శ్రీ మహా భారతంలో మంచి కథలు-4

0
4

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

9. పరశురాముని కథ!

తండ్రి మాట మేరకు తల్లిని సంహరించినవాడు, తండ్రి కోపానికి గురియైన అన్నదమ్ములకు శాపోప శమనాన్ని కలిగించినవాడు, తల్లి ప్రాణాన్ని తండ్రి నుండి వరంగా స్వీకరించినవాడు, భువిపై గర్వించిన క్షత్రియాధములపై ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించినవాడు, సామాన్యుడి కోపం యేస్థాయిదో చాటినవాడు, తాను ఎంతో సాధించినప్పటికి, అంతా తృణప్రాయంగా భావించి, విడిచిపెట్టి తపస్సుకై వెళ్ళిన త్యాగధనుడు, పరశురాముడు.

పూర్వం గాధి అనే రాజు కన్యాకుబ్జ పట్టణమును పాలించేవాడు. అతని కూతురు సత్యవతి. భృగు మహర్షి కుమారుడైన ఋచికుడు సత్యవతిని పెండ్లాడగోరి, గాధిని అర్థించాడు. గాధి అతనితో ఒక చెవి నల్లగా, శరీరమంతా తెల్లగా ఉన్న గుర్రాలను కన్యాశుల్కంగా తెచ్చివ్వు, అపుడు నా కూతురును నీకిచ్చి వివాహం చేస్తాను. ఇది మా సంప్రదాయం” అన్నాడు. ఋచీకుడు వరుణిడిని ప్రార్థించి, అలాంటి వెయ్యి గుర్రాలను పొంది గాధికిచ్చి సత్యవతిని పెండ్లాడినాడు. గంగానది నుండి గుర్రాలు ఉద్భవించాయి. కావున, అప్పటి నుండి కన్యాకుబ్జములో గంగానదికి అశ్వ తీర్థం అను పేరు వచ్చింది.

ఒకనాడు కన్యాకుబ్జనికి భృగుమహర్షి వచ్చాడు. కొడుకునూ, కోడలును చూచి సంతోషించాడు. కోడలి మంచితనానికి ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. “నాకు ఒక కొడుకును, నా తల్లికి ఒక కొడుకును వరంగా ప్రసాదించండి” అని కోరింది. “అట్టే జరుగుగాక! పరిశుభ్రంగా స్నానం చేసి నీవు మేడి చెట్టునూ, నీ తల్లి అశ్వత్థ వృక్షమును కౌగలించుకోండి” అని ఆనతిచ్చాడు. కాని వారు పొరపాటున తారుమారుగా ఆలింగనం చేసుకున్నారు. భృగు మహర్షి అపుడు, నీకు పూజ్యుడైన కొడుకు పుడతాడు. కాని అతడు దారుణ క్షత్రీయ ప్రవృత్తితో గర్వంతో ప్రవర్తిస్తాడు. ఇక నీ తల్లికి క్షత్రియుడిగా పుట్టినప్పటికీ తపస్వియై బ్రాహ్మణ భావం, జ్ఞానం, గొప్ప తేజస్సు నిష్ఠతో పొందుతాడు” అన్నాడు.

అపుడు సత్యవతి మామగారికి మ్రొక్కి క్షత్రియ భావం తన కొడుకుకు కాక, మనుమడికి కలిగేటట్లు వరం పొందింది. సత్యవతికి చతుర్వేద పారీణుడు, విలు విద్యా నేర్పరి, మహాత్ముడైన జమదగ్ని పుట్టాడు. అక్కడ ఆమె తల్లికి, విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని ప్రసేనజితు మహారాజుకు కూతురైన రేణుకను పెండ్లాడినాడు. అయిదుగురు కొడుకులను పొందాడు. అందులో ఒకడు పరశురాముడు. ఒకరోజు జమదగ్ని అడవిలో తీవ్రమైన తపస్సులో ఉన్నాడు. పుత్రలు పండ్లు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. వారివెంట రేణుక కూడా వెళ్ళింది. అక్కడ ఒక కొలనులో భార్యలతో జలకాలాడుతున్న చిత్రరథుడనే రాజును చూచింది. ఆమె మనస్సు చలించింది. దివ్యదృష్టితో మానసికమైన ఆమె చెడు నడవడిని కనిపెట్టిన జమదగ్ని ఆవేశపరుడై, తన నలుగురు కొడుకులను వరుసగా పిలిచి, తమ తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. వారు అది పాపమని ఆ పనికి పూనుకోలేదు.

‘తనయుల నలువురఁ గ్రమమునఁ
బనిచెన్‌ జమదగ్ని దనదు భార్య వధింపన్‌;
జననీఘాతము పాతక
మని వారలు పలుకకుండి రవ్యవసితులై’

దానికి జమదగ్ని కోపించి, “భయంకరమైన అడవిలో బుద్ధి, జ్ఞాన శూన్యులై జంతువులులా, పక్షులలా ఉండండి” అని శపించాడు. గండ్రగొడ్డలిని చేత బూనిన రాముడిని పిలిచి, “ఈ రేణుకను సంహరించు” మన్నాడు. రాముడు తక్షణమే తండ్రిమాట మేరకు తల్లిని సంహరించాడు.

పరశురాముడు ఇక్కడ తల్లికి నిజానికి మేలు చేసాడు. ఈ జన్మలో ఆమె పోయిన పాపపు పోకడకు ఆమెను చంపుట ద్వారా ఆమె పాపపు జన్మకు భరతగీతం పలికి, మరలా పునీతురాలైన క్రొత్త జన్మనెత్తడానికి తోడ్పడ్డాడు. ఒకవేళ ఆమెకు ఆ శిక్ష పడకపోతే ఆమె జీవితాంతం తప్పు చేసిన దానివలె మిగిలిపోయేది. శారీరక పాపమే కాదు మానసిక పాపమూ పాపమే కదా. కొన్ని విషయాలను ఆయా కాలాల ధర్మాధర్మాలను బట్టి తేల్చాల్సి ఉంటుంది.

రాముడి పితృవాక్య పరిపాలనకు, తెగువకు సంతోషించి కోపం తగ్గినవాడైన జమదగ్ని రాముడిని వరం కోరుకోమన్నాడు. “నా తల్లి తిరిగి బ్రతకాలి. నా మాతృహత్య దోషం పోవాలి. నా పాపం పోవాలి. నా సోదరులకు శాపవిమోచనం కావాలి. నాకు యుద్ధాలలో ఎదురులేని బలం కలగాలి. చిరకాలం జీవించాలి” అని కోరాడు. ఎంతటి సమయస్ఫూర్తితో కుటుంబంలో వచ్చిన పెనుతుఫానును, ఇట్టే విచారించి తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొనేలా చేసాడు. తండ్రి తన కుమారుడి మాతృ, భ్రాతృ, పితృ ప్రేమకు సంతోషించి అడిగిన వరాలిచ్చాడు.

కొంతకాలం గడిచింది. హైహయ వంశంలో అరివీర పరాక్రముడు, అమిత శౌర్యుడు, సహస్ర బాహుడనే ప్రసిద్ధుడైన కార్తవీర్యుడుండేవాడు. ఒకనాడు వేటాడి వేటాడి అలసి జమదగ్ని ఆశ్రమానికి ప్రవేశించాడు. జమదగ్ని మంచి ఆతిథ్యమిచ్చాడు. క్షత్రియ మదము తలకెక్కిన ఆ రాజు ఆశ్రమ వాసులను అనుమానించి ఆశ్రమ వృక్షాలను కూల్చి, హోమధేనువును లేగదూడతో సహా బంధించి తీసుకువెళ్ళాడు. దర్బలకై వెళ్ళిన రాముడు తిరిగి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. వెంటనే కార్తవీర్యుడిపై యుద్ధానికి వెళ్ళి అతడి వెయ్యి భుజాలను ఖండించి, అతడిని సంహరించాడు. అటుపై కార్తవీర్యుడి కొడుకులు పగబట్టి, రాముడు లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని చెల్లాచెదురు చేసి, అందరూ భీతిల్లేట్లుగా జమదగ్నిని సంహరించాడు. అది తెలుసుకున్న రాముడు క్షత్రియ జాతిని సంహరించెదనని శపధం చేసాడు. అన్నట్లుగానే 21 సార్లు దండెత్తి క్షత్రియులను సంహరించి, భూమండలం జయించాడు. శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని చేసి, ఋద్విజుడికి సమర్పించేటటువంటి సంభావనా ద్రవ్యంగా భూమండలాన్ని కశ్యపుడికి దానం చేసి తపస్సుకై మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు.

ఈ కథలో జమదగ్నికి గల క్షణికావేశం భార్యను చంపడానికి వెనుదీయలేదు. అదేవిధంగా కార్తవీర్యార్జునుని పుత్రుల కోపం ప్రపంచానికే అనర్థదాయకమైనది. కోపమును కోపంతో, పగను పగతో జయించలేము. అయితే పరశురాముడి కోపం ధర్మాగ్రహంలాగే కనబడుతుంది. పైగా ఆ కోపంతో సిరి సంపదలూ, రాజ్యాలు కోరుకోలేదు. సంపాదించింది దానంగా ఇచ్చినాడు. పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, దౌర్జన్యాన్ని సహించలేని ప్రవృత్తి, శౌర్య ప్రతాపాలు కలగలసిన మహనీయ వ్యక్తిత్వం పరశురాముడిది. ఆకృత ప్రణుడు ధర్మరాజుకు చెప్పినది. అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

10. శిబి చక్రవర్తి కథ!

పరోపకార్థం తమ శరీరాలను లోక కల్యాణానికై అర్పించి, “పరోపకార్యార్థ మిదం శరీరమ్” అన్న సూక్తికి ఉదాహరణగా నిలిచిన మహామహిమోన్నతుడు శిబిచక్రవర్తి. శిబిచక్రవర్తి సకల సద్గుణ సమున్నతుడు. ఇతడు పూర్వం భృగుతుంగ శిఖరంపై అనేక యజ్ఞయాగాలు చేశాడు. ఇతడి శీల సంపదలను దేవతలైన ఇంద్రాగ్నులు పరీక్షించదలిచారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్ని పావురం రూపాన్ని ధరించారు.

డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, పావురం రూపంలో నున్న అగ్నిని తరుముతూ శిబి అంతఃపురం ప్రవేశించాడు. డేగ వలన భీతితో పావురం పరుగెత్తుకొని వచ్చి శిబి చక్రవర్తిని శరణు వేడింది. డేగ పావురాన్ని వెంటాడుతూ వచ్చి శిబితో “అయ్యా! నీవు సత్య ధర్మా చరణ నిపుణుడివి. నేను మిక్కిలి ఆకలితో ఉన్నాను. నాకు ఆహార విఘ్నం చేయడం న్యాయమా” అన్నది.

శిబి “నేను పావురానికి శరణునిచ్చాను” అన్నాడు. దానికి డేగ “సకల ప్రాణులు ఆహారం మూలంగా బ్రతికి పెంపొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాని నాడు నా ప్రాణాలు నిలువవు. అట్లా జరిగితే నా సంతానం, నా భార్య బ్రతకలేరు. ఒక్క పావురాన్ని నీవు కాపాడి ఇన్ని ప్రాణాలను హింసించటం ధర్మ వ్యతిరేకం కాదా” అన్నది. మరలా డేగ

‘ధర్మజ్ఞు లైన పురుషులు
ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్‌
ధర్మముగా మదిఁ దలఁపరు;
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌’ (3-3-230)

“ధర్మ స్వరూపాన్నెరిగిన జ్ఞానులు ధర్మానికి ఏమాత్రం కీడు కలిగించే ధర్మాన్నైనా, ధర్మంగా మనస్సులో భావించరు. అచ్చమైన ధర్మం జగత్తుకంతటికి మేలు చేయాలి కదా” అంటూ,

“ధర్మ సూక్ష్మానికి విజీవనాడి విశ్వశ్రేయస్సు” అని సెలవిచ్చింది. “రెండు ధర్మాలు విప్రతిపన్నాలైతే పరమ ధర్మమేది?” అని ప్రశ్నించింది. “పావురమును కాపాడటం నీ ధర్మమైతే, నా ఆహారం సంగతేమిట”ని ప్రశ్నించింది. అంతేకాక “ఒక ధర్మానికి హాని కలిగించే యే ఇతర ధర్మమైనా పరమ ధర్మం కాబోదు” అని తేల్చి చెప్పింది. “కాబట్టి ఈ పావురం భగవంతుడిచ్చిన వేదవిహితమైన ఆహారం. డేగలు, పావురాలను భక్షిస్తాయి. కావున పావురమును వదిలివేయాలి” అని పలికింది.

శిబికి ఇంద్రాగ్నులు గొప్ప ధర్మ పరీక్షనే తెచ్చి పెట్టారు. ఇలాంటి ధర్మ విప్రతి పన్నాలు తేల్చడములో మహాభారతము మానవ జాతికి దిక్సూచి, కరదీపం కదా. మనదారి ఎంతటి క్లిష్టమైన చీకటిలోనున్నా మార్గదర్శనం చేయించగలదు. ఇంద్రాగ్నుల పరీక్ష నెదుర్కుంటూ శిబి,

‘ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధముఁ డయిన
విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని?
నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ’ (3-3-232)

“ప్రాణభయంతో పావురం నన్నాశ్రయించింది. ఆశ్రయించిన వారిని ఎట్టి నీచుడయినా విడువడు కదా. కావున శరణుకోరిన పావురాన్ని ఎలా విడువగలను. ఆశ్రితులను విడువడం ధర్మమవుతుందా చెప్పుము. పక్షి అయి కూడా ధర్మాన్ని తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు. శరణార్థిని విడవడం అధర్మం కాదా? నీకు ఆకలి తీరాలంటే ఈ అడవిలో ఇంతకంటే అధిక మాంసం కలిగిన జంతువులు ఎన్ని లేవు. ఈ పావురంపై కోపం మానుకో. వేరే ఆహారం చూసుకో. నేను దీనిని విడువను” అని ఖరాఖండీగా చెప్పాడు. అపుడు డేగ, “ఈ పావురం నాకు ప్రకృతి సిద్ధమైన ఆహారం. దీనిని రక్షించాలని నీవు అనుకుంటే, దీని బరువుతో సరిసమానమైన తూకం కల నీ శరీర మాంసం వెనుకాడక నాకీయుము. అపుడు నీ చిత్తశుద్ధి తెలియగలదు” అన్నది.

శిబి తన సమస్యకు పరిష్కారం లభించినట్లుగా భావించాడు. డేగ పలుకులతో శిబి సంతోషించి, “నీవు ఉత్తమ పక్షివి. దయతో నాకు మార్గం చూపావు” అని అంటూ, తత్క్షణమే తన శరీరంలోని మాంసం కోసి త్రాసులో వేయసాగాడు. అతడు ఎంతగా శరీరంలోని మాంసం కొని త్రాసులో పెడుతున్నా, ఆ తులాభారంలో పావురం ఉన్న భాగమే క్రిందికి దిగుతున్నది. ఎంతకీ పావురం బరువుకు, తన శరీర మాంసం తూగక పోవడంతో తానే త్రాసులోకి ఎక్కి కూర్చున్నాడు.

అతడి ఆత్మార్పణ పూర్వకమైన త్యాగానికి, ఆర్తత్రాణ పరాయణ గుణానికి ధర్మాచరణ నిష్ఠకు ఇంద్రాగ్నులు సంతోషించారు. ప్రత్యక్షమయ్యారు.

“మహానుభావా! నీ త్యాగ, ధైర్య, శౌర్యాలు అనుపమానాలు. నీ కీర్తి అక్షయమై లోకోత్తరమై నిలుస్తుంది” అని దీవించి, వీడుకోలు పలికి వెళ్ళిపోయారు.

శిబిలాంటివారు ఉండబట్టే ఈ దేశానికి ధర్మభూమి, పుణ్యభూమి అని పేరు కలిగినది. త్యాగానికి, భూతదయకు నిలువెత్తు దర్పణమై నిలిచిన శిబి కథ ప్రపంచ మానవాళికి మానవతా సందేశాన్నిస్తుంది.

ఒక ధర్మానికి హాని కలిగించే ధర్మం అభాస ధర్మమే కాని పరమ ధర్మం కాలేదని తెలిపే ఈ కథ అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

రోమశుడు ధర్మరాజుకు చెప్పినది.

  • This body is for doing good to others.
  • When wisdom came to me, I resolved to defend the weak, and to all living things I gave compassion of my heart. – Lord Buddha.

11. అష్టావక్రుడి చరిత్ర!

జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు.

పూర్వం ఏకపాదుడనే ముని ఉండేవాడు. అతడి భార్య పేరు సుజాత. ఆవిడ గర్భవతి. మహావిద్వాంసుడైన ఏకపాదుడు తన శిష్యులకు నిరంతరం వేదాధ్యయనం చేయిస్తుండేవాడు. ఒకనాడు గర్భస్థ శిశువు తన తండ్రితో “నీ శిష్యులు పగలనక, రేయనక ఎడతెరిపి లేకుండా విద్యాభ్యాసం చేస్తూ, నిద్రలేమి చేత, మందబుద్ధులవుతూ, వేద పాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఇలా తప్పులు చదివించడమెందుకు?” అని నిందించాడు. దానికి తండ్రి కోపించాడు. “నీవు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు. కావును అష్టావక్రుడవై పుట్టుము” అని శపించాడు. ఇంతలో సుజాతకు నెలలు నిండాయి. ఆమె ప్రసవ భారాన్ని తలుచుకొని భయపడి భర్తతో, “భూమిపై నున్న మిక్కిలి పేదవారు కూడా పురిటి సమయానికి ముందే నూనె, నేయి, తిండి గింజలు తెచ్చి పెట్టుకుంటారు. మరి మనం పేదవారం కాబట్టి మనకు అవి సులభంగా దొరకవు కదా” అన్నది.

దానితో ఏకపాదుడు ధనం సంపాదించాలని నిశ్చయించుకొని జనకుడి ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ జనకుడి ఆస్థానంలో వరుణిడి కుమారుడైన వందితో వాదానికి పరాజయం పొందాడు. నీటిలో మునిగియుండే శిక్షను పొందాడు. అదే సమయంలో ఇక్కడ సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అదే సమయాన ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని సంప్రదించింది. మేనమామ మేనళ్లుళ్ళైన శ్వేతకేతుడు, అష్టావక్రుడు సమ వయస్కులై ఉద్దాలకుడి వద్ద పన్నెండేళ్ళు వేదవిద్యలు నేర్చుకున్నారు.

ఒకనాడు అష్టావక్రుడు, ఉద్దాలకుడి తొడపై ఎక్కి ఆడుకుంటున్నాడు. శ్వేతకేతుడు అది చూచి, “నీవు మీ నాన్న తొడపై ఎక్కి ఆడుకో. మా నాన్న తొడపై ఎందుకు ఎక్కావు” అన్నాడు. దానితో అతడు ఏడుస్తూ, తల్లి దగ్గరికి వెళ్ళి, “మా తండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్ళారు?” అని అడిగారు. తల్లి జరిగినది చెప్పింది. అష్టావక్రుడు వెంటనే శ్వేతకేతుడిని వెంట బెట్టుకొని జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు.

అక్కడ ద్వార పాలకులు ఈ పిల్లలను లోనికి రానీయలేదు. “మేము బ్రాహ్మణులము. మమ్మల్ని అడ్డగిస్తారెందుకు?” అన్నారు. మరలా “ఈ వాకిలి గుండా మూగ, చెవిటివారు, స్త్రీలు కూడా లోనికి వెళ్ళమన్నారు కదా” అన్నారు. దానికి వారు “వృద్ధులైన విద్వాంసులు, అనుభవజ్ఞులైన ఋత్వికులు ఈ యజ్ఞ వాటికలో ప్రవేశానికి అర్హులు. మీరు బాలురుమీకు అర్హత లేదు” అన్నారు. అపుడు వారు

“అలయక యేండ్లు గడుం బె
క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ
ద్ధుల లక్షణమే? జ్ఞానము
గలఁ డేనిన్‌ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్‌” (3-3-248)

చాలా సంవత్సరాలు ఓర్పుతో బ్రతకటం, వెండ్రుకలు తెల్లబడటం, ముసలివారికి చిహ్నాలా? జ్ఞానం కలవాడైతే బాలుడైనా పెద్దగానే భూమిపై భాసిల్లుతాడు. చక్కగా చదువుకొని, ఆ చదువును తన నిత్య జీవితంలో ప్రతిఫలించేటట్లు తన ప్రవర్తనను తీర్చి దిద్దుకునేవాడు, వయసులో చిన్నవాడైనా ప్రజల చేత మన్నన పొందగలడు. కావున చిన్న వారమని అనుమానించవద్దు. జనక మహారాజు సభలో గర్వముతో విర్రవీగుతున్న వేదవాదులతో సిద్ధాంత రాద్ధాంతాలు చేయడానికి వచ్చాము” అన్నారు.

ఆపై వారు ఆహ్వానం పొందారు. ఆపై అష్టావక్రులు అక్కడ పండితులను, వందిని వాదనలో ఓడించి, బంధితుడైన తండ్రిని విడిపించాడు. రాజుగారి, పండితుల గౌరవాదరాలు పొంది, శ్వేతకేతుడితో ఆశ్రమానికి తిరిగి వచ్చారు.

జ్ఞానం దీపం వంటిది. అది చిన్న గాజుకుప్పెలో నున్నా పెద్దగాజు కుప్పెలో నున్నా ఇచ్చే వెలుగు సమానమే. తండ్రి కోపించినా, తండ్రి కష్టాన్ని, కుటుంబ కష్టాన్ని తన విద్యా పాండిత్యాదులతో తీర్చి, తండ్రి ఋణాన్ని తీర్చుకున్న ఉత్తమపుత్రుడు అష్టావక్రుడు.

ఆధునిక కాలానికి ఈ కథను అన్వయిస్తే, కొడుకులు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే తండ్రి కష్టాలు తీరుతాయని చెప్పుకోవచ్చు. మరియు ఈ కథ జ్ఞానానికి, వయసుకు సంబంధం లేదని తేల్చి చెప్పినది.

రామాయణంలో పిడకల వేట. ఆ కాలంలో కూతురుతో పాటు తల్లి కూడా పిల్లల్ని కనేదని తెలుస్తున్నది. ఈ జాడ్యం మనం మొన్నమొన్నటి వరకు చూస్తూనే వచ్చాము. ప్రస్తుత కాలంలో కనిపించడం లేదు. శుభ పరిణామం.

అరణ్య పర్వము తృతీయాశ్వాసం లోనిది.

రోమశుడు ధర్మరాజుకు చెప్పినది.

బాలాదపి సుభాషితం – A well spoken word should be received even from youth.

యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి శుకాదపి

A reasonable word should be received even from a child or a parrot.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here