సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 20

0
3

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి.]

ప్రపంచంలో రెండవ పెద్ద దేవాలయం: అక్షరధామ్ న్యూజెర్సీ

[dropcap]అ[/dropcap]ది డిసెంబర్ 25, 2022.

నార్త్ బ్రౌన్స్విక్, న్యూజెర్సీ లోని చెల్లి ఇంటి నుండి దక్షిణం వైపు 20 మైళ్ళ దూరంలో ఉన్న రాబిన్స్ విల్లే లోని స్వామి నారాయణ్ అక్షరధామ్ మందిరానికి రెండు కార్లలో బయలుదేరాం.

నిజానికి దేవాలయాలకు వెళ్ళడానికి నేనంత ఆసక్తి చూపను. కానీ అధునాతనంగా విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందని చెల్లి కామేశ్వరి చెప్పింది. దాంతో పాటు న్యూజెర్సీలో భారతీయ దేవాలయ నిర్వాహకులు జరిపిన మానవ అక్రమ రవాణా, వారి శ్రమ దోపిడీ గురించి వార్తల్లో విన్నాను. ఆ విషయం ప్రస్తావించినప్పుడు చెల్లి అక్షరధామ్ పైన ఆరోపణలు వచ్చాయని చెప్పింది. అదేంటో చూద్దామని వెళ్ళాను.

ఢిల్లీలో అక్షరధామ్ చూసాను. కాబట్టి ఇది కూడా అదే స్థాయిలో ఉంటుంది అని ఊహించాను.

దాదాపు అరగంట ప్రయాణం చేసి పదకొండు గంటల సమయంలో మందిర ప్రాంగణం చేరుకున్నాం. రాబిన్స్ విల్లే టౌన్ షిప్ కంటే ముందే కుడివైపున ఉన్న రోడ్డులోకొద్దిగా ముందుకు వెళితే అక్షరధామ్. అల్లంత దూరం నుండే రా రమ్మని ఆహ్వానిస్తూ కనిపించింది.

విశాలమైన ప్రదేశంలో అక్కడక్కడా పచ్చదనంలో అందంగా తీర్చిదిద్దిన అత్యంత ఖరీదైన దేవాలయం తెల్లగా మంచులాగా.. అప్పుడప్పుడు పడే ఎండపొడ పడి వెండిమీద బంగారం తాపడం పెట్టినట్లుగా మిలమిల మెరుస్తూ.. డోమ్‌లు శిఖరాలతో.. మనదేశంలో ఉన్న భావన కల్పిస్తూ..

అక్షరధామ్ అనుకున్నట్టుగానే చాలా పెద్ద దేవాలయం. 184 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రధాన ద్వారానికి ఎదుట కొలను, ఆ కొలను చుట్టూ, లోపల కొన్ని విగ్రహాలు, దాని ఎదుట బంగారు వర్ణంలో మెరిసిపోతున్న బాల స్వామి నారాయణ్ విగ్రహం. ఒంటికాలిపై నిల్చుని రెండు చేతులూ పైకెత్తిన విగ్రహాన్ని వెనుకవైపు నుండి చూస్తూ గబగబా ఆలయం లోపలికి దారితీసాం. కారణం చల్లటి చలిగాలులు ఈడ్చి కొడుతున్నాయి.

లోపలికి అడుగుపెట్టి చెప్పులు విడిచి షూ రాక్‌లో పెట్టాం. కాళ్లకు చెప్పులు లేకుండానే మరో ద్వారంలోంచి లోపలికి వెళ్లాం. అప్పటి నుంచి అద్భుతమైన శిల్పాలు, పాలరాతి వర్ణచిత్రాలు, నాట్య భంగిమలు ఒకటా రెండా వేలకు వేలుగా.. భారతీయ శిల్పకళా నైపుణ్యం కళ్ళకు కడుతూ ఏనుగులు, నెమళ్ళు, నృత్య భంగిమలు.. అనేక రకాలైన డిజైన్లు ఒకదాన్ని మించి మరొకటి.. శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

అక్కడ వాడిన పాలరాతిని గ్రీస్, టర్కీ, ఇటలీ దేశాల నుంచి, లైం స్టోన్ బల్గెరియా, టర్కీ నుంచి తెప్పించి ఓడల్లో భారతదేశం పంపారు. వాటితో పాటు మన దేశంలోని పింక్ సాండ్ స్టోన్, గ్రానైట్ లతో మందిరం డిజైన్ ప్రకారం శిల్పాలు చెక్కారు, రాజస్థాన్ లోని వర్క్‌షాప్‌లో వేలాది కార్మికులు, ఇంజనీర్లు పనిచేసి శిల్ప ఆకృతులు తయారు చేశారు. తయారైన పలకలకు నంబర్ వేసి ఓడల్లో అమెరికా పంపారు.

భారత్ నుంచి తెచ్చిన పాల రాతి పలకలను ఒక క్రమపద్ధతిలో అమర్చడానికి, మెరుగులు పెట్టడానికి, ఇతర పనులకు రాజస్థాన్ నుండి ఇంజనీర్లను, శిల్పకళా నిపుణులను, కార్మికులను అమెరికా రప్పించారు.

వేదాలలోని నియమముల ననుసరించి ఆలయ నిర్మాణం జరిగింది. ఎంతటి ప్రతికూల వాతావరణానికి అయినా తట్టుకునే విధంగా నిర్మించారు. మార్బుల్ రంగు మారకుండా ఉండడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వివిధ రకాల రాళ్లు ఉపయోగించి శిల్పాలు చెక్కారు. 68,000 క్యూబిక్ అడుగుల ఇటాలియన్ మార్బుల్ వాడారు.

శిల్పకళా శాస్త్రం నియమాలను అనుసరించి పవిత్రమైన శిల్పాలు రాధాకృష్ణులు, శివపార్వతులు, సీతారాములు, హనుమ, గణపతి తదితర దేవతామూర్తులు చెక్కారు. గోడలకు, స్తంభాలకు, పైన రూఫ్ అంతటా ఎన్నిరకాల డిజైన్లో..

పదివేలకు పైగా శిల్పాలు, ఆకృతులు, డిజైన్‌లు సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తాయి. కనువిందు చేస్తాయి. ప్రధాన ఆలయం 87 ఫీట్ల వెడల్పు, 133 ఫీట్ల పొడవు, 43 అడుగుల ఎత్తులో నిర్మించారు. 108 భరతనాట్యం భంగిమలు ఉన్నాయిట. మయూర్ ద్వారంలో ఏనుగులు, నెమళ్లతో చాలా అందంగా భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని పశ్చిమ తీరంలో వారికి తెలియజేస్తూ.. సాంప్రదాయ శిల్పకళా వైభవంతో పాటు ఆధునిక నిర్మాణ పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి విగ్రహాన్ని, ప్రతి శిల్పాన్ని మనసుపెట్టి చిత్రిక పట్టడం వల్లనే అవి అంత ఆకట్టుకోగలుగుతున్నాయి అనిపించింది.

అక్షరధామ్ స్వామినారాయణ్ మందిర్ గురించి తెలుపుతూ వీడియో, ఆడియో షోలు ఉన్నాయి. ఎక్కడికక్కడ వాలంటీర్లు గైడ్ చేస్తున్నారు. 2014లో ప్రారంభమైన ఈ మందిరం నిర్మాణం గురించి, స్వామినారాయణ్ గురించి వివరించి చెప్పే వాలంటీర్లు 360 రోజులు గుడి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.

మొబైల్ ఫోన్లో ఎక్కడికక్కడ చాలా ఫోటోలు.. కానీ ప్రధాన మందిరంలో మాత్రం ఫోటో తీయనీయలేదు. ప్రధాన మందిరం సమీపంలోనే మరో పెద్ద నిర్మాణం జరుగుతున్నది.

మన దేశంలో సామాజిక జీవితం మతం, ఆ మతం నుండి వచ్చిన భక్తి భావాలతో ముడిపడి ఉంది. అందుకే ఉదయం లేచి ఏ గుడి ముందు చూసినా పెద్ద పెద్ద బారులు తీరిన జనం కనిపిస్తారు. చిన్న పెద్ద అన్ని వయసుల వాళ్ళు కనిపిస్తారు. స్త్రీలు, పురుషులు కనిపిస్తారు. వారిలో అన్ని తరగతుల వారు, అన్ని వృత్తుల వారు ఉంటారు. గ్రామీణులు ఉంటారు. పట్టణ/నగర వాసులు ఉంటారు.

అట్లాగే ఇక్కడ కూడా జనం..

నా చిన్నప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే జనంలో నమ్మకాలు, భయాలు, భక్తి చాలా పెరిగింది. మందిరాలు, మసీదులు, చర్చిలు పెరిగాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయుల భక్తి పెరిగిపోతున్నది అని న్యూజెర్సీలో ఉన్న దేవాలయాలు, ఆస్ట్రేలియాలో చూసిన దేవాలయాలు చెప్పాయి. అంతేకాదు వాటి కోసం మనిషి ఎంత ఖర్చు చేస్తున్నాడో కూడా దేవాలయాల డాబు దర్పం చెప్పకనే చెబుతుంటాయి కదా..

బహుశా మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి రకరకాల నమ్మకాలు, విశ్వాసాలు పుట్టి ఉండవచ్చు. తనకు కలిగే భయాలు, సందేహాల నివృత్తి కోసం కనిపించని దేవుడిపై భారం వేసి నిశ్చింతగా ఉంటున్నాడు మనిషి.

ఆ క్రమంలో మనిషి మతం సృష్టించుకున్నాడు. మనిషికి మతానికి మధ్య అనేక నమ్మకాలు. భగవంతుడు..

భగవంతుని అనుగ్రహం కోసం, స్వర్గ ప్రాప్తి కోసం ప్రతి భక్తుడు/భక్తురాలు ప్రత్యేక పూజలు, అభిషేకం వంటివి ఏవేవో చేస్తారు.

ఏది చేసినా అంతా భగవంతుని కోరేది ఒకటే. తమ జీవితం సవ్యంగా సాగిపోవాలని. కష్టాలు నష్టాలూ లేకుండా పైకి ఎదగాలని, తనని తన కుటుంబాన్ని అభివృద్ధి చేయమనిఇలా రకరకాలుగా దేవుణ్ణి కోరుకుంటూ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ త్రుణమో ఫణమో సమర్పించుకుంటూ ఉంటారు. తమ ఆస్తిపాస్తులు కాపాడమని భారీగా ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. మనిషి విశ్వాసాలే మార్కెట్ శక్తుల పాలిట వరమైంది.

అంటే సామాన్యుడికి దేవుడికి (నమ్మేవారికి) మధ్య గుడి ఉందనొచ్చేమో! సామాన్యుడికి ఉన్న భయాలు కనిపించని దేవుడిపై ఉన్న భక్తి మార్కెట్ శక్తులకు, మతానికి పెద్ద వ్యాపారం అయిందనిపించింది.

ఆ వ్యాపారంలో భాగమే ఈ కార్పొరేట్ దేవాలయాలు. అత్యాధునిక హైటెక్ హంగులతో 96 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో చూస్తే 770 కోట్ల రూపాయలతో కట్టిన ఈ దేవాలయమే అందుకు ఉదాహరణ.

ఈ ప్రపంచంలో కాదేదీ మార్కెట్‌కి అనర్హం. భక్తి కూడా అందులో భాగం అయిపొయిందని ఆలోచిస్తూ అక్కడ అమ్ముతున్న ఖరీదైన దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, పూజ సామాను, వగైరా వగైరా చాలా చూశాను.

అప్పటికే అందరికీ ఆకలి అవుతున్నది. మా స్నేహి ఒకసారి వెళ్లి ఏదో తినేసి వచ్చాడు. మేమంతా కేఫ్ వైపు నడిచాం. అక్కడ అసలు ఖాళీ లేదు. వచ్చిన జనమంతా అక్కడే పెద్ద పెద్ద క్యూలలో. సెలవు దినం కావడంతో మరీ రద్దీగా ఉందేమో!

ఇక చేసేది లేక స్వీట్ షాప్ వైపు నడిచాం. మాలాగా చాలా మంది చేరారు అక్కడ. అక్కడ అమ్మే రకరకాల ఉత్తర దక్షిణ భారతీయ తాజా స్వీట్స్, పిండి వంటలు గుడికి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. మేం కూడా అంతా తిరిగి చూసి కొన్ని కొన్నాం.

మళ్ళీ భోజనశాలకు నడిచాం. అక్కడికి వచ్చిన ఎవరికైనా మందిర నిర్వహణలోని భోజనశాలలో భారతీయ భోజనం చేయనిదే సంపూర్ణం కాదు అనుకుంటా.

శయోన కేఫ్ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భారతీయ శాకాహార భోజనం మెనూలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఎవరి రుచులకు అనుగుణంగా వారు కౌంటర్లో డబ్బులు చెల్లించి ఆర్డర్ చేసుకుంటున్నారు. రాజేష్ సాధన వెళ్లి క్యూలో నించున్నారు. అమ్మ, పిల్లలు సౌరవి, సుచిర్ చాలా ఆకలిగా ఉన్నారు. తిరిగి తిరిగి అలసి పోయారు. ఆ విశాలమైన భోజనశాలలో ఖాళీ చూసుకుని కూర్చున్నాం. మా ఆర్డర్ వచ్చేసరికి టేబుల్స్ కాస్త ఖాళీ అయ్యాయి.

డైనింగ్ సదుపాయం బాగుంది. ధర కూడా ఎక్కువేమీ కాదు. అక్కడ కూర్చొని తీరిగ్గా భోజనం చేసి బయట పడ్డాం. భారతీయుల్లో ఉత్తర భారతీయులు ఎక్కువగా కనిపించారు.

కేఫ్ ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 9 నుంచి రాత్రి 8. వరకు స్వీట్స్, స్నాక్స్ షాప్ అందుబాటులో ఉంటుంది. ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసిన ఆహారపదార్థాలకు చాలా గిరాకీ ఉంది. ఎవరికైనా ఏ ఫంక్షన్ కైనా క్యాటరింగ్ కావాలంటే క్యాటరింగ్ సర్వీస్ సదుపాయం కూడా ఉంది.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి స్లీవ్‌లెస్‌లు, మోకాళ్ళ పైకి ఉండే బట్టలతో ఆ గుడిలోకి రానివ్వరు. అర్ధనగ్నంగా వెళితే వాళ్ళు మన శరీరాన్ని కప్పుకోవడానికి ఏదో ఒకటి ఇస్తారు..

పరిశుభ్రంగా పైకి కనిపించడమే కాదు మరుగుదొడ్లు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. పిల్లలు, వృద్దులకు అనుకూలంగా ఉన్నాయి.

నిర్మాణం పనులు జరిగే చోటుకు వెళ్దామని చూశాం. కానీ వెళ్లడానికి కుదరదు అన్నారు. మేం వెనుదిరిగాం. అప్పటికే సమయం దాదాపు మూడు గంటలు కావస్తున్నది. బయట చలి గాలులు తగ్గాయి. ఎండ వేడి బాగానే తెలుస్తున్నది.

బంగారు రంగులో మెరుస్తున్న 45 అడుగుల బాల స్వామినారాయణ్ విగ్రహం దగ్గరకు వస్తుంటే కొలను మా వైపు చూడండంటూ ఆహ్వానించింది. కొలను మధ్యలో ఆకట్టుకునే ఫౌంటెన్, చుట్టూ శిల్పాలు, చిన్న చిన్న నిర్మాణాలు, ఉద్యానవనాలు, తోరణాలతో పాటు ఆకర్షించే బాల స్వామినారాయణ్ విగ్రహం. ఆ విగ్రహం మొత్తం బంగారంతో చేశారట.

చూపరులను ఆకట్టుకునే శిల్పకళా నైపుణ్యంతో ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో రెండవ పెద్ద దేవాలయంగా పేరుపొందిన స్వామి నారాయణ్ అక్షరధామ్ మందిర్ గురించి ఆలోచిస్తూ వెనుదిరిగాం.

నా ఆలోచనలు మాత్రం ఇంత అందమైన, అద్భుతమైన ఆలయ నిర్మాణం వెనుక దాగిన శ్రమదోపిడి కనిపిస్తున్నది. ఆ శ్రామికుల వేదన కనిపిస్తున్నది.

అమెరికా కార్మిక చట్టాలకు విరుద్ధంగా పని చేయిస్తూ, అతి తక్కువ వేతనం అంటే రోజుకు 15 డాలర్ల లోపు ఇచ్చారని, మానవ అక్రమ రవాణా చేశారని, బలవంతంగా పని చేయిస్తున్నారనే ఆరోపణ గుర్తొచ్చింది.

దాదాపు 200 మంది కూలీలను భారతదేశం నుంచి తీసుకొచ్చి పని చేయించారు. వారంతా దళిత బహుజన ఆదివాసీలే. వారితో వారానికి 87 గంటలు పని చేయించుకున్నారు. వచ్చిన కార్మికులు తమను వీడి ఎక్కడికి పోకుండా వారి పాస్‌పోర్ట్‌లు నిర్వాహకులు తమ వద్దే పెట్టుకున్నారు. అమెరికా వారికి మతపరమైన వర్కర్స్ – వాలంటీర్లు అని చెప్పి తీసుకొచ్చారు. ఇలా 200 మందిని R -1 వీసా లో తీసుకొచ్చారు. నెలకు 400 డాలర్లు కార్మికుల ఇంటికి పంపించి 50 డాలర్లు మాత్రం వారి చేతికి ఇచ్చేవారు.

నాలుగు గోడల మధ్య నుంచి బయటికి పోకుండా ఎప్పుడు కాపలా ఉండేవారు. ఇంటికి వెళ్ళిపోతాం అంటే ఒప్పుకోలేదు. పంపలేదు.

న్యూజెర్సీ చట్టాల ప్రకారం కనీస వేతనం గంటకు 12 డాలర్లు, వారానికి 40 గంటలు పని చేయాలి. ఈ దేవాలయ నిర్మాణంలో అందుకు విరుద్ధంగా జరిగింది. అది కాక 17 బాలుడిని కూడా తీసుకొచ్చారు. అతను అక్కడ పని చేస్తూ చనిపోయాడు. దాంతో కార్మికులు చాలా వేదన చెందారు. అమెరికాలో ఉండలేక తిరిగి స్వదేశం వెళ్లలేని అశక్తతలో ఉన్న సమయంలో బాగా చలించిన 37 ఏళ్ల ముఖేష్ కుమార్ కొందరు నిర్మాణ కూలీలతో కలిసి లాయర్‌ని కలిశాడు. దేవాలయ నిర్వాహకులపై కేసు పెట్టారు.

బొచాసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) పై అమెరికా చట్టాల ప్రకారం తమకు రావలసిన సొమ్ము ఇప్పించి, అక్రమంగా ఇక్కడికి తీసుకు వచ్చిన వారిని అరెస్టు చేయాలని కేసు పెట్టడంతో పాటు తమను తమ దేశం పంపించవలసిందిగా కోరారు. న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించిన వార్త అప్పట్లో చర్చనీయాంశం అయింది. భారతదేశంలోని మీడియా కూడా ఆ వార్తలు ప్రపంచానికి తెలిపింది.

అమెరికా నియమ నిబంధనలు అతిక్రమిస్తున్నారని వచ్చిన ఆరోపణల దృష్ట్యా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ దేవాలయం మాత్రమే కాదు అమెరికాలో ఇతర దేవాలయాల నిర్మాణంలోనూ ఇదే విధంగా జరుగుతున్నదని తేల్చారు.

ఏది ఏమైనా స్థానిక ప్రభుత్వ సహకారం లేనిదే అంత పెద్ద నిర్మాణం సాధ్యం అయ్యేది కాదు. అక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని దేవుని ప్రార్ధించే వాళ్లకన్నా శిల్పకళా అద్భుతాల్ని మొబైల్ ఫోన్‌లో, కెమెరాలో బంధించే వాళ్లే ఎక్కువ కనిపించారు.

దేవుని నమ్మిన నమ్మకపోయినా భారతీయ వారసత్వ కళాసృష్టి చేసిన శిల్పుల నైపుణ్యాన్ని ఎవరైనా చూసి రావచ్చు. భారతీయ ఆధ్యాత్మికత, సౌందర్యాత్మకత మేళవించిన ఈ మందిరం చూశానని తృప్తి కంటే దేవుని సమక్షంలోనే, దేవుని పనిలో ఆ కార్మికులకు ఇంత అన్యాయం జరిగితే ఎలా? అన్న ప్రశ్న నాతో పాటు ఇంటికి చేరింది.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు), బతుకుసేద్యం, ప్రచురణ. నిష్కల, నీలాకాశంలో నిధి (బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here