భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-3

0
5

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-3: సామాజిక వైరుధ్యాల మధ్య వేమన

  • భావుకుని భావజాలానికి మూలాధారం పదార్థం. భావం పదార్థ పరిజ్ఞానం వల్ల పుడుతుంది. చంద్రుని పరిజ్ఞానాన్ని బట్టి చంద్రముఖి అనే భావం. అలాగే పరమహంస.
  • నిత్య పరిణామాల పాదార్థిక ప్రపంచంలో అనుభూతి (feeling) పొందాలన్నా అభివ్యక్తి (Expression) సాధించాలన్నా కవి అంతర్, బహిర్ పోరాటం చేయక తప్పదు. సామాజిక వర్గ పోరాటాల ప్రతిబింబమే భావనా ప్రపంచం.
  • మార్పు అనేది ఒక నాటితో వచ్చి ఒక నాటితో మారిపోయేది కాదు. అది విరుద్ధ శక్తుల నిరంతర సంఘర్షణల ఫలితం.
  • సామాజిక అనివార్యతతో సొంత ఉనికి కోసం పాకులాడే చేతివృత్తుల వారు సొంత భావజాలాన్ని తమ ఆర్థిక జీవనానికి అనుకూలంగా ప్రవేశపెట్టి ప్రచారం చేస్తారు.
    • కబీర్ – నేత పనివాడు (1380-1414)
    • నానక్ – కుట్టు పనివాడు (1469-1539)
    • అలాగే పోతులూరి వీరబ్రహ్మం వగైరా.
  • ‘కావ్యకన్యకల్ని’ రాజుల అంకితమిచ్చి మడులు మాన్యాలు పొందే ప్యూడల్ సాంప్రదాయం మొదట్నుంచి వుంది. రాజుల తృప్తికోసం కవులు చేయరాని అంగాంగ వర్ణనలు చేశారు. పోతనకి భోగినీ దండకం తప్పలేదు. తరువాత మానేశాడు.
  • అలాగే దేవుని పేర శృంగార కీర్తనలు పాడే అన్నమయ్య నరసింగరాయల శృంగార గీతాలు రాయనని మొండికేసి చెరసాల పాలయ్యాడు.
  • మానసిక అశాంతిని సామాజిక సంక్షోభాన్ని తెలియజేసే ఆత్మాశ్రయ సాహిత్య ప్రక్రియయే శతకం.
  • పాత విశ్వాసాలకి కొత్త అవసరాలకి లంకె లాగా కబీర్ (1380-1414) నిలుచుని సామాజిక శంకలనీ, సమాధానాలనీ తీర్చ ప్రయత్నించాడు.
  • మత వ్యవస్థకు సైనిక వ్యవస్థను సమకూర్చి పెట్టాడు గురునానక్ (1469-1539).
  • శివకేశవుల అభేదాన్ని చాటడానికా అన్నట్లు తులసీదాస్ (1532-1623) ‘రామచరిత మానస్’ రచించాడు.
  • కేవలం తాత్విక జగత్తుకే సీమితమైన ‘భక్తి ఉద్యమం’ – ‘సమర్థ రామదాసు’ (1608-1681) కాలానికి వచ్చేసరికి రాజకీయ పాత్ర నిర్వహించడానికి హితబోధలు కూడా చేసింది

రామడుగు శివరామ దీక్షితులు

‘అచలవాద ప్రతిష్ఠాపనాచార్య’ అన్న బిరుదు వుంది. ఈయన అనేక తత్త్వాలు రచించాడు. జన్మతః బ్రాహ్మణుడైన ఈయన బ్రాహ్మణ్యాన్ని త్యజించి, సామాన్య ప్రజానీకంతో కలసిమెలిసి సంచరించి అచలవాద వ్యాప్తికి, ధర్మ బోధనకు తన కాలాన్ని వినియోగించాడు. ఈయన 19వ శతాబ్దము మధ్య భాగంలో ఉండినట్లు తోస్తుంది. ఈయన శిష్య పరంపర విరివిగా కలదు. ‘పదము చెందక ముక్తి పదము కలుగదు’ అనే మకుటంతో అచల వచనమని, ఈయన రచనలో వర్ణ భేద నిరసన కన్పడుతుంది. ఇతని శిష్యులలో కాలువ కోటప్ప అనే అతడు ప్రముఖుడు.

వీరబ్రహ్మం గారు – వేమన పోలికలు

వేమన తన భావ ప్రచారానికి ఆటవెలది ఎంచుకుంటే వీరబ్రహ్మం, ఆయన అనుచరులు రాగతాళ యుక్తములయిన పదాలు ఎన్నుకొన్నారు. అవే తత్త్వాలుగా ప్రసిద్ధి చెందాయి.

ఉదాహరణ:

చందమామ చందమామ చందమామ,
ఈ సంధి తెలిపే జ్ఞానులెవరె చందమామ..
కాయమను పుట్టలోను చందమామ,
పాము మాయగానే మెలగుచుండు చందమామ
జంట నాగ స్వరములూది చందమామ,
పామును పాదు పెకలింపవలెను చందమామ
తొమ్మిది వాకిల్లు మూసి చందమామ,
పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ
భక్తియను కట్టుకట్టి చందమామ,
పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ
దేహ దేహములందు చందమామ,
పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ

మానవుని ఆవరించి ఉన్న ‘మాయ’ను  పాముతో పోల్చి దాన్ని యోగ ప్రభావంతో పట్టి బంధించాలని ఆ చందమామ పల్లవితో పల్లవించిన ఆ పాట ప్రబోధిస్తుంది.

అలాగే ఇంకొక పాట ‘తియ్య మామిడి’.

తియ్యటి మామిడి పండు
పండు తినబోతే దొరకదు
తీవులు మెండు
విత్తులేని ఫండు విశ్వములో నుండు
సత్యము ఈ మాట నిత్యామయా
ఒరులకు ఈ పండు ఒక దినుసు గానుండు
పరులకు నీ పండు వశము గాకుండు

~

ఇలాంటి తత్త్వాలు చలనచిత్ర జగత్తులో రూపాంతరం చెంది శ్రోతలను అలరిస్తున్నాయి కూడా. ఈ సందర్భంలో ‘నందామయా గురుడ నందామయ’ పాట గుర్తుచేసుకోవచ్చు.

యాగంటి లక్ష్మయ్య

ఈయన కాలాన్ని గురించి విభిన్న అభిప్రాయాలు వున్నాయి. ఈతని రచనలో పల్లవి, అనుపల్లవులు లేకుండా ధ్రువమే కనబడుతుంది – కనుక ఈయన అన్నమయ్యకి పూర్వుడు. 14వ శతాబ్దం కావచ్చు అని శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారి అభిప్రాయం. కొంతమంది పోతులూరి వీరబ్రహ్మంగారికి సమకాలికుడు లేదా పూర్పుడో అనగా 17వ శతాబ్దం కావచ్చు అని అంటారు. ఈయన పేర ఉన్న రచనలు చూస్తే అని ఏ ఒకరో రచించినట్లు వుండదు. యాగంటి సంప్రదాయం అనేది ఒకటి ఉండి, యాగంటి లక్ష్మయ్య గారే గాక వారి తరువాత వారి శిష్యులును రచించిన పదాలు యాగంటి వారి పదాలుగా భావించడానికి అవకాశం ఉంది. కొన్ని అచ్చంగా ఏలపాటలు, కొన్ని కోలాటపు పాటలు. పల్లవి, అనుపల్లవి, చరణాలతో కూడినవి కొన్ని వున్నాయి. తరువాతి కాలపు శిష్యులు ఆయన పేరుతో వ్రాశారు అని కొందరి అభిప్రాయం. యాగల్లు అనేది కర్నూలు జిల్లాలో ఉన్నది కనుక ఈతను రాయలసీమ వాసి అని కొందరి అభిప్రాయం. సంప్రదాయాల వ్యాప్తిని బట్టి తీరాంధ్ర వాసి అని చెప్పవలసి వస్తుంది. ఈయన తత్వాలలో భాషా సౌష్ఠవం ఎక్కువ. అన్నింటిలో సాధారణంగా శివ పారమ్యతం కన్పిస్తుంది ‘ఇదిగో గంగాయాత్ర’, ‘సంధ్య వార్చే విధము తెలియండి’ అనే పదాలు ఈయన రచించాడు. ఈతను అచలవాది. ‘ఆనంద మయుడు కావలెను’ మొదలగువానితో – ఈ వాదం వివరింపబడింది.

అభినయ కవి క్షేత్రయ్య

లింగనముఖి కామేశ్వర కవి రచించిన ‘సత్యభామా సాంత్వనము’, చోక్కనాధుని కాలంలో వెలిదిండ్ల వెంకటపతి కవి రచించిన ‘రాధామాధవము’ అనే శృంగార ప్రబంధాలు వెలసినాయి. వీరు క్షేత్రయ్యకు సమకాలికులు. 18వ శతాబ్దం ఆరంభంలో అంటే క్షేత్రయ్యకు తరువాతనే ‘అహల్యా సంక్రందనము’, ‘రాధికా సాంత్వనము’, ‘తారాశశాంకము’ వంటి ప్రబంధాలు వచ్చాయి. శృంగారం పాళ్ళు ఎక్కువుండడంతో ప్రభుత్వ నిషేధానికి గురి అయ్యాయి. ఉదాత్తమైన శృంగారం సాహిత్య రంగం నుండి తొలగిపోయింది. ఆనాటి సాహిత్య క్రమ పరిణామం శ్రీనాథునితో ప్రారంభమైన శృంగార కావ్య ప్రస్థానం దక్షిణాంధ్ర నాయకరాజుల కాలం నాటికి మరో మలుపు తిరిగి పతనమైంది. ఉత్తమ సాహిత్య విలువలు విస్మరించబడ్డాయి.

తెలుగు సాహిత్య వాతావరణం ఇలా ఉన్న కాలంలో క్షేత్రయ్య తన పదాలతో సాహిత్య క్షేత్రంలో అడుగు పెట్టాడు. ఒకనాడు రఘునాధ రాయల్ని దర్శించడానికి వెళ్ళాడు. ఎందుకు వచ్చావని ప్రశ్నస్తే అపుడు క్షేత్రయ్య ఈ విధంగా సమాధానం చెప్పాడు.

తముదామె వత్తు రర్థులు
క్రమమెరిగిన దాత కడకు; రమ్మన్నారా
కమలంబులున్న కొలనికి
భ్రమరంబుల నచ్యుతేంద్ర రఘునాథ నృపా?

అంటే కోరకపోయినా రాజుల్ని దర్శించటం తన ధర్మంగా చెప్పాడు. ఇక్కడ ఇతని వ్యక్తిత్వం తొంగి చూస్తుంది.

ఉత్తరభారతంలో తమ భక్తి గేయాలతో జన జీవితాన్ని ప్రభావితం చేసిన సమర్థ రామదాసు, భక్త తుకారాం, కబీరుదాసు; ఇటు దక్షిణాన నారాయణ తీర్థులు, సిద్ధేంద్ర యోగి, భక్త రామదాసు, క్షేత్రయ్య ఇంచుమించు సమకాలికులు. ఒక్క సిద్ధేంద్ర యోగి తప్ప మిగతా వారందరూ భక్తి మార్గంలో రచనలు చేసారు.

అన్నమయ్యి క్షేత్రయ్యకు సుమారు 150 సంవత్సరాలు ముందరివాడు; త్యాగయ్య క్షేత్రయ్యకు సుమారు 100 సంవత్సరాలు తరువాతి వాడు; అన్నమయ్య శృంగార క్రీర్తనలకి త్యాగయ్య ప్రభావితుడయ్యాడు అని కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రాసారు.

ఇంతకు క్షేత్రయ్య తాను చెప్పుకున్న ‘వేడుకతో నడుచుకున్న విటరాయడే’ అన్న పదాన్ని బట్టి మొత్తం 4500 పదాలు రచించినట్లు తెలుస్తుంది. కాని మనకు లభిస్తున్నవి 400 పదాలకు మించి లేవు.

తత్వం:

సత్యాన్ని ఆవిష్కరించటమే తత్వం అంటడు ఒక కవి.

కుమ్మరి సిద్దప్ప వంటి తత్వ కవులు తమ వంశ వృక్షాన్ని, బందువర్గాన్ని ఇట్లా చెప్పుకున్నారు.

వేద వేద్యులైన వేమన్న – తాత
సుమతి – పెద్ద తల్లి
వీరబ్రహ్మంగారు – జనకుడు
అక్క – ఈశ్వరమ్మ
దూదేకుల సిద్దప్ప – అన్న
కడగొట్టు అన్న – కాళిదాసు
ఆత్మ బంధువు – అమర సింహుడు
యాగంటి వారు – అన్నలు
వీరే ఆత్మ బంధువులు, చచ్చినా బ్రతికి ఉన్నారని కుమ్మరి సిద్దప్ప చెప్పుకున్నాడు.

~

లాక్షణికులు మధుర భక్తి అంటారు. అంటే అలౌకిక శృంగారమన్నమాట.

విజయ రాఘువ ముద్రతో రచించిన పదాలు 12, తుపాకుల వెంకటకృష్ణ ముద్రతో రచించిన పదాలు 3 విడిగా మనకు లభిస్తున్నాయి.

క్షేత్రయ్య కంచి వరదరాజ స్వామిపై కొన్ని పదాలు రచించారు. ఈతని మొదటి పేరు కూడా వరదయ్యే. క్షేత్రయ్య తన పదాల ద్వారా సాహిత్యానికి, సంగీతానికి చేసిన సేవ అపారం. తెలుగు భాషకు చేసిన సేవ మరువరానిది. ఇతర వాగ్గేయకారుల కృషి కేవలం సంగీత సాహిత్యాలకే పరిమితమైంది. కాని క్షేత్రయ్య పదాలు – సంగీతం, సాహిత్యం, అభినయం – మూడింటికి త్రివేణి సంగమం లాంటివి. నృత్యం, గీతం, వాద్యం కలిస్తేనే సంగీతం అవుతుంది.

ప్రాచీన లాక్షణికుల మతానుసారం – రాగ రచన చేసి రాగానికి రస సిద్ధిని కల్పించి, రాగాల మొక్క సంపూర్ణ స్వరూపం నిరూపించి సంగీతంలో రాగానికి ఉన్నత స్థానాన్ని నిర్ణయించి, తరువాతి వాగ్గేయకారులకు, సంగీతవేత్తలకు మార్గదర్శి అయ్యాడు.

క్షేత్రయ్య శృంగారమయమైన గేయాలను పదాలని, అలాగే అన్నమయ్య శృంగారమయమైన గేయాలను శృంగార కీర్తనలనీ అనేవారు.

జన వ్యవహారంలో ఉన్న కొన్ని పదాల్ని సరికొత్త అర్థాల్లో ప్రయోగించి నవ్యతను సాధించాడు. క్రొంగొత్త పద బంధాల్ని కూర్చుకోని భాషా విస్తృతికి తోడ్పడ్డాడు.

ఉదా:

‘కోరిక’ అనే అర్థంలో ‘ఎన్నిక’ అనే పదము; ‘అనుట’ అనే అర్థంలో ‘అంట’ అనే పదమూ; ‘చేసునే’, ‘ఇచ్చేనమ్మా’, ‘మొన్నటాల నండి’ వంటి వ్యవహారిక పదాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. ‘నఖక్షతాలు’ అనడానికి బదులు ‘చందురు పిల్లలు’ అని గానీ ‘విదియ చందురుడు’ అన గాని వింతగా ప్రయోగించే అభివ్యక్తితో కొత్తదారులు వేసారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here