[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘నిస్సహాయుడను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]వేశం నన్నావహించినప్పుడల్లా
ఇంకో మనిషి నా నుండి బయటకు
దూకడం నేను గమనిస్తూనే
ఉంటాను నిరుత్తురుడనై!
ఆ ఆకారాన్ని, అవకరాన్ని,
నేనైతే మాత్రం కాదు,
బహుశా అది నన్ను గెలిచి,
గేలి చేస్తున్న నాలోని అహం ఏమో!
ఆ అవకరం నా నుండి వేరుపడ్డ
ప్రతిసారి తను సృష్టించిన విధ్వంసానికి
సాక్షిగా నేను, భయంతో క్షణాలు
లెక్క పెడుతునే ఉంటాను.
ఆ తీవ్ర ధ్వని లోనూ గొణుగుతునే ఉంటాను,
చేసిన ఘన కార్యం చాలు ఇక లోపలికి రమ్మని.
దిక్కులు పిక్కటిల్లేటట్టు అరవాలనుకుంటాను
కానీ! మాట పెగల నివ్వదు
నన్నావహించిన ఆ మహమ్మారి!
ఆ అమానుషం నన్నావహించినప్పుడు
నా మనసొక కల్లోల సాగరమే అవుతుంది
నేను విసిరే మాట విచక్షణ లేని కెరటమే అవుతుంది.
క్షణాలు గడిచే కొద్దీ తాను చేసిన విధ్వంసాన్ని
కొంచెం, కొంచెంగా గుర్తించిన నాలోని అపరిచితుడు
దయతో నన్ను వదిలేసినప్పుడు..
ఆవేశపు ఉదృతి తగ్గి నన్ను నేను ఓ సారి
తడిమి చూసుకుంటాను
మనుసుకు కలిగిన అవకరాన్ని గమనించి
నిట్టనిలువునా నేల లోనికి పతనమవుతాను,
ఆవహించిన సిగ్గుతో కుచించుకు పోతాను.
నా వాళ్లో, పైవాళ్లో ఎవరైనా కానివ్వండి,
నా అసంబద్ధ ఆగ్రహపు రుచి చూసిన వారి
నిస్సహాయతను చూసి సానుభూతినవుతాను.
ప్రతిసారీ, ఎలా స్పందిస్తారోనని భయపడతాను.
తీవ్ర ఆవేశాన్ని వెళ్లగక్కే ముందు ,నేనెందుకు
మనీషిలా ఓ క్షణం ఆలోచించలేక పోయానేనని
తెగ మదన పడుతూనే ఉంటాను.
ఆ మథనమే నేమో నా పరిణతిని
కొలిచే ఓ కొ(కా)లమానమనిపిస్తుంది.
ఆ ఆలోచనే యేమో నా పరిమాణాన్ని
ఇంకా, ఇంకా తెగ నరుక్కొని మరుగుజ్జుగా
మిగలొద్దని హితవు పలుతున్నట్టనిపిస్తుంది!!!