[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండురాజు వివాహము-దిగ్విజయము
[dropcap]య[/dropcap]దువంశము అనబడే సముద్రానికి చంద్రరేఖలాంటిది; గొప్ప తేజస్సు కలిగినది; ఎప్పుడూ ఆపకుండా అన్నదానం చేస్తూ మహర్షుల్ని, బ్రాహ్మణుల్ని సంతోష పెట్టేది; వాళ్ల ఆశీర్వాదం వల్ల పవిత్రమైన రూపం కలిగినది; వినయం, వివేకం, గౌరవం, మంచితనం అనే ఉత్తమమైన గుణాలు కలిగినది; కమలాల వంటి కళ్లు కలిగినది; భూదేవంత ఓర్పు కలిగినది అయిన పృథని స్వయంవరంలో తన సొంతం చేసుకున్నాడు పాండురాజు. పృథని వివాహం చేసుకున్న తరువాత భీష్ముడి అనుమతి తీసుకుని మాద్రిరాజు కుమార్తె మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు పాండురాజు.
భరతవంశానికి ఆభరణం వంటి పాండురాజు తన చతురంగ బలాలతో దిగ్విజయ యాత్రకి బయలుదేరాడు. సాటిలేని పరాక్రమంతో నాలుగు దిక్కుల్లో ఉన్న రాజుల్ని జయించాడు. భూమి మీద ఉన్న రాజులందరూ పాండురాజుకి అతడి సైన్యానికి భయపడి పాండురాజుతో స్నేహన్ని ప్రకటించారు. దేవేంద్రుడితో సమానంగా ఉన్న కురువంశ ప్రభువైన పాండురాజుని చూడడానికి అనేక కానుకల్ని తీసుకుని రాజులందరూ వచ్చారు.
గుర్రాలు, ఏనుగులు, అందమైన కన్యలు, మణులు, వెండి, బంగారం, మేకలు, ఆవులు, గొర్రెలు, దున్నల్నీ, చాలా ఎక్కువ ధనాన్ని రాజులనుంచి కప్పాలుగా పొందాడు. బంగారాన్ని, వెండిని నూరు వేల ఏనుగులతో మోయించి తెచ్చాడు. పాండురాజు దిగ్విజయ యాత్ర పూర్తయిన తరువాత భూమి మీద ఉన్న రాజులందరు కురువంశ రాజులకి ప్రతి సంవత్సరం కప్పం కడుతూ వచ్చారు.
పాండురాజు మంచి పనులు
పాండురాజు దిగ్విజయం చేసి వచ్చి అంతులేని సంపదలు తెచ్చాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకుని వాటిని భీష్ముడికి, సత్యవతికి, తమ తల్లులకి, విదురుడికి, స్నేహితులకి, బ్రాహ్మణులకి ఇచ్చి వాళ్ల ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నాడు.
కీర్తివంతుడైన పాండురాజు తీసుకొచ్చిన ధనంతో ధృతరాష్ట్రుడు గొప్ప వైభవంతో తృప్తి తీరేలా బ్రాహ్మణులకి తనివితీరా దక్షిణలు ఇచ్చి నూరు అశ్వమేధయాగాలు చేశాడు. పాండురాజు వినయ విధేయతలతో ధృతరాష్ట్రుణ్ని గౌరవించడం, బంధువులకి అవసరమైన పనులు చేయడం, మిత్రులకి అనుకూలంగా ఉండండం, పండితుల కష్టాన్ని గుర్తించడం, అనాథల్ని ఆదరించడం, ప్రజలకి భయం లేకుండా చేయడం వంటి తన మంచి ప్రవర్తనతో అందరికీ సంతోషాన్ని కలగచేశాడు.
పూరు, భరత, కురు చక్రవర్తులతో సమానంగా వంశాన్ని నిలబెడతాడని పండితులు పాండురాజుని పొగిడారు. పాండురాజు అనేక సంపదల్ని దానం చేస్తూ, యజ్ఞాల్లో దక్షిణలు ఎక్కువగా ఇస్తూ సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల్ని ధనవంతులుగా చేశాడు.
పాండురాజు పొందిన శాపము
అనేక సుఖాలు, విలాసాలు, కోరుకున్న భోగాలు అనుభవించడంలో పాండురాజు కాలం గడిపేవాడు. ఒకసారి కుంతి, మాద్రిలతో కలిసి ధనుస్సు బాణాలు పట్టుకుని వేటకి వెళ్లాడు. హిమాలయ పర్వతాలకి దక్షిణ భాగంలో ఉండే భూముల్లో వేటాడుతూ తిరుగుతున్నాడు. అతడికి ఇష్టమైన అన్నపానీయాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు, మొదలైన వాటిని ధృతరాష్ట్రుడు పంపించేవాడు. అనేక మృగాల్ని వేటాడుతూ అడవిలోనే ఉండిపోయేవాడు.
ఒకరోజు ఎన్ని మృగాల్ని తరిమినా ఒక్క దాన్ని కూడా కొట్టలేక పోయాడు. విసుగ్గాను కోపంగాను కూర్చున్న అతడికి కలిసి ఉన్న మగ, ఆడజింకలు కనిపించాయి. అయిదు బాణాలు వేసి వాటిని చంపేశాడు. తన బాణాలు తీసుకోడానికి వాటి దగ్గరకి వెళ్లాడు. కొన ఊపిరితో ఉన్న మగ జింక పాండురాజుని చూసి మనిషి భాషలో “దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం కలవాడా! నేను ‘కిందముడు’ అనే పేరు గల మహర్షిని. మృగాలు కలిసి ఉండడాన్ని రోజూ చూస్తున్న నేనూ, నా భార్య మేము కూడా అలాగే ఉండాలని అనుకుని మృగ రూపంలో ఉండి సంతోషంగా జింకల మధ్య తిరుగుతున్నాము.
జింకలుగా ఉన్న మమ్మల్ని చంపడం వల్ల నీకు పాపం రాదు. ఎందుకంటే వేటాడడం క్షత్రియ ధర్మం. కాని, పరుగెత్తలేనివి, ఆడుదానితో కలిసి ఉన్నవి, ఈనుతూ ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాల్ని మాంసమే ఆహారంగా జీవించే కిరాతులు కూడా కొట్టరు. సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగి, భూమి మీద ఎప్పుడూ ధర్మ మార్గాన్ని తప్పని భరతుడు మొదలైన ప్రసిద్ధులైన రాజుల వంశంలో పుట్టినవాడివి. పుణ్యాత్ముడివైన నువ్వు అధర్మం చెయ్యడం న్యాయంగా ఉందా? కౌరవుల్లో గొప్పవాడా! నీకు తెలియని ధర్మశాస్త్రాలు ఉన్నాయా?” అన్నాడు.
తనను నిందిస్తున్న మహర్షిని చూసి పాండురాజు కోపంతో “ రాజులు శత్రువుల్ని చూసి సహిస్తారేమో కాని మృగాల్ని చూసి మాత్రం సహించరు. వెంటనే వాటిని చంపుతారు. నమ్మించి, మోసం చేసి మాత్రం చంపకూడదు. పూర్వం అగస్త్య మహర్షి ప్రతిరోజూ మృగమాంసంతో శ్రాద్ధం చేస్తూ రాజులకి మృగాల్ని చంపడం వల్ల పాపం లేకుండా చేశాడు. అందువల్ల నువ్వు నన్ను నిందించడం బాగుండలేదు” అన్నాడు.
అంతలోనే ఆ మృగాలు బాణం దెబ్బ వల్ల కలిగిన బాధ సహించలేక “ప్రాణులన్నింటికీ సాధారణము, ఇష్టము అయినట్టు సుఖంగా ఉన్న సమయంలో ఏ తప్పూ చెయ్యని మమ్మల్ని చంపావు. నువ్వు కూడా నీ ప్రియురాలితో కలిసి ఉన్నప్పుడు మరణాన్ని పొందుతావు. నీ భార్య కూడా నీతో మరణించుగాక!” అని పాండురాజుకి శాపమిచ్చి ప్రాణాలు విడిచారు.
ఆ మృగాల్ని చూసి పాండురాజు చాలా బాధ పడ్డాడు. తనకు కలిగిన శాపానికి దుఃఖపడ్డాడు. విధి కంటే కర్మ బలీయమైంది అంటారు. మానవులు ఎంత గొప్ప వంశంలో పుట్టినా, మంచి చెడ్డల గురించి ఆలోచించగల పరిజ్ఞానం ఉన్నా కూడా పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. పాండురాజు నిరాశపడ్డాడు. ‘ఇంక ముందు జీవితం ఏముంది. నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. నేను కృష్ణద్వైపాయనుడి దయవల్ల పుట్టాను. ధర్మమార్గంలోనే నడుస్తున్నాను. ఇటువంటి దురవస్థ కలగడానికి నా పూర్వజన్మ కర్మమే కారణం.
ఇంక నేను మహర్షులు జీవిస్తున్నట్టు జీవించాలి. బంధాల్ని వదిలి పెట్టాలి. ప్రాణులన్నింటినీ సమభావంతో చూడాలి. హింసా ప్రవృత్తిని వదిలి పెట్టాలి. ప్రతిరోజు ఒక్కొక్క చెట్టు నుంచి ఒక పండుని భిక్షగా తీసుకోవాలి. అది దొరకని రోజు ఉపవాసం ఉండాలి. శరీరమంతా దుమ్ముకొట్టుకుంటూ చెట్టు కింద నివసించాలి. ఇంద్రియాల్ని బంధించి, పనులన్నీ వదిలిపెట్టి, పాపపుణ్యాలు విడిచి పెట్టి. మనస్సుని జయించాలి.
ఇది ఇష్టం, ఇది ఇష్టం కాదు; ఇది నింద, ఇది నింద కాదు; ఇది పొగడ్త అనే భావం అనేది లేకుండా అన్నిటినీ ఆనందంగానే స్వీకరించాలి. దుఃఖం, భయం, చలి, ఎండ, గాలి అంటే ఏమిటో అలోచించకుండా శరీరాన్ని మర్చిపోవాలి. చావుకి భయపడడం, బ్రతుకుతున్నందుకు సంతోషించడం మానేసి భయంకరమైన అడవిలో కూర్చుని గొప్ప తపస్సు చేస్తాను’ అని నిశ్చయించుకున్నాడు.
కుంతిని, మాద్రిని పిలిచాడు “మీరు ఇక్కడ ఉండద్దు. హస్తినాపురానికి వెళ్లి అక్కడే ఉండండి. నేను తపస్సు చేసుకుంటున్నానని ధృతరాష్ట్రుడికి, సత్యవతికి, భీష్ముడికి, విదురుడికి, తల్లులకి, వృద్ధులకి, పురోహితులకి, బ్రాహ్మణులకి చెప్పండి” అన్నాడు.
పాండురాజు మాటలు విని కుంతి, మాద్రి “మీరు తపస్సు చెయ్యాలని అనుకుంటే ఇక్కడ ఆశ్రమంలో ఉండే తపస్సు చెయ్యండి. మేము కూడా ఇక్కడే ఉండి మిమ్మల్ని సేవించుకుంటాం. మిమ్మల్ని వదిలిపెట్టి మేము హస్తినాపురానికి వెళ్లం. బలవంత పెడితే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం” అన్నారు.
వాళ్ల మాటలు విని పాండురాజు “అయితే మీరు కూడా ఇక్కడే ఉండండి. నేను వానప్రస్థానం స్వీకరిస్తాను. నార బట్టలు కట్టి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్నానం చేసి హోమం చేస్తూ కందమూలాలు, పండ్లు ఆహారంగా తీసుకుంటూ పితృదేవతల్ని ఆరాధిస్తూ క్రమంగా శరీరాన్ని విడుస్తాను” అని చెప్పాడు. దేవతలతో సమానమైన పాండురాజు గొప్ప పుణ్యాన్ని పొందాలని అనుకున్నాడు. బ్రాహ్మణులకి విలువైన రత్నాలు, ధనం, ఏనుగులు, గుర్రాలు, ధాన్యరాసులు, ఆవులు దానంగా ఇచ్చాడు. తన దగ్గర మిగిలి ఉన్న వస్తువులన్నింటినీ ధృతరాష్ట్రుడికి పంపించేశాడు.
మమకారాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టాడు. కుంతి మాద్రి, కూడా పాండురాజులా తపస్సు చేసుకోడంలో నిమగ్నమయ్యారు. ముగ్గురూ కలిసి ఉత్తర దిక్కు వైపు ప్రయణం చేస్తూ నాగశైలాన్ని, దైత్రరథాన్ని, పారిషేణాన్ని, హిమవంతాన్ని దాటి దేవతలు సిద్ధులు సేవించే గంధమాదనం మీద కొంతకాలం ఉన్నారు. తరువాత ఒక కొలను, హంసకూటం దాటి మహర్షులతో కలిశారు.