేట్ జనరల్ ప్రాక్టీషనర్, ఆ ప్రాంతంలో పేరున్న వ్యక్తి నాకు పరిచయం అయినారు. ఆయన ఒకప్పుడు కంటి సమస్యతో కనుచూపు కోల్పోయిన వ్యక్తి. ఆ అనుభవంతో ఆయన ఎక్కువగా ఉచిత కంటి వైద్య శిబిరాల ఏర్పాటులో ఎప్పుడు ప్రధాన పాత్ర వహించేవాడు. ఆయనే స్వర్గీయ డా. వి. నరసింహా రెడ్డి గారు. నా కంటి చూపులో తేడాను గమనించి, ఆయన డా దేవేందర్ అనే కంటి వైద్య నిపుణిచేత పరీక్ష చేయించి, నా కంటిచూపును మెరుగు పరచుకోవడంలో, సహాయ పడ్డ మహానుభావుడు.

రచయితకు మొదట కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు సూచించిన డా. దేవేందర్ (మహబుబాబాద్/వరంగల్)

నేను హన్మకొండలో స్థిరపడినప్పుడు, మామూలు కంటివైద్య పరీక్షలు చేస్తూ – బయట పడ్డ కంటిసమస్యలు (రెటీనా సమస్య, గ్లకోమా) గుర్తించి, వెంటనే స్వయంగా అపోల్లో ఆసుపత్రిలో, కంటి రెటీనా వైద్యులు, డా. మల్లికా గోయెల్ గారిచేత మంచి వైద్యం చేయించిన, కంటి వైద్య నిపుణుడు, నాకు మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి డా. గిరిధర్ రెడ్డి. (ప్రస్తుతం వరంగల్ ప్రాంతీయ కంటి వైద్యశాల, సూపరింటెండెంట్) ఆయన సహాయం ఎన్నటికీ మరువరానిది. ఇప్పటికీ మా స్నేహం అదే విధంగా కొనసాగటం నా అదృష్టమనే చెప్పాలి. నాకు డా. గిరిధర్, పర్సనల్ కంటి వైద్య నిపుణుడిగా ఉండేవాడు. నాకు మాత్రమే కాదు, నా యావత్ కుటుంబానికీ ఆయనే కంటివైద్యుడు. కానీ ఉద్యోగరీత్యా ఆయన బాధ్యతలు పెరిగాక, నేను మరో మంచి కంటివైద్య నిపుణుడిని వెతుక్కోవాల్సి వచ్చింది.

రచయిత కంటి సమస్యలు గుర్తించి డా. మల్లికా గోయల్ (అపొల్లో) కు రిఫర్ చేసిన కంటి వైద్య మిత్రుడు డా. గిరిధర్ రెడ్డి (హన్మకొండ)
రచయిత ఎడమకంటి రెటీనా కు చికిత్స చేసిన డా. మల్లికా గొయెల్ (అపొల్లో..హైదరాబాద్)

అలా పరిచయం అయినవారు, సహృదయులు, డా. ప్రవీణ్ గారు. ఆయన హన్మకొండలో, విజయ టాకీస్‌కు ఎదురుగా కాకతీయ కంటి వైద్యశాల (మినీ కార్పొరేట్) నెలకొల్పారు. ఆయన నాకు ఎడమ కన్నుకు కేటరాక్ట్ సర్జరీ చేసారు. తెలంగాణా ప్రభుత్వం జారీచేసిన ‘హెల్త్ కార్డు’ వల్ల, నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. అయితే, కరోనా సంచలన విజృంభణ తర్వాత నా కుడికంటికి కూడా కేటరాక్ట్ వచ్చింది. దానికి సర్జరీ చేయించుకోవడానికి ఎన్నో ఆటంకాలు. అనుకోని విధంగా, తాత్కాలికంగా నేనూ నా శ్రీమతి, హన్మకొండ నుండి సికింద్రాబాద్‌కు, అమ్మాయి ఇంటికి వలస రావలసి వచ్చింది. రెండవదిగా, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడము, అదీ కంట్రోల్‌లో వున్నప్పుడు, మరేదో తప్పనిసరి పని పడడం, నాకు మళ్ళీ హన్మకొండలోనే సర్జరీ చేయించుకోవాలన్న గట్టి కోరిక ఉండడం, ఇలా నా కుడి కంటికి కేటరాక్ట్ శస్త్ర చికిత్స సుమారు మూడు సంవత్సరాలు వాయిదా పడుతూ వచ్చింది. కేటరాక్ట్, వున్నవాళ్ళు చిన్న అక్షరాలు సైతం దగ్గరగా, స్పష్టంగా చూడగలుగుతారు కనుక, నా రచనా వ్యాసంగానికి, ఈ కేటరాక్ట్ సమస్య ఏవిధంగానూ అడ్డు కాలేదు. అందుచేత కాలం బాగానే గడిచిపోతూ వచ్చింది. కానీ, క్రమంగా కుడికంటికి మబ్బుతెరలు పెరుగుతూ ఉండడంతో, తప్పని పరిస్థితిలో, హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను.

రచయిత ఎడమ కంటికి కేటరాక్ట్ సర్జరీ చేసిన డా.ప్రవీణ్ (కాకతీయ కంటి ఆసుపత్రి, హన్మకొండ)

హైదరాబాద్‌లో సర్జరీ ఎక్కడ చేయించుకోవాలన్నది మరో సమస్య. మొత్తం మీద ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకుని, మా అమ్మాయి నిర్ణయం ప్రకారం, నా కంటి సర్జరీకి ‘అపోల్లో ఆసుపత్రి’ ని ఖాయం చేసుకున్నాము. జుబ్లీహిల్స్ లోని అపోల్లో ఆసుపత్రికి మా అమ్మాయి నిహార నన్ను తీసుకు వెళ్ళింది. అక్కడ కంటి చికిత్సలకు సంబంధించి అనేక విభాగాలున్నాయి. నన్ను జనరల్ విభాగానికి పంపించారు. జరగవలసిన ముందస్తు పరీక్షలన్నీ జరిగాయి. ఈ విభాగపు అధిపతి డా. శ్రీ కుమార్ రెడ్డి. ఆయనను చూడగానే ఒక రకమైన గౌరవం ఏర్పడింది. ఆయన మాటలు వినగానే ఒక రకమైన భరోసా, నమ్మకం ఏర్పడ్డాయి. నా స్వభావానికి ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది.

రచయిత కుడి కంటికి కేటరాక్ట్ సర్జరీ చేసిన డాక్టర్ శ్రీకుమార్ రెడ్డిగారు (అపొల్లో కంటి విభాగం,హైదరాబాద్)

ఒక శనివారం ఉదయం (11-11-2023) నా సర్జరీకి ముహూర్తం నిర్ణయించబడింది. 9 గంటలకే నా కుమార్తె, నేను ఆసుపత్రికి చేరుకున్నాం. వైద్య పరిభాషలో కేటరాక్ట్, అంటే అతి చిన్న శస్త్ర చికిత్స. కానీ, వారు తీసుకున్న జాగ్రత్తలు ఒక పెద్ద శస్త్ర చికిత్సకు తీసుకోవలసినన్ని వున్నాయి. సుమారు 15 నిమిషాల శస్త్ర చికిత్సకు, నన్ను ఆ సర్జరీకి సిద్ధం చేయడానికి సుమారు గంట సమయం పట్టింది. సిబ్బంది పక్షాన ఎలాంటి ఫిర్యాదులు చేసే అవకాశం రాలేదు. సర్జరీ తర్వాత రెండుగంటల పాటు వార్డులో ఉంచడం, లంచ్ తర్వాత, అవసరమైన కొన్ని సూచనలు చేసి పంపించడం, ఆనందాన్ని,తృప్తిని కలిగించాయి. సాయంత్రానికల్లా కంటి మబ్బులు తొలగి పోయి, వేయి వోల్టుల కాంతిని చూస్తున్న భావన కలిగింది. కంటి చూపు విలువ/అవసరం ఏమిటో తెలిసాయి.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి/పెన్షనర్‌కు మెడికల్ హెల్త్ కార్డు జారీ చేసింది. కానీ,అది పేరుగాంచిన అపోల్లో ఆసుపత్రిలో ఉపయోగపడలేదు. 2) నేను ‘కేర్ ఇన్సూరెన్సు’ తీసుకున్నాను కానీ అది రెండు సంవత్సారాలు పూర్తి అయితే తప్ప ఇలాంటి శస్త్ర చికిత్సలను ఆదుకోదట! అందువల్ల అదీ నాకు ఉపయోగపడలేదు. 3) మరో వెసులుబాటు వల్ల (నా శ్రీమతి SBH/SBI ఉద్యోగిని) బ్యాంకు హెల్త్ కార్డు నన్ను ఆదుకుంది. బిల్లులో సగం వారు చెల్లించారు. మిగతా సగం నా పెన్షన్ సొమ్ము నుండి పెట్టుకోవాల్సి వచ్చింది.

ఏది ఏమైనా ఇప్పుడు నా కనుచూపు మెరుగు పడింది. చదువుకోవడానికి,నా రచనా వ్యాసంగానికీ ఎలాంటి అడ్డు ఇప్పుడు లేదు. కనుచూపు కరువైతే.. జీవితం ఎలావుంటుందో అనుభవిస్తేనే గాని తెలియదు. అందుచేత బాల్యం నుండీ ముఖ్యంగా కంటి విషయంలో ముందస్తు పరీక్షలు/జాగ్రత్తలు అవసరం. దీని పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పక తప్పదు. ప్రభుత్వపరంగా ఈ కంటి వైద్యసేవలు, అతి సామాన్యుడికి సైతం చేరువ కావలసిన అవసరం వుంది.

‘కంటిని అశ్రద్ధ చేయవద్దు!
కనుచూపు పై,
నిర్లక్ష్యము వద్దు..
కాంతివంతమైన జీవితమే ముద్దు!!’

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here