[box type=’note’ fontsize=’16’] ఆకర్షణ కలిగించే ప్రలోభాలని తట్టుకుని, తన కూతురు పుస్తకాలనే ప్రేమించి, వాటినే నేస్తాలుగా భావించి జీవితంలో స్థిరపడేందుకు ప్రేరేపించిన తల్లి కథ స్వాతీ శ్రీపాద వ్రాసిన “రేపేమిటి?“. [/box]
[dropcap]“చి[/dropcap]న్నూ, రేపు ఆదివారం పనులేం పెట్టుకోకు. సాయంత్రం మనిద్దరం ఒక చోటికి వెళ్దాం” బట్టలు మడతపెడుతూ౦టే ఉన్నట్టుండి చెప్పింది అమ్మ.
శనివారం మా ఇద్దరికీ ఇదే పని. వారం బట్టలన్నీ ఉతికి ఆరేసి మడతలు పెట్టుకోడం. నిజానికి నాకు బట్టలు మడతెయ్యడం అంటే మా చెడ్డ చికాకు. ఇస్త్రీకిస్తే అయిపోతుందిగా అంటే అమ్మ ఎర్రగా చూసి ‘మనది రాయల్ ఫామిలీ కాదు. రోజూ బట్టలు ఇస్త్రీ చేసుకుందుకు. అయినా ఆరగానే చక్కగా మడతపెట్టుకుంటే, ఇస్త్రీ చేసిన వాటికి తాతల్లా ఉంటాయి’ అంటుంది.
అందుకే తనతో పాటే నన్నూ కూచోబెట్టుకుని నా బట్టలను నాతోటే మడత పెట్టిస్తుంది.
“ఎక్కడికి?”
“వెళ్ళాక తెలుస్తుందిగా…”
ఏం తెలుస్తుంది? ఏ సేవాసదన్‌కో తీసుకు వెళ్తుంది. మళ్ళీ మొదలు తల వాచేలా నీతి సూత్రాలు.
అసలు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి మాల్‌కి వెళ్దామనుకున్నాను. ముందే అమ్మ బ్లాక్ చేసుకుంది.
ఈ వారం డాడీ రాడు. గుజరాత్ ట్రాన్స్‌ఫర్ అయింది. సెకండ్ సాటర్ డే కలసి వచ్చేలా అయిదు రోజులు సెలవు తీసుకుని నెలకోసారి ఒకవారం ఉండేలా వస్తాడు.
ఇహ నెలంతా ఇంట్లో ఇద్దరమే.
అమ్మ గట్టిగా మాట్లాడదు. తిట్టదు. కాని ఖచ్చితంగా ఉంటుంది.
ఒక టై౦ టేబుల్ ఫాలో అవాలి. క్రమశిక్షణ వేరు, ప్రేమ వేరు అంటుంది.
బట్టలు మడత పెట్టి నా గదిలో నేను పెట్టుకున్నాను.
ఈ మధ్యనే అమ్మ పోరగా పోరగా ఫోన్ కొనిచ్చి౦ది.
కాని నాకు అనుమానమే, ఎప్పుడో పడుకున్నప్పుడు అమ్మ నా ఫోన్ చెక్ చేస్తుందేమోనని. అయినా అమ్మ మంచిదే. నాకు కావలసినవన్నీ అడక్కుండానే కొనిస్తుంది.
నా బర్త్ డేకి నాకు తెలీకుండానే నా మిత్రులను పిలిచి సర్‌ప్రైజ్ పార్టీ ఇస్తుంది.
అయినా అమ్మకు తెలియని నా రహస్యం నాకు ఒకటి ఉంది.
రవీష్ ఎప్పటి నుండో తెలుసు కాని ఈ మధ్యే నా మీద బోలెడు శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఇంట్లో నుండి బయటకు వస్తే చాలు, ‘నేను ది౦పనా’ అంటూ తన బండితో ప్రత్యక్షమవుతాడు.
“నీ కోసమే” అంటూ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాడు.
నాకూ అతనంటే ఇష్టంగానే ఉంది.
ఎంత ప్రేమగా మాట్లాడతాడు.
“నువ్వు అచ్చు మొన్ననే వచ్చింది చూడు ఆ కొత్త సినిమా దాన్లో హీరోయిన్లా ఉన్నావు” అంటాడు.
అవునో కాదో కాని కాస్సేపు నిజమేనేమో అనిపిస్తుంది.
ఏ సినిమా చూసినా ప్రేమ కథ మొదలయ్యేది ఇలాగే కదా !
మొన్నోసారి హీరో హీరోయిన్ ముద్దుపెట్టుకుంటున్న సీన్ ఒకటి నాకు పంపాడు రవీష్.
కంగారుపడి వెంటనే డిలీట్ చేసాను.
అయినా నా క్లాస్‌మేట్స్, నా ఫ్రెండ్స్ సంధ్యకూ, ఆశాకీ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో సినిమాలకూ షికార్లకూ వెళ్తుంటారు ఎవరికీ తెలియకు౦డా.
నాకూ వెళ్ళాలనే ఉంటుంది కాని ఏదో భయం.
అయినా ఒకసారి వెళ్లి చూస్తే అన్న తెగింపు.
అమ్మో, అమ్మకు ఎవరైనా చెప్తే…
“చిన్నూ”
అమ్మ పిలుపు.
చటుక్కున కళ్ళు మూసుకున్నాను నిద్ర నటిస్తూ.
***
పొద్దున్నే యిద్దర౦ బ్రేక్‌ఫాస్ట్ తిని బయలుదేరాలని అమ్మ అన్నా, మేం నిద్దర్లు లేచేసరికే తొమ్మిదై౦ది.
గబగబా రెడీ అయి బయలుదేరాం. బయటే బ్రేక్‌ఫస్ట్ చేద్దామని. తాజ్‌లో మసాలా దోశ తిని కారెక్కి బయల్దేరాం. కడుపు నిండా తినేసరికి మళ్ళీ నిద్ర వచ్చింది. గంటన్నర పైగానే నిద్రపోయి ఉంటాను. మెలకువ వచ్చే సరికి హైవే మీద వెళ్తోంది కారు.
“ఇంకా ఎంత దూరం?”
“మరో పది నిమిషాలు” డ్రైవర్ జవాబిచ్చాడు.
సరిగ్గా పది నిమిషాలకు ఒక ఫాం హవుస్ లాటి దాని ముందు ఆగింది కారు.
జుట్టు సరిచేసుకుని, అయినా అమ్మకు నచ్చక ఒకసారి బాగ్ లోంచి దువ్వెన తీసి తల దువ్వుకుని, నా జుట్టూ పై పైన దువ్వాక ఆ తరువాత ఇద్దరం కారు దిగాం.
పెద్ద గేట్. తలుపు తీసుకుని లోపల అడుగుపెట్టాం. అంత పెద్దిల్లు ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు. ఇంటి చుట్టూ పూల మడులు, మధ్య మధ్య సిమెంట్ బెంచీలున్న పెద్ద లాన్. ఇవన్నీ చూడకముందే ఇంటి ముందు ఆగి బెల్ కొట్టింది అమ్మ.
వెంటనే తలుపు తెరిచి “వచ్చారా, రండి రండి” అంటూ ఆవిడ మమ్మల్ను లోపలకు తీసుకు వెళ్లి౦ది.
ఇ౦టి లోపల కూడా అంత అందంగానూ ఉంది.
ఆవిడ కూడా చాలా అందంగా వుంది.
“జ్యోతి గారూ, మీ గురించి చదివాక ఒకసారి కలుద్దామనిపి౦చి౦ది. ఎంత గొప్పగా ఆలోచించారు. అసలి౦త వరకూ ఈ దిశగా ఎవరూ ఆలోచించి ఉండరు” అమ్మ మెచ్చుకోలుగా అంది.
“ఏముంది మనం నిమిత్త మాత్రులం. ఎప్పుడు ఏ ఆలోచన ఎలా వస్తుందో చెప్పలేం. నేనూ అందరిలానే పెళ్లి చేసుకుని ఆయనతో అమెరికా వెళ్లాను. పదేళ్ళపాటు యాంత్రిక జీవితమే గడిపాము.
ఆ తరువాత మా సమస్య ముందుకు వచ్చి ఇద్దరిని పెంచుకుందుకు దత్తత కోసం వచ్చాము. కాని వచ్చాక మా ఉద్దేశాలు మారిపోయాయి. ఆరు నెలల నుండి రెండేళ్ళ మధ్య ఉన్న పదిమంది పిల్లలను వారున్న కండిషన్స్ చూసాక, వారిని సముదాయి౦చలేక అంత స్తోమతు లేక సతమత మవుతున్న, ఆ అమ్మను చూసాక, ఖాళీ చేతులతో ఇంత గొప్ప సంస్కరణకు పూనుకున్న ఆమె ముందు నా అల్పత్వం తెలిసి వచ్చింది. నిజంగానే ఎంత స్వార్థం మాకు. మాకు పిల్లలు కలిగే అవకాశం లేకపోతే ఎవరో ఒకరిద్దరిని ఎంచుకుని మా పిల్లలుగా చలామణి చేసుకు మా ఈగోను తృప్తి పరచుకుంటాము.
కాని పదమూడేళ్ళ వయసులో మాయమాటలకు మోసపోయి తల్లి అయిన కూతురి బిడ్డతో పాటు, అలా మోసపోయి దిగజారిపోయిన పదిమందికి నీడలా నిలిచి, ఆ పిల్లలను చూసుకుంటూ, వారి తల్లులను చదివిస్తో౦దావిడ, చాలీ చాలని రెండు గదుల ఇంట్లో.
ఆ క్షణం మేము ఆ పదిమంది పిల్లలనూ దత్తు తీసుకున్నాము, వారి తల్లులను కూడా. ఇక్కడే స్థిరపడి పోయాము”.
ఇంతలో లోపలి నుండి ఒక నడి వయసావిడ రెండు కప్పుల్లో కాఫీ, నా కోసం అయిస్ క్రీం తెచ్చింది.
“లలితమ్మ గారు. నిజానికి ఈ యజ్ఞం ప్రారంభినది ఈవిడే”.
లలితమ్మ గారు ప్రసన్నంగా నవ్వారు.
“నా కూతురు అనే ఆర్తి నించి పాకిన సేవాభావం ఇది.”
“అమ్మా, మీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామనే వచ్చాము. మీవల్ల మరో పదిమంది ముందుకు వస్తారన్న ఆశ. ఈ కథలు చదివినా లేదూ చదివి వినిపించినా కనీసం పిల్లలకు కొంచం ఆవగాహన కలుగుతుందన్న ఆశ.”
ఆ రోజంతా అక్కడే ఉన్నాము.
లోపలి గదుల్లో ఒక్కొక్క గదిలో నెలరోజుల నుండి రెండేళ్ళ వరకూ పది మంది పాపాయిలు ఉన్నారు. వారిలో ఆడపిల్లలు మొగపిల్లలు కూడా ఉన్నారు. ఆర్నెల్ల పిల్లవరకూ ఒక గదిలో ఏడాదికి అటూ ఇటూ ఉన్నవారిని ఒక గదిలో రెండేళ్ళ నుండి మూడేళ్ళ వారిని ఒక గదిలో, వారిని చూసుకుందుకు ప్రతి గదిలో ఇద్దరు అటెండర్స్.
“లలిత గారూ, మీకీ ఊహ ఎలా వచ్చింది?” అమ్మ అడిగింది.
“నాకు ఇద్దరు కూతుళ్ళు. పావని, శ్రావణి. పెద్దపిల్ల ఇంటర్ చదువుతుండగానే తండ్రి లేడు గనక మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసాను. ఆ పిల్ల పెళ్ళయాక కూడా చదువుతోంది.
పావని నా చిన్న కూతురు తొమ్మిదో క్లాస్‌లో ఉంది. క్రితం సంవత్సరం. నేనూ ఏదో ఒక పని చేసి ఇల్లు నడిపేదాన్ని. అది స్కూల్‌కి వెళ్లి వస్తోంది. అక్కలా ఇంటర్ వరకూ చదివిస్తే ఏదైనా సంబంధం వస్తుందని అనుకున్నాను.
కాని పాలూ నీళ్ళూ తెలియని అమాయకురాలని అనుకోలేదు. స్కూల్‌కి వెళ్తున్నానని వెళ్ళేది. కాని ఒక్కరోజూ స్కూల్‌కి వెళ్ళలేదు.
పిల్ల నునుపు దేరుతుంటే కొంచం అనుమానం వచ్చినా పెరిగే పిల్ల నా దిష్టే తగులుతుంది అనుకునే దాన్ని.
కాని ఒక రోజున తల తిరుగుతున్నట్టుగా ఉండి, మధ్యాన్నం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దీంతో పాటు మరొకడు. నన్ను చూస్తూనే పారిపోయాడు.
ఎన్ని జరగాలో అన్నీ జరిగాక అప్పటికే చేతులు కాలాయి. అప్పటికే ఏడాదిగా సాగుతున్న వ్యవహారం అని తేలింది.
ఆ పిల్లవాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తలిదండ్రులు గుట్టు చప్పుడు గాకుండా ఊరు విడిచిపోయారు.
అటు చదువు ఇటు జీవితం రెండూ కోల్పోయి మిగిలినది పావని. దానికి తోడూ మూడో నెల. చాలా మంది సలహా ఇచ్చారు అబార్షన్ అని. నేను ఒప్పుకోలేదు. ఒళ్ళు తెలియకుండా జీవితం చేయి జార్చుకుని మరో ప్రాణిని బలి ఇవ్వడం…
అందుకే ఆలోచించాను.
రెండే దారులు. పిల్లను కనీ చదువు కొనసాగిస్తుందా, ఇప్పుడే దాని బ్రతుకు అది బ్రతుకుతుందా?
దానికి ఉన్నదారి పుట్టిన బిడ్డకోసమైనా చదువుకుని స్థిరపడటం.
ఎలా మోసపోయావు అంటే – ‘నన్ను ప్రేమి౦చానన్నాడు, నేను సమంతాలా ఉంటానన్నాడు. ఇద్దరం సిటీకి వెళ్లి సినిమాల్లో వేషం వేద్దామన్నాడు. అవుననుకున్నాను’ అంది.
నేనూ తప్పు చేసాను పెరిగే పిల్లకు తిండీ తిప్పలే కాదు, అనుక్షణం వెన్నంటి దాని మనసునూ కాపాడుకోవాలని, కనీసం ఇంగితం తెలిసే వరకూ కంటికి రెప్పలా ఉండాలని మరచాను.
నేను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను, ఏడాదిలో ఇలాటి వాళ్ళు నాకు తెలిసి ఇల్లు వదిలి వెళ్ళిన వాళ్ళూ, మోసపోయిన వాళ్ళూ, సినిమాల పేరిట వంచి౦చబడిన వాళ్ళు ఇలా వచ్చి చేరుతూనే ఉన్నారు.
ఇప్పుడు నా కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం. సాయంత్రాలు చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్తుంది.
అయిదారుగురితో సతమతమవుతున్న సమయంలో జ్యోతి గారు వచ్చారు. ఆవిడ మొత్తం తల్లులనూ పిల్లలనూ దత్తత తీసుకున్నారు.
ఆయన కూడా ఈ పిల్లలకోసం చాలా ఏర్పాట్లు చేసారు. తల్లులను హాస్టల్‌లో చేర్చారు.
పిల్లలు సవ్యంగా పెరగటమే మా ఇప్పటి ఆశ. తల్లులు జీవన పోరాటంలో స్థిరపడాలి.”
సాయంత్రం వరకూ ఆ పిల్లలతో గడిపి అక్కడే లంచ్ చేసి వచ్చేముందు అమ్మ అంది,
“నేనూ నాకూతురూ కూడా వాలంటరీగా ఏదైనా చేస్తాం”
నవ్వింది జ్యోతి అనే ఆవిడ. “ పాపను బాగా చదివించండి. మీకు వీలయితే ఒక తల్లి చదువుకో బిడ్డ పెంపకానికో స్పాన్సర్ చెయ్యండి” అంది.
అమ్మ సంతోషంగా చెక్ రాసిచ్చింది.
ఇంటికి వచ్చేసరికి ఆరు దాటిపోయింది.
మర్నాడు స్కూల్ బస్ ఎక్కేముందు వచ్చాడు రవీష్,
“నేను డ్రాప్ చెయ్యనా?”
వెంటనే పావని కథ , ఆమె ఏడాదిన్నర పాప గుర్తుకు వచ్చారు.
“మా అమ్మను అడుగు” తలతిప్పుకుని బస్ ఎక్కాను. ఒక ఇంజనీర్ గానో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గానో స్థిరపడే వరకూ నాకు కనిపించేవి పుస్తకాలే, అదే నా ప్రేమ అవే నా నేస్తాలు. దృఢంగా అనుకున్నాను.