[డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి రచించిన ‘అనుభవాల కడలి’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]ప్పుడు కాలం రేఖలన్నీ రంగులద్దుకుని
రంగవల్లికలై అలరారుతున్నాయి.
బుడిబుడి అడుగులనాటి నుండి
నడుంవంగినా నడుస్తున్న నేటివరకూ
దాటివచ్చిన తోవంతా పచ్చగానే కనిపిస్తుంది
అమాయకపు గుర్తులు చెరిగిపోలేదు
నలుపుతెలుపు చిత్రాలు మాసిపోలేదు
వెనకటి జ్ఞాపకాలలోకి తొంగిచూస్తే
కలలవంతెనలు వేసినవి కొన్ని
కరచాలనంతో నడిపించినవి కొన్ని
గుండె కలుక్కుమనిపించినవి మరికొన్ని
మందహాసాలతో కొన్ని చిందులేస్తున్నాయి
నా కళ్ళముందే తెరలుగా కదిలిపోతున్నాయి
స్నేహం భుజంమీద ధీమాగా చేయివేసి
కలయతిరిగిన ఓ కమ్మని లోకం
అనుంబంధాల వాకిళ్ళలో ప్రతినిత్యం
పరామర్శల పరిమళాలు వెదజల్లిన కాలం
బాధ్యతల కావిళ్ళు మోసుకొచ్చిన క్షణాలు
కవ్వించిన వేళలూ, మచ్చలుమిగిల్చిన గాయాలూ..
నిద్రలోకి జారుకొనే సమయం దగ్గరైంది
చూడగలిగే పగళ్ళెన్నున్నాయో తెలీదు
జ్ఞాపకాల తరంగాలే ఊతంగా చేసుకు
అనుభవాల కడలిలో మునిగితేలుతున్నా