వేస్ట్ ఫెలో

0
4

[box type=’note’ fontsize=’16’] మిడిమిడి జ్ఞానంతో తనని ప్రశ్నించి, తనకేమీ తెలియదన్న ఓ పేషంట్ బంధువు దురభిప్రాయాలని దూరం చేసిన ఓ డాక్టర్ కథ ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్ వ్రాసిన “వేస్ట్ ఫెలో”. [/box]

[dropcap]“వే[/dropcap]స్ట్ ఫెలో”అన్న మాటలు స్పష్టంగా నా చెవిన పడ్డాయి.

పేషెంట్స్‌తో హడావిడిగా ఉన్ననాకు ఆ మాటలు కాస్త కోపం తెప్పించాయి. ఎవరు ఏ సందర్భంలో ఎవరి గురించి మాటలాడినా అలా మాట్లాడడం తప్పు.

కానీ మరు క్షణంలో పిడుగు నా నెత్తిన పడినట్లనిపించింది.

“ఈ డాక్టర్ వేస్ట్ ఫెలో. అసలు డిగ్రీ పాస్ అయ్యాడో లేదో. ఆ పైన పీజీ ఒకటి” నన్ను ఉద్దేశించి అన్న మాటలే అవి. కాని ఇంత ధైర్యంగా నా రూమ్ బయటే నిలబడి మాట్లాడుతున్నది ఎవరా అన్నది నాకు అర్థం కాలేదు.

వెంటనే బెల్ కొట్టి బోయ్‌ని పిలిచి వాళ్ళెవరో వాకబు చేయమన్నాను.

బోయ్ చెప్పాడు వాళ్ళు ఏదో కేసు గురించి మాట్లాడడానికి వచ్చారట.

నేను ఒక క్షణం ఆలోచించాను. అటువంటి వాళ్ళు బయట పిచ్చిగా మాట్లాడుతే నా పరువు పోతుంది.

లోపల ఉన్న పేషెంట్‌ని పంపించి వాళ్ళని లోపలకి పిలవమని బోయ్‌కి చెప్పాను.

ఇద్దరు యువకులు లోపలి వచ్చారు. ఇద్దరికీ కూడా వయస్సు సుమారు ముప్ఫయి ఉంటుంది.

బాగా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. అందులో ఒకతనిని గుర్తు పట్టాను. పేషెంట్ తండ్రి.

“కూచోండి . మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా?” ప్రశాంతంగా అడిగాను వాళ్ళని.

“డాక్టర్ గారు మీరు ఎంతో తెలివైన వాళ్ళు అనుకుని మీ దగ్గరకు మా అబ్బాయిని తీసుకు వచ్చాం. కానీ…… మీరు అలా సలహా ఇస్తారని అనుకోలేదు”.

వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అదే విషయం అడిగాను.

“మీ దగ్గరకి వస్తే మంచి సలహాలు ఇస్తారని, బాగా ట్రీట్ చేస్తారని విన్నాం. కానీ చిన్న కేసు కూడా డీల్ చేయలేరని తెలుసుకున్నాం!!”

నాకు మెల్లిగా కోపం మొదలు అయ్యింది. అయినా నిగ్రహించుకున్నాను.

“మీరు దేని గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా?” వీలయినంత ప్రశాంతంగా అడిగాను.

“అదే మమ్స్ కేసు గురించి…”

“ఏమయ్యింది!!??” అని అడిగాను

నా భ్రుకుటి ముడి పడింది. కన్నులు చిన్నవి అయ్యాయి.

“మీరు ఇచ్చిన సలహా అర్థం లేనిదిగా ఉంది” ఇద్దరిలో పేషెంట్ తండ్రి కాకుండా వేరే యువకుడే సంభాషణ సాగిస్తున్నాడు.

“నాకు కాస్త అర్థం అయ్యేలా చెప్పండి” అన్నాను కోపంగా

“మీరు పేషెంట్‌ని, వాళ్ళ బంధువులని సరిగ్గా గైడ్ చెయ్యాలి గాని అయోమయంలో పడవేయకూడదు.”

“బీ డైరెక్ట్. మీరు ఏమి చెప్పదలుచుకున్నారో సరిగ్గా చెప్పండి. అవతల చాలా మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు” నాలో కోపం కాస్త పెరగసాగింది.

“మేము పని పాటా లేక లేం” యువకుడి గొంతులో కోపం ధ్వనించింది.

“సరే అసలు విషయం చెప్పండి” అన్నాను విసుగ్గా.

“ఈ ఇంటర్నెట్ అవ్వీ లేకపోతే మేము మరీ చీకట్లో ఉండిపోయే వాళ్ళం.”

“మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. డొంక తిరుగుడు మాని సూటిగా విషయానికి రండి” నాకు సహనం అడుగంటింది.

“మేము మా వాడికి వచ్చిన డిసీస్ గురించి, మందులు గురించి ఇంటర్నెట్‌లో చూశాం. మీరు అనవసరంగా ఏవేవో మందులు రాసేసారనిపించింది. అసలు రాయవలిసినివి రాయలేదు అనుకుంటున్నాం. అలాగే మీరు చెప్పిన విషయం జీర్ణించుకోలేకపోతున్నాం.”

“ఒరేయ్ కొంచెం ఊర్కో!!” పేషెంట్ తండ్రి కలగ జేసుకున్నాడు.

తరువాత అతనే మాట్లాడడం మొదలు పెట్టాడు.

“డాక్టర్ గారు. మా ఆదుర్దా మాది.”

“ఇంతకి నేను రాసిన మందులు కుర్రాడికి వేస్తున్నారా లేదా!!??” అని అడిగాను.

“వేస్తున్నాం. కానీ మా వాడు అంత కంటే మంచి మందులు ఉన్నాయి అంటున్నాడు. నెట్‌లో చూసాడుట.”

“చూడండి మీరు నెట్‌లో చూసి ట్రీట్‌మెంట్ తీసుకుంటే నా దగ్గరకు రావక్కరలేదు. మీ డబ్బులు, టైం దండగ చేసుకోక్కర్లేదు” అన్నాను కోపంగా

పేషెంట్ తండ్రి కంగారు పడ్డాడు.

“లేదు డాక్టర్ మీరు చూసారు కనుక మంచి మందులే రాస్తారు. కాని… కానీ…” నసిగాడు అతను.

అప్పుడు తోడుగా వచ్చిన వ్యక్తి అందుకున్నాడు.

“మీరు సరి అయిన సలహా ఇవ్వాలి. అంతే కానీ మీకు మరొక పేషెంట్ వచ్చేలా మిస్ గైడ్ చెయ్యకూడదు.”

“మీరు అంటున్నది ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు” తల అడ్డంగా ఆడించాను నేను.

“నెట్‌లో చూసాను మమ్స్ కంటేజియస్ డిసీస్ అని. మరి మీరు ఇచ్చిన సలహాలో అర్థం లేదు.”

“అంటే!!??” అని అడిగాను

“మీరు పేషెంట్‌తో వాడి అన్నని కూడా అడుకోమన్నారు. నిజానికి ఇటువంటి సమయంలో వేరే పిల్లల్ని దూరంగా ఉంచాలి కదా!?”

“నెట్‌లో అన్ని విషయాలు మీరు పూర్తిగా చదివారా!?” అని అడిగాను.

మరలా నేనే “నెట్‌లో అన్ని విషయాలు చదవరు, వచ్చి మా ప్రాణం తీస్తారు” విసుక్కున్నాను.

“అసలు నెట్ ఎవరు చూడమన్నారు. కావాలంటే, నా మీద నమ్మకం లేకపోతే, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళే కదా!!??”

“అంటే మేము చదువు రాని వాళ్ళం, తెలివి తేటలు లేని వాళ్ళం అనా మీ ఉద్దేశం?” కోపం ధ్వనించింది యువకుడి కంఠంలో.

నేను తల అడ్డంగా ఉపాను.

“నేను అలా అనలేదే!!?? నెట్‌లో చూసి నన్ను కొశ్చన్ చేయకూడదు. నేను డాక్టర్‌ని.”

“మీలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఇప్పుడు చాల సైట్లు వచ్చాయి. పాపం మీకు ఇబ్బంది” వెటకారం ధ్వనించింది ఆ కంఠంలో.

“చూడండి మీరు ట్రీట్‌మెంట్ కోసం వచ్చారా!!?? లేదా నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారా… నెట్‌లో చూసి డయాగ్నోసిస్, ట్రీట్‌మెంట్ చేసేసుకోండి. ఇంక మేము అనవసరం. ఆఖరి స్టేజిలో వద్దురుగాని” అన్నాను నేను విసురుగా .

ఆ యువకుడు ఏదో మాట్లాడబోయాడు. నేను చేతితోనే వారించాను మాట్లాడవద్దని.

“మేము ఎంతో కష్టపడి, సంవత్సరాల తరబడి చదివి, ఎన్నో కేసులు చూసి వైద్యం చేస్తాం.

పుస్తకాలలో, నెట్లో వైద్యం నేర్చుకోగలిగితే ఇక ప్రతివాడు డాక్టరే.. హాఫ్ నాలెడ్జి ఈస్ డేంజరస్ అంటారు. ఇక మీ లాంటి వాళ్ళు మిడి మిడి జ్ఞానంతో ఎక్కడో ఏదో చూసి, ఏదో చదివి ఇక సర్వం తెలుసు అనుకుంటారు. ఒకోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

అసలు మీకు మెడిసిన్ గురించి ఏమి తెలుసు అని నన్ను అడుగుతున్నారు!!??

మీ ఇంటర్నెట్ నాలెడ్జి తుంగలో పడేసి నేను చెప్పినది వినండి.

మమ్స్ వ్యాధి పెద్ద వయస్సులో వస్తే అది సంతాన హీనతకి దారి తీయవచ్చు. ఏ వ్యాధి ఎవరు కావాలనుకోరు. కానీ మమ్స్ ఇంట్లో ఒకరికి వస్తే తక్కిన వాళ్ళని వాళ్ళతో అడుకోమంటారు.

ఎందుకో తెలుసా చిన్నతనంలో వస్తే నాలుగు రోజులు నెప్పితో సరిపోతుంది.అదే పెద్ద అయ్యాక వస్తే నేను ఇందాకా చెప్పినట్టు సంతాన రాహిత్యానికి దారి తీయవచ్చు.

అందుకనే పిల్లలిని ఇద్దరినీ కలిసి అడుకోమన్నాను. అంతే కానీ మీరు నీచంగా అనుకున్నట్టు ఒక పేషెంట్ కోసం కక్కుర్తి పడే వాడిని కాదు. మీకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంతే కానీ నెట్‌లో, పుస్తకాలలో చూసి మీ తెలివి తక్కువతో ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.”

“ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి వేస్టు ఫెలోస్ ఎవరో” ఈ మాటలు వత్తి పలికాను.

ఆ యువకుడి ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేదు. సహజం.

ఇద్దరు అంత వరకు చేతిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్స్ కంగారుగా జేబుల్లో పెట్టేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here