తెలుగు రామాయణానికి కీర్తి కిరీటమీ పద్యం

1
3

[మొల్ల రామాయణంలోని ‘కదలకుమీ ధరాతలమ’ అనే పద్యాన్ని విశ్లేషిస్తున్నారు శ్రీ వేదాల గీతాచార్య.]

కదలకుమీ ధరాతలమ, కాశ్యపి బట్టు ఫణీంద్ర, భూవిషా
స్పదులను బట్టు కూర్మమ, రసాతల, భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్.

[dropcap]చి[/dropcap]న్నతనంలో ఎప్పుడో మా స్కూల్ సీనియర్లకు మా తెలుగు టీచర్ చెప్తుంటే బాగా విని (నన్నప్పుడు క్సాస్ బైట నించోబెట్టారు హోమ్వర్క్ చేయలేదని. అబ్బో అదో పెద్ద స్టోరీ) గుర్తుపెట్టుకున్న పద్యమిది.

దురదృష్టవశాత్తు మా బ్యాచ్ వచ్చేసరికి సిలబస్ మారిపోయింది. కానీ ఇదే పద్యాన్ని మా నాన్న తన దగ్గర ట్యూషన్‌కు వచ్చిన వారికి చెప్పినప్పుడు విన్నాను. ఆ వివరణ కూడా భలే చెప్పటం గుర్తుంది. ఆ పద్యంలో సొగసు, పదాలను ప్రయోగించిన తీరు, పదాల ఎంపిక, అక్షరాల పలుకుబడి వల్ల వచ్చే వైబ్రేషన్.. మొల్ల సామాన్య కవయిత్రి కాదు అనిపించింది. కాలం గడిచింది.

హఠాత్తుగా ఏదో వివరం కోసం సంచిక చూస్తుంటే మొల్ల గురించి “రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల” అని పుట్టి నాగలక్ష్మి గారు రచించిన వ్యాసం నా కంటపడింది. అది చదివాక నేను కాస్త nostalgic trip లోకి వెళ్ళిపోయాను. ఆ ఆలోచనలలో వచ్చిన భావాలే ఈ క్రింది వివరణ.

ఈ చంపకమాలా వృత్తం గుర్తొచ్చింది. ఎంత సొగసైన పద్యం. ఎంత గడుసైన పద్యం!

ఎంత భక్తిపూర్వక పద్యం!

కాదు కాదు. రామాయణానికే తలమానికమీ పద్యం.

One of the greatest foreshadowings we have seen in literature.

కేవలం రాముడు విల్లు ఎక్కు పెడుతుంటే ఆ సందర్భాన్ని వర్ణించటానికి చమత్కారంగా రాసిన పద్యం కాదు. రామాయణాన్ని కాచి వడబోసిన ఒక మహాభక్తురాలు, కవయిత్రి, storyteller సృజించిన masterpiece. వాల్మీకి తరువాత రామాయణ రచనలో ధ్వనిని అంత బాగా వాడిన పద్యమిది.

చంపకమాలా వృత్తం.

కదలకుమీ ధరాతలమా

ధరాతలమా కదలకు అని చెప్పటం కాదు. సీతమ్మను అమ్మా! నువ్వు కదలకు. రాముని చూడు. ఆయన వీరత్వాన్ని చూడు. ఆయన శక్తిని చూడు. కళ్ళు తెరచి మరీ చూడు అని చెప్తోంది. ఆయన మీద అనుమానాలు వద్దు.

ఎందుకు? అక్కడ కళ్యాణం ముందు ఘట్టం. ఒక రొమాంటిక్ ఊహ. హాయిగా ఆయన్ని చూడు. నీవాడే అని చెప్పటం. అందుకే హాయిగా ఆ స్మితపూర్వ భాషి అయిన రాముడిని చూడు అనే ప్రేమ పూర్వక హెచ్చరిక.

అంతేనా?

అరణ్యవాసంలో ఆయన గురించి నీకు భయం కలుగ కూడదు. ఆయన శక్తిని శంకించకు. కదలకు. అక్కడే ఆగు. గీత దాటకు. పర్ణశాల నుంచీ బైటకు రాకు అని ముందే చెప్తున్న ఘట్టం కూడా. ఆ విల్లునెక్కుపెట్టే తీరులోనే ఆయన శౌర్యం కనబడుతుంది. కళ్ళప్పగించి మరీ చూడమ్మా! అని బ్రతిమాలటం కూడా.

కాశ్యపిబట్టు ఫణీంద్ర

ఓ ఫణీంద్రా! కాశ్యపిని పట్టి నిలుపు! అని ఆదిశేషుడికి చమత్కారంగా చెప్పటమే కాదు.

ఓ లక్ష్మణా! భవిష్యత్‌లో సీతమ్మ కదులుతుంది పర్ణశాల నుంచి. హెచ్చరికగా జాగరూకుడవై ఉండు. స్వామి పరాక్రమాన్ని ముందే నీవు కూడా చెప్పు. అమ్మకు రక్షణగా ఉండు. అనంతుడవు గాన అన్ని వైపులనుండీ కాచుకుని కాపాడు. రావణుని కంట పడకుండా చూడు అని చెప్పటం కూడా.

భూవిషాస్పదులను బట్టు కూర్మమ

ఇక్కడ పైకి విషయం విదతమే. ఓ కూర్మమా! భూమిని, విషాస్పదుడైన శేషుడిన్ కూడా నువ్వు గట్టిగా పట్టుకుని కదలకుండా వైబ్రేట్ కాకుండా చూడు.

కాదు కాదు. కూర్మావతారమెత్తి మంధర పర్వతాన్ని నిలబెట్టి క్షీరసాగర మథనం సక్రమంగా జరిగేలా చేసిన కూర్మావతార రూపుడైన శ్రీమహావిష్ణువు శ్రీరాముని రూపంలో వచ్చాడు. ఆయన్నే, స్వయంగా ఆయన్నే హెచ్చరిస్తున్నది.

స్వామీ! నీవు పరిపూర్ణుడవు. నీవు మాత్రమే చేయవలసినదిది. సీతమ్మ భయవిహ్వల కూకుండా, లక్ష్మణుడు కూడా పట్టుతప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే సుమా! అని.

ఆయన మాత్రం అవతార పరమార్థం నెరవేర్చటానికే అని నవ్వి ఊరుకున్నాడు.

ఆ పైన మొల్ల ఆగకుండా..

రసాతల, భోగి ఢులీ కులీశులన్ వదలక పట్టు ఘృష్టి, ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్ బొదువుచు బట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కెడిన్

అంటూ ఎక్కడెక్కడినుంచి దేవతాశక్తులను మేల్కొలుపుతూ, హెచ్చరిక చేస్తూ రావణుడు సీతమ్మను తీసుకుని వెళ్ళేది ఖాయం అని ఆయనే చెప్పాడు కనుక, మీరంతా వివిధరూపాలలో చేరి, ఆ వానరులుగా స్వామి వారికి సాయం చేయటానికి రండి. సిద్ధంగా ఉండండి. ఎక్కువ కాలం లేదు.

అని చెప్పింది మొల్ల.

అంటే రామాయణంలో ప్రధానమైన విషయాన్ని మొత్తాన్నీ ఒక పద్యంలో ఇమడ్చటమే కాక స్వయంగా స్వామి చేతనే, రావణ సంహారం గురించి కూడా అభయమిప్పించిందీ విదుషీమణి మొల్ల. ఎక్కడికక్కడ ఈకారాన్ని వాడుతూ శక్తి బీజాన్ని యాక్టివేట్ చేస్తోంది కూడా.

ఈ విషయంలోకి ఘృష్టి రూపాన వరాహ స్వామిని కూడా లాక్కువచ్చింది. భూ తనయను రావణుడెత్తుకుపోతాడు. కాచుకోవయ్యా భూరక్షకా! అని అప్పటికే భూమిని ఉద్ధరించిన వరాహ స్వామిని కూడా వదలలేదు.

భూవరుడీఈశుని చాప మెక్కెడిన్

శివుని విల్లుని ఎత్తటంలోనే ఆయన భక్తుడైన రావణుని మీద గురి. ఆ చాపాన్ని విరిచినట్లుగానే రావణ గర్వాన్ని, అతని అధర్మ వంశాన్ని కూడా విరిచేయటం కూడా చెప్పింది.

కాశ్యపి అనే ప్రయోగంతో శ్రీరామాయణంలో మహర్షుల ప్రాధాన్యం ఎంత ఉన్నదో తెలిపింది.

కేవలం 84 అక్షరాలలో.

మొల్ల తపస్వి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here