[డా. విజయ్ కోగంటి రచించిన ‘పైనాపిల్ జామ్’ అనే కథా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా ఆంగ్ల అధ్యాపకులైన డా. విజయ్ కోగంటి కవిగా, వ్యాసకర్తగా, అనువాదకులుగా సుప్రసిద్ధులు. డా. విజయ్ వ్రాసిన 32 చిన్న కథలతో వెలువరించిన సంపుటి ‘పైనాపిల్ జామ్’.
“పాఠకుడి ఆలోచనకు ఏమీ మిగల్చని కథల కన్నా విషయాన్ని సూచించి ఆలోచింపజేసేదే మంచి కథ. ఆ ‘లక్షణాని’కి ‘లక్ష్యం’ అనదగ్గ చిన్న చిన్న కథలివి” అని వ్యాఖ్యానించారు శ్రీ హెచ్చార్కె.
***
వ్యాపారస్థులు తమ వ్యాపారాలని ఎలా ప్రమోట్ చేసుకుంటారో, వినియోగదారుల ఆలోచనలను ఎలా ‘ట్యూన్’ చేసి, తమ లాభాల వైపు మళ్ళిస్తారో చెప్పిన కథ ‘లడ్డూ కావాలా?!’. వాట్సప్‍లలో వచ్చే కొన్ని ఫార్వార్డ్స్ వెనుక ఎలాంటి వ్యాపార ప్రయోజనాలుంటాయో ఈ కథ చెబుతుంది.
వేరే ఊర్లో ఉద్యోగం పేరిట తనని, కూతుర్ని వదిలి వెళ్ళిపోయిన భర్త – అక్కడ మరో స్త్రీతో ఉంటున్నాడని తెలుసుకున్న కల్పనకి మరో ఊరికి జరిగిన బదిలీ కాస్త ఊరట అవుతుంది, ‘ట్రాన్స్‌ఫర్’ కథలో. తప్పు చేసింది భర్త అయినా, నిందలు మాత్రం భార్యపై మోపే సమాజం తీరుని ఈ చిన్న కథ మరోసారి గుర్తు చేస్తుంది.
‘ఎవరు కవి’ కథ నిజమైన కవిత్వమంటే ఏమిటో, అసలు కవి ఎవరో చెప్తుంది. ఉగాది కవి సమ్మేళనాల నిర్వహణ ఎంత బోలుగా ఉంటోందో, కొందరు విమర్శకుల ప్రవర్తన ఎలా ఉంటోందో ఈ కథ చెబుతుంది.
ఓ హోటల్‍లో పరిచయమైన వ్యక్తి – కొన్నేళ్ళ క్రితం వరకూ తనను వెతుకుతున్న మనిషని కథకుడికి (నెరేటర్‌కి) తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ గారేజ్‍లో ఉన్న ఓ పాత కారుకీ తన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో తెలిసాకా, ‘కొన్ని కథలు ఎలా మొదలై, ఎలా మలుపు తిరుగుతాయో తెలీదు’ అనుకుంటాడతను ‘పంజాబ్ మెకానిక్’ కథలో.
ఉపాధి కోల్పోయి, తాగుడికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు కల్పన తండ్రి. ఎనిమిదేళ్ళ కల్పన వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది. దేవుడిని ఆ పాప కోరుకున్న కోరికతో తన పరిణతి అర్థమవుతుంది పాఠకులకి. ఎప్పుడో ఏళ్ళ క్రితం పూర్తవ్వాల్సిన బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి కాదు కానీ, ఆ ఊరికి సారా అంగడి మాత్రం వచ్చేస్తుంది. ఇదీ మన సమాజపు వైచిత్రి! ‘నాన్నొస్తే..’ అనే చిన్న కథలో ఎంతో వేదనని నింపారు రచయిత.
దేవుళ్ళూ దెయ్యాలూ ఎక్కడో లేరు, మనమే దేవుళ్లం, మనమే దెయ్యాలం అని చెప్పిన కథ ‘తల్లీ బయలెల్లినాదే!’ ఊరిని ఇబ్బంది పెట్టిన ధూర్తుడిని తునుమాడడానికి అమ్మవారి కత్తే ఉపకరిస్తుందీ కథలో.
చాలా ఏళ్ళ తరువాత సొంతూరికి వెళ్ళిన అతనికి అన్నీ మారిపోయి కనిపిస్తాయి. అప్పటి మనుషులు లేరు, ఆనాటి అభిమానాలు ఉండవు. ఉపాధి కోసమో, ఉద్యోగం కోసం సొంత ఊరికి దూరమై (అక్కడి మనుషులకి, వాళ్ల జీవితాలకి అందనంత దూరంగా వెళ్ళిపోయి) – చానాళ్ళ తర్వాత సొంతూరికి వస్తే మిగిలేవి జ్ఞాపకాలే.. ఇగిరిపోయిన సుగంధాలే అని చెప్తుంది ‘ఏది మా వూరు?’ కథ.
నేటి యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టిన కథ ‘జొమాన్స్’. ఇంజనీరింగ్ పూర్తి చేసి, పిజిలో చేరే లోపు ఖాళీగా ఉండడం ఎందుకని జొమాటోలో ఫుడ్ డెలివరీ బోయ్/గర్ల్ గా చేరిన మిథున్, శ్వేతల స్నేహం ప్రేమగా మారి ముందుకెళ్తుందా? శ్వేతలో సందిగ్ధత, మిథున్‍లో ఆశ! ఈ కథ ముగింపు ఏమవుతుందో అని ఓ క్షణం పాటు ఆలోచిస్తారు పాఠకులు. శ్వేతని సమర్థించలేక, మిథున్‍ని నిరాశపరచలేక – ముగింపు తెలియకపోవడం మంచిదని భావిస్తారేమో.
తీర్చగలిగి ఉండీ, కొడుకు శీనుగాడి కోరిక తీర్చకుండా, సరుకు అమ్ముకోడానికి వెళ్ళిపోతాడు శంకరయ్య ‘ఒక్క ఆశ!’ కథలో. గత రెండు మూడు రోజులుగా సరిగా బేరాలు లేక ఆదాయం లేదని, ఈ రోజైనా బాగా అమ్ముకోవాలన్నది శంకరయ్య ఆశ. బండి మీద పుచ్చకాయ ముక్కలని అమ్ముకుని జీవనం సాగించే శంకరయ్య – శీనుగాడు అడిగిన ఒకే ఒక కాయని ఇవ్వకుండా బజారుకి వచ్చేస్తాడు. సగం కాయలమ్మాకా, సన్నగా వాన మొదలవుతుంది, బండి మీద పట్టా కప్పి, చక్రాలకి ఇటుక రాయి అడ్డం పెట్టి టీ తాగడానికి పక్కకి వెళ్తాడు శంకరయ్య. హఠాత్తుగా వాన ఉధృతి పెరుగుతుంది, పుచ్చకాయల బరువుకి, చక్రం కింద ఉంచిన ఇటుక కదిలిపోతుంది. శంకరయ్య పరిగెత్తుకొచ్చినా, బండిని అందుకోలేకపోతాడు. బండి – ముందుకు దూసుకుపోయి ఆటోను ఢీకొని, పుచ్చకాయలు చెల్లాచెదురైపోతాయి. పుచ్చకాయలన్నీ ముక్కలై రోడ్డంతా చితికి ఎర్రగా నీళ్ళు! జేబులోని డబ్బు తడిసిపోగా ఒకే ఒక కాయని అడిగిన కొడుకు గుర్తొస్తాడు. కథలోని చివరి వాక్యం శంకరయ్య మనసులోని బాధకి అద్దం పడుతుంది.
‘జొమాన్స్’ కథలో జీవితం పట్ల బాధ్యతగా ఉన్న యువతని పరిచయం చేస్తే, ‘కొత్త తరం’ కథలో బాధ్యత పట్టని యువతని చూపిస్తారు. తండ్రిని ఓ ఎటిఎంలా భావించే కొడుకు కథ ‘కొత్త తరం’ కథ. తండ్రికి తలకి గాయమై, ఆసుపత్రిలో ఉంటే, కొడుకు పలికిన మాటలు జీర్ణించుకోడం కష్టమవుతుంది పాఠకులకి. ఆ కొడుకలా తయారవడానికి కారణం గారాబమా? సమాజమా?
‘బదిలీ’ మరో ఊరికి ట్రాన్స్‌ఫర్ అయిన లెక్చరర్ కథ. ప్రతీ ఐదేళ్ళకో ఊరు మారుతూ, ఎందరో విద్యార్థులను శిష్యులుగా చేసుకుని వారిని సవ్యమార్గంలో పెట్టిన ఆ లెక్చరర్‍కి తోటి అధ్యాపకుల నుంచే సమస్యలు ఎదురవుతాయి. ప్రిన్సిపాల్ నేర్చుకోమని చెప్పిన ‘లౌక్యం’ మాత్రం వంటబట్టించుకోడతను.
జీవితంలో సమస్యలతో పోరాడుతున్న ధీర కథ ‘ఆగని పాట’. జీవితపు బరువంతా మోసేది స్త్రీలేనని చెప్తుందీ కథ.
కాలం నేర్పే పాఠం ఆకలి విలువ తెలిసినవారికే అర్థమవుతుందని చెప్పిన కథ ‘పాఠం’. సత్యదేవ్ పాత్ర గొప్ప సందేశం ఇస్తుంది. ‘అర్థం కాని నవ్వు’ జీవితం మీద పూర్తి అవగాహన ఉన్న హరిత కథ. మనుషుల్లా బ్రతకాలని ప్రయత్నించేందుకే ఆ నవ్వు అని ఆమె చెప్పినా, ఆ నవ్వు.. ఆనంద్‍కి అర్థం కాదు. నిడివిలో చిన్నవే అయినా, చదువరుల మనసులపై గాఢమైన ముద్ర వేసే కథలివి. ఈ రెండు కథల గురించి ఎంతైనా రాయచ్చు. కానీ ఎవరికి వారు చదువుకున్నప్పుడు కలిగే ఆలోచనలో, అనుభూతులో, జ్ఞాపకాలో – వారి వారి హృదయాలను తాకుతాయి.
జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు నివారణగా టీవీ ఛానెల్స్‌లో – సిద్ధాంతులు చెప్పే ఉపాయాలు పాటిస్తే ఏం జరుగుతుందో ‘పాపం పరాంకుశం!’ కథ చెబుతుంది. ఛానెల్స్‌లో వచ్చి ఇటువంటి ప్రోగ్రామ్స్‌పై సంధించిన వ్యంగ్య బాణం ఈ కథ.
‘ఎర్ర చారల కలం’ కథలో తనని అభిమానించే కరుణ అనే విద్యార్థిని ఇచ్చిన కానుకగా ఇచ్చిన ఓ అందమైన ఫౌంటెన్ పెన్‍ని పోగొట్టుకుంటాడో అధ్యాపకుడు. ఆ పెన్ ఇవ్వడానికి వచ్చిన రోజున అతనంటే తనకిష్టమని కరుణ చెబుతుంది. థాంక్యూ అంటాడు కానీ, ఆంతర్యం గ్రహించడు. చాలా ఏళ్ళ తరువాత ఓ కొరియర్ షాపులో సంతకం చేయాల్సి వచ్చి, చేతిలో పెన్ లేకపోయేసరికి, తన పక్కన నిలబడి కవర్ మీద అడ్రస్ రాసున్న మహిళ చేతిలో పెన్ కేసి చూస్తాడు. అది అచ్చం – గతంలో తనకి కరుణ ఇచ్చిన పెన్‍లానే ఉంటుంది. ఆమెని అడిగి పెన్ తీసుకుని అడ్రస్ రాసి కొరియర్ చేస్తాడు. ఇలాంటిదే నాకో పెన్ ఉండేదని ఆమెకి చెప్తే, అది ఎవరిచ్చారో గుర్తుందా అని అడుగుతుంది. కరుణ అనే స్టూడెంట్ ఇచ్చిందని చెప్తాడు. ఆ పెన్నుని అతన్నే ఉంచుకోమని చెప్తూ, “మీరు మంచి టీచరే కానీ మీకు కొన్ని అర్థం కావులెండి” అంటుదామె. ఆమె మాటల్లోని ఆంతర్యం అతనికి అప్పుడైనా అర్థం అవుతుందా?
కోటిలచ్చి గడుసుతనమేమిటో తెలుసుకోవాలంటే ‘ఇస్మార్ట్’ కథ చదవాలి. ‘బదిలీ’ కథలో ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోతున్న లెక్చరర్‍ని ప్రిన్సిపాల్ నేర్చుకోమని చెప్పిన లౌక్యం ఇదే. ఎదుటివారి బలహీనతను వాడుకుంటూ మనం ఎదిగిపోవడం! ఆ లౌక్యం అలవర్చుకోవాలా వద్దా అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందని ఈ రెండు కథల్లోను స్పష్టం చేస్తారు రచయిత.
‘కొండమీది బంగ్లా’ కొద్దిగా హారర్ కథలా అనిపిస్తుంది. కానీ మన భయమే దెయ్యమని, భయభ్రాంతులమైనప్పుడు బుద్ధి సరిగా పనిచేయక భ్రమకి గురవుతామని ఈ కథ చెబుతుంది.
‘పెద్దరికం’ మిగతా కథలో పోలిస్తే కాస్త పెద్ద కథ. కొడుకు ఇష్టపడిన అమ్మాయినిచ్చి పెళ్ళి చేసేందుకు – మాట పట్టింపులకి పోయి దూరం పెట్టిన స్నేహితుడిని కలుస్తాడో తండ్రి. ఉన్నతాశయాలు, ఆదర్శ భావాలు కల ఆ యువజంటని కలిపి వాళ్ళకు ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు. ఆసక్తిగా చదివిస్తుందీ కథ.
కళాశాలలో బోధనని మెరుగుపరిచి విద్యార్థులకు మేలు చేద్దామనుకున్న ప్రిన్సిపాల్ ఆశలెలా వమ్ము అయ్యాయో ‘మీటింగ్’ కథ చెబుతుంది. ప్రభుత్వం తీరుని, కొందరు అధ్యాపకుల వైఖరిని బహిర్గతం చేస్తుందీ కథ.
‘ఊరేగింపు దేవతలు’ కథ ఒక పశువు మూగవేదననీ, ఓ ఇల్లాలి మనోవేదనని తెలుపుతుంది. ఐదు కాళ్ళ ఆవుని చూపిస్తూ డబ్బులడిగే భూషయ్య, వచ్చినా కాస్త డబ్బుతో తాగేసి, ఆవునీ, భార్యని తన్ని వెళ్లిపోతాడు. గోవు మాలచ్చి, ఇంటి మాలచ్చి నిస్సహాయంగా ఇంటి వైపు నడుస్తారు.
షేర్ ఆటో పరిమితికి మించి జనాల్ని ఎక్కించుకుని తిప్పే కుమార్‌కి తాను చేస్తున్నది రిస్క్ అని తెలిసినా, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాలను తలచుకుంటూ ఆ ‘రిస్క్’ కొనసాగిస్తాడు. ముందురోజు జ్వరం వచ్చినా, కాస్త తగ్గగానే ఆటో తీసుకుని సెంటర్‍కి వచ్చేస్తాడు. మనసులో ఆలోచనల ట్రాఫిక్, బయట రోడ్డు మీద ట్రాఫిక్. ఈ హాడావిడిలో యాక్సిడెంట్ అవుతుంది. రచయిత ఆటో డ్రైవర్ కోణం లోంచి కథ చెప్పారు. అతనికి దెబ్బలు తగిలాయి. మరి ప్రయాణీకుల మాటేమిటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల మాటేమిటి? వాళ్ళూ కూడా కాస్త డబ్బులు ఆదా చేద్దామనుకునే షేర్ ఆటోలు ఎక్కుతారుగా? – ఇలాంటి ప్రశ్నలు పాఠకుల మనసులలో తలెత్తుతాయి.
ఒకరి విధిలో నిర్లక్ష్యం మరొకరి ప్రాణాలను బలిగొంటే ‘దోషి’ ఎవరు? పని సక్రమంగా చెయ్యని వారా? లేక వాహనం నడిపేవారి స్వయంకృతమా? ఏదేమైనా మునుస్వామి లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినప్పుడు చాలా మందిని వేధించే ప్రశ్నే ఇది – దోషి ఎవరు?
తనని ప్రాణప్రదంగా పెంచి పెద్దచేసిన బామ్మ కోరికని తీర్చకుండా మనవడు సాకులు ఎందుకు చెప్పాడో కారణం తెలిసినప్పుడు హృదయం బరువెక్కుతుంది. ‘సమోసా’ కథ కంటిని చెమరుస్తుంది.
పరిస్థితులు దిక్కుతోచనీయనప్పుడు మనిషిలో స్వార్థం మరింత పెరుగుతుందని చెప్తుంది ‘ఎంతెంత దూరం’ కథ.
పశ్చాత్తాపం లేని కొమరయ్య లాంటి మనుషులు మీకు తారసపడితే ఏం చేస్తారు? ఏదైనా చేయాలంటే ముందు కొమరయ్య గురించి తెలియాలిగా? ‘ఇలాగే మనుషులు..!’ కథ చదివేయండి మరి.
జీవితాన్ని మలుపు తిప్పే ‘పది నిమిషాలు’ సమయం అతనికి దొరుకుతుంది. సద్వినియోగం చేసుకుంటాడా లేదా?
‘నన్నే వెతుక్కుంటూ’ కథ మంచి ప్రయోగం. ఈ పుస్తకంలో రచయిత సృష్టించిన పాత్రలు కొన్ని జీవం పోసుకుని వచ్చి రచయితతో సంభాషిస్తాయి. తమని అలా తీర్చిదిద్దినందుకు నిలదీస్తాయి.
ఆస్తుల్లో వాటాలడగడానికి వచ్చిన కొడుకులకి ఓ తండ్రి ఘాటైన జవాబిస్తాడు ‘చీమలు ఈగలు’ కథలో. హఠాత్తుగా కురిపించే ప్రేమల వెనుక ఉన్న స్వార్థాన్ని అర్థం చేసుకుంటాడాయన.
ఒకరి కోసం ఒకరు తపించే వృద్ధ దంపతుల ప్రేమకి చిహ్నం ‘పైనాపిల్ జామ్’ కథ. వారి అన్యోన్యతకీ, అనుబంధానికి మనసు ఆర్ద్రమవుతుంది.
‘సర్పశిఖి’, ‘కుంక బొంకుడి గుడ్లు’ కథలు కాస్త నిగూఢంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చదవాల్సి వస్తుంది.
***
“మన సంస్కారాన్ని చెడగొట్టకుండా హాయిగా చదువుకోవడానికి బాగుండే కథలివి.” అన్నారు అద్దేపల్లి ప్రభు తమ ముందుమాటలో. ఆ మాటలు ఎంతో నిజమని అనిపిస్తాయి ఈ కథలు చదివాకా.
ఈ కథల్లోని పాత్రలంతా మనకి ఎప్పుడోప్పుడు ఎక్కడో అక్కడ తారసపడే వ్యక్తులు. కథల లోని ఘటనలు, సన్నివేశాలు మనం కన్నవో/విన్నవో. నిశితంగా చదివితే ఇవి మన కథలే అనిపిస్తాయి లేదా మనవాళ్ళ కథలే అనిపిస్తాయి.
ఒకటో రెండో కథలు తప్పించి మిగతా కథలన్నీ రెండు పేజీల కన్నా తక్కువ నిడివి ఉన్నవే. విజయ్ గారు స్వతహాగా కవి కావడం వల్ల క్లుప్తత పై పట్టు సాధించి, పదునైన సంభాషణలతో, తక్కువ పదాలతో లోతైన భావాలనందించే సన్నివేశాలను కల్పించారు. 32 కథలను (ముందుమాటతో సహా) 97 పేజీలలో అందించగలిగారంటే ఎంత క్లుప్తంగా చెప్పారో అర్థమవుతుంది. పుస్తకం చదివాకా, ఒకటే అనిపిస్తుంది. ‘Stories are short, yet, are of profound impact!’ అని.
***
పైనాపిల్ జామ్ (కథా సంపుటి)
రచన: డా. విజయ్ కోగంటి
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్
పేజీలు: 97
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 90004 13413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/PINEAPPLE-JAM-VIJAY-KOGANTI/dp/B0CG4S9BZK