అవగాహన

0
3

[బాలబాలికల కోసం ‘అవగాహన’ అనే కథని అందిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

[dropcap]ఈ[/dropcap] రోజు ‘ఓజోన్ పొర రక్షణ దినం’. మన దేశంలో ‘నేషనల్ గ్రీన్ కార్స్’ అనే సంస్థ వున్నది. ఆ సంస్థ ఈ సందర్భంగా జిల్లాల వారీగా పాఠశాలల విద్యార్థులకు ‘పర్యావరణ పరిరక్షణ’ గురించి రకరకాల పోటీలు పెడుతున్నది. గెలిచిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నది. ఇప్పుడు వక్తృత్వ పోటీలను జిల్లా కో-ఆర్డినేటర్ గారు మరో ఇద్దరు న్యాయనిర్ణేతలతో కలిసి వారి ఆఫీసులోనే నిర్వహిస్తున్నారు.

జిల్లా నలుమూలల పాఠశాలల నుండి 8వ తరగతి చదివే విద్యార్థులు కొంతమంది ఆ పోటీలో పాల్గోవటానికి వచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరి పేరు పిలవగానే వచ్చి తను చదివే పాఠశాల పేరు, ఊరు గురించి పరిచయం చేసుకున్న తర్వాత తనకిచ్చిన సమయంలో విషయాన్ని మాట్లాడి వెళ్తున్నారు.

ఇప్పుడు సూర్యాంష్ పేరు పిలిచారు. అతను వేదిక మీదికొచ్చాడు. మైకు అందుకోగానే భయపడ్డాడు. మాట పెగల్లేదు. వణికే గొంతులో తను గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల నుండి వచ్చానని తడబడుతూనే చెప్పాడు. ‘ఈ అబ్బాయి బాగా భయపడుతున్నాడ’ని వేదిక మీద కూర్చున్న వారు అనుకున్నారు. తోటి విద్యార్థులు కూడా ‘వీడేం చెప్పగలడు! బడాయిగా చెప్పాలని మాత్రం వచ్చాడ’ని కొంచెం వెక్కిరింతగా నవ్వడం మొదలుపెట్టారు.

సూర్యాంష్ కాస్త నిలదొక్కుకున్నాడు. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు. “అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ మొదలుపెట్టాడు. “ఈ పర్యావరణ పరిరక్షణకు నేనూ, నా కుటుంబం ఏం చేస్తుందో చెప్తాను. మా తాత వున్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు. వ్యవసాయం కూడా చేస్తాడు. రసాయనిక ఎరువులు వాడడు. పశువుల పేడను, ఎండుగడ్డిని మాగబెట్టి పెంటపోగు ఎరువును తయారు చేస్తాడు. దాన్ని పొలం లోకి తోలిస్తాడు. వరి, మొక్కజొన్న, పెసర, మినుము ఏదైనా సరే పంట కోసి, ధాన్యం నూర్చిన తర్వాత ఆ పైరును పొలంలో తగులబెట్టడు. పైరుకు ముక్కలు ముక్కలు చేయిస్తాడు. పంట కాల్వ లోని నీటిని చేనుకి పారిస్తాడు. దాంతో భూమికి సారవంతమైన ఎరువవుతుంది. ఆవుపేడ, ఆవు మూత్రం, వేప కషాయాలు తయారుచేసి పురుగు మందులుగా వాడతాడు. ఇలా సేంద్రియ ఎరువులు వాడటం వలన భూమిలో వానపాములు పుట్టుకొస్తాయి. అవి నేలను గుల్లబరుస్తాయి. వీటన్నింటితో భూమి కాలుష్యం నుంచి కాపాడబడుతున్నది. అలాగే మనం నీటిని కూడా కాలుష్యం బారిన పడకుండా కాపాడాలి. చెరువుల్లో, కాలువల్లో పూడిక తీయాలి. వాటిలో వ్యర్థ పదార్థాలు కలపగుడుదు. వ్యర్థాలు కలిసిన నీరు కలషితమవుతుంది. మానవులకు, నీటి లోని ప్రాణులకు అనారోగ్యాలూ, ప్రాణాపాయాలు కలుగుతాయి. ఆ తరువాత గాలి కాలుష్యం కూడా చాలా ప్రమాదకరమైనది. రకరాకాలుగా కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయులువు గాలిలో వ్యాపించడం వలన పర్యావరణానికి చాలా కీడు జరుగుతున్నది. మనం చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల ఆక్సీజన్ బాగా లభిస్తుంది. వర్షాలు కురుస్తాయి. మతంతో సంబంధం లేకుండా మా ఇంట్లో కూడా రోజూ అగ్నిహోత్రం చేస్తారు. మామిడిపుల్లలు, ఆవు నెయ్యి, ఔషధ సామగ్రి పొడిని, ముద్ద కర్పూరంలో మండిస్తారు. అలా చేస్తే మంచి ఆరోగ్యకరమైన సువాసనే కాకుండా, ఆక్సీజన్ రీసైక్లింగ్ సిస్టమ్ గాలిలో బాగా జరుగుతుంది. ఫ్యాక్టరీల పొగ, పెట్రోలు, డీజిల్ ఎక్కువ వాడటం వలన గాలి బాగా కలుషితమవుతుంది. వాటి వాడకం తగ్గించాలి. నేను రోజూ సైకిల్ మీదే స్కూల్‍కు వస్తున్నాను.

ఇంతే కాకుండా ధ్వని కాలుష్యం వలన కూడా పర్యావరణం దెబ్బతింటున్నది. విపరీతమైన వేగంలో చప్పుడు చేస్తూ వాహనాలు నడుపకూడదు. డి.జె. సౌండ్లు అంటూ పెట్టి తోటివారిని ఇబ్బంది పెట్టకూడదు. టీవిలు, మైకులు పెద్ద ధ్వనితో వాడకూడదు. ఇలా ఇన్ని రకాల కాలుష్యాల వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. ఫ్రిజ్‍లు, ఎ.సి.లు ఎక్కువగా వాడుతుంటే వాటి వలన వెలువడే కాలుష్యం వలన ఓజోన్ పొర దెబ్బతింటున్నది. ఓజోన్ పొర దెబ్బతింటే మన ఆరోగ్యం పాడవుతుంది.

మా ఇంట్లో మేం చల్లటి నీటి కోసం మట్టి కుండలే వాడుతాం. ప్లాస్టిక్‍కు బదులుగా మా అమ్మ గారు కాగితపు కవర్లు, గుడ్డ సంచులే వాడతారు. మొక్కలు చెట్లు చాలానే పెంచాం. మా వాడకపు నీరంతా వీటిల్లోకి వెళ్లేటట్లుగా మా నాన్నగారు కాలువలు కట్టించారు. నేలలో నీరు ఇంకటానికి ఇంకుడు గుంత కూడా తవ్వించారు. ఇలా అందరూ చేయాలి. అప్పుడు పర్యావరణం బాగుంటుంది. ప్రకృతి సమతుల్యత వుంటుంది. సకాలంలో వర్షాలు పడి, మంచి వాతావరణం వుంటుంది. ప్రాణికోటి ఆరోగ్యంగా, సుఖంగా వుంటుంది. ధన్యవాదాలు” అంటూ ముగించాడు. మొదట భయపడ్డ సూర్యాంష్‌కు పర్యావరణం పట్ల మంచి అవగాహన వున్నది. దాన్ని చక్కగా వివరించాడన్న నిర్ణయాన్ని కలిగించాడు అందరికీ. మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.

జిల్లా కో-ఆర్డినేటర్ గారు సిల్వర్ మెడల్‌ను సూర్యాంష్ మెడలో వేశారు. సర్టిఫికెట్‌ను చేతికిస్తూ – “చాలా తెలివిగలవాడివి. నీకు చాలా విషయాలు తెలుసు. ప్రభుత్వం వారిచ్చే బహుమతితో పాటు నేను వ్యక్తిగతంగా 500 రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తున్నాను” అనగానే అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here