అమ్మణ్ని కథలు!-7

0
3

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని గానసాధన!

[dropcap]ఒ[/dropcap]క రోజు మధ్యాహ్నం వేళ అమ్మ కాఫీలు కలుపుతున్నది.

పెద్దమ్మ పెరటి వాకిటి దగ్గర కూర్చుని ఒత్తులు చేస్తున్నది. నేను దూదితో ఒత్తులు చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాను.

“దూది అంతా ఖరాబు చేస్తున్నావే అమ్మణ్నీ! పాటో, పద్యమో నేర్చుకో పోయి!” అన్నది.

“నాకు పద్యాలయితే నువ్వే నేర్పాల. పాటలయితే నాకేం రావు. సినిమా పాటలే వచ్చు. అవి పాడితే నువ్వు తిక్కపాటలు పాడొద్దంటావు” అన్నాను నేను నా తప్పేమీ లేదన్నట్టుగా.

అమ్మ చెప్పినట్టు ఎవరు, ఎప్పుడు, యే ప్రశ్న అడిగినా సమాధానం సిద్ధంగా వుంటుంది నా దగ్గర.

పెద్దమ్మ యేదో గుర్తొచ్చినట్టు.. అమ్మను ఉద్దేశించి, “పెద్దపిల్లలకు నేర్పినావు కదా శాంతమ్మా.. అమ్మణ్నికీ, జయకూ కూడా యేవైనా అమ్మవారి పాటలు నేర్పించకూడదా? రేపు పెళ్లై అత్తగారిళ్లకు పోతే, నోములు, వ్రతాలు చేసుకున్నప్పుడు యేం పాటలు పాడుకుంటారు వీళ్లు? మొన్న అన్నపూర్ణమ్మ చెప్పి చెప్పి నవ్వింది.. వాళ్ల మనవడి పుట్టినరోజు పేరంటంలో వీళ్లిద్దరినీ పాట పాడమంటే, జెండా పాట, నెహ్రూ పాట పాడినారట! వాళ్లకొచ్చింది వాళ్లు పాడినారు పాపం.. పిల్లలేం జేస్తారు? ఈ పల్లెకొంపలో సంగీతం నేర్పించే వాడెవడూ లేడు. నీకు సంగీతం వొచ్చు గానీ, పనితో నీకు తీరనే తీరదు. ఈ పాడీపంటా శాదానం తోనే నీకు సరిపోతుంది.. మరి వీళ్లిద్దరికీ పాటలెట్లా వొస్తాయమ్మా?” అని పలిమింది పెద్దమ్మ.

“సరేలేండి అమ్మా.. పాట నేర్పిస్తా లెండి!” అన్నది అమ్మ కాఫీలు గ్లాసులలో పోస్తూ.

అందరూ కాఫీలు తాగేశారు. నేను, జయా, తమ్ముళ్లూ మా కోటా రెండు గ్లాసుల పాలూ తాగేసి, మరో అరగ్లాసు కాఫీ కూడా తాగేసినాం. అమ్మ ఒక కాయితంలో పాట రాసిపెట్టింది. సాయంత్రం మా ఇద్దరినీ కూర్చోబెట్టి తనతోపాటు పాడించింది.

అది అమ్మ పూజలప్పుడూ, పేరంటాలప్పుడూ పాడే పాటే కాబట్టి మాకు రాగం అదీ త్వరగానే వచ్చింది.

“ఈ కాయితం పెట్టుకోని పాడుకుంటూ వుండండి..” అని చెప్పింది.

అది ఆమనికాలం. మామూలుగా వసంతఋతువును ‘ఆమని’ అంటారు. కానీ, పంటలొచ్చే కాలాన్ని మా వూళ్లో ‘ఆమని’ అంటారు.

ఉగాది ముందర మా వూళ్లలో పంటలు చేతికొస్తాయి కాబట్టి అట్లా అంటారేమో!

పంటలు ఆ రోజుల్లో వొస్తాయి కాబట్టి ఉగాది పెద్దపండగ ఆ ప్రాంతాల్లో.

మా చేలో జొన్నలు, కందులు, పెసలు, సెనిక్కాయలు, కుసుమలూ, ధనియాలూ బాగానే పండినాయి. పత్తి ఇంకా నెలన్నర రోజులు దాటితేగానీ చేతికిరాదు.

జొన్నలను పడుగుతిప్పి (కంకులనించి గింజలను వేరుచేసే ప్రక్రియ), రాశి పోసినారు. పేద్ద రాశి అయింది. మధ్యలో ఒక బల్లెం గుచ్చిపెట్టినారు. మిగతా పంటలనన్నింటినీ కూడా కళ్లంలో ఆరబెట్టినారు.

నాయన రోజంతా కళ్లంలోనే వుంటున్నారు. పొద్దున్నే పదింటికల్లా భోంచేసి వెళ్లిపోతే మళ్లీ చీకటి పడింతర్వాతే ఇంటి కొస్తున్నారు.

రాత్రి నమ్మకస్తులైన మనుషులిద్దరిని కాపలాకు పెట్టినారు. వాళ్లు రాత్రంతా కళ్లం చుట్టూ తిరుగుతూ కర్రలు పట్టుకొని కాపలా కాస్తారు.

చుట్టుపక్కల కళ్లాల వాళ్లు కూడా మా తాతగారు, నాయన గారి పైన అభిమానంతో మా కళ్లం పైన ఓ కన్ను వేసి వుంచుతామని చెప్పినారట!

రోజూ నాయనకు మధ్యాహ్నం టిఫిన్, కాఫీ ఎవరో ఒకరం పోయి ఇచ్చివస్తున్నాము.

ఆ రోజు నేనూ, జయా కళ్లానికి బయల్దేరినాము, మధ్యాహ్నం మూడు గంటలవేళ ఎండ మిటమిటలాడుతుండగా.

నేను స్టీలు టిఫిన్ క్యారియర్, మంచినీళ్ల మరచెంబు, జయ కాఫీ ఫ్లాస్కూ పట్టుకున్నాము. మా పాట కాయితం కూడా మాతో తెచ్చుకున్నాము.

ఇంట్లో గౌరీదేవి పాట మేం గొంతెత్తి పాడుతుంటే, అందరూ “కొంచెం చిన్నగా పాడండే.. వినలేకపోతున్నాం.. ఏదైనా ఒక రూమ్‌లో తలుపులేసుకోని పాడండే..” అంటున్నారు.

మా పెద్దక్క అయితే “అమ్మా! నువ్వు వీళ్లిద్దరికీ యేమని నేర్పించినావో గానీ ఈ పాట.. వీళ్లు సరిగ్గా నా కూతురు పడుకున్నప్పుడే మొదలు పెడతారు. అది నిద్రలో ఉలిక్కిపడి లేచేస్తూంది” అని ఫిర్యాదు చేసింది.

అప్పటినించీ అమ్మ “సాయంత్రం పూట మిద్దె పైకి పోయి కొంచెం చిన్నగా పాడుకోండి” అని చెప్పింది. మాకొక వైపు అవమానంగా వుంది. కానీ, ఓర్చుకున్నాము.

ఈ రోజు కళ్లంలో పోయి హాయిగా, గొంతెత్తి పాడుకోవాలని నిశ్చయించుకున్నాము. అదే మాట అన్నాను అమ్మతో. అది విన్న మా పెద్దన్న..

“అది మంచి పని! అక్కడ కూర్చోని పాడినారంటే పిట్టలు ఎగిరి పోతాయి. దొంగలు కూడా భయపడి పారిపోతారు. మన జొన్నలు మనింటికి వొస్తాయి క్షేమంగా” అని వెక్కిరించాడు.

నేను, జయ పోయి మీదపడి తలో రెండు గుద్దులు గుప్పించాము. పారిపోయాడు మా ధాటికి.

సరే.. కళ్లానికి చేరి, నాయనకు టిఫిన్ పెట్టినాము.

అక్కడే ఒక చిన్న గది వుంది నాయన కోసం. ఆ గది కిటికీలో నుంచి కళ్లం అంతా కనబడుతుంది. నవారు మంచమూ, దిండూ, నీళ్ల కూజా, టేబుల్ ఫానూ, ఈజీఛైరూ, పేపరూ, వారపత్రికలూ ఇలా అన్ని వసతులూ కల్పించుకున్నారు నాయన.

ఆయన రాజకుమారుడు. సుఖజీవి! పెద్ద వకీలుగారి ఏకైక పుత్రుడు మరి!

నాయననేమీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా అమ్మ యేర్పాటే! ఆమె సంరక్షణలో వున్న వాళ్లక్కావలసిన యేర్పాట్లన్నీ అట్లా చూసుకుంటుంది ఆమె.

టిఫిన్ తిన్నారు నాయన. మేము ఇంట్లో కానిచ్చే వచ్చాము.

ఇంటికి తీసుకెళ్లాల్సిన సామానంతా ఒక సంచీలో సర్దుకున్నాము.

ఇంక ఆటలకు పక్కనే వున్న రెడ్డిగారి కళ్లంలోకి పోయినాము.

వాళ్లది పెద్ద కళ్లం. వాళ్లు కళ్లాన్ని తోటగా మార్చుకున్నారు. బావిలోని నీళ్లు మోటరు ద్వారా కాలువల్లోకి, తోటలోకి పారుతున్నాయి.

కాసేపు నీళ్లల్లో ఆడుకున్నాము. అక్కడ కాపలా వుండే అతను మాకు తెలిసినవాడే! మేము ఆడుకుంటుంటే నవ్వుతూ అతని పని అతను చేసుకుంటున్నాడు. వాళ్ల తోటలో కుంకుడుచెట్టు కింద రాలిన కుంకుడు కాయలను రాయితో పగలగొట్టి, బాదాం ఆకును దొన్నెలాగా చేసుకుని, నీళ్లుపోసి, రసం తీసి,ఆ రసంతో మొహం, కాళ్లు చేతులు రుద్దుకున్నాము. పాట సంగతి గుర్తుకువచ్చింది.

“ఇక్కడైతే మనం ఎంత గట్టిగా పాడుకున్నా ఎవరూ యేమనరే జయా..” అన్నాను నేను.

ఇద్దరం ఒక గోడ మీద కూర్చొని గట్టిగా,

“పూజా చేతాము రారే మన గౌరుకు..

పూజా చేతాము రారే తేజాముతో మన వారిజాక్షు లందరూ జాజిపూలా..” అని రెండు చరణాల పాటంతా పాడుకున్నాము.

“పాటంతా ఒచ్చేసింది కదే అమ్మణ్నీ.. ఈ కాయితాన్ని చించేద్దాం ఇంక” అన్నది జయ. నాకూ ‘నిజమే కదా..’ అనిపించింది.

దాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి నీళ్లల్లో పడేసినాము.

మళ్లీ అమ్మ యేమైనా అంటుందేమోనని భయం వేసింది.

ఇద్దరం పాటపాడుకుంటూనే ఇంటిదారి పట్టినాము. చుట్టుపక్కల కళ్లాల వాళ్లు మమ్మల్ని ఆపి ముచ్చట్లు మొదలు పెట్టినారు.

వాళ్లకు కూడా “కొత్తపాట నేర్చుకున్నాం. వినండి” అని పాడి వినిపించినాం! బాగా పాడినామని మెచ్చుకున్నారు అందరూ. మొహమాటం కొద్దీ అట్లా అన్నారేమోనని నాకు అనుమానం!

వాళ్లు మా ద్వారా మా ఇంటి విషయాలు లాగుదామని ప్రయత్నం చేసినారు.

“మీ మూడో అక్కకు పెళ్లి కుదిరిందా? మొన్న పెళ్లిచూపులు జరిగినాయంట కదా? మీ అమ్మ పెద్దమ్మను బాగానే చూసుకుంటుందా? తాతకు అమ్మంటే ఇష్టమా? పెద్దమ్మంటే ఇష్టమా? మీకు జొన్నలు ఎన్ని పుట్లు పండినాయి?” లాంటి ప్రశ్నలు అడిగినారు.

మాకు పెద్దవాళ్ల విషయాలు యేవీ తెలియవని ముక్తకంఠంతో జవాబిచ్చినాము. ఇదంతా మాకు మా అమ్మ ఇచ్చిన తర్ఫీదు.

ఏయే ప్రశ్నలడిగితే ఎట్లా జవాబు చెప్పాలో.. నేర్పివుంచుతుంది అమ్మ. “లేకపోతే పల్లెటూళ్లలో బతకడం కష్టం” అంటుంది. మాకవేమీ అర్థం కావు. అక్కకు పెళ్లికుదిరితే కుదిరిందని చెప్తే వొచ్చే నష్టమేమిటో తెలీదు.

కానీ, అమ్మ ఛత్రఛాయలో వుంటేనే అన్ని విధాలా క్షేమం అని మాత్రం మాకు పలు సందర్భాల్లో అర్థమయింది. అందుకే అమ్మ వొద్దన్న పనిని చచ్చినా చెయ్యము.

తరవాత ఇంటికొచ్చినాము. మేమెక్కడికి పోయి వొచ్చినా ముందు అమ్మ యక్ష ప్రశ్నలకు జవాబు చెప్పితీరాల్సిందే.

ఎట్లా కనుక్కుంటుందో యేమో.. మనం ఎక్కడ తప్పు చేసినామో.. అక్కడే ఖచ్చితంగా గొంతు పట్టుకుంటుంది.

చుట్టుపక్కల కళ్లాలలో జొన్నల రాశులు ఎంత పెద్దగా వున్నాయో, కందులెవరికి ఎక్కువగా పండినాయో.. పెసలు ఎవరికి బాగా పండినాయో.. మేము సేకరించిన ఇలాంటి వివరాలన్నీ అమ్మకు చెప్పినాము.

పక్కనవాళ్ల తోటలో ఆడుకున్నదీ, పాడుకున్నదీ చెప్పినాము.

“ఇంతకూ ఆ కాయితం తెచ్చినారా? ఎక్కడైనా పడేస్తిరా?” అడగనే అడిగింది.. అసలు ప్రశ్న.

మా తెలివితక్కువ తనం మీద ఎంత పరిశోధన చేసిందో కదా.. అనిపిస్తుంది, ఇప్పుడు ఆలోచిస్తే..

“ఇంకా ఎందుకమ్మా ఆ కాయితం? మా ఇద్దరికీ నోటికి వొచ్చేస్తేనూ.. కావాలంటే పాడి వినిపిస్తాం చూడు..” అన్నాను నేను బింకంగా.

“అంటే పారేసి వొచ్చినారన్నమాట!” నిలదీసింది.

“అవునమ్మా! పాట వొచ్చేసిం తర్వాత కాయితం ఎందుకనుకోని చించి పారేసినామమ్మా.. నీళ్లలో పడేసినాం” జయ తెగించి చెప్పేసింది.

ఇక నవ్వడం అమ్మ వొంతయింది. అక్కడే వున్న పెద్దమ్మ

“ఏం తెలివే మీది? పాట వొచ్చేసిందని పాట కాయితం పారేస్తిరా? అదేమన్నా అన్నమడిగిందా? నీళ్లడిగిందా? తలంటిపోయమని అడిగిందా? పుస్తకంలో పెట్టుకుంటే పడివుండేది కదా? మరిచిపోతే చూసుకోవచ్చు కదా?” అని, మా తెలివితక్కువ తనాన్ని తలుచుకోని, తలుచుకోని నవ్వింది.

అన్నావాళ్లు, అక్కావాళ్లు అందరూ ఎగతాళి చేయడం మొదలు పెట్టారు.

మాకు కూడా మేము చేసిన పని చాలా తెలివితక్కువగా అనిపించింది.

అప్పటినించీ మా ఇంట్లో అదొక జోక్ అయిపోయింది. అయిందానికీ, కానిదానికీ ఈ సంఘటనను ఉదాహరణగా చూపడం, నవ్వడం, మేమిద్దరం ఉడుక్కోవడం మామూలయి పోయింది.

కొత్తపాట నేర్చుకున్నాం కదా.. అప్పటినించీ ప్రతీ పేరంటంలో ఆ పాటే!

“కొత్తపాటేదైనా నేర్పమనవే అమ్మణ్నీ.. మీ అమ్మను. ఎప్పుడూ గౌరమ్మ పాటేనా?” అని అత్తావాళ్లందరూ చెప్పడం మొదలుపెట్టారు.

ఒక పేరంటంలో.. భ్రమరాంబత్త అట్లాగే అంటే,

“అత్తా! నా కొచ్చినపాట ఇది.. ఇది పాడమంటే పాడుతాను. లేదా ‘అన్నా అన్నా విన్నావా.. నెహ్రూ చాచాను కన్నావా? చిన్నాపిల్లల జతగాడూ.. మా చిన్నాపిల్లల జవహారు..’ అని పాడుతా” అని బెదిరించాను.

“ఒద్దులేవే.. గౌరీదేవి పాటే మేలులే!” సర్దుకుంది భ్రమరాంబత్త.

“అట్లా దారికి రావాల మరి. కష్టపడి నేర్చుకొని, మీ పేరంటంలో పాడిందానికి సంతోషపడక తప్పులు పట్టడం ఒకటి!” అనుకున్నాను.. అయితే మనసులోనే!

కానీ, మాకు కూడా గౌరమ్మ పాట విసుగెత్తింది. పురజనుల కోరిక, మా అవసరం మేరకు ‘లవకుశ’ సినిమా పాటలు నేర్చుకోవడం మొదలుపెట్టినాము.

ఆ తరువాత యే పేరంటంలోనైనా ‘రామకథను వినరయ్యా, లేదా ‘శ్రీరాముని చరితమునూ వినరోయమ్మా..’ అనే పాటలను ఢంకా బజాయించినట్టు పాడేవాళ్లం.. నేనూ జయా!

ఇంకా రమావాళ్ల అరుగు మీద డాన్సు కూడా చేసేవాళ్లం ఆ పాటలకు.

ఇంకా ‘జననీ శివకామినీ..’ అనే పాట, ‘అమ్మా తులసీ.. ప్రేమన్ వెలసీ..’ అనే పాటా కూడా నేర్చేసుకున్నాం.

అలా మా గానసాధన సినిమా భక్తిగీతాలతో ముందుకు సాగింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here