జ్ఞాపకాల పందిరి-190

25
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

ఓటూ.. నీ రేటెంత..!?

[dropcap]మ[/dropcap]న ‘భారత రాజ్యాంగం’ ఈ దేశ పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ద్వారా, ఎన్నికల ప్రక్రియ ద్వారా, తమకు నమ్మకమైన, ఇష్టమైన నాయకుని ఎన్నుకునే అవకాశం కల్పించింది. అలా మన దేశంలో మొదటి ఎన్నికల ప్రక్రియ 1951-52, సంవత్సరంలో జరిగింది. అంటే, మొదటి మన దేశ సార్వత్రిక ఎన్నికలన్న మాట! అప్పుడు దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తులే ఎన్నికలలో నిలబడే సాహసం చేశారు. అలంటి వారినే ప్రజలు ఎన్నుకునే ప్రయత్నం చేశారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే (కొన్ని ఇతర పార్టీలు ఉన్నప్పటికీ) ఎన్నికల పోటీలో నిలబడ్డాయి. అప్పటికి, ఇప్పుడున్నన్ని ప్రాంతీయ పార్టీలు గాని, ఇతరపార్టీలు గానీ లేనందున ప్రజలలో (ఓటర్లలో)కూడా ఎలాంటి తికమక లేకుండా, ప్రజలు తమ ఓటు హక్కును అతి స్వేచ్ఛగా వినియోగించుకోగలిగారు. అప్పుడు నాయకుడిని ఎన్నుకోవాలంటే అతని మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని, సేవాదృష్టిని పరిశీలించి, పార్టీలు అభ్యర్థులను ఎంచుకోవడం, ప్రజలు అటువంటివారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే నిరక్షరాస్యులు, ఓటు విలువ తెలియనివారు, అప్పుడూ, ఇప్పుడూ వున్నారు. వారు ఓటు వేయడానికి ఎవరో ఒకరిమీద ఆధార పడవలసిందే! అందుచేతనే ఇటువంటి వారి ఓట్లు, తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో, సలహాలు ఇచ్చే స్వార్థపరుల వల్ల, మార్గదర్శనం చేసే పోలింగ్ సిబ్బంది మూలాన నిరుపయోగానికి గురి అయ్యాయి. అంటే ఓటరు అనుకున్నది ఒకటైతే, దానికి భిన్నంగా ఓటు పోల్ అయ్యేది. ఎన్నికలలో నిలబడే నాయక అభ్యర్థులకు, మూడు రకాల ఓటర్లతో అవసరం ఉంటుంది. వాళ్ళు ఎవరంటే,1) అక్షరాస్యులు 2) నిరక్షరాస్యులు 3) స్త్రీమూర్తులు.

ఈ మూడు కేటగిరీలలోనూ, పోలింగ్ బూత్‌కు వచ్చి తప్పనిసరిగా, బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు, నిరక్షరాస్యులు, మహిళలు (అభ్యర్థుల బంధువులు కూడా) అక్షరాస్యులు అంటే ముఖ్యంగా ఉద్యోగులు, ఓటు హక్కు వినియోగించుకోని వారిలో, ముందు వరుసలో వుంటారు. అందుచేతనే, ఎన్నికల నిలబడే తెలివైన అభ్యర్థుల గురి, మహిళ/నిరక్షరాస్య ఓటర్లను ప్రభావితం చేయడంపై ఉంటుంది. అందుకే ఆయా వర్గాలకు ఓటుకు నోటు, ఇతర తాయిలాలు అందించి, ప్రలోభ పెట్టి ఆయా ఓటర్లను తమవైపు తిప్పుకునే విశ్వప్రయత్నం చేస్తారు. కాలం మారడంతో పాటు, ప్రజల ఆలోచనా విధానాలు మారిపోయాయి.

నాటి కేంద్ర ఎన్నికల అధికారి స్వర్గీయ టి.ఎన్.శేషన్ గారు.

ఎన్నికల ప్రక్రియ దీనికి అతీతం కాదు. ఓటు వేయడానికి ఇప్పుడు అనేక మార్గదర్శక సూత్రాలను పాటించవలసిన అవసరం ఏర్పడింది. అభ్యర్థి ఎలాంటివాడైనా, అతని వ్యక్తిత్వం ఎలాంటిదైనా, పార్టీ, కులం, మతం, ప్రాంతం, బంధుత్వం ప్రాతిపదికలయ్యాయి. పేదవారిలోనే కాదు, వున్నవారిలోనూ ఓటుకు రేటు కట్టే రోజులు అమలుకు నోచుకున్నాయి. అందుచేత, ఎన్నికల కమిషన్ ఎన్ని కట్టుబాట్లు చేసిన ఎన్ని మార్గదర్శక సూత్రాలు జారీచేసినా, డబ్బు ప్రధానంగా, ఎన్నికలపై అత్యధిక ప్రభావం చూపిస్తున్నది. కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్న తాత్కాలిక ఉచిత పథకాలు, ఆయా పార్టీల/మనుగడకు తప్ప, ప్రజా సంక్షేమానికి, దేశ/రాష్ట్రాల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. సరికదా, అప్పుల భారం పెంచి, పౌరుడు బ్రతికినంతకాలం, అప్పులు తీర్చే పనిలో పడక తప్పడం లేదు. దీనికి తోడు రకరకాల టాక్సులు సామాన్యుడికి తలకు మించిన భారం అవుతున్నది.

ప్రజలను ఆకర్షించడానికి చేసే గిమ్మిక్కులకున్న శ్రద్ధ, దేశ/రాష్ట్ర అభివృధ్ధి కోసం లేకపోవడం బాధాకరం. ఇలా ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల, డబ్బు ఖర్చుచేసినవాడే ఎన్నికల్లో నెగ్గుకు రావడం అనే తంతు మొదలైన తర్వాత ప్రజాసంక్షేమం మూలాన పడి, ప్రజాధనం దోచుకోవడం పైననే నాయకులు దృష్టి పెట్టడం ,ప్రజాభివృద్ది పట్టాలు తప్పుతుందనడానికి ప్రధాన సంకేతంగా మనం ఊహించవచ్చు. నాయకులు, పదే పదే, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారడం, ప్రజలలో అయోమయాన్ని సృష్టించి, ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో తికమక పడిపోవడం జరుగుతున్నది. స్నేహ పూర్వకంగా, సుఖంగా బ్రతుకుతున్న ప్రజలు ఎన్నికల వేళ, కులాల వారీగా, మతాలవారీగా విడిపోవలసి వస్తున్నది. ఈ ప్రక్రియ ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారంలో వున్నప్రభుత్వాలు ఇటువంటి వాటికి కొమ్ముకాయడం మరింత దురదృష్టకరం. ఇంతకు మించిన దరిద్రం మరొకటి వుంది.

స్వగ్రామంలో రచయిత ఏర్పాటు చేసిన దంతవైద్యశిభిరం ప్రారంభిస్తున్న నాటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీ కానేటి మోహనరావు గారు

ఎన్నికల వేళ ఎంత డబ్బుతో ఓటరును ప్రలోభ పెట్టినా, ఇంటింటికి తిరిగి ఓటు అర్థించడం ఆనవాయితీగా మామూలు విషయమే! ఇళ్లకు వచ్చి వాళ్ళువేసే విచిత్ర వేషాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇళ్లల్లో దూరి అన్నం పెట్టమనడం, పిల్లల్ని ఎత్తుకోవడం, కాఫీ హోటల్‌కు వెళ్లి కాఫీ తయారుచేస్తున్నట్టు, ఇస్త్రీ షాపుకు వెళ్లి ఇస్త్రీ చేసినట్టు నటించడం, ఒక్కటికాదు. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అన్నట్టు మరునాడు ఆ గొప్ప ఫోటోలు దినపత్రికలలో రావడం, ఇంతకుమించిన ప్రహసనం ఇక ఏముంటుంది?

ఎన్నికలంటే కొందరికి పండుగ రోజులే! ముఖ్యంగా కాలనీలలో పెద్దమనుష్యులుగా పోజు కొట్టేవారు, చలామణి అయ్యేవారు, ఏ పార్టీవాళ్ళు వచ్చినా, మొత్తం కాలనీ జనం తమ చెప్పుచేతల్లోనే ఉన్నట్టు, తాము ఎవరికీ ఓటు వెయ్యమంటే వారికే వేస్తారని నమ్మ బలికి, ఆయా నాయకులను కాలనీ లోపలికి పోకుండా చేసి, వాళ్ళ దగ్గర కొంత సొమ్ము వసూలు చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయని ఎలా అనుకుంటాం. ఇటువంటి రాజకీయ పరిస్థితుల మధ్య తమ గెలుపే ధ్యేయంగా పెట్టుకునేవారు, తమపార్టీ అభివృధ్ధి కోసం, తాము ఆర్థికంగా బలపడటం కోసం శ్రమిస్తున్నారు తప్ప, ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం, నాయకుల కృషి శూన్యమనే చెప్పాలి. ఎన్నికల కమిషన్‌లో, అవసరమైన మార్పులు, కఠినమైన చర్యలు ఉంటే తప్ప, ఎన్నికల సంస్కరణలు సజావుగా సాగవు. దానికోసం నాటి ఎన్నికల కమిషనర్ స్వర్గీయ శేషన్ వంటివారు కొంతకాలం ఎన్నికల కమిషనరేట్‍లో పనిచేస్తే తప్ప ఆశించిన ఫలితాలు మనకు దక్కక పోవచ్చును. అలాగే ప్రజలలో కూడా మార్పు రావలసిన అవసరం వుంది. తాత్కాలిక తాయిలాలను వ్యతిరేకించే పరిస్థితి ప్రజలలో రావాలి.

రాజమండ్రి మొదటి పార్లమెంట్ సభ్యులు రచయిత సోదరులు (కజిన్) స్వర్గీయ కానేటి మోహనరావు (ఎడమ), రచయిత మేన బావ స్వర్గీయ రాపాక విశ్వనాధం (కుడి)

ఇకపోతే, ఎన్నికలకు, నాకు, కొన్ని గుర్తు పెట్టుకోవలసిన దగ్గర సంబంధాలు వున్నాయి. 1951-52 సంవత్సరంలో మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగితే నేను 1953లో పుట్టానట! ఆ ఎన్నికలలో, దేశం మొత్తం మీద నేషనల్ కాంగ్రెస్ ఎక్కువ పార్లమెంటు సీట్లను గెలుచుకున్నా, ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం కమ్యూనిస్టులు విజయభేరి మ్రోగించారు. దానికి కోస్తా ప్రాంతం అతీతం కాదు. ఈ ఎన్నికలలో మా అన్నయ్య (కజిన్) కమ్యూనిస్ట్ టికెట్‍తో, పార్లమెంటుకు, అసెంబ్లీకీ ఎన్నిక కావడం విశేషం. అలా ఆయన అసెంబ్లీ సీటు వదులుకుని, రాజమండ్రికి మొదటి యువ పార్లమెంట్ సభ్యునిగా రికార్డుల్లో నమోదు అయ్యారు. ఆయనే స్వర్గీయ కానేటి మోహన్ రావు గారు. అయన మేనకోడలే మా వదినగారు శ్రీమతి కె. శిరోరత్నమ్మ (అన్నయ్య కె. కె. మీనన్ భార్య).

ఎన్నికల డ్యూటీలో రచయిత బావమరిది (మధ్య) రాజబాబు.

ఇకపోతే, నాకు ఓటు హక్కు వచ్చే సమయానికి నేను హైదరాబాద్‍లో అన్నయ్య కె. కె. మీనన్ సంరక్షణలో, కాకతీయనగర్‌లో వున్నాను. ఆ సంవత్సరం గుర్తులేదు కాని, మొదటిసారి ఓటు వేయాలన్న మహదానందంతో, పోలింగ్ బూత్‌కు, అన్నయ్యవాళ్ళతో కలిసివెళ్ళాను. అయితే మమ్ములను ఆశ్చర్యపరుస్తూ, మా ఓట్లన్నీ అప్పటికే పోల్ అయిపోవడం విశేషం. ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరుగుతాయో మొదటిసారి తెలుసుకున్నాను. తర్వాత ఎప్పుడూ ఇప్పటివరకూ అలా జరగలేదు.

కానీ నేను ఓటేసినవారు ఎవరూ ఇప్పటివరకూ ఎన్నికల్లో నెగ్గలేదు. ఇది కూడా ఒక రికార్డుగా (యితర రికార్డులు ఏమీ లేవు కనుక) చెప్పుకోవచ్చునేమో! తెలంగాణా రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 2023, నవంబరు 30న జరగనున్నాయి. మేము హన్మకొండలో ఓటు వేయవలసి వుంది. సికింద్రాబాద్ నుండి దీనికోసం హన్మకొండ వెళ్లడం అవసరమా? అనిపించినప్పటికీ ‘విద్యావంతులే ఎక్కువశాతం ఓటింగ్‍లో పాల్గొనడం లేదు’ అన్న అపవాదు తప్పించుకోవడానికైనా, ఆ రోజు ఓటింగ్‍లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. ఈసారి మేము ఓటు వేసిన అభ్యర్థి తప్పక నెగ్గుతాడనే నమ్మకంతో కూడా వున్నాము.

గత ఎన్నికల్లో (హన్మకొండ) వోటు వేసిన తరువాత రచయిత, వారి అమ్మాయి –నీహార కానేటి

చివరగా చెప్పే విషయం ఏమిటంటే, చిన్న చిన్న తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా, మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో పార్టీ, కులం, మతం, ప్రాంతం ప్రమేయం వుండకూడదు. అయితే, మంచి వ్యక్తి అంటే ఎవరు? ప్రజలకు సమస్యలు సృష్టించకుండా, ప్రజాసమస్యలు తెలుసుకుని, తన వంతు పరిష్కార మార్గాలు చూపించేవాడు, అన్నిరకాలుగా ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి పరచగల సత్తావున్నవాడు, పార్టీలకతీతంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారిని మంచి వ్యక్తులుగా భావించి, అలాంటి వారినే ఎన్నుకునే ప్రయత్నం చేయాలి.

మాయమాటలు చెప్పి, ఊహాలోకంలో విహరింపజేసి, ఓట్లు తన్నుకుపోయే దగాకోరులపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఓటు అమ్ముకోవడం అంటే, మనల్ని మనం అవమాన పరచుకోవడమే, మన అభివృద్ధిని మనం చేతులారా పాడు చేసుకోవడమే! దేశ అభివృద్ధిలో ‘ఓటరు’  పాత్ర కీలకం అన్న విషయం మరువ కూడదు. అలాగే, ఓటు హక్కు వున్న ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకుని, ఉత్తమ పౌరుడిగా నిలవాలి. ఓటింగ్‍లో‌ పాల్గొనడం ఈ దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలి. ఈ సందర్భంలో మన దేశ రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్, ఎన్నికలకు సంబందించి చెప్పిన ఒక మంచి మాటను ఉటంకించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

‘నేను నా దేశప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు!
ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి
రాజులు అవుతారో, అమ్ముకుని బానిసలు అవుతారో,
అది వారి చేతుల్లోనే వుంది..!’
–డా. బి. ఆర్. అంబెడ్కర్.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here