శతాబ్దంన్నర కాలపు తెలుగు సాహిత్య వైభవాల చరిత్ర, ఒక సింహావలోకనం – ‘సబ్బని సాహిత్య వ్యాసములు’

0
3

[డా. సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన ‘సబ్బని సాహిత్య వ్యాసములు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ సంకేపల్లి నాగేంద్రశర్మ.]

[dropcap]గ[/dropcap]త నాలుగున్నర దశాబ్దాల నుండి నిరంతరం సాహిత్య, రచనా వ్యాసంగాలతో మమేకమయ్యే కరీంనగర్ సుప్రసిద్ధ సాహితీవేత్త డా. సబ్బని లక్ష్మీనారాయణ గారు ఇటీవల రాసిన ‘సబ్బని సాహిత్య వ్యాసములు’ చదివితే పాఠకుడికి 24 వ్యాసాలతో పాటుగా, సుమారుగా నూటా డెబ్బయి సంవత్సరాల నుండి నేటి వరకు సాగిన సాహిత్య ఉత్తాన వైభవాలు, పరిణామక్రమం, అనుశీలనతలు తెలిసి వస్తాయి. సాహిత్య జీవులకు ఈ వ్యాస సంకలనం ఒక పసందైన విందు భోజనం లాంటిది. సుమారు నలబై వరకు వివిధ ప్రక్రియల్లో పుస్తకాలు రాసి, పలు సత్కారాలు, పురస్కారాలు అందుకొన్న డా. సబ్బని వారు రాసిన ఈ పుస్తకం చదివితే, సుప్రసిద్ధులైన రచయితల పుస్తకాలు ఆసాంతం చదివినట్లుగా అనుభూతికి లోనవుతాము. ఆధునిక సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వచ్చిన రచనలు, రాసిన రచయితల భిన్న శైలీ మాధుర్యాలు, ఆ నాటి నుండి నేటి వరకు సాగిన, సాగుతున్న సాహిత్య వైభవాలు 175 పేజీల్లో 24 వ్యాసాల ద్వారా మనకు అవగతమవుతాయి. తన సృజనాత్మక సాహిత్య అనుభవాన్ని రంగరించి, ప్రామాణికంగా ఈ వ్యాసాలను రాశారని చెప్పవచ్చును. పోటీ పరీక్షలు రాసే వారికి, కొత్త తరం, పాత తరం సాహిత్య జీవులకు ఒక శక్తివంతమైన టానిక్ లాగా ఈ వ్యాస సంకలనం ఉపయోగ పడుతుంది.

ఈ వ్యాసాలు లోతైన అధ్యయనం, తులనాత్మకత, సమగ్ర విశ్లేషణలతో కనిపిస్తాయి. వ్యాస సంకలన రచయిత సబ్బని వారు కష్టపడి పరిశోధించి, సకారాత్మకంగా మలిచారు. ఇందులోని వ్యాసాలు సమీక్షాపరమైన విమర్శనంగా ఉన్నాయని చెప్పవచ్చును. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ భేదాలు చూపక, కేవలం వారి వారి సాహిత్య ప్రతిభలు, అనుభవాలు, సామాజిక సంస్కరణోద్యమాల సేవలను వివరిస్తూ, విశ్లేషిస్తూ స్థూలంగా రాశారు. ఇందులోని చాలా వరకు వ్యాసాలను ‘నేటి నిజం’ పత్రికలో రావడంతో, ఆ పత్రిక సంపాదకులు, సీనియర్ సెలబ్రేటి బైస దేవదాస్ గారికి ఆత్మీయంగా అంకితం ఇచ్చారు. షష్టిపూర్తి తర్వాత డా. సబ్బని వారు ఈ వ్యాసాల గుచ్ఛాన్ని ప్రచురించారు. గత దశాబ్దిన్నర కాలం నాటి నుండి వివిధ పత్రికల్లో ఈ వ్యాసాలు అచ్చయ్యాయి. చక్కని ముఖచిత్రంతో ఈ వ్యాస సంపుటిని కస్తూరి విజయం వారు ప్రచురించారు. ISBN కలిగి, E-Book మరియు ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్‌గా వారు దీనికి తగిన అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడంతో ఈ వ్యాస సంపుటి పుస్తకం అంతర్జాతీయంగా పాఠకులు పొందడానికి అందుబాటులో ఉంది. 24 వ్యాసాలలో 18 మంది రచయితలు కీర్తిశేషులు కాగా, మిగతా ఆరుగురు సజీవులు. కందుకూరి, గురజాడ, గిడుగు రామమూర్తి పంతులు, కవిసమ్రాట్ విశ్వనాథ, కవిచక్రవర్తి గుర్రం జాషువా, మహాకవి శ్రీశ్రీ, దేవరకొండ బాల గంగాధర తిలక్, కుందుర్తి ఆంజనేయులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఆవంత్స సోమసుందర్, దాశరథి కృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, డా.సినారె, నవలా రచయిత వడ్డెర చండీదాస్, ద్వా. నా. శాస్త్రి గారి తొలి దళితకవి కుసుమ ధర్మన్న, అక్షర శిల్పి అలిశెట్టి ప్రభాకర్, తదితరులతో పాటుగా, సజీవులైన డా. కె. శివారెడ్డి గారి ‘మోహనా ఓ మోహనా’ కవిత్వం, ఆచార్య గోపీ రాసిన ‘జలగీతం’ దీర్ఘకవిత, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి రాసిన ‘పొలి’ వ్యవసాయక దీర్ఘకావ్యం, బి. ఎస్. రాములు రాసిన విశిష్ట నవల, ‘బతుకు పోరు’, కరీంనగర్‌లో అదనపు కలెక్టర్‌గా పనిచేసి వెళ్ళిన డా. ఏనుగు నరసింహారెడ్డి గారి ‘తెలంగాణ రుబాయిలు’, రాయలసీమకు చెందిన డా. రాధేయ గారి ‘మగ్గం బతుకు’ దీర్ఘకవిత్వం లపై వ్యాసాలున్నాయి.

కొస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణా రచయితల వ్యాసాలు ఇందులో చోటు చేసుకొన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల వారి సాహిత్య రీతులను, ప్రతిభా పాటవాలను సానపెట్టి, వీరి రచనల్లోని సాహిత్యాంశాలను వడగట్టి, నాడీ పట్టిన ధన్వంతరి వైద్యునిగా ఈ వ్యాసాల గుచ్ఛాన్ని సబ్బని వారు మనకు అందించారు. ఆధునిక తెలుగు సాహిత్య వైభవాలు, మార్పులు, సమకాలీనతలను మనం అర్థం చేసుకోవచ్చును. అయినప్పటికినీ ఇందులో తెలంగాణా ప్రాంత సాహిత్యంపై కోస్తాంధ్రులు దృష్టి సారించి రాసిన వ్యాసాలను సబ్బని వారు ఎంచుకొని చేర్చడంతో, తెలంగాణా ప్రాంతంపై అక్కడి కవుల సకారాత్మక దృక్పథం ఉందని మనకు అర్థవంతంగా తెలిసి వస్తుంది. అంతేకాక తెలంగాణా మలి ఉద్యమ కాలంలో సబ్బని వారు తెలంగాణా ఉద్యమ ప్రేమతో పలువురిపై సాహిత్య వ్యాసాలు రాశారు. అంతేకాక సజీవులైన సాహితీవేత్తల వ్యాసాలను తీసుకొని, వ్యాస సంకలనానికి నిండుదనం చేకూర్చారు. కొన్ని వ్యాసాలు పుస్తకం కోసం అదనంగా చేర్చి, సాహితీ విలువలను పెంచాలన్న దృక్పథానికి ఈ పుస్తకానికి తుది రూపు నిచ్చారు.

ప్రముఖ సాహితీ వేత్త, పరిశోధకులైన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు మున్నుడి రాస్తూ, తెలుగు వారి సాహిత్య సమైక్యతను చాటే వ్యాసాలుగా, సహృదయ సాహిత్యంగా అభివర్ణించారు. సబ్బని వారి బహు భాషా పాండిత్యం వీరి వ్యాసాలలో మనం చూస్తామని, సాహిత్యాన్ని ప్రేమించే వ్యాసాల పుస్తకమిదని కితాబు నిచ్చారు. అధునిక సాహిత్యాన్ని, దశలను, కాలానుగుణ మార్పులను మనం సాలోచనగా ఈ వ్యాసాలలో చూడవచ్చును. వచన కవిత్వంలోని భాగాలైన దీర్ఘకవిత్వం, మినీకవిత్వంతో పాటుగా కథలు, నవలలు, నాటకాలు ఇందులో చర్చకు వచ్చాయి. ఆయా కవుల భావజాలాలు అర్థమవుతాయి.

రచయిత సబ్బని వారు తన అంతరంగాన్ని వెల్లడిస్తూ, ఈ రచన తేవడానికి గత ఏడాది నుండి ప్రయత్నం చేస్తున్నట్లుగా, గతంలోనే వివిధ పత్రికల్లో ప్రచురణకు నోచుకొన్న ఈ వ్యాసాలతో పాటుగా, కరీంనగర్ ప్రాంతీయతపై విశ్వనాథ రాసిన ‘మ్రోయు తుమ్మెద’ నవల సమీక్షా వ్యాసాన్ని అదనంగా చేర్చినట్లుగా పేర్కొన్నారు. సొంత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డా.సినారె గారి ‘విశ్వంభర’ పై వ్యాసం ఇందులో ఉంది. కుందుర్తి గారి ‘తెలంగాణ’ కావ్యం డా. నందిని సిద్దారెడ్డి గానం చేయగా, యూ-ట్యూబ్ లో చూసి, ఆ కవిత్వాన్ని విని రాసుకొని, వ్యాసాన్ని రాసినట్లుగా తన అనుభవాల్ని రాసుకొన్నారు. విజయనగరం, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు సాహిత్య యాత్రలు చేసి, ఈ వ్యాసాలను రాసినట్లుగా చెప్పుకొన్నారు. ఈ వ్యాసాలు రాసిన సందర్భ నేపథ్యాలను చక్కగా నివేదించారు.

గురజాడ, కందుకూరి, గిడుగు, కాళ్ళకూరి, విశ్వనాథ వారు చేసిన రచనలతో పాటు, వ్యవహారిక భాషోద్యమ కృషి, సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టిన రాసిన వ్యాసాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాగే కుందుర్తి, ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్ తదితరులు తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాలను దృష్టిలో పెట్టుకొని రాసిన కావ్యాల సమీక్షల వ్యాసాలు చదివితే, కోస్తాంధ్రులు తెలంగాణా అంశాలపై రచనా వ్యాసంగాలను చేసి అలరించారని స్పష్టమవుతుంది. శ్రీశ్రీ, ద్వా. నా. శాస్త్రిలు, జాషువాలు రాసిన రచనలపై వ్యాసాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జ్ఞానపీఠ పురస్కారాలు తెలుగు సాహిత్యంలో పొందిన వారు ముగ్గురైతే, ఇందులో విశ్వనాథ, డా. సినారెల వ్యాసాలు చోటు చేసుకోవడం గమనార్హం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కోసం పోటీలో ఉన్న ఒకరిద్దరి రచనలు ఇందులో చోటు చేసుకొన్నాయి. వాసిలో రాశిలో ప్రసిద్ధులైన వారి రచనలు ఇందులో కానవస్తాయి. మొత్తంగా తెలుగు సాహిత్యాధ్యయనానికి ఈ వ్యాసాలు చేయూతను, తోడ్పాటును ఇస్తాయని చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు.

ఇహ వీరి వ్యాసాల లోకి వెడితే, తొలి వ్యాసం ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్త గురజాడ. గురజాడ 150వ జయంతిని పురస్కరించుకొని 2008లో రాశారు. నేను కూడా ఈ రచయిత సబ్బని వారితో విజయనగరం వెళ్ళి, గురజాడ 150వ జయంతి మహాసభల్లో పాల్గొన్నాను. ఏడు పేజీల్లో ఈ వ్యాసం ఉంది. గురజాడ రచనలు, వ్యవహారిక భాషోద్యమానికి, ప్రజా ఉద్యమానికి, సంఘ సంస్కరణలకు ఉపయోగ పడ్దాయి. తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ్య తర్వాత, వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గురజాడ మహనీయుడు. ఆదికవి నన్నయ్య 10వ శతాబ్దం నాటి అప్పటి సంస్కృతం కాదని, మహాభారతాన్ని తలుగులోకి అనువాదానికి శ్రీకారం చుట్టాడు. ఇవి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో పెద్ద మలుపులు. కావ్య, గ్రాంథిక భాషకు గురజాడ స్వస్తిపలికి, వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు వారితో కలిసి కృషి చేశారు. 1862-1915 మధ్య కేవలం 53 ఏండ్లు జీవించిన గురజాడ తొలిగా ‘దిద్దుబాటు’ అనే కథను వ్యవహారిక భాషలో రాసి, తొలి కథా రచయిత గా 1910లో రాసి చరిత్ర పుటల్లో నిలిచి పోయారు. పలు కథలు రాశారు. ఆంగ్లంలో కూడా రచనలు చేశారు. బాల్యంలో గిడుగు వారితో కలిసి చదువుకొన్న గురజాడ వారు జీవితాంతం వారితో సఖ్యతగా ఉంటూనే వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేశారు. గురజాడ, గిడుగు, ఏట్స్, శ్రీవివాస అయ్యంగార్లను దుష్ట చతుష్టయంగా గ్రాంథిక భాషావాదులు చిత్రించారు. అయినా గురజాడ తన పంథాను మార్చుకోలేదు. గురజాడ తన అసమ్మతి పత్రంలో వ్యవహారిక భాషోద్యమాన్ని సమర్థిస్తూ తన ఆకాంక్షను వెల్లడించారు. కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి రచనలు చేసి, ఆ నాటి సమాజంలోని కుళ్ళును కడిగారు. అందుకే గురజాడ ఒక అడుగుజాడగా ఆధునిక భాషా సాహిత్యాలకు ఒక యుగకర్తగా, ఒక వైతాళికుడిగా నిలిచిపోయారు. కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, పాటలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మానవ సమాజంపై మహత్తర బాధ్యతగా రచనావ్యాసంగాలు చేసి, గురజాడ ప్రజా, వ్యావహారిక భాషోద్యమకారుడిగా సాహితీ చరిత్రలో నిలిచిపోయారు.

ఇహ రెండవ వ్యాసం, తొలి తెలుగు నవల కందుకూరి వారి రాజశేఖర చరిత్రం. తొలి తెలుగు నవలగా చెప్పబడుతున్న రాజశేఖర చరిత్రం కథ, ఈ రచన చేయడానికి కందుకూరి వారికి ఉన్న పూర్వాపరాలను రచయిత సబ్బని వారు ఏడు పేజీలలో కూలంకషంగా చర్చించారు. 1880లో ఈ నవల రాయబడింది. ఇందులో కథానాయకుడు రాజశేఖరమే. బ్రిటిష్ ఆంగ్లరచయిత అలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ నవలకు కొంత అనుకరణ ఉన్నట్లుగా ఒక వాదం ఉన్నా, ఈ అంశంపై కందుకూరు వారు సరైన వివరణ ఇచ్చారు. కొంత ఆ నవల సాయం పొందినా, దానికి, దీనికి విశేశ సంబంధం ఉండదు. ఆనాటి తెలుగు సమాజపు పోకడలను చిత్రిస్తూ, ఆనాటి వ్యవహారిక గ్రాంథిక భాషలోనే కందుకూరి వారు రాశారని రచయిత సబ్బని వారు చెబుతారు. స్మిత్ రాసిన ఇంగ్లీష్ నవల 32 చాప్టర్లలో, 300 పేజీలలో 1761-62 లలో రాయబడింది. సుమారు వంద సంవత్సరాలు దాటాక కందుకూరు వారు ఈ ఆంగ్ల నవల సాయం తీసుకొన్నారు. కొరుకుడు పడని గ్రాంథిక భాషలో ఈ నవల సాగినా, ఆనాటి కాలానికి ఈ భాష వ్యవహారికమేనని రచయిత అంటాడు. ఈ అంశాన్ని ముందు మాటలో ఆచార్య దార్ల ప్రస్తావిస్తూ, కందుకూరి వారి నవల సారాంశాన్ని పూర్తిగా సబ్బని వారు వివరిస్తూ విడమరిచి రాయడం గొప్ప పనేనని కితాబు నిచ్చాడు. ఈ నవల 15 ప్రకరణాలు, 215 పేజీలలో ప్యాకెట్ సైజ్‌లో ముద్రితమైంది. ఈ తెలుగు నవల ఆంగ్లంతో పాటు, ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమైంది. విశేష పాఠకాదరణకు నోచుకొని, పలు ముద్రణలు పొందింది. రాజమండ్రి, ధవళగిరి పరిసరాలు, దేవాలయ వర్ణనలు, ప్రకృతి, పరిసరాలు, పాత్రల వర్ణనలు కళ్ళకు కట్టినట్లు రచయిత చూపెట్టారు. ఆనాటి సమాజంలోని మూఢనమ్మకాలను, దురాచారాలను వెళ్ళగక్కారు. ఈ నవల కందుకూరి వారి వివేకవర్థిని పత్రికలో సీరియల్‌గా వచ్చింది. తెలుగు స్వతంత్రమైన నవలగానే భావించవచ్చు. ఈ నవలను గ్రంథకర్త కందుకూరి వీరేశలింగం గారు తెలుగు భాషకు ఇతోధికంగా కృషి చేసిన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ విద్యాధికారి కల్నల్ రాబర్డ్ మెకన్జీకి అంకితం ఇచ్చారు.

వ్యవహారిక భాషోద్యమకారులు, గిడుగు రామమూర్తి పంతులు వ్యాసం చదువుతుంటే, నేటి ఆధునిక యుగంలో కూడా మాతృభాషగా తెలుగు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మనం గమనించవచ్చును. ఆంగ్ల మీడియం వ్యామోహంలో పడి పాలకులు మాతృభాషకు జరుపుతున్న అన్యాయాలపై ఒక సమీక్ష వ్యాసంగా ఈ వ్యాసాన్ని ఉదహరించవచ్చును. ఆ కాలంలో గ్రాంథిక, వ్యవహారిక భాషోద్యమాల పంచాయితీలుంటే, ఈ కాలంలో అసలికే మోసం జరుగుతుందన్న వాదనలను మనం కొట్టిపారేయలేం. తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కందుకూరు, గురజాడ, గిడుగు వార్లు చేసిన కృషి అనన్య సామాన్యం. కందుకూరు వారు సంఘ సంస్కరణం, గురజాడ వారు ఆధునిక సాహిత్యం, గిడుగు వారు వ్యవహారిక భాషోద్యమాలకు పునాదులు వేశారు. 1879వ సంవత్సరంలో జన్మించిన గిడుగు వారు బాల్యం నుండే గురజాడ వారికి సహాధ్యాయిగా ఉండి, భాషోద్యమాలలో చురుకుగా పాల్గొనారు. విద్యావేత్తగా, ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా, చరిత్రకారుడిగా గిడుగు వారు తన జీవితాంతం కృషి చేశారు. చరిత్ర, ఆంగ్లం, సంస్కృతం, మానవీయ శాస్త్రాలను బోధించారు. పర్లాకిమిడీలోని జమిందారీ కళాశాలలో లెక్చరర్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. వారి కుమారులు గిడుగు సీతాపతి కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఒక చరిత్రకారుడిగా ముఖ లింగ శాసనాలతోపాటు, కళింగ ప్రాంతపు దీర్గ్ఘాసి శాసనాన్ని ప్రకటించారు. గిరిజన కొండ భాషైన సవర భాషకు లిపిని, వాచకాలను రాసి ఎంతో సేవచేశారు. మనం మాట్లాడుతున్న భాషనే కావ్య భాషగా చేయడానికి గిడుగు వారు గురజాడ, పి.టి.శ్రీనివాస అయ్యంగార్, సెట్టి లక్ష్మీనరసింహం, జె ఎ. ఏట్స్, కిళాంబి నర్శింహాచార్యులు, బుర్ర శేషగిరి లాంటి పెద్దలతో కలిసి పోరాడారు. గ్రాంథిక భాషావాదులైన జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరాయ శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు, వావికొలను సుబ్బారావు, మహీపతి సూర్యారావు, బహద్దూర్ లాంటి దిగ్గజాలను ఢీ కొట్టారు. వ్యావహారిక భాషోద్యమ సభలను పర్లాకిమిడి, బరంపురం, విజయనగరం, విశాఖ, మద్రాస్, గుంటూర్, మచిలీపట్నం, అనంతపురం, మొదలగు ప్రాంతాలలో నిర్వహించారు. తణుకు సభల్లో వ్యవహారిక భాషావాదానికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదింపజేశారు. 1933లో రాజమండ్రిలో జరిగిన మహాసభలలో రెండవ రోజున గిడుగు వారి సప్తతి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1938లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గిడుగు వారిని కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చి సన్మానించారు. వీరు 22-1-1940 లో స్వల్ప అనారోగ్యంతో 77వ ఏట కన్నుమూశారు. ఆగస్ట్ 29 వ తేదీన వచ్చే వీరి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు. అలా గిడుగు వారు తెలుగు నేలపై బహుముఖీన సేవలు అందించి చిరస్మరణీయులుగా నిలిచిపోయారు.

కాళ్లకూరి నారాయణ రావు గారి సాంఘీక నాటకం ‘వర విక్రయం’ గూర్చి అయిదు పేజీల వ్యాసంలో వరవిక్రయం నాటకం సుమారు వంద సంవత్సరాల కిందట రాయబడిందని చెప్పారు. ఈ నాటకం సామాజిక సంస్కరణలకు ప్రతీకగా నిలిచింది. 1921లో రాసిన ఈ నాటకం గద్య, పద్య రూపంలో ఉంది. కాళ్ళకూరి వారు ‘చింతామణి’, ‘వర విక్రయం’, ‘మధు సేవ’ అనే మూడు నాటకాలు రాశారు. వీరు వర్ణాంతర వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. 1939లో తెలుగు చిత్రంగా ప్రసిద్ద దర్శకులు సి. పుల్లయ్య గారు తెరకెక్కించారు. ఇప్పటికీ పెళ్ళి కుమారున్ని కొనుక్కొనే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఈ వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ కాళ్ళకూరి వారు ఈ నాటకాన్ని రాశారు. ఒక రాజారాంమోహన్ రాయ్‌లా, ఒక కందుకూరిలా కాళ్ళకూరి వారు సాంఘీక దురాచారాల నిర్మూలనకు చేసిన కృషి గొప్పది.

మహాకవి, పద్యకవి, కవి చక్రవర్తి బిరుదాంకిత గుర్రం జాషువా కవితా వైభవం, దేశభక్తి గూర్చి ఆరు పేజీల వ్యాసం రాశాడు. ఈ నేలను, ఈ గాలిని, దేశభక్తిని అమితంగా ప్రేమించి జాషువా పలు రచనలు చేసి చిరస్మరణియుడిగా మిగిలారని అంటాడు. పద్యాన్ని హృద్యంగా పండించి సామాజిక చైతన్యంతో, సమాజ అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన మహాకవియని కొనియాడాడు. ద్వా.నా. శాస్త్రి గారి తొలి దళితకవి కుసుమ ధర్మన్న వ్యాసంలో దళిత కవిగా, జాషువా సమకాలికుడిగా ధర్మన్న పలు రచనలు చేసి, దళితోద్యమాలు చేసి రాణించాడని, అంబేద్కర్‌చే సన్మానింపబడిన ధర్మన్నకు రావాల్సినంతగా గుర్తింపు రాలేదని ద్వానా శాస్త్రి పేర్కొన్నారు. కుసుమ ధర్మన్న పై ద్వానా వారు రాసిన పుస్తకం ఎంతో పరిశీలనతో రాశాడని రాశారు. జాషువా కన్నా కుసుమ ధర్మన్నే తొలి దళిత కవియని చెబుతూ, ధర్మన్న చేసిన రచనలు, దళితోద్యమాలను తులనాత్మకంగా ఏకరువు పెడుతూ, ధర్మన్నే తొలి దళిత కవిగా నిరూపించే ప్రయత్నం ద్వానా వారు సాధికారికంగా చర్చిస్తూ చేశారని సబ్బని వారు పేర్కొన్నారు. ద్వానా శాస్త్రి గారు తెలంగాణాపై పలు రచనలు చేశారని, 1948లో జన్మించి, తన 70వ ఏట హైదరాబాద్‌లో 2019లో పరమపదించారని పేర్కొన్నారు. ఇలా సబ్బని వ్యాసాలలో తెలంగాణా సాహిత్య కోణాన్ని కూడా చర్చిస్తూ వ్యాసాలు రాయడం కనిపిస్తుంది.

ముగ్ధ మనోహరంగా కవితామృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్, ‘అమృతం కురిసిన రాత్రి’ వ్యాసాన్ని సబ్బని వారు తనకున్న వచన కవిత్వం పట్ల ప్రేమను ప్రకటిస్తూ రాసినట్లు అనిపిస్తుంది. ఎనిమిది పేజీలలో రాశారు. తనను ఆకట్టుకొన్న కవులలో తిలక్‌తో పాటు శ్రీశ్రీ, శేషేంద్ర శర్మలని పేర్కొన్నారు. తెలుగు కవితా కన్య నుదుటిపై కవితా తిలకం దిద్ది, రసహృదయుల ఎదల్లో తన స్థానాన్ని తిలక్ గారు పదిలం చేసుకొన్నారు. వీరు రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’లో గొప్ప కవిత్వం, అయస్కాంత శక్తి ఉంది. 1968లో 159 పేజీలతో 89 కవితలతో కుందుర్తి మున్నుడితో ఈ పుస్తకం తొలుత విశాలాంధ్ర వారు ప్రచురించారు. 1996 వరకు తొమ్మిది ముద్రణలు పొంది, అమిత సాహిత్యాదరణానికి నోచుకొంది. నాజూకు అందాలతో ముట్టుకుంటే పాదరసంలా మెరిసి పోతూ, హృదయాంతరాలను మధురాతి మధురంగా కదిలించేలా తిలక్ కవిత్వం ఉంది. కవిత్వ సీమలో నాకు నచ్చిన కవియని, ప్రాతఃస్మరణీయుడని అంజలి ఘటిస్తారు.

అభ్యుదయ పథగామి మహాకవి శ్రీశ్రీ అని ఆయన వర్ధంతి సందర్బంగా 2008లో 15 పేజీల వ్యాసం రాశారు. కవిత్వం పట్ల ప్రేమానురాగాలను కనరిచే సబ్బని లాంటి ప్రసిద్దులైన వచన కవులకు శ్రీశ్రీ ఆరాధ్యుడిగా నిలిచారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని కూలంకషంగా సమీక్షించారు. ఆధునిక కవిత్వానికి ఆద్యుడిగా నిలిచారు. తెలుగు సాహిత్యాన్ని తన బలమైన ముద్రతో కదిలించిన మహా రచయిత చలం ముందుమాటను బెజవాడ నుండి 1940లో రాశాడు. శ్రీశ్రీ కవిత్వం పదును, వాడిని ఇచ్చాయి పురాణ ప్రతీకలు. 73 ఏళ్ళు బతికిన శ్రీశ్రీ గారు రాసిన కవితలపై 15 పేరడీ కవితలు రాసి, మరో 25 ఇతరులు రాసిన వాటిపై పేరడి కవితలు రాసి, 2001లో మన ప్రస్థానం అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాసి, శ్రీశ్రీ గారికే అంకితం ఇచ్చానని సబ్బని వారు ఈ వ్యాసంలో ఆత్మీయంగా రాసుకొనడాన్ని మనం గమనిస్తాం.

శేషేంద్ర ఆధునిక ఇతిహాసం ‘నా దేశం నా ప్రజలు’ అనే వ్యాసాన్ని నాలుగు పేజీలలో రాశారు. ఈ వ్యాస నేపథ్యంలో చూస్తే, మహాకవిగా ప్రసిద్ది నొందిన గుంటూరు శేషేంద్ర శర్మగారితో ఉన్న వ్యక్తిగత పరిచయాన్ని, ఇంటర్యూను, పరస్పరం లేఖలు రాసుకోవడం వంటి విషయాలు, శేషేంద్ర శర్మ గారి కవిత్వంపై సబ్బని వారు వేసిన చిరు పుస్తకం గుర్తొస్తాయి. ఇందులో శర్మ గారు రాసిన ‘నా దేశం నా ప్రజలు’ అనే కావ్యాన్ని సోదాహారణంగా సబ్బని వారు సమీక్షించారు. ఎనిమిది సర్గలుగా విభజించి, ప్రాచీన అలంకారికుల ప్రమాణాలను బట్టి ఈ కావ్యం మహాకావ్యమని, ఒక ఇతిహాసమని శేషేంద్రే పేర్కొన్నారని చెబుతారు. ఆంగ్లంలోకి వీరే తర్జుమా చేశారు. హిందీ, ఉర్దూ తదితర భాషల్లోకి ఇతరులు అనువందించారు. విశ్వ, భారతీయ సాహిత్యంలో అధ్బుతమైన మహాకావ్యంగా సబ్బని వారు కితాబు నిచ్చారు. శేషేంద్ర గారు రసైక ప్రేమ మూర్తి, వ్యవస్థపై మార్పు కోసం, ధర్మాగ్రహం, మంచికోసం కవిత్వాన్ని రాశారు. కవి జగత్తు, శ్రామికుడి జగత్తు మిళితమై సాగిపోయిన భావాత్మక కావ్యంగా వర్ణిస్తారు. ఇందులో గొప్ప అభివ్యక్తి, కొత్త డిక్షన్ తో అది ఒక విశిష్ట కావ్యమని అంటారు.

అలాగే ‘తెలుగు నవలా సాహిత్యంలో వడ్డెర చండీదాస్’ అంటూ నాలుగు పేజీల వ్యాసం రాశారు. చండీదాస్ గారి రచనలు పరివ్యాప్తమయ్యాయి. తెలుగు సాహితీలోకాన్ని కుదిపిన వీరు రాసిన నవల ‘హిమజ్వాల’ యని చెబుతారు. వ్యక్తి యొక్క మానసిక సంఘర్షణలను, అత్యద్భుతంగా రాశారు. రాయడం ఒక మార్మిక విద్య, ఒక ఆత్మ నివేదన, తనను తాను విముక్తం చేసుకోవడానికి రాసిన నవల ఇదని సబ్బని వారు ఈ నవలా ప్రాశస్థ్యాన్ని మనకు చెబుతారు. చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు తన పేరును వడ్డెర చండీదాస్‌గా మార్చుకొని, 64 ఏండ్ల పాటు తన జీవిత ప్రయాణాన్ని సాగించాడు. బెంగాళి సాహిత్య తాత్విక చింతనలో భాగంగా ప్రేరేపితుడైన ఆయన జీవితంలోను, రచనల్లోను అస్తిత్వ సిద్ధాంతాలు దర్శనమిస్తాయని రచయిత సాహితీ మూర్తిమర్త్వాన్ని శ్లాఘిస్తారు.

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విలక్షణమైన నవల ‘మ్రోయు తుమ్మెద’ గూర్చి సబ్బని వారు 15 పజీలలో సుదీర్ఘ వ్యాసం రాశారు. కరీంనగర్ హిందుస్థానీ సంగీత కారుడు, మేధావి, విద్యావేత్త, న్యాయవేత్త నారాయణరావు గారి జీవితం ఆధారంగా రాయబడింది. విశ్వనాథ వారు కరీంనగర్ డిగ్రీ కళాశాలలో 1959-61 మధ్య రెండు సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కరీంనగర్ దిగువ మానేర్ నదికి ‘మ్రోయు తుమ్మెద’ వాగు ఉపనది. ఈ వాగు సమీపంలోనే పసిపిల్లవాడిగా నారాయణరావు గారు ఒక దంపతులకు దొరికాడు. ఆయన పెరిగిన బాల్యం, చదువులు, అప్పటి కరీంనగర్ సామాజిక వాతావరణం, సంగీత-సాహిత్యాలు వంటి అంశాలు ఈ నవలలో చర్చకు వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర, సాహిత్యం, దేవాలయాలు, ప్రజల జీవన విధానాలు ఈ నవల ద్వారా తెలుస్తాయి. ఈ నవలను తొలుతగా కరీంనగర్ చింతల నరసింహులు బుక్ డిపో వారు 1961లో ప్రచురించారు. 2006లో ద్వితీయ ముద్రణకు నోచుకొంది. నారాయణరావు, విశ్వనాథ, ధూళిపాళ రాంమూర్తి, జువ్వాడి గౌతమరావు గార్లు దగ్గరి మిత్రులు. కరీంనగర్‌లో సాయంకాలం కలుసుకొని సాహిత్యం, ఇతర కబుర్లు చెప్పుకొనేవారు. అలా నారాయణరావు గారి బహుముఖీన విశిష్ట జీవితాన్ని విశ్వనాథ వారు అక్షరబద్ధం చేసారు. జువ్వాడి గౌతమరావు గారు దస్తూరి చేశారు. నారాయణరావు గారి శిష్యుడైన నేదునూరి బాపూరావు గారి (91) వద్దకు వెళ్ళి ఇంటర్యూ చేసి, సాహితీవేత్త జి.వి.కృష్ణమూర్తి గ్రంథాలయం నుండి మ్రోయతుమ్మెద నవలను సేకరించి, కరీంనగర్ ప్రాంతీయాత్మతతో సబ్బని వారు రాసిన ఈ వ్యాసం అద్భుతంగా మలచబడింది. ఈ వ్యాసం చివరన నారాయణరావు, విశ్వనాథ వారు కలిసి ఉన్న ఫోటోను సబ్బని వారు ప్రచురించడం గమనించదగిన విషయం. ఈ వ్యాసం ఈ పుస్తకంలో ఇదే దీర్ఘమైనదిగా రికార్డయిందని చెప్పవచ్చును.

నైజాం ప్రభువుల కాలంలో తెలంగాణాలో అల్లకల్లోలమైన దుస్థితులను, ఆనాటి రైతాంగ పోరాటాలను, ప్రజల బాధలను ముగ్గురు కోస్తాంధ్ర కవులు స్పందించి రాశారు. అందులో కుందుర్తి ‘తెలంగాణా’ దీర్ఘకవిత్వం, ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆవత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’ కావ్యాలు రాశారు. వీరి ముగ్గురి గూర్చి సబ్బని వారు చక్కటి వ్యాసాలు రాశారు. కుందుర్తి తెలంగాణా కావ్యాన్ని ప్రముఖ సాహితీవేత్త డా. నందిని సిధారెడ్ది గానం చేసిన వీడియోను యూ-ట్యూబ్ ద్వారా విని, రాసుకొని, కుందుర్తి తెలంగాణా కావ్యంపై సబ్బని వారు సమీక్షా వ్యాసం రాశారు. వచన కవితా పితామహుడిగా పేరు గాంచిన కుందుర్తి వారు గుంటూర్ జిల్లా నర్సరావుపేట వాస్తవ్యులు. తెలంగాణా సాయుధ పోరాటంపై, నిజాం ప్యూడల్ వ్వవస్థపై తెలంగాణా కావ్యాన్ని మహాభారతంవలె 18 భాగాలుగా విభజించి రాశారు. 1922-82 మధ్య 60 ఏళ్ళు జీవించారు. 1956లో సమాచార శాఖలో అనువాదకులుగా చేరి, హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు. ప్రఖ్యాత కవివతంశులు గుర్రం జాషువా, విశ్వనాథ గార్లు ఈయనకు గురువులు. 1958లో వచన కవితా వికాసానికై వీరు హైదరాబాద్‌లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని స్థాపించారు. ఈ పురస్కారం నేటి వరకు కొనసాగుతున్నది. వీరి తెలంగాణా కావ్యంలో నిజాం ప్రభువుల నిరంకుశ విధానాలను, దొరల ఆగడాలను, వెట్టి చాకిరీ బతుకులను, సంఘం యొక్క గొప్పతనాన్ని, అక్రమ పోలీస్ దౌర్జన్యాలు, వారి నిర్భంధాలను, రజాకార్ల అఘాయిత్యాలను, మానభంగ పర్వాలను, గృహ దహనాలను, భూ స్వామ్య దోపిడీలను, పేదల భూముల దురాక్రమణలను, తెలంగాణా ప్రజల తిరుగుబాట్లను చక్కగా వివరిస్తూ రాశారు. 1953లో రాసి మూడేళ్ళ తర్వాత కుందుర్తి వారు ఈ కావ్యాన్ని ప్రచురించారు. అలా తెలంగాణా ఆగడాలపై రాసి ధన్యజీవులయ్యారు కుందుర్తి వారు.

సోమసుందర్ కవిత్వం- ‘వజ్రాయుధం’ గూర్చి రాస్తూ, ఆసక్తికరమైన విషయాలను ఏడు పేజీల వ్యాసం ద్వారా సబ్బని వారు వెళ్ళడించారు. వీరు పాతిక సంవత్సరాల వయస్సులోనే ‘వజ్రాయుధం’ కవిత్వం రాశారు. తెలంగాణా సాయుధ పోరాటం-1949లో కొనసాగుతున్న రోజులలోనే ఇతివృత్తంగా తీసుకొని రాశారు. ఈ కావ్యాన్ని ఆనాటి తెలంగాణా సాయుధ పోరాట నాయకులు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి అంకితం చేశారు. ఈ కావ్యాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1950లో ఈ ప్రతుల్ని కళాకేళి ప్రచురణాలయంపై దాడి చేసి మొత్తం ప్రతుల్ని పట్టుకొని పోయారు. అలా వీరి రచన పెను సంచలానాలకు కారణమైంది. సోమసుందర్ అలా తెలంగాణా పై కావ్యం రాసి, తదుపరి ఆరుద్ర రాసిన త్వమేవాహం కావ్యానికి ప్రేరణగా నిలిచారు.

‘త్వమేవాహం’ రాయడంలో ఆరుద్ర కవి హృదయం అనే వ్యాసాన్ని ఆరు పేజీలలో రాశారు. శ్రీశ్రీ, దాశరథి, సినారె వ్యాఖ్యలు అనే ట్యాగ్ తగిలించి రాశాడు. తెలంగాణా కవి యోధుడు దాశరథికి ఒక లేఖ ఆరుద్ర రాస్తూ, తాను తెలంగాణా అంశంగా ‘త్వమేవాహం’ కావ్యం రాయడానికి గల కారణాల్ని వివరించాడు. నైజాం కిరాతకులు ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి ఆమె శీలాన్ని దోచుకొన్న విధానాన్ని ఆరుద్ర తన కావ్యంలో రికార్డు చేశారు. ఇలా ఆరుద్ర గారి రచన 1949లో వెలుగు లోకి వచ్చింది. 1948లో ఈ రచన చేసారు. తెలంగాణా అని పేరు తొలుత పెట్టగా, శ్రీశ్రీ కోరికపై ‘త్వమేవాహం’ అని పేరును ఆరుద్ర గారు మార్చారట. డా. సినారె గారు ఈ కావ్యంపై వ్యాఖ్యానించారు. రజాకార్ల దుర్మార్గాలను, ప్రజలు పొందిన బాధలను ప్రతీక వాదంతో అరుద్ర గారు రాశారని సినారె కితాబు నిచ్చారు. ‘త్వమేవాహం’ అంటే నువ్వే నేను, నేనే నువ్వు అని అర్థం. తెలంగాణా కావ్య వస్తువు. అలా దాశరథి, సినారె స్పందనలతో ఈ కావ్యం మహత్తరమైనదని సబ్బని వారు సెలవిచ్చారు.

‘దాశరథి భావనల్లో తెలంగాణం’ అనే వ్యాసాన్ని మూడు పేజీలలో రాశారు. తెలంగాణా సాయుధ ఫోరాటంలో పాలు పంచుకొన్న మహాకవి దాశరథి భావనల్లో తెలంగాణం పునర్నవం, అగ్నిధార తదితర కావ్యాలు రాశారు. సబ్బని వారు దాశరథి గారు 1956లో వెలువడిన పునర్నవం లోని ఒక కవిత ‘తెలంగాణం’ సమీక్ష చేస్తూ, తెలంగాణా భావనలను పాటకులకు ఎరుక జేశారు. తెలంగాణా నిజాం ప్యూడల్ నిరంకుశ పాలనలో మగ్గిపోయింది. బీద ప్రజానీకం పడరాని కష్టాలను పడింది. రాస్తే పెద్ద చరిత్ర తెలంగాణాది. కడలి కన్నీటి కావ్యం. భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తే, తెలంగాణాకి 1948 సెప్టంబర్‌లో వచ్చింది. అందుకే జాగరుకతో మెలగాలని, పురోగతి, ప్రగతి సాధించాలని, ఇక ఎవ్వరూ అడ్డుకోలేరని దాశరథి ఆకాంక్షించాడు. దీనిని 2013లో సబ్బని వారు తెలంగాణా మలి ఉద్యమంలో భాగంగా రాసి, తెలంగాణా ఉద్యమానికి ఊపు నిచ్చారని స్పష్టమవుతుంది.

‘అసమ్మతి ధిక్కార స్వరం-కాళోజీ కవిత్వం’ అనే వ్యాసాన్ని అయిదు పేజీలలో 2004లో సబ్బని వారు తెలంగాణా మలి ఉద్యమ కాలంలో రాశారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కాళోజీ పాపులర్ పంక్తులతో ఈ వ్యాసం మొదలవుతుంది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణించినపుడు కాళోజీ రాసిన కవిత్వం ఇది. ప్రజల భాషలో కాళోజీ కవిత్వం రాశాడు. తెలంగాణా మట్టి భాషను ప్రేమించి, ‘నా గొడవ’ ద్వారా జీవితాంతం తెలంగాణా కోసం ఉద్యమించాడు. 82 ఏళ్ళు బతికిన కాళోజీ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని వివరించాడు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావాలని ఊపిరి ఉన్నంతవరకు కోరాడు. కాళోజి ప్రజల భాషలో ఉధృతితో కవిత్వాలు, పాటలు ధిక్కార స్వరంతో రాశారు. కాళోజీ ఒక యోగి, తెలంగాణా భాషను ప్రేమించిన యోధుడని కాళోజీకి నివాళులర్పించాడు.

మానవ ఇతిహాస క్రమానుగత కావ్యం డా. సినారె గారి ‘విశ్వంభర’ అంటూ ఆరు పేజీల వ్యాసం రాస్తూ, ఈ కావ్యానికి నాయకుడు మానవుడు, రంగ స్థలం విశ్వంభర అని అంటాడు. జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఈ ‘విశ్వంభర’ కావ్యం గూర్చి, ఇప్పటి వరకు తెలుగులో ముగ్గురే ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డులు దక్కాయని, అందులో సినారె ఒక్కరు అని అంటాడు. గేయకవిగా, సినీ గేయకవిగా సినారె గారు సుప్రసిద్ధులు, 1988లో జ్ఞానపీఠ పురస్కారాన్ని ఈ కావ్యం అందుకొంది. దీర్ఘ కవిత్వంగా 1980లో ప్రచురించారు. సినారె విశ్వగతిని గమనించి పరిణతి చెందిన దశలో రాశారు. ఇతివృత్తం, తేదీలతో నిమిత్తం లేకుండా, పేర్లతో అగత్యం లేని మనిషి కథగా ఈ కావ్యం మలచబడింది. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి సాగించిన ప్రస్థానాన్నే ‘విశ్వంభర’ కావ్యంగా సినారె మలిచారు. ఎన్నో పురస్కారాలు, సిద్ధాంత పరిశోధనలు, పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యపుస్తకంగా నోచబడిన ఈ కావ్యం హిందీ, ఇంగ్లీషు, మలయాళ భాషల్లోకి అనువాదమైంది. 1980లో ప్రచురణ అయిన ఈ కావ్యం వంద పేజీలు, అయిదు ప్రకరణాలతో రెండు వేల లైన్ల కవిత్వంతో రూపు దాల్చింది. మనిషి యొక్క అనంత జీవిత సత్యాల పరామర్శ, వెతుకులాట, అన్వేషణ, విశ్లేషణలే విశ్వంభరలో దర్శనమిస్తాయి. ఇలా ఈ కావ్యం గూర్చి రాస్తూ, విశ్వయవనికపై మనుగడ ప్రస్థానం, మానవ ఇతిహాస క్రమానుగత తాత్విక కావ్యం. ఇందులో అన్నీ ప్రతీకలతో అలరారుతాయని చెబుతారు.

‘అక్షర శిల్పి అలిశెట్టి ప్రభాకర్’ అనే వ్యాసంలో అలిశెట్టి రాసిన సిటీలైఫ్ వంటి మినీ కవిత్వాలపై ఆరు పేజీల్లో సమీక్ష చేశారు. అలిశెట్టి మంటల జెండాలు, ఎర్ర పావురాలు, రక్త రేఖ, పరిణతి చెందిన కాలంలో సంక్షోభ గీతం, సిటీలైఫ్ కవిత్వాలు రాసి సంచలనం సృష్టించారు. మరణం నా చివరి చరణం కాదంటూనే 1993లో అర్ధాయుస్సు తోనే జనవరి 12 తన జయంతి రోజునే పరమపదించారు. ఈ వ్యాసం చదువుతుంటే అలిశెట్టి ఎదుర్క్కొన్న కఠిన రోగ పీడిత జీవితం చూసి కన్నీళ్ళు వస్తుంటాయి.

సజీవుల సాహితీవేత్తల రచనల సమీక్షల వ్యాసాల లోకి వెడితే, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గహీత, విద్యావేత్త, బహు గ్రంథకర్త, తెలుగు విశ్వవిద్యాలయం విసీగా పనిచేసిన డా. గోపి గారి ‘జలగీతం’పై చేసిన సమీక్ష పర్యావరణ స్పృహను రేకెత్తిస్తుంది. ‘సజల దృశ్యకావ్యం జలగీతం’ అనే టైటిల్ పై 9 పేజీల సమీక్షా వ్యాసాన్ని రాశారు. ఇదే ఈ పుస్తకంలో విశ్వనాథ తర్వాత ఇదే రెండవ దీర్ఘ వ్యాసంగా చెప్పవచ్చును. 2002లో డా. గోపీ గారు ‘జలగీతం’ కావ్యం రాశారు. 12 భాషల్లోకి అనువాదమైంది. బహుళ ప్రాచుర్యం పొందింది. రాజస్థాన్ జలదాత, పర్యావరణ వేత్త రాజేందర్ సింగ్ గూర్చి, రాస్తూ ఈ కృతిని వారికే గోపీగారు అంకితం చేశారు. ఆరావళి నదిలోని ఐదు నదులను బతికించిన జలబ్రహ్మ రాజేందర్ సీంగ్ అని గోపీ కొనియాడారు. జలగీతం 27 భాగాల్లో ఒక దీర్ఘకావ్యంగా 2200 పంక్తులతో, 87 పేజీల్లో రాశారు. కవిత్వ భాష, కన్నీటి భాష తెలిసిన డా. గోపీ గారి ‘జలగీతం’ అంతర్జాతీయ దృక్పథంతో, విశ్వజనీన సత్యాలతో, అధ్బుతమైన కవిత్వంతో తీర్చిదిద్దారని సబ్బని వారు కితాబు నిచ్చారు.

సేద్యంపై ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్ది గారి దీర్థకావ్యం ‘పొలి’ అని ఎనిమిది పేజీల వ్యాసం రాస్తూ, ఈ దీర్ఘకావ్యాన్ని 22 భాగాలుగా దాదాపుగా వెయ్యి లైన్లలో రాశారు. రాచపాళెం వారు ఒక రైతు బిడ్దగా పుట్టి, రైతు జీవన వేదంగా ఈ కావ్యాన్ని మలిచారు. సుప్రసిద్ద సాహితి వేత్తగా, సాహితీ విమర్శకులుగా రాణించిన ఈ ‘పొలి’ కావ్యం చదివితే సేద్యంలోని లోటుపాట్లు, గిట్టుబాటు ధరల ఊగిసలాటలు, రైతన్నల బాధలను కంట తడి పెట్టించేలా రాశారు. సంప్రదాయ గ్రామీణ సంస్కృతిలో పొలిలో బలి అనివార్యం. మేకనో, పొట్టేలునో నరికి ఆ రక్తంతో వేపాకులు వేసి, అన్నంతో కలిపిన నెత్తురు కూడును వరిపైరుకు రోగం వచ్చినపుడు ఊరిలోని పొలాలన్నింటిపై చల్లుతారు. పైరుకు రోగం, రైతును భయపెట్టే పులి, పొలి అని రాచపాళెం వారు అక్షరీకరించారు. గొప్ప దీర్ఘ కావ్యంగా అభివర్ణించారు. ఈ కావ్యాన్ని అనంతపురంలోని ప్రముఖ ఆంగ్ల రచయిత డా. పి. రమేష్ నారాయణ గారు ఆంగ్లంలోకి ‘హార్వెస్ట్’ అనే పేరుతో అనువదించారు.

సజీవ దృశ్యకావ్యం బి. ఎస్. రాములు గారి ‘బతుకు పోరు’ నవల యని రాములు గారి జీవిత, సాహిత్య నేపథ్యాన్ని చక్కగా వివరిస్తూ, నవలా నేపథ్యాన్ని, నవలని సబ్బని వారు నాలుగు పేజీలలో చక్కగా సమీక్షించారు. సజీవ సాహిత్యంగా బీడీ కార్మికుల సజీవ చిత్రణని బతుకు పోరుగా బి. ఎస్. రాములు గారు తీర్చి దిద్దారు. సజీవమైన తెలంగాణా భాషలో, బీడీ కార్మికుల జీవిత సమస్యలు, వారి వెతలు, అరకొర వసతులు, గిట్టుబాటు కాని కూలీలు, జీడీ కార్మికుల వెతల బతుకులను కథా వస్తువుగా రాసిన బిఎస్. రాములు గారి ఈ నవల ప్రజాదరణకు నోచుకొంది. 1982 లో వెలువడి, తిరిగి 1990లో అచ్చులోకి వచ్చింది. పాతికేళ్ల క్రితం సహజమైన భాషలో బీడీ కార్మికుల నేపథ్యంగా వెలువడిన ఈ నవల ప్రజోపయోగకరంగా రాయబడింది. విస్తృత అధ్యయన శీలిగా, సామాజిక కార్యకర్తగా, సాహితీవేత్తగా గొప్ప ముద్ర వేసుకొన్న బి.ఎస్. గారి గొప్ప నవల ‘బతుకు పోరు’ అంటూ సబ్బని వారు కితాబు నిచ్చారు.

నేత కార్మికుల జీవితంపై రాధేయ దీర్ఘకావ్యం ‘మగ్గం బతుకు’ అనే ఆరు పేజీల వ్యాసం చేనేత రంగ దుస్థితిని వివరిస్తుంది. 2006లో దీర్ఘ కవిత్వంగా డా. ఉమ్మడిశెట్టి రాధేయ గారు చేనేత చిత్రపటంలో విరిగిన మగ్గం వ్యథ అంటూ నేత కార్మికుల పస్తులుంటున్న బతుకులను, ఆత్మహత్యలను, కన్నీటి కథలను కావ్య గానం చేశారు. ఈ కావ్యాన్ని డా. పి. రమేష్ నారాయణ ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. తెలుగు చేనేత శ్రామికుల జీవన పోరాటాన్నిఅత్యంత వాస్తవికంగా, విమర్సనాత్మకంగా అల్లి, జాతీయంగా చేనేత రంగానికి ఉన్న ప్రాధాన్యతను వివరించే యత్నం చేశారు. రైతు పండించిన ధాన్యానికి, నేతన్న గుడ్డకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. మగ్గాల శాలలన్నీ మార్చురీ గదులుగా మారిపోతున్నాయని నేతన్న వ్యథల బతుకు చిత్రాన్ని రాధేయ గారు ఆవిష్కరించారు. నేతన్నల బతుకు గానంగా సబ్బని వారు వర్ణించారు. ఇది అన్నార్థుల గీతం. నేతన్నల కష్ట గీతం. హిందీలోకి కూడా అనువాదమైంది.

కవిత్వమై జీవించిన కవి కె.శివారెడ్డి గారి మోహనా, మోహనా కవిత్వం గూర్చి సబ్బని వారు స్థూలంగా ఏడు పేజీలలో విశ్లేషించారు. అయస్కాంత శక్తితో అద్భుతంగా, పదాలకు, వాక్యాలకు పదును పెడుతూ కవిత్వ శ్వాసై, ఆలోచనా తరంగాలతో కవిత్వం రాస్తున్న కె.శివారెడ్ది గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఈ కావ్యానికి అందుకొన్నారు. 1988లో ఈ కవిత్వం రాయగా, 1990లో పురస్కారాన్ని అందుకొన్నారు. విశ్వకవిత్వాన్ని అవలోకనం చేసుకొన్న కవి. కాగితపు యెదపై ప్రవహించే జీవకవిత్వం. 1973 నుండి రక్తం సూర్యుడితో కవిత్వం రాస్తున్న శివారెడ్డి గారు ఇప్పటికినీ 80 ఏళ్ళ వయస్సులో కవిత్వ శ్వాసై బతుకుతున్నారు. సరస్వతీ సమ్మాన్, కబీర్ సమ్మాన్ పురస్కారాలు అందుకొన్న ఈ నికార్సైన కవి అభినందనీయుడని సబ్బని వారు కితాబు నిచ్చారు. హైదరాబాద్ లోని లకడీకపూల్ లోని ద్వారకా హోటల్‌లో కవితా దర్బార్‌లు నిర్వహించిన నగర కవియని ప్రస్తుతించారు.

కరీంనగర్‌లో అదనపు కలెక్టర్‌గా పనిచేసిన డా. ఏనుగు నరసింహారెడ్ది గారు రాసిన ‘తెలంగాణా రుబాయిలు’ పై నాలుగు పేజీలలో చక్కటి వ్యాసం రాశారు. జీవిత సత్యాల సమాహారంగా అభివర్ణించారు. వీరి రుబాయిల్లో తెలంగాణా ఆకాంక్షతనం ఆవిష్కరించబడింది. తెలంగాణా భాష, పదాలతో వీరి రుబాయిలు అలరారాయి. తెలంగాణా మలి ఉద్యమం నడుస్తున్న సమయంలో వీరు రాశారు. 536 రుబాయిలను 300 పేజీలలో రాశారు. దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్యుల తర్వాత ఎక్కువగా రుబాయిలు రాసింది, నరసింహారెడ్ది గారేనని సబ్బని వారు చెబుతారు. 11వ శతాబ్దంలో పారశీక కవి ఉమర్ ఖయ్యూం ఈ రుబాయిల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆంగ్ల కవి ఫిడ్జ్ రాల్డ్ చే 1895లో అనువాదం అయ్యాయి. దువ్వూరి రామిరెడ్ది, ముద్దుకృష్ణ, చలంలు ఈ రుబాయిలను పద్య, వచన రూపంలో తెలుగు లోకి అనువాదాలు చేశారు. నరసింహారెడ్డి గారి రుబాయిల్లో మరకతాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలున్నాయని సబ్బని వారి కితాబు నిచ్చారు. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన ఈ రుబాయిల రచయిత నరసింహారెడ్ది గారు అభినందనీయుడని అంటారు.

ఇలా సబ్బని లక్ష్మీనారాయణ గారు దశాబ్దంన్నరకు పైగా రాసిన ఈ పరిశోధక వ్యాసాల సంకలనం ఈనాటి, నాటి తరానికి రెఫరెన్స్ మెటీరియల్. కొత్తగా రాసే రచయితలకు రెడ్ కార్పెట్ వేసే రహదారిని చూపించగలదు. సబ్బని వారు మరిన్ని మంచి పరిశోధక సాహిత్య వ్యాసాలు వెలువరించి, తెలుగు సాహిత్యాన్ని మరింతగా రసవంతం చేయాలని ఆశిద్దాం.

***

సబ్బని సాహిత్య వ్యాసములు (వ్యాస సంపుటి)
రచనా: డా. సబ్బని లక్ష్మీనారాయణ
ప్రచురణ: కస్తూరి విజయం
పేజీలు: 180
వెల: ₹ 340
ప్రతులకు:
రచయిత, చరవాణి: : 91 8985251271,
కస్తూరి విజయం, చరవాణి: 9515054998.
ఆన్‍లైన్‍లో:
https://amzn.to/3S2C6DA
https://bit.ly/3jUVp5r

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here