[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]నా[/dropcap]లుగవ తారీఖున నిజామ్ తనను, రాష్ట్రాన్ని లాయక్ అలీ నాశనం చేశాడని అతనితో స్పష్టంగా చెప్పాడు. అదే రోజు సాయంత్రం లాయక్ అలీ రాజీనామా పత్రాన్ని సమర్పించాడు.
జనరల్ ఎల్ ఎద్రుస్ రాజీనామా విషయం కూడా సైనిక దళాలకు తెలిసింది. ఎవరికి విధేయులుగా ఉండాలన్న విషయంలో సైనిక దళాలు రెండుగా చీలిపోయాయి. కొందరు రజాకార్లను వ్యతిరేకించి మరీ నిజామ్‍ను సమర్థించాలని అనుకున్నారు. కానీ కొందరు, ముఖ్యంగా కొత్తగా పదోన్నతి పొందిన ఆఫీసర్లు, యువకులు ఇందుకు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తపరచారు.
ఆగస్టు 5 న లాయక్ అలీ రాజీనామా పట్ల సంతోషం వ్యక్తపరిచాడు నిజామ్. సాయంత్రం 3 గంటలకు ఢిల్లీ నుంచి జైన్ హైదరాబాదు వచ్చాడు. నిజామ్‍తో సుదీర్ఘమైన చర్చ జరిపాడు. ఈ సంభాషణ జరిగిన సందర్భంలో లాయక్ అలీ, ఎల్ ఎద్రుస్, దీన్ యార్ జంగ్ కూడా ఆ గదిలో ఉన్నారు. తరువాత నన్ను కలసినప్పుడు, కొత్త మంత్రివర్గం ఏర్పాటు చర్చలు తరువాత రోజు కూడా కొనసాగుతాయని నాతో చెప్పాడు జైన్. కొత్త మంత్రివర్గం ఏర్పాటు వరకూ పదవిలో కొనసాగమని నిజామ్ లాయక్ అలీని కోరాడు.
అయిదవ తేదీ సాయంత్రానికల్లా నగరమంతా ఉద్విగ్నత నెలకొంది. ఇత్తెహాద్ వర్గానికి ఏం చేయాలో తోచలేదు. ఢిల్లీలో ఉన్న మీర్జాకు నిజామ్ టెలిగ్రామ్ పంపాడు, జైన్ రాక కోసం ఎదురు చూడమని.
ఏదో ఒక నిర్ణయం నిజామ్ తీసుకునేట్టు చేయాలని మీర్జా ప్రయత్నించాడు. మౌంట్‍బాటెన్ ప్రతిపాదనలను తాను ఆమోదిస్తున్నట్టు నిజామ్ రాజాజీకి స్పష్టం చేసేవరకూ తాను ఢిల్లీలో ఎదురుచూస్తూ కూర్చోలేనని నిజామ్‍కు మీర్జా స్పష్టం చేశాడు. ఇక చర్చలకు తావు లేదని చెప్పాడు.
అయిదవ తేదీ రాత్రి పదిన్నరకు లాయక్ అలీ, రిజ్వీలు నిజామ్ ను కలిశారు. నిజామ్ పూర్తిగా లొంగిపోయాడు.
ఆరవ తేదీ తేదీ ఉదయానికల్లా నిజామ్ పూర్తిగా మారిపోయాడు. “ఏది ఏమైనా మౌంట్ బాటెన్ ప్రతిపాదనలను ఆమోదించను” అని ప్రకటించాడు. సంక్షోభం సమాప్తమైపోయింది. లాయక్ అలీ విజేతగా నిలిచాడు. మౌంట్ బాటెన్ ప్రతిపాదనలకు నిజామ్ ఆమోదం తెలిపితే, సైన్యం, పోలీసులు, ఇత్తెహాద్‍ల నుంచి నిజామ్‍ను రక్షించటం కష్టమన్న విషయం అతి వినయంగా నిజామ్‍కు చెప్పి ఉంటారు. సలహాను అడిగే వ్యక్తి లేడు. తన ఆజ్ఞను పాటించేవారూ లేకపోవటంతో నిజామ్ వారికి లొంగక తప్పలేదు.
బహిరంగంగా రజ్వీ ఓ హెచ్చరికను జారీ చేశాడు. “రాజ్యానికి వ్యతిరేకంగా లేచిన చేతిని నరివేస్తాం. ఎత్తిన చేతులనే కాదు, ఆ ఎత్తిన చేతులను పరోక్షంగా నియంత్రించే చేతులనూ నరికేస్తాం”.
తన పదవిని సుస్థిరం చేసుకున్న లాయక్ అలీ, నన్ను షాహ్ మంజిల్‍కు రాత్రి భోజనానికి పిలిచాడు. తన రాజీనామాకు సంబంధించిన వార్తలన్నీ నిరాధారమని నన్ను నమ్మించేందుకు ఈ డిన్నర్‍కు నన్ను ఆహ్వానించాడు లాయక్ అలీ. హైదరాబాద్ వ్యవహారాల్లో మీర్జా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో నిజామ్ మీర్జా పై కోపంగా ఉన్నాడని చెప్పాడు లాయక్ అలీ.
ఎదుటివారిని బోల్తా కొట్టించే అమాయకమైన నవ్వుతో , తనకూ నిజామ్‍కూ నడుమ భేదాభిప్రాయాలు లేనే లేవని అన్నాడు లాయక్ అలీ. ఇత్తెహాద్‍లకు చెందిన ఇంగ్లీషు, ఉర్దూ భాషల వార్తాపత్రికలలో వచ్చిన ఆయన రాజీనామాకు సంబంధించిన వార్తలను ప్రస్తావించాను. “అల్ హజ్రత్ నా గురించి కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. నా పనితీరు నచ్చకపోతే రాజీనామా చెప్తానని అన్నాను. దాన్ని వార్తాపత్రికలు వక్రీకరించాయి” అన్నాడు. “తరువాత రోజు నాపై అవిశ్వాసం లేదని నిజామ్ అన్నారు. నేను రాజీనామా విషయం వదిలేశాను. అయితే నేను రాజీనామా చెయ్యటానికి ఎప్పుడైనా సిద్ధమే” అన్నాడు.
అంతలో చాలా గంభీరంగా – “దురదృష్టవశాత్తు నేను రాజ్యానికి ధార్మికమైన వ్యవహారాలలో ఎలాంటి సేవ వేయలేకపోయాను. అయినా సరే, ఎట్టి పరిస్థితులలో మనం యుద్ధం జరగకుండా చూడాలి. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయాలి” అన్నాడు లాయక్ అలీ.
నా సహాయాన్ని లాయక్ అలీ అడుగుతున్నాడంటే, అతని మనసులో వేరే ఏదో ఆలోచన ఉంటుందని నాకు తెలుసు.
“మీరు మౌంట్‍బాటన్‍తో చర్చలు జరుపుతున్నప్పుడు జరిగే ఒప్పందానికి అడ్డుపడద్దని నన్ను మీరు కోరారు. నేను నా వాగ్దానాన్ని నిలుపుకున్నాను. ఒప్పందం విషయంలో జోక్యం చేసుకోలేదు. ఒకవేళ అడ్డుపడదామనుకున్నా అడ్డుపడలేను. ఒప్పందం భంగం కావటానికి కారణం మీరు. మీ ప్రభుత్వం పట్ల నా ప్రభుత్వానికి ఇప్పుడు నమ్మకం పోయింది. నిజామ్, అతని సలహాదార్లు నా ప్రభుత్వానికి నమ్మకం కలిగేటట్లు ఏదైనా చేస్తే తప్ప మీపై విశ్వాసం కలగదు” అన్నాను.
ఫిబ్రవరిలోని రజాకార్లను రద్దు చేయుమని నేను ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తు చేశాను. అయితే భారత్ కోరే కోరికలను ఎదుర్కునేందుకు రజాకార్లు ఒక ఆయుధమని అన్నాడు . ఫలితంగా భారత్ భద్రతకు రజాకార్లు ప్రమాదకరంగా పరిణమించారు. అలవాటయిన రీతిలో లాయక్ అలీ రజాకార్లను సమర్థించాడు. వారి అకృత్యాలకు సంబంధించిన వార్తలన్నీ అతిశయోక్తులన్నాడు.
“రజాకార్ల అడ్డు మాటలు ద్వారా తొలగించటం కుదరని పని. సైన్యం కానీ ప్రభుత్వానికి విధేయంగా ఉన్న పోలీసులు కానీ రజాకార్లను అదుపులో పెట్టగలరు. నా అభిప్రాయం ప్రకారం మీ ప్రభుత్వం రజాకార్లను నియంత్రించగల స్థితిలో లేదు.”
మా సంభాషణ లక్ష్యాన్ని నేను ఊహించాను. ఆ రోజు ఉదయం లాయక్ అలీ ప్రిన్స్ మువాజామ్ ఝా తో – రాత్రికి నన్ను కలిసి సమస్యకు ఏదో ఓ పరిష్కారం చూస్తానని అన్నాడు. నిజామ్‍ను మెడలు వంచి తమ మాట వినేట్టు చేసుకున్న తరువాత భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు కనిపించాలని అతని ఉద్దేశం. మేమిద్దం వీడ్కోళ్లు తీసుకునేటప్పుడు నేను లాయక్ అలీకి స్నేహపూర్వకమైన సలహా ఇచ్చాను:
“లాయక్ అలీ, మీరు ఎప్పుడూ నా మీద నమ్మకం ఉందని అంటారు. ఒకప్పుడు మీరు నా క్లయింట్. ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్న విధంగా ప్రవర్తించి ఏం సాధిస్తారు? మౌంట్‌బాటన్ ప్రతిపాదనలు నిజానికి మీకు అత్యంత లాభకరమైన ప్రతిపాదనలు. ఇంతకు మించిన లాభకరమైన ఒప్పందం మీకు లభించదు. మీరు దాన్ని తిరస్కరించారు. ఒక విషయం గుర్తుంచుకోండి. దేశంలో నాలుగు కోట్లు ముస్లింలున్నారు. మీరు కనుక నిజామ్ ప్రధానిగా, భారత ప్రభుత్వంతో సహకరిస్తే, హిందు ముస్లింల సమస్యను పరిష్కరించిన వారవుతారు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటవుతుంది. కొన్నాళ్ళలో భారతదేశం మొత్తం మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా కీర్తించినా నేను ఆశ్చర్యపడను. కేంద్రం కోరిన ఆ మూడు అంశాలకు ఆమోదం తెలిపి సమస్యను ఎందుకని సమాప్తం చేయటం లేదు?”
“మున్షీ.. భారత్‍తో విలీనం అన్న విషయన్ని నేను చచ్చినా ఆమోదించలేను. ఆ అంశంతో రాజీ పడలేను.”
“మీరీ మార్గంలో ప్రయాణిస్తే ఒనగూడే వినాశకరమైన ఫలితాలు మీకు తెలుసనే అనుకుంటున్నాను.”
అతను తలెత్తి నా వైపు చూసి “మున్షీ, షహదత్ – అమరవీరుడు అన్న పదం తెలుసు కదా?”
నేను సమాధానం ఇవ్వలేదు. కానీ అతని మానసిక స్థితి నాకు అర్థమయింది.
10వ తారీఖు ఉదయం, నిజామ్‍కు ఈద్ ముబారక్ చెప్పేందుకు వెళ్లి కలవమని, లేదా అభినందనలు తెలుపమని లాయక్ అలీ నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను వచ్చినప్పటి నుంచీ వారు నా పట్ల అవమానకరమైన ప్రవర్తననే చూపుతున్నారు. నన్ను అవమానిస్తూనే వున్నారు. అలాంటి పరిస్థితులలో నా అంతట నేను అభినందనలు చెప్పలేనని చెప్పాను.
అయితే, నేను సర్దార్‍కు ఫోన్ చేశాను. సర్దార్ సూచన మేరకు, నిజామ్ కనుక నన్ను కలిసేట్టయితే, నేను నిజామ్‍ను కలిసేందుకు సిద్ధమని లాయక్ అలీకి తెలిపాను. అయితే ఆయన నన్ను కలిసేందుకు సిద్ధంగా లేకపోతే వ్యక్తిగతంగా గాని, ఉత్తరం ద్వారా కానీ నిజామ్‍కు అభినందనలు తెలిపేందుకు సిద్ధంగా లేనని, అలా తెలపటం అపార్థాలకు దారి తీస్తుందని సమాచారం పంపించాను.
(ఇంకా ఉంది)