[శ్రీ సిహెచ్. సి. ఎస్. శర్మ రచించిన ‘ఊపనా ఊయల’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]“రం[/dropcap]గా!..”
“ఏం అమ్మా!..”
“నిన్న మామయ్య వచ్చి వెళ్లాడు!..”
తల్లి శాంతి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు రంగ..
తన తండ్రి శ్యామ్.. తన వయస్సు పది సంవత్సరాలుగా వున్నపుడే మరణించాడు. కారణం విషజ్వరం.
అప్పటినుండి.. మామయ్య గోపాల్.. తనను, చెల్లెలు సుధను, అమ్మ శాంతిని.. ఎంతో అభిమానంతో సాయం చేస్తూ తనకు చెల్లెలికి నాన్న లేని లోటును తెలినీయకుండా.. పెంచి.. చదివించి పెద్ద చేశారు.
‘మామయ్య నాకు చెల్లికి తండ్రిలాంటి వారు. వారి ఋణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను.. వారి మనస్సులోని కోర్కెను తీర్చలేక పోయాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో!..’ అనుకొన్నాడు రంగ. “అమ్మా!.. మామయ్య ఏం చెప్పాడమ్మా?..”
“నిన్ను ఒకసారి వాడిని కలమవన్నాడు నాన్నా!..”
“విషయం ఇదని ఏమీ చెప్పలేదా?..”
“లేదు..” కొన్ని క్షణాల తర్వాత.. “ఎపుడు వెళతావు?..” అడిగింది శాంతి.
“ఫ్రష్ అయి వెళతానమ్మా!..”
రంగా రెస్ట్ రూమ్‍లోకి వెళ్లాడు. సుధ కాలేజీ నుండి వచ్చింది. వాకిట్లో వున్న రంగా బూట్లను చూచి.. “అమ్మా!.. అన్నయ్య వచ్చాడా?..” అంది.
“ఆ.. శనివారం కదా.. వచ్చాడమ్మా!..”
“ఆ.. నాకు సబ్జెక్టులో కొన్ని సందేహాలు వున్నాయి.. అడిగి.. తెలుసుకుంటాను..” చిరునవ్వుతో
తన గదిలోకి వెళ్లిపోయింది సుధ.
రంగా ఫ్రష్ అయి హాల్లోకి వచ్చాడు.
“అమ్మా!..”
వంటింట్లోవున్న శాంతి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చి.. గ్లాసును రంగకు అందించింది.
“నాన్నా!.. మామయ్యగారి ఇంటికి వెళుతున్నావా?..”
కాఫీ త్రాగుతూ.. “అవునమ్మా..” చెప్పాడు రంగా
సుధ తన గదినుండి బయటికి వచ్చింది.
“అన్నయ్యా!.. మామయ్యా వాళ్ల ఇంటికి నేనూ రానా?..” అడిగింది.
రంగా క్షణం సేపు సుధ ముఖంలోకి చూచి.. తల్లి ముఖంలోకి చూచాడు. ఆ చూపుల్లో సుధ తనతో రావడం ఇష్టం లేదన్న భావన.. స్పష్టంగా సుధకు.. శాంతికి అర్థం అయింది.
“నీవు ఇపుడు వద్దులేవే.. వాణ్ణి వెళ్లిరానీ.. మనం తర్వాత వెళదాం..” అనునయంగా కూతురుకు చెప్పింది శాంతి.
“సరే అమ్మా!..” తల ఆడించి సుధ తన గదిలోనికి వెళ్లిపోయింది.
“వెళ్లొస్తానమ్మా!..”
“ఆ.. నాన్నా!.. వాడి మనస్సు చాలా విచారంగా వుంది. కాస్త వూరట కలిగించేలా మాట్లాడు..” ప్రాధేయపూర్వకంగా చెప్పింది శాంతి.
రంగా తల ఆడించి ఇంట్లోనుంచి బయటికి నడిచి బులెట్ ఎక్కి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న తన మేనమామ గోపాల్ ఇంటికి బయలుదేరాడు.
***
ఊరికి దూరంగా తోటలో రెండు సంవత్సరాల క్రిందట గోపాల్ రెండంతస్తుల మేడను నిర్మించాడు. వారి భార్య పేరు సుమతి. ఇరువురు కుమార్తెలు పావని.. పవిత్ర.. ఒక కొడుకు రఘు. పావనికి వివాహం అయింది. భర్త మరణించాడు. మూడు నెలల లోపలే.. పుట్టింటికి చేరింది. యం.యస్సీ. వరకు చదివింది. మంచి రూపం.. తెలివి కలది.. కానీ.. అన్నీ వుండీ అదృష్టం ఆ రీతిగా మారింది. పవిత్ర ఇంటర్ సెకండ్ ఇయర్.. రఘు ఎనిమిదో తరగతి.. చదువుతున్నారు..
పావనికి రంగాకి ఐదేళ్ల వ్యత్యాసం.. రంగ పోలీస్ డి.యస్.పి. అతని చెల్లి సుధ పవిత్ర లాగా ఇంటర్ సెకండ్ ఇయర్.. ఒకే కాలేజీ.. పావని భర్త మరణం.. మూడు నెలల లోపలే ఆమె పసుపు కుంకుమలకు దూరమై ఇంటికి చేరడం.. ఆ స్థితిలో ఆమెను చూడడము.. ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆవేదనను కలిగించింది.
పది ఎకరాల్లో కొబ్బరి .. మామిడి.. నిమ్మ.. జామ చెట్లపై.. వ్యవసాయంతో సంవత్సరానికి మంచి ఆదాయాన్నే చూస్తాడు గోపాల్.
రంగా బులెట్‌ను బంగళా కార్ పోర్చిలో ఆపాడు. వరండాలోనే కూర్చొనివున్న గోపాల్ లేచి.. “రా.. రంగా!.. రా!..” అంటూ ప్రీతిగా పలకరించాడు.
తన బులెట్ సౌండ్ విని పావని హాల్లోకి వచ్చి.. తన్ను చూచి లోనికి వెళ్లడాన్ని రంగా గమనించాడు. రంగా వెళ్లి గోపాల్ ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు.
మరదలు.. పవిత్ర మంచినీళ్ల గ్లాసుతో వరండాలోకి వచ్చింది. వెనకాలే గోపాల్ భార్య సుమతి వచ్చింది.
“రంగా.. అమ్మా.. చెల్లి.. బాగున్నారా!” ఆదరంగా అడిగింది సుమతి.
“ఆ.. బాగున్నారత్తా!..”
పవిత్ర అందించిన గ్లాసును అందుకొని కొంచెం నీళ్లు త్రాగి గ్లాసును పవిత్రకు అందిస్తూ… “చాలు..” అన్నాడు రంగా.
పవిత్ర లోనికి వెళ్లిపోయింది.
“అలా తోటలోకి వెళదాం పద!..” అన్నాడు గోపాల్.
“ఆ..” కుర్చీలోంచి లేచి ముందుకు నడిచాడు రంగ.
ఇరువురూ ఇంటి వెనుక వున్న తోటలో ప్రవేవించారు..
“మామయ్యా!.. రమ్మన్నారట?..”
“అవును.. రంగా!..”
“విషయం ఏమిటి మామయ్యా ?..”
“పవిత్రకు ఒక సంబంధం వచ్చింది..”
“ఏ వూరు?..”
“అల్లూరు..”
“అబ్బాయి ఏం చేస్తున్నాడు?..”
“బి.టెక్. సివిల్ ఇంజనీరు.. హైదరాబాద్లో పనిచేస్తున్నాడు..”
“తల్లీ తండ్రీ వున్నారా.. అన్నా చెల్లీ ఎంతమంది?”
“ఇతను పెద్దవాడు.. తర్వాత ఇద్దరూ మెగపిల్లలే.. ఇంటర్ అంతకంటే క్రింది తరగతులు చదువుతున్నారంట.. ఇల్లూ వాకిలీ.. పది పదిహేను ఎకరాల భూమి వుందట..తండ్రి హైస్కూల్ టీచర్ వుండి రిటైర్ అయినారట. మంచి కుటుంబం అని విన్నాను..”
“మామయ్యా!.. మీ అభిప్రాయం ఏమిటి?.. మంచి సంబంధం కదా అని పవిత్ర చదువును ఆపి వివాహం చేయాలనుకుంటున్నారా!..”
గోపాల్ జవాబు చెప్పకుండా మౌనంగా వుండి పోయాడు.
“అసలు పవిత్ర ఉద్దేశం ఎలా వుందో అడిగారా?..”
“అడగలేదు.. నా పిల్లలు నా మాట కాదనరనే నమ్మకం నాకుంది!..”
“మామయ్యా!.. మీరు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత.. నాకు ఆ విషయం చెప్పడంలో అర్థం ఏమిటి?..”
“నేను ఇంకా నిర్ణయానికి రాలేదు రంగా!.. నీ నిర్ణయం ఏమిటో వినాలని నిన్ను రమ్మన్నాను..
ఈనాడు కాపోయినా.. కొన్నాళ్ల తర్వాతైనా నీవు పవిత్రను చేసుకొంటావా.. చేసుకొంటానని నాకు మాట ఇవ్వగలవా?..” ఆవేశంగా అడిగాడు గోపాల్..
“పావని విషయంలోని గతం.. మిమ్మల్ని ఎంతగానో కలవర పరిచిందన్న విషయం నాకు తెలుసు. ఆ కారణంగానే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మామయ్యా!.. పవిత్ర చిన్న పిల్ల.. దాన్ని సుధతో కలసి చదువుకోనీయండి మామయ్యా.. పదహారేళ్లు.. ఇప్పుడప్పుడే దానికి పెండ్లి ఏమిటి మామయ్యా!… డిగ్రీ పూర్తి కానివ్వండి.. మన మనస్సు బాగుంటే మనం అనుకొన్నట్లుగానే జరుగుతుంది. ముందు పావనిని గురించి ఆలోచించాలి మామయ్యా!.. ఆలోచించండి..” మెల్లగా జిజ్ఞాసగా చెప్పాడు రంగా.. సన్నగా చినుకులు పడసాగాయి.
“ఏ విషయానికి అధైర్యపడకండి.. దైవం మీద నమ్మకం.. సత్సంకల్పంలో మనస్సును ప్రశాంతంగా వుంచుకోండి.. మామయ్యా!.. త్వరలో మీరు సమస్యలు అనుకొంటున్నవన్నీ తీరిపోతాయి. ఒకనాడు ఇదంతా మీరు నాకు నూరిపోసిన ధైర్యమే మామయ్యా!..” చిరునవ్వుతో గోపాల్ ముఖంలోకి చూచాడు రంగా.
అతని ముఖంలో ఎంతో ప్రశాంతత.. నిర్మలత్వం.. చూపుల్లో అభిమానం.. గోపాల్‍కు గోచరించాయి. “పదండి మామయ్యా!.. వర్షం వచ్చేలా వుంది..”
ఇరువురూ ఇంటివైపుకు బయలుదేరారు. ఇంటి వరండాను సమీపించారు.
సుమతి వరండాలోకి వచ్చింది.
“రంగా!.. బయలుదేరుతున్నావా!..”
“అవునత్తా!..”
“రెండు నిముషాలు ఆగు..” లోనికి నడిచింది సుమతి.
వరండా మెట్లు ఎక్కుతూ లోనికి చూచాడు రంగా..
పావని.. కొన్ని క్షణాలు అతన్ని చూచి ప్రక్కకు తప్పుకొంది.
సుమతి ఓ బాక్సుతో వరండాలోకి వచ్చింది. ఆ బాక్స్‌ను రంగాకు అందిస్తూ..
“ఇందులో మజ్జిగ పులుసు వుంది.. మీ అమ్మకు.. అదే మా వదినకు ఇదంటే చాలా ఇష్టం.. తీసుకెళ్లు..” నవ్వుతూ అందించింది.
పవిత్ర వరండాలోకి వచ్చింది. నాలుగు మూర్ల సన్నజాజి పూలను అరటి ఆకులో చుట్టి రంగాకు అందించింది.
“బావా!.. సన్నజాజులు దొడ్లో విరియబూస్తున్నాయి రోజూ!.. సుధకి ఇవంటే చాలా ఇష్టం.. తీసుకెళ్లు.. దానికి ఇవ్వు బావా!..” నవ్వుతూ చెప్పింది పవిత్ర.
రంగా పవిత్ర ముఖంలోకి చూచాడు. ఆనందంగా నవ్వుతూ అమాయకంగా రంగా ముఖంలోకి చూచింది పవిత్ర.
“రేపు ఆదివారమేగా!.. రా నాతో.. సుధ నీవు కలసి చదువుకొందురుగానీ.. రేపు సాయంత్రం తీసుకొచ్చి దింపుతా!.. ఏం మామయ్యా!..” నవ్వుతూ అడిగాడు రంగా.
“నీ ఇష్టమే నా యిష్టం.. ఓకే.. రంగా!..” నవ్వుతూ చెప్పాడు గోపాల్..
ఆ మాటలు విన్న పావని సింహద్వారాన్ని సమీపించింది. వరండాలో వున్న వారినందరినీ చూచింది. రంగా స్పష్టంగా పావని ముఖాన్ని నాలుగు నెలల తర్వాత చూచాడు.
ముఖాన బొట్టు లేదు.. కళ్లకు కాటుక లేదు.. జడ అల్లుకోలేదు.. తెల్ల చీర.. తెల్ల రవిక.. కొన్ని క్షణాలు పావనిని పరీక్షగా చూచి తలను ప్రక్కకు తిప్పుకున్నాడు.
అతని హృదయం పిండినట్లయింది.. వదనంలో విచారం.. మనస్సున మూగ బాధ.. నిట్టూర్చాడు. “మామయ్యా!.. బయలుదేరుతున్నాను” అన్నాడు.
“బావా!..” పిలిచింది పావని.
తొట్రుపాటుతో ఆమె ముఖంలోకి చూచాడు రంగా.. అతనే కాదు.. తల్లీ.. తండ్రి.. చెల్లి.. ముగ్గురు కూడ పావని ముఖంలోకి చూచారు ఆశ్చర్యంతో..
ఇంటి పనిమనిషి.. చంచమ్మ.. ‘బావా’ అన్న పావని మాటను విని ఆశ్చర్యానందాలతో ఆమె ముఖంలోకి చూచింది.
మూడు నెలల తర్వాత.. మామూలుగా.. పూర్వంలా.. పావని పలికిన పలుకు ‘బావా’.. “అత్తయ్యని.. సుధనీ అడిగినట్లు చెప్పండి..” పెదవులపై చిరునవ్వు.
అందరికీ ఆశ్చర్యం..
“అలాగే పావనీ!..’
“నన్ను అత్తయ్య దగ్గరకు ఎపుడు తీసుకొని వెళతారు?..”
ఆ ప్రశ్నకు అందరూ ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.
రంగా.. చిరునవ్వుతో “త్వరలో అమ్మతో మాట్లాడి తీసుకొని వెళతాను. నాకు అమ్మకు.. నీవు.. పవిత్ర.. ఎప్పటికీ ఒక్కటే..”
“థాంక్యూ బావా!..” స్వచ్ఛందంగా నవ్వుతూ చెప్పింది పావని.
సుమతి ముఖంలో ఆనందం.. మూడు నెలలుగా ఎవరితోనూ మాటా పలుకు లేకుండా.. ఎపుడూ ఏడుస్తూ.. ఎపుడో.. ఏదో తిని.. తాను బాధపడుతూ… అందరికీ బాధను పంచిన పావని ఈ రోజు ఈ రీతిగా రంగాతో మాట్లాడటం అందరికీ ఆనందం..
మామ గోపాల్‍కు అత్తకు చెప్పి రంగా బులెటను సమీపించి కూర్చుని స్టార్ట్ చేశాడు. పవిత్ర వెనుక కూర్చుంది.
చిరునవ్వుతో.. రంగా పావనికి ‘బై’ చెప్పాడు.. ఆనందంగా నవ్వుతూ పావని రంగాకు ‘టాటా’ చెప్పింది.
రంగా బులెట్ కదిలింది.
***
ఆ రాత్రి భోజనానంతరం..
రంగా తన గదిలో మంచంపై వాలాడు.
గోడకు తగిలించి వున్న ఫొటో.. అది తాను తీసింది.. పావని.. పవిత్ర.. సుధ. పావని మధ్యన.. పవిత్ర సుధలు ఇరువైపులా.. ఎంతో అందమైన ఫొటో.. గోడుకు వున్నదాన్ని చేతికి తీసుకొన్నాడు. తాను హైదరాబాదులో ఐ.పి.యస్. ఫైనలియర్ వుండగా.. ఓ వుదయం గోపాల్ దగ్గరనుంచి కాల్..
“రంగా!..”
“ఏం మామయ్యా!.. అంతా కుశలమేనా?..”
“ఆ.. ఆ.. నీకో శుభవార్త!..’
“ఏమిటది మామయ్య?.. “
“పావని బి.యస్సీ. ఫస్టు క్లాసులో పాసయింది..”
“నాకు తెలుసు మామయ్యా!.. తాను ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందనేది!..” చిరునవ్వుతో చెప్పాడు రంగా..
“మరో విషయం..”
“అదేమిటి మామయ్యా!..”.
“మీ అత్తయ్య సుమతి అన్న రామకోటయ్య కొడుకు ఇంజనీర్ సుధాకర్‍కు పావని నచ్చింది. అతనికే కాదు వారి కుటుంబ సభ్యులదరికీ.. అతనితో పావని వివాహం నిశ్చయించాము.”
రెండవ వార్త.. రంగాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
తాను.. పావని.. పవిత్ర.. సుధ ఇరుగుపొరుగులై బంధువులైనందున.. కలసి ఆడుకొనేవాళ్లు.. చదువుకొనేవాళ్లు.. పావనికి ఊయలపై ఊగటం ఎంతో ఇష్టం.. దొడ్లో వున్న వేపచెట్టుకు చాంతాడు మోకు వేలాడదీసి.. దానిపై ఓ దిండును వుంచి.. ముగ్గురినీ ఒకరి తర్వాత ఒకరిని ఎక్కించి జోరుగా ఊయలను రంగా ఊపడం.. ఆ ముగ్గురూ గంటల తరబడి వూగడం.. వారికి ఎంతో ఆనందం.. ఆ ముగ్గురి ఆనందమే రంగాకు ఎంతో ఆనందం..
అరమరికలు లేని.. అభిమానం.. ప్రేమ…
రంగాకు.. గోపాల్ మేనమామ.. తల్లి శాంతికి తమ్ముడు.. అతని తండ్రి శ్యామ్ తన పదవ ఏట చనిపోవడంతో.. మేనమామ గోపాల్.. తల్లికి అండగా నలబడి తనను చెల్లిని సాకి.. చదవించి పెద్దచేశాడు. పిల్లలకు వయస్సు పెరిగే కొద్ది.. శాంతి మనస్సున పెద్ద కోడలు పావని.. రంగా భార్య.. అనే భావన..
గోపాల్ భార్య సుమతికి.. తన అన్న వదినల పట్ల అభిమానం.. గౌరవం.. వారి కొడుకు.. తనకు వరుసకు మేనల్లుడు సుధాకర్ సివిల్ ఇంజనీరు పట్ల అభిమానం.. తన కూతురును సుధాకర్‍కు ఇచ్చి పెండ్లి చేయాలనే సంకల్పం.. సుధాకరకు పావని నచ్చడం.. అతని తల్లిదండ్రులకు పావని పట్ల అభిమానం..
వారు పావనిని తమ కోడలుగా అడగటం.. సుమతి సరే అనడం.. భార్య మాటను గోపాల్ కాదనలేక పోవడం.. ఫలితంగా.. పావని .. సుధాకర్‍ల వివాహ నిశ్చయం.. జరిగింది.
వదిన నిర్ణయానుసారం పావని వివాహం నిశ్చయమైన విషయం తెలిసిన శాంతి తన తమ్ముడితో కాని ఎవరితోకానీ.. తన కొడుకు రంగాను గురించి ప్రస్తావించ లేకపోయింది. నిశ్చితార్థం జరిగాక.. రెండు నెలలకు సుధాకర్.. పావనిల వివాహం జరిగింది.
ట్రయినింగ్ పూర్తయి వివాహానికి రెండు నెలల ముందు వచ్చిన రంగా విషయాన్ని విని.. తమ కుటుంబ గౌరవాన్ని పదిమంది మంచిగా అనుకునేలా గోపాల్ కుటుంబంతో ఎలాంటి వైరభావం లేకుండా గతాన్ని గురించి ఎలాంటి చర్చ లేకుండా.. తన మామ అత్తయ్య అడిగిన దానికి క్లుప్తంగా జవాబు చెప్పడం.. కోరి సాయం చేయడం జరిగింది.
వివాహమై.. పావని అత్తవారింటికి వెళ్లింది. కట్టడ నిర్మాణ స్థలంలో నాలుగు అంతస్తుల పైనుండి క్రిందపడి సుధాకర్ మరణించాడు.
***
గత జ్ఞాపకాలతో రంగా నిద్రపోకుండా వుండటాన్ని తల్లి శాంతి గమనించి గదిలోకి వచ్చింది. “ఏం నాన్నా.. నీవు వచ్చినప్పటినుంచి ఏదో తీవ్రంగా ఆలోచనలో వున్నావు. మామయ్య ఏం చెప్పాడు?”
“పవిత్రకు మంచి సంబంధం వచ్చిందట. వివాహం చేద్దామా.. వద్దా.. అని అడిగారు”
“నీవేం చెప్పావు?..”
“చిన్న పిల్ల.. దాన్ని చదివిద్దాం అన్నాను..”
“అందుకు వాడేమన్నాడు?..”
“నీవు తర్వాత పవిత్రను పెండ్లి చేసుకొంటావా అని అడిగాడు”
“దానికి నీ జవాబు..”
“అమ్మా!.. నేను నీ కొడుకును.. ఏం జవాబు చెప్పివుంటానో నీవు ఆలోచించలేవా?..”
“నీవేం చెప్పివుంటావో.. నాకెలా తెలుస్తుందిరా!..”
“ఆహా.. సరే.. పావని విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?..”
“అంటే?..” ప్రశ్నార్థకంగా చూచింది రంగా ముఖంలోకి సుశీల.
“అమ్మా!.. పావని వయస్సు ఇరవై అయిదు..”
“అయితే!” ఆశ్చర్యంగా అడిగింది శాంతి
“ఆమెకు మరో వివాహం చేయాలి.. ఆమె జీవితానికి ఆనందాన్ని నింపాలి..” తల్లి ముఖంలోకి నిశితంగా చూస్తూ చెప్పాడు రంగా.
“ఆ పని ఎవరు చేయగలరు నాన్నా?..”
“ఎవరు చేయగలరో ఆలోచించు అమ్మా!..”
గోపాల్‍కు ఫోన్ చేశాడు రంగా.
“మామయ్యా!..”
“ఏం.. రంగా!..’
“హాల్లో పైకి ఎత్తికట్టిన ఊయలను క్రిందికి దింపించండి మామయ్యా!.. మీరూ.. పావని.. పవిత్ర.. అత్తయ్య.. దానిపై కూర్చొని ఆనందంగా వూగడాన్ని నేను చూడాలి మామయ్యా!..” ప్రాధేయ పూర్వకంగా అడిగాడు రంగా.
ఆ ఊయలలో పావనిని.. పెండ్లికాక ముందు మహారాణిలా కూర్చొని వూగేది.. రంగా వెళ్లితే… “బావా!.. ఊపవా.. ఊయల!..” అంటూ చిరునవ్వుతో అడిగేది. రంగా.. నవ్వుతూ ఊయలను వూపేవాడు.
“అలాగే రంగా!.. ఇపుడే క్రిందికి దింపిస్తాను..” ఆనందంగా చెప్పాడు గోపాల్. పనిమనుషులను పురమాయించి ఊయల బల్లను క్రిందికి దింపించాడు.
“అమ్మా!..”
“చెప్పు నాన్నా!..”
“మామయ్య నాకు మామయ్య వరసే కాదు కదమ్మా!.. తండ్రిలా నన్ను సాకి సంతరించారు. ప్రస్తుతంలోని.. వారి బాధ.. వ్యథ.. నాకు పంబంధించిందిగా నేను భావిస్తున్నాను. వారు పూర్వంలా ఆనందంగా బ్రతకాలి.. సంతోషంగా వుండాలి. వారి ఆ స్థితిని మనమందరం చూడాలి.. అంటే!..”
“అంటే.. నీవు ఏం చేయగలవు నాన్నా!..”
“అమ్మా!.. పావనిని నేను పెండ్లి చేసుకుంటానమ్మా!..”
“రంగా!..” ఆశ్చర్య ఆనందాలతో శాంతి రంగా ముఖంలోకి చూచింది.
“అవునమ్మా!.. నీకు సంతోషమేగా!..”
“అవును నాన్నా!..”
“నేను మామయ్య ఇంటికి వెళ్లి వస్తాను..”
“ఈ రాత్రి సమయంలోనా!..’
“అవునమ్మా!..”
‘పావనిని చూడాలి.. తనకు నా నిర్ణయాన్ని తెలియ చేయాలి. ఊయల మీద పావనిని ఊపాలి.. ఆమె మనస్సుకు ఆనందం కలిగించాలి. తను నా అర్ధాంగి అని చెప్పాలి..’ అని నిశ్చయించుకున్నాడు.
రంగా బులెట్ ఎక్కి గోపాల్ గార్డెన్ వైపుకు బయలుదేరాడు. దార్లో తాను వస్తున్నట్టు మామ గోపాల్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
బులెట్ దిగి ఇంట్లోకి చూచాడు రంగా..
గోపాల్ సుమతీ చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించారు..
“మామయ్యా.. పావనిని నేను పెండ్లి చేసుకొంటాను..” నవ్వుతూ చెప్పాడు. హాలు మధ్యలో వున్న ఊయలను చూచాడు.
తన గదిముందు నిలబడి తన్నే చూస్తున్న పావనిని సమీపించాడు.
తన ఎడమ చేతిలోకి ఆమె కుడి చేతిని తీసుకున్నాడు. పావని ఆశ్యర్యంగా రంగా ముఖంలోకి చూచింది.
ఇరువురూ ఊయలను సమీపించారు.
“పావనీ.. ఆ ఊయలపై కూర్చో..”
పావని ఊయల చెక్కపై కూర్చుంది.
“పావనీ!.. నీవు నా దానివి.. ఊపనా ఊయల!!..” నవ్వుతూ అడిగాడు రంగా.
ఆనందం.. సిగ్గు.. ముంచుకురాగా పావని ఓరకంట.. రంగా కళ్లల్లోకి నవ్వుతూ చూచింది. సరే అన్నట్టు తల ఆడించింది.
గోపాల్.. సుమతీల ముఖాల్లో ఆనందం..
రంగా.. నవ్వుతూ ఊయల ఊపాడు..
(సమాప్తం)