‘సుమా’నవత్వం

0
3

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన – ‘సుమా’నవత్వం – అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]బం[/dropcap]డి అనకాపల్లిలో ఆగింది. మధు కాస్త మొహమాట పడుతూ, “నేను మిమ్మల్ని విశాఖపట్నం నుండి అడగాలనుకుంటూనే ఆడలేకపోయాను. నా పేరు మధు, మరి మీ పేరు” అడిగాడు చిన్న చిరునవ్వుతో.

“నా పేరు సుమ”, చెప్పింది చిన్నగా నవ్వుతూ. ఇంతలో ఒకావిడ బిడ్డతో ట్రైన్ ఎక్కి అటూ ఇటూ అయోమయంగా చూస్తోంది. మధు ఆమె వంక చూస్తూ, ‘ఈమెకి సీట్ ఇచ్చి, సుమ మనసులో మంచి మార్కులు కొట్టేస్తాను’ అనుకుంటూ లేవబోయాడు. అంతలో, సుమ ఎదురు బెర్త్ లో కూర్చున్న ఒకావిడ, “వద్దు బాబూ, ఆమెని చూస్తే నాకేదో భయంగా ఉంది. వేరే దగ్గర కూర్చుంటుందిలే” చెప్పింది, కాస్త బిక్కు బిక్కు మంటూ చూస్తూ.

కానీ మధు ఆమె మాటలు పట్టించుకోకుండా, “మరేం పర్లేదు”, అంటూ లేచి ఆమెని “ఇక్కడ కూర్చోండి” అన్నాడు తన తెలివితేటలకి తానే తెగ మురిసిపోతూ.

ఆమె నవ్వుతూ, “ఎంత మంచోడివి బాబూ, నీకు కాబోయే పెళ్ళాం అధృష్టవంతురాలు” అంటూ సుమ పక్కన కూర్చుంది. మధు నిలబడే సుమ వంక చూస్తున్నాడు. ఆమె కూడా అప్పుడప్పుడూ చూసి నవ్వుతోంది. తుని రాగానే సుమ ఎదురుగా కూర్చున్నావిడ, “బాబూ, నా పక్క సీటు ఖాళీ అయింది. కూర్చో” చెప్పింది.

“థాంక్స్ ఆంటీ” అన్నాడు.

ఆమె కొంచెం చిన్నబుచ్చుకుంటూ, “అలా ఆంటీ అనకు బాబూ, ఎంచక్కా అక్కా అని పిలువు” అంది.

“సరే అక్కా, ఇందాక ఆమెకి సీట్ ఇవ్వొద్దు అన్నావ్. చూశావా ఆమె ఎంత కామ్‌గా కూర్చుందో” అన్నాడు.

“నాకు ఇంకా ఎందుకో సందేహంగానే ఉంది” చెప్పింది, ముక్కు గోక్కుంటూ ఆమె వంకే అనుమానంగా చూస్తూ.

“అబ్బబ్బే, అలాంటిదేం ఉండదక్కా” అని మధు అంటుండగానే, ఆమె కాస్త కాళ్ళు చాపి మధు పక్కన పెట్టింది.

తర్వాత చెంగుకి మూటకట్టుకున్న వేరుశెనక్కాయులు తీసుకుని, ఒక్కోటి తిని అటూ ఇటూ విసిరేస్తోంది. తర్వాత తన పిల్లాడ్ని సుమకి ఇచ్చి, “కొంచెం పట్టుకోమ్మా” అని చీర సరిచేసుకుని, జాకెట్ లోంచి మొబైల్ ఫోన్ తీసి, “ఏరా” అంటూ రెండు మూడు బూతులు వాడి, “పెళ్ళాం చచ్చిందనుకున్నావా, నేను గంట క్రితం రెండు మార్లు కాల్ చేస్తే ఎత్తి మాట్లాడవేం, మళ్ళీ దాని ఇంటికి వెళ్ళావా” అంటూ పెద్దగా అరుస్తూ తిడుతోంది. బహుశా మొగుడ్నే అనుకుంటాను. తర్వాత అతను ఏం చెప్పాడో ఏమో కానీ కొంచెం చల్లబడి మధు వంక చూసి, ఫోన్ కట్ చేసి, “బాబూ, నువ్ కొంచెం సేపు మా బాబుని ఎత్తుకోవూ” అని తన పిల్లాడిని ఈ సారి మధుకి ఇచ్చింది.

చేసేది లేక, నవ్వుతూ అందుకున్నాడు. కాళ్ళు ఇంకా ఎదురు బెర్త్ మీద ముందుకి జరిపింది. తర్వాత, ఆమె కోసం మధు, అతని పక్కన కూర్చున్నావిడ కొంచెం ఎడంగా జరిగి ఆమె కాళ్ళు పెట్టుకోడానికి సహకరిoచారు. తర్వాత ఆమె మొబైల్‌లో పెద్ద సౌండ్‌తో పాటలు వింటోంది. మధు బిక్క మొహంతో పక్కకి చూశాడు. పక్కనావిడ, ‘నా మాట విన్నావు కాదు’ అన్నట్టు అన్నట్టు కొరికి తినేసేలా కొరకొరా చూసింది. తల తిప్పి సుమ వంక చూసి ఓ వెర్రి నవ్వు నవ్వి తను కూడా మొబైల్ చూసుకుందావనుకున్నాడు. కానీ ఒళ్ళో పిల్లాడు ఉండటంతో కుదరక మళ్ళీ మొబైల్‌ని జేబులో పెట్టేశాడు.

మధు పక్కన కూర్చున్నావిడలో సహనం చచ్చిపోయి, “ఏవిటమ్మా ఇది, నీ కాళ్ళు ఇలా ఎదుటి బెర్త్ మీద బార్లా చాపితే ఎలా చెప్పు. నాకు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నీ కాళ్ళు కూడా తగులుతున్నాయి” చెప్పింది సూటిగా చూస్తూ.

దానికామె మొబైల్‌ని పక్కన పెట్టి, పెద్ద నోరెసుకుని, “ఏటమ్మా అలా విసుక్కుంటున్నావ్. నిన్న మా ఆయన్ని ఎగిరి కాలితో తన్నడంతో కాలు కొంచెం నొప్పి చేసి ఇలా చాపుకున్నాను. నీకు మానవత్వం లేదా, ఈ బాబుని చూసి నేర్చుకో. ఆ బాబుకి రెండు కాదు నాలుగు సార్లు నా కాళ్ళు తగిలాయి. అయినా ఏమీ అనలేదు. మా బుడ్డోడిని ఎత్తుకోమని ఇచ్చినప్పుడు, ఆ బాబు మీద ఒంటెలు పోసాడు. కానీ ఆ బాబు చిన్న నవ్వు నవ్వి రుమాలుతో తుడుచుకున్నాడు. నేను చూసుకోకుండా విసిరేసిన రెండు మూడు వేరుశెనక్కాయ్ తొక్కలు ఆ బాబు జేబులో పడ్డాయి, కానీ ఏవీ అనలేదు. అదీ మానవత్వం. అందరం దిగిపోతాo, ఈ కొద్ది సేపు సర్దుకోలేవా” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందావిడ.

దానికి, ఈవిడ కూడా కొంచెం కోపంగా, “అతనిది మానవత్వం కాదూ మట్టిగడ్డలూ కాదూ, అతనిది ‘సుమా’నవత్వం. అర్థం కాలేదా? నీ పక్కన కూర్చున్న అమ్మాయి పేరు సుమ. ఈ బాబూ, ఆమే కళ్ళు కళ్ళుతో పాటు మనసులు కూడా కలుపుకునేలా ఉన్నారు. ఈ విషయం నేను విశాఖ నుండీ గమనించాను. నువ్ అనకాపల్లిలో ఎక్కి, మొత్తం విషయం ఆగం ఆగం చేశావ్. ఆమె దృష్టిలో చెడ్డ అవ్వకూడదని ఇలా కామ్‌గా ఉంటున్నాడు, లేదంటే నీ పని ఖతమే. ఆ పిల్ల వచ్చే పిఠాపురంలో దిగాక, నిన్ను గోదాట్లోకి తోసేయకపోతే అడుగు” అందావిడ అసహనంగా.

దాంతో ఆమె, అప్పుడే వచ్చిన స్టేషన్ వంక చూసింది. అది పిఠాపురమే. ఆమె గుండెలో రాయి పడింది. అప్పుడే సుమ కూడా లేవడంతో, ఆమెకి భయంతో గుండె జారిపోయింది. దాంతో మధు వంక కాస్త భయం భయంగా చూస్తూ ఒక్కసారే చెరుగ్గడలా పైకి లేచి నించుంది. పరిస్థితి అర్థం చేసుకున్న మధు, “భయపడకండి, మరేం పర్లేదు కూర్చోండి. మీరు కూడా నాకు అక్కలాంటి వారే” చెప్పాడు చిరునవ్వుతో.

సుమ కూడా ఆమె వంక చూస్తూ, “నేను దిగడం లేదు, వాష్ రూమ్‌కి వెళ్ళివస్తాను” చెప్పడంతో ఆమె మనసు కుదుట పడింది. చీర చెంగుతో నుదుటన పట్టిన చెమట తుడుచుకుని, నిదానంగా కూర్చుంది. అప్పటి నుండి ఆమె మరి నోరు మెదపలేదు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here