[అనూరాధ బండి గారు రచించిన ‘అనిశ్చితి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]దురరాని సముద్రం
నిదురపోని తీరం
ఆవలింతలతో నావికుడూ
అలసటలో నావ
చుక్కలు పొడుచుకుంటూ ఆకాశం
వలసల లెక్కలు తేల్చుకుంటూ పక్షులు
మాటల అడుగుల క్రింద
నలిగిన హృదయాలు ఎన్నైనా కానీ,
వేళ్ళంచులని తాకుతూ నిషిద్ధాక్షరాలు..
రాయలేని కలపు హాహాకారాల నడుమ
అనిశ్చల తరంగాలతో సముద్రపు ఘోష
చాలా బయటకొచ్చాక చూస్తే-
తలక్రిందులుగా చుట్టూ ప్రదక్షిణ చేసే గబ్బిలాలు
కీచురాళ్ళ విరహాన్ని వినే గుడ్లగూబలు
వాటన్నిటినీ-
ప్రియంగానో అప్రియంగానో చూసే వీధి దీపం