[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
‘నెట్ జీరో’ ఎంత దూరం?
[dropcap]2[/dropcap]030 నాటికి కూడా ప్రపంచం 50 గిగా టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుందని అంచనా. నిజానికి పారిశ్రామిక విప్లవం నాటి నుండి ఈనాటి వరకు వెలువరించబడిన ఉద్గారాలలో సింహ భాగం సంపన్న దేశాలు వెలువరించినవే. కాని ఫలితాలను మాత్రం అంతర్జాతీయంగా అన్ని దేశాలూ అనుభవిస్తున్నాయి.
USలో 2020లో కూడా శిలాజ ఇంధన వనరులపై పనిచేసే పరిశ్రమలకు 81.8 మిలియన్ సబ్సిడీలు ఈయబడ్డాయి. US కాంగ్రెస్‌లో పరువురు సభ్యులు శిలాజ ఇంధన పరిశ్రమలలో వాటాదారులు. సహజంగానే ప్రభుత్వం పాలసీలలో ఆ ప్రబావం ఉండి తీరుతుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1% పారిశ్రామికవేత్తలు 2019లో వెలువరించిన ఉద్గారాలు 5.9 బలియన్ టన్నులు. వీరు వాతావరణ మార్పుల ప్రభావానికి ఏ మాత్రం ప్రభావితం గాని సురక్షితమైన, విలాసవంతమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నవాళ్లు. కానీ వీరి చర్యల వలన వెలువడుతున్న ఉద్గారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకానికి జీవన్మరణ సమస్యగా పరిణమిస్తున్నాయి. ఒక దశలో పర్యావరణ ప్రేమికుడిగా ఉండి సంపన్నులపై పన్ను విధించి దానిని సంక్షోభ నివారణకు వెచ్చించాలని సూచించిన ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ సైతం ప్రస్తుతం సాదాసీదాగా జీవిస్తునట్లు కనిపిస్తున్నప్పటికీ తన జీవన విధానంతో కాకపోయినా కార్యకలాపాలతో ఉద్గారాల వెలువరింతకు తనవంతు తాను దోహదం చేస్తున్నాడు.
చిన్న దేశాలే మేలు:
భూటాన్:
ప్రపంచంలో ‘నెట్ జీరో’ను సాధించిన మొట్టమొదటి దేశం భూటాన్. సుస్థిర, సేంద్రియ వ్యవసాయం, అడవుల సంరక్షణ భూటాన్ ఆచరణలో చూపిస్తోంది. 1990లలో అక్కడ అడవులు 60 శాతానికి తగ్గిపోయాయి. వివిధ అవసరాల నిమిత్తం కలప గురించి చెట్ల నరికివేత దానికి కారణమని గ్రహించిన ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం ద్వారా 10 సంవత్సరాల లోపునే మళ్ళీ ఆ లోటును భర్తీ చేసి 70%కి చేర్చగలగింది. ఇప్పుడు మునుపటి వలెనే 70% భూమి అడవులతో ఆ దేశం అలరారారుతోంది. అక్కడ జనాభా 8,00,000. పర్యాటకం ఇక్కడ మెచ్చదగిన ఆర్థిక వనరు. పర్యాటలకుల నుండి సుస్థిరాభివృద్ధి రుసుము ($200) వసూలు చేస్తూ వారిని భాగస్వాములను చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మాత్రమే భావించకుండా పర్యావరణం పరిరక్షణ బాధ్యతనూ మప్పి ఆదర్శంగా నిలుస్తోంది.
గబన్:
అడవుల నరికివేత నియంత్రణను చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. సహజ వనరుల సమర్థ నిర్వహణతో సుస్థిరాభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణలో ‘గబన్’ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రశంసించింది.
పనామా:
ఇక్కడ జనాభా చాలా తక్కువ. వర్షారణ్యాలు అధికం. 2050 నాటికి 50,000 హెక్టార్ల అరణ్యాలను పెంపొందించే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఉద్గారాల నియంత్రణ విషయంలో ఈ చిన్న చిన్న దేశాలన్నీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్న నిజాన్ని అంగీకరించాలి. కారణం – అవి సుస్థిరాభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూనే పర్యావరణానికి సంబంధించి కఠినమైన పరిరక్షణ పాలసీలను అమలు చేస్తున్నాయి.
పై దేశాలన్నీ జనాభా పరంగా తక్కువ సాంద్రత కలిగిన దేశాలు. అభివృద్ధి పరంగాను కొంచెం తక్కువస్థాయిలోనే ఉన్నాయి. ఆ కారణంగా అవి ‘నెట్ జీరో’ సాధించడంలో ఘనత ఏమీ లేదన్న వాదనలూ వినవస్తున్నాయి. ఆ వాదనలో పసలేదు. కారణం- లక్ష్యాలను నిర్దేశించుకున్నాక, చిత్తశుద్ధితో కృషిచేసి ఎవరు లక్ష్యానికి చేరువ కాగలిగారన్నది ఇక్కడ కీలకం.