అంతరిక్షంలో మృత్యునౌక-4

0
3

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[మార్స్‌ను కాపాడే మిషన్‍కు ఎంపికైన వ్యోమగాములని ఎంపికపూర్తవుతుంది. ఏయే దేశాలు ఈ మిషన్‍కి ఏ రకంగా సాయం చేయాలన్నది నిర్ణయమవుతుంది. జపాన్‍ లోని పారిశ్రామికవేత్త కజుయా వార్తలు వింటూంటాడు. అతని కూతురు శాటో  మార్స్ మిష‍న్‍కి ఎంపికైందని విని – నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నావా అని కూతురుని అడుగుతాడు. తన అవసరం ఎంతో ఉందని తండ్రికి చెప్తుందామె. తన గురించి భయపడవద్దని, క్షేమంగా తిరిగి వస్తానని చెప్పి, బయల్దేరుతుంది. కాన్ఫరెన్స్ రూమ్‍లో ప్రొఫెసర్ ఫ్రాన్సిన్ మార్స్ మిషన్ సిబ్బందిని ఒకరొకరుగా అందరికీ పరిచయం చేస్తాడు. సమయం వృథా చేయద్దంటూ ఆయన చేయాల్సిన పని గురించి చెప్పడం మొదలుపెడతాడు. మొదటి సమావేశం ముగుస్తుంది. మరోదఫా సమావేశం అవుతారు. అలెక్సిస్ ఆలస్యంగా వచ్చి కూర్చుంటాడు. తమ ప్రణాళికని ఐక్యరాజ్యసమితి ఆమోదించిందని, ఒక అంతరిక్ష నౌక, ఒక కంట్రోల్ స్టేషన్, నిర్మాణంలో ఉన్నాయని చెప్తాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్. వ్యోమగాములందరూ తమ తమ దేశాలు ఈ మిషన్‍కి ఏ విధంగా తోడ్పతుతున్నాయో తెలుసుకుంటారు. చాలా దేశాలు ఈ మిషన్‍కు సాయం చేస్తున్నాయని ఇదొక విశ్వకార్యమని వారు గ్రహిస్తారు. నీల్ తమ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని కలుస్తాడు. పిల్లలతో ఆడుకుంటాడు. భార్య టెస్సాతో కబుర్లు చెప్తాడు. భర్త ప్రమాదకరమైన మిషన్‍కి వెళ్తున్నాడని ఆమెకు తెలుసు. అందుకే నీల్‍ని నిలదీస్తుంది. ఇదే తన చివరి మిషన్ అని నీల్ ఆమెకు భరోసా ఇస్తాడు. ఆమెకి దుఃఖం ఆగదు. ఆమెను ఓదారుస్తాడు నీల్. – ఇక చదవండి.]

ప్రకరణం-4: మిషన్ ‘ఎ’ – అత్యంత క్లిష్టమైన, చతురతతో కూడిన పథకాలు

[dropcap]నీ[/dropcap]ల్ వరుస క్రమంలో ఉన్న మూడో హాల్లోకి ప్రవేశించాడు. చివరికి తన టీం మెంబర్లు అందరూ దూరంగా ఉండడం చూశాడు. వారి చుట్టూ ఒక ఇంజనీర్ల సమూహం ఉంది. అందరూ ‘ఓవరాల్స్’ ధరించి ఉన్నారు. వారేం చేస్తూ ఉన్నారో అతడు కేవలం ఊహించగలిగాడు. ద్వారం గుండా నడిచి, హాలులో ప్రవేశిస్తూ ఉండగా, పనిచేస్తున్న యంత్రాల రొద బిగ్గరగా వినపడసాగింది. ఏమిటా అని చూడకుండా ఉండలేకపోయాడు.

ఒక వైపు ఇద్దరు ఇంజనీర్లు రెండు ప్లేట్లను కలిపి వెల్డింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు, ఇంకోవైపు ఇంకా ఇంజనీరు గ్రైండింగ్ మిషన్ ఉపయోగించి పెద్ద ధ్వనులు వచ్చేలా ఒక ప్లేటును అరగదీస్తున్నాడు, దాన్ని నున్నగా చేయాలని. ముందుకు తిరిగాడు నీల్. ఒకతను ఎవరోగాని, చుట్టూ లోహలు పెట్టుకోని కుర్చీలో ఇరుక్కుపోయాడు, పట్టీ వేసినట్లుగా! అతనొక హెల్మెట్ ధరించి ఉన్నాడు. ఊదా రంగు ఓవర్ కోటు వేసుకొన్నాడు. అది ఇంచుమించు ఒక స్పేస్ సూట్‌లా ఉంది. కాని దాని వెనుక ఎలాంటి పట్టీలు లేవు.

“నీల్!” పిలిచింది ఒలీవియా. “ఎక్కడున్నావు బాస్, ఇప్పటిదాకా?”

“నీక్కూడా గుడ్ ఆఫ్టర్ నూన్, ఒలీవియా!” అన్నాడు నీల్, గొంతులో కొంత ఎత్తిపొడుపు ధ్వనిస్తుండగా.

MSM బృందంలోని అందరూ అక్కడ ఉన్నట్లే. అలెక్సిస్, ఎలాషాతో సహా! మిస్టర్ బ్రియాన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కూడ రంగంలో దిగారు. సిమ్యులేషన్ ఎలా జరుగుతుందో నోట్ చేసుకోవడానికి వీలుగా.

అతని అధిక్షేపానికి ఒలీవియా కొంచెం నవ్వింది. కాని తన ప్రశ్నను అడగటం మానలా. ఈసారి అంత కఠినంగా కాకుండా, అడిగింది.

“కుటుంబాన్ని చూసివద్దామని వెళ్లాను” అన్నాడు నీల్, ఆమెను దాటి, ఆ వ్యక్తిని కప్పివేసిన ఆ యంత్రం దగ్గరికి వెళుతూ. “శాటో కదా!” అనడిగాడు ఆ ఆకారం వైపు చూపుతూ.

“అవును. నాకేమనిపిస్తుందంటే, మనందరిలోకీ, తనను తాను సంబాళించుకోవడానికి కష్టపడుతూన్న వ్యక్తి ఆమెనని” అన్నాడు రాకేష్, చేతులు జోడించి. అందరూ గంభీరంగా ఉంటే తన జోకులకు తానే నవ్వగలిగినవాడు అతనొక్కడే.

“ఒక సిమ్యులేషన్‍ను సరియైనదిగా తేల్చుకోవాలంటే ఒకటికి మూడు సార్లు నీవు దాన్ని పరిశీలించాలి. అలాంటిది, ఒక అమ్మాయిని నీవు అవమానించావు. నీకు సిగ్గుగా లేదూ?” అన్నాడు వ్లాదిమీర్, తాను కూర్చున్న చోటినుంచే. అందరూ నవ్వారు! ఆఖరికి వ్లాదిమిర్ పక్కన కూచున్న ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కూడ తన నవ్వును దాచుకోలేకపోయాడు.

“సరే! మీ పనులన్నీ అయ్యాక, ఇక్కడ, ఈ రోజుకు చివరి బ్రీఫింగ్ ఉంది. అవుతూనే నాకు చెప్పండి” అన్నాడు నీల్ తెరిచి ఉన్న హలు తలుపు వైపు నడుస్తూ .

“ఆగు నీల్, వస్తున్నా! నిన్నో మాట అడగాలి” అని అరిచింది శాటో, కుర్చీలోంచి లేచి, అతని వైపుకు పరుగెత్తుకొని వస్తూ. ఆమె నీలం రంగు ‘ఓవరాల్’లో ఉంది. హెల్మెట్ చేతిలో పట్టుకొని ఉంది.

“ఏమిటది శాటో! నేను మరో పావుగంటలో న్యూక్లియర్ విభాగంలో ఉండాలి!”

“పావుగంట చాలా ఎక్కువ. మనం నడుస్తూ మాట్లాడుకుందాం!”

“అలాగే” అన్నాడు నీల్ తన నడక వేగాన్ని తగ్గిస్తూ.

“మనం అక్కడికి వెళ్లడం ఎందుకు? మనందర్నీ రాకెట్‌లో కూర్చోబెట్టి అక్కడికి పంపే బదులు, రాకెటును మాత్రమే పంపొచ్చుగా? రాకెట్ యొక్క చలించే పథాన్ని (ట్రాజెక్టరీ) నేను సులభంగా లెక్కవేయగలను, ఇతర కంప్యూటర్లతో! ఖచ్చితంగా ఉంటుంది”

నీల్ వెంటనే జవాబిచ్చాడు. “దానిలో ఎన్నో సంక్లిష్టతలున్నాయి. అణుధార్మిక వ్యర్థాలను మోసుకుపోతున్న దాన్ని మనం పేల్చివేయలేం. ఎందుకంటే అంతరిక్షమంతా రేడియేషన్‌తో కలుషితమవుతుంది. అలా జరిగితే ఘోరంగా ఉంటుందని నీవంగీకరిస్తావని అనుకొంటున్నాను!”

“నిజమే, నీవు చెప్పింది!” అయిష్టం గానే జవాబిచ్చిందామె. అడిగేముందే ఆ కాన్సెప్ట్‌ను తాను సరిగా అర్థం చేసుకొని ఉండాలనిపించింది ఆమెకు.

“మనకు చెప్పిన విధంగా, మన పని ఏమిటంటే పైకి వెళ్లి ఆ న్యూక్లియర్ వేస్ట్ వాహనాన్ని పట్టుకోవాలి. దాన్ని అంతరిక్షంలోకి మరింత తోయాలి. దాని గురించి నీవు ఇప్పటికీ అలోచిస్తూ ఉండి ఉంటావని నాకు తెలుసు. కాని, మనందరం దిగబోయే భూమి మీదకి మనం దాన్ని వెనక్కు తీసుకోరాలేమని మనం తెలుసుకోవాలి. నీకు సమయమిస్తే, మనం ఖచ్చితంగా ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది నీవు క్యాలిక్యులేట్ చేయగలవని నాకు నమ్మకం ఉంది. కానీ, ఆ వ్యర్థాన్ని మోస్తూన్న ఆ నౌక యొక్క హీట్ ప్యానెల్ గురించి ఆలోచించాలి. తిరిగి ప్రవేశించే సమయంలో, అది గనుక వేడిమిని తట్టుకోలేకపోతే, మన పని గోవిందా!”

“అమ్మో!”

“అవును. నాకు తెలుసు. అది అంత క్లిష్టమైనదే మరి! ఒకటి చెబుతాను ఊహించుకో. తొమ్మిది లేదా పది కిలోమిటర్ల దూరంలోని ఎగిరే దాన్ని ఒక బుల్లెట్‌తో షూట్ చేయాలనుకో. బుల్లెట్ దాన్ని కొట్టే లోగా స్లో అవ్యాల్సిన అవసరం ఉంది. అంతేగాని టార్గెట్ చిందరవందర అవకూడదు. టార్గెట్ వస్తువు ఇప్పుడు పది కాకపోయినా తొమ్మిది కిలోమీటర్లుంది. దాని మార్గం స్పష్టంగా కనబడటం లేదు. పైగా తోవను మార్చుకుంటూ ఉంది. ఊహించడం చాలా కష్టం. అర్థమైంది కదా!”

“ఫ్! నేనడగాలనుకున్న ప్రశ్నలన్నింటికీ నీవు జవాబులు చెప్పేశావు. అందుకే వాళ్లు నన్ను నీ దగ్గరకు పంపారు. నీవు న్యూక్లియర్ ఎక్స్‌పర్ట్‌వని!”

“నా పనే అది! మిషన్ యొక్క ప్రతి కోణాన్ని నేను చూడాలి. లేకపోతే, నాకెవరూ సాయం చేయరు”

“చాలా చలిగా ఉంది” అన్నది శాటో, తాను తీసుకొన్నపెద్ద నీలిరంగు ‘ఓవరాల్’లోకి ఇంచుమించు దూరిపోతూ! నీల్ అమెనీ సరిగ్గా సమయానికి పట్టుకున్నాడు.

“థాంక్స్! నేను వెనక్కు మా వాళ్ల దగ్గరికి పోయి ఈ అనుకరణను (సిమ్యులేషన్) మరింత మెరుగుపరుస్తాను. నా నంబర్లు నాకుంటాయి మళ్లీ!” అన్నది శాటో. ఆమె మాట్లాడుతుంటే ఆమె జపనీస్ మాండలీకం మరింత బాగా బయటపడింది. “ఇంకా, అనుసరించడానికి మీకు స్వాగతం” అని, సిమ్యులేషన్ జరిగే హాలుకు పరుగెత్తింది.

రేడియేషన్ డిపార్టుమెంటు ఎదురుగ్గా నీల్ ఒంటరిగా మిగిలిపోయాడు. సిమ్యులేషన్ హాల్ లాగే అది చాలా పెద్దదే. అతడు లోపలికి వెళ్తుండగా, అతన్ని చూడడానికి అందరి కళ్ళు అతని వైపు తిరిగాయి ఎందుకోగాని అతనికి దీనివల్ల అంత సంతోషం కలుగలేదు. “మనందరం తలలు తిప్పి, పని మీద దృష్టి పెడదామా, దయచేసి?” అంటూ వారికి ఆదేశం ఇచ్చాడు.

“మనం చేసిన షీట్స్ మీద ఇటీవలి రిపోర్టు నాకు తెచ్చివ్వు. వచ్చే ఐదు రోజుల్లో తెలియని లోకంలోకి దూకబోయే ముందు మనం చివరిసారిగా మళ్లీ పరీక్ష జరపాల్సిన అవసరం ఉంది”

ఆ సమయంలో, ఫ్లోరిడాలోని కేప్ కెన్నెడీ భూభాగంలో సూర్యుడు అప్పటికీ అస్తమిస్తున్నాడు. వాళ్లంతా అప్పుడున్నది అక్కడే. గత కొన్ని వారాలలో ప్రణాళికలు మారిపోయాయి. తమను అంతరిక్షంలోకి తీసుకుపోవడానికి రాకె‍ట్‌ను అంతరిక్ష నౌకను నిర్మించడానికి వారు నిర్ణయించారు.

21 జూలై, 1970. MSM అంతరిక్ష నౌక టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. సూర్యుడు ఆ రోజు తొందరగా వచ్చేశాడు. అలాగే భూగ్రహం మీది ప్రతి మానవుడు కూడా. మిషన్ ప్రారంభాన్ని చూడడానికి, వినడానికి, ప్రతి ఛానెల్, ప్రతి రేడియో ట్యూన్ కాబోతున్నాయి. నీల్ తన గది లోని అద్దంలో చూసుకున్నాడు. కేప్ కెన్నెడీ ఉన్నన్ని రోజులూ అతడా గది లోనే ఉన్నాడు.

రూము చిన్నదే. మధ్యరకం సైజులో ఒక పరుపు వేసి ఉంది. బట్టలు తగిలించుకోవడానికి హ్యంగర్ ఉంది. బెడ పక్కన ఒక షెల్ఫ్ ఉంది. అద్దం అదనంగా ఉంది, బయటికి వెళ్లే ముందు చక్కగా తల దువ్వుకోడానికి. అతడు తలుపు వేసే సమయానికి యూరీ ఇవానోవ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇద్దరూ పక్కపక్క రూముల్లోనే ఉంటున్నారు మరి.

ఇద్దరూ తెల్లని, గుండ్రని మెడ కలిగిన టావ్, లేత గోధుమ రంగు ట్రవుజర్స్ ధరించి ఉన్నారు. వాళ్లందరూ ధరించే యూనిఫారం అదే.

“గుడ్ మార్నింగ్, యూరీ!” నీల్ పలకరించాడు.

“గుడ్ మార్నింగ్, నీల్! ఈ గొప్పరోజున ఉద్విగంగా ఉన్నావా?” అనడిగాడు రష్యన్ టోన్‌లో.

“ఖచ్చితంగా చెప్పలేను. ఇక్కడ మనిద్దరిపై విపరీతమైన ఒత్తిడి ఉందని నీవు అనుకోవటం లేదా? వ్లాదిమిర్‍ని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారని నాకు తెలుసు. కాని అది కేవలం మీడియా వాళ్లకోసమే!” అని జవాబిచ్చాడు నీల్, కొంత తికమకగా.

ఒక మిషన్‍లో ఉన్నపుడు నెర్వస్ ఫీలవడం అతని బలహీనతల్లో ఒకటేమీ కాదు. కాని ఎందుకో, అలా ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాడు, తన స్నేహితుడు ఏమంటాడో విందామని. గత కొన్నివారాలు వాళ్లను ‘కలిపి ఉంచే’ ‘టైం అనుకొన్నా, కాని దురదృష్టం, అది అంతగా జరుగలేదు. యూరీ ప్రశ్నకు అతని స్పందన, సంభాషణను అతడు ప్రారంభించే విధానం.

వాళ్ల కారిడార్ నుండి బయటకు వస్తున్నారు. రూములన్నీ దాటుకుంటూ, ఆ పెద్ద హల్ వైపుగా ముందుకుసాగారు. అక్కడే వాళ్ళు వ్యోమగాముల దుస్తులు ధరించేది.

“ఇంతకు ముందు నీవు కొన్ని యితర మిషన్స్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నావని అనుకున్నా. నమ్ము నన్ను, నీవు ఒక మిషన్‍లో నెర్వస్‌గా ఉండడమనేది వినడం ఇదే మొదటిసారి. నిన్నటికి నిన్న, అందరూ ఎంతో కొంత ఆతృత, అందోళన పడుతూ ఉంటే, సరదాగా అందర్ని ‘కూల్’ చేసింది నీవే కదా?”

“ఏమిటి?” అన్నాడు నీల్. తాను మరీ ఎక్కువగా బయటపడ్డానని అర్థమై. అప్పుడు, ప్రతి ఒక్కరూ, యారీతో సహా తన వల్ల ప్రేరణ పొందారని అనిపించింది. అది విన్నంతనే, అతని స్వభావాన్ని బట్టి, కొంత ఇబ్బందిగా అనిపించిందతనికి. ఏదైనా అటూ ఇటూ అయితే?

“నీకు తెలుసా? నా గురించి నీవేమనుకున్నా, నేనూ మనిషినే కదా! ఒత్తిడి ఎక్కువైనపుడు నాకూ నెర్వస్ గానీ ఉంటుంది”

“నాకర్థమయింది, నీల్! అది సరే.. నేను నిన్ను ఆటపట్టిస్తున్నా. అంతే! నీకు తెలుసా, నేనింకా చాలా చిన్నవాడిగా ఉన్నపుడు, జర్మన్ ముట్టడి సమయంలో, నా కుటుంబాన్ని కాపాడాను. నేనేదీ అంత సులభంగా వదిలేసే రకాన్ని కాదు. నా మీద నేనే ఒత్తిడి పెంచుకొంటాను. అప్పుడు నేను వెనక్కి తగ్గనందుకు సంతోషిస్తున్నాయి. లేకపోతే నా కుటుంబమే ఉండేది కాదు. అంటే నేను కూడా! కాబట్టి, రిలాక్స్ ఉండు నేస్తం. నీకు ఒత్తిడి ఎక్కువగా ఉందనిపిస్తుంటే, మరీ మంచిది. నీవంటి సాటి నాయకుడి నుండి మాకు కావల్సిందదే!”

యూరీ మాటలతో, నీల్ కొంత సాంత్వన పొందాడు. యూరీ అంత గొప్పగా మాట్లాడతాడని అతడనుకోలేదు. అవి అతనికి కొంత అసహజమైన వెసులుబాటునిచ్చాయి. కాని యూరీ తన పక్కన ఉన్నందుకు అతనికి సంతోషంగా ఉంది. చాలా రిలీఫ్‌గా, ప్రశాంతంగా ఫీలయ్యాడు నీల్

ఈలోపు, యారీ తన కుటుంబాన్ని రక్షించినట్లు చెప్పగానే, మళ్లీ వాళ్లను చూడాలనిపించింది. ఆ నెల అతని పోగ్రాంలో, కుటుంబంతో గడపడం కూడా ఉంది; మిషన్‌కు ప్రిపేరవడంతో పాటు. కాని అది కుదరలేదు. తొందరగా మిషన్ పూర్తవ్వాలని, తన ప్రియాతిప్రియమైన కుటుంబంతో తాను వెకేషన్‌కు వెళ్లాలనీ అతని ఆశ.

అప్పుడే వాళ్లు హల్లో ప్రవేశించారు. అక్కడే వాళ్లు వృత్తిపరమైన దుస్తులు ధరించి, సిద్ధం కావాలి. కాని తాము ముందుగా వచ్చినట్లు వారికి అర్థమైంది. వ్లాదిమిర్ తప్ప, బృందంలోని సిబ్బంది ఎవరూ రాలేదు. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, ఎలాషా వారితో లేరు. వారు USS సార్స్‌ఫీల్డ్ అనే విధ్యంసక నౌకలో వెళ్లారు. అంటార్కిటికా వెళ్ళేందుకు దాన్ని ఆస్ట్రేలియాలో మోహరించారు. అక్కడి వారు పైర్ కంట్రోల్ రాడార్‍ను, అప్టికల్ సిస్టమ్స్‌ను ఉపయోగించి, రాకెట్లను లాంచ్ చేసేటప్పుడు ట్రాక్ చేస్తారు.

అక్కడ ఉన్న సిబ్బంది దుస్తులు వేసుకోవడానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. నీల్, యూరీ పనిలో దిగారు. వారితో మరో ముగ్గురు యువకులు కలిశారు. వారు కూడా పనితో బాగా పాల్గొంటున్నట్లు అనిపించింది.

“అమ్మయ్య! ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ ఇక్కడ లేనందుకు నాకు సంతోషంగా ఉంది” అన్నాడు కృష్ణ. ఆడపిల్లలు కొంచెం నవ్వారు. కాని అప్పుడ ముగ్గురు పెద్దవాళ్లు తమ వేడి, వాడి చూపులతో, వారిని చూశారు. వారు కాఠిన్యాన్ని, క్రమశిక్షణను ప్రొఫెసర్ గారి నుంచి నేర్చుకున్నారు. తాము ప్రారంభించబోయే మిషన్‌తో దాన్ని అమలు చేయాలని ఉన్నారు.

వారు దుస్తులు ధరిస్తూ ఉండగా, అలెక్సిస్ వచ్చాడు. వారికి క్లుప్తంగా వివరించాడు. వారు అంతరిక్షంలోకి వెళ్లేముందు మరో చిన్న వివరణ ఇవ్యాలనుకున్నట్లుగా ప్రొఫెసర్ కోరినట్లు అతను తెలియజేశాడు. వారంతా తయారయ్యేముందు, మరికొంతమంది అక్కడికి వచ్చారు.

పిల్లలు చేసే కోలాహలంతో హలు ప్రతిధ్వనించసాగింది. హాలు పెద్దదవడం వల్ల అలా జరిగిందేమో?

“డాడీ!” పిల్లలు గట్టిగా అరుస్తూ తండ్రి వైపుకు దూసుకువచ్చారు.

“రేచెల్! జేమ్స్!” నీల్ దిగ్భ్రాంతితో వారిని పిలిచాడు, సంభ్రమంగా వారి వైపు చూస్తూ. “మీరిక్కడికి ఎలా వచ్చారు?” అని అడిగాడు ఉద్వేగంగా.

వారు రావడం అతనికి ఆశ్చర్యంతో బాటు అనందాన్ని కూడా కలిగించింది. వ్యోమగామి సూట్‍లో ఉన్న అతడు వంగడానికి కొంత ఇబ్బందిపడ్డాడు. ఏదో ఒక రేపర్ చుట్టుకున్నట్లుగా ఉన్నాడు. అయినా, వంగి, పిల్లలిద్దర్నీ చేతుల్లోకి తీసుకున్నాడు, మళ్లీ మామూలుగా నిలబడ్డాడు, ఇద్దరి బుగ్గల మీదా రెండు ముద్దులు పెట్టాడు. తర్వాత దూరంగా నిలబడి ఉన్న తన భార్య టెస్సాను చూశాడు.

యూరీ కూడా, అంతరిక్షమంటే విపరీతమైన మోజున్న, తన కొడుకును చూసి, ఉద్వేగంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకొని, వాడి జుట్టు సవరించాడు. వాడిని క్రిందికి దించాడు. అతని భార్య, స్పేస్ సూట్‍ను ధరించిన తన భర్తను, ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉంది.

ఇంచుమించు సిబ్బంది అందరూ తమ కుటుంబాన్ని కలుసుకున్నట్లే, ఒక్క రాకేష్ కృష్ణ తప్ప! అతనికి, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, చాలా సేపు వారితో మాట్లాడుకోడానికి అవకాశం ఇచ్చారు.

టేకాఫ్‍కు ముందే, బృందం సభ్యులంతా తమ కుటుంబాలను కలుసుకొని, కొంత సమయం గడపడానికి ఆయా ప్రపంచ దేశాల నాయకుల నుండి ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అనుమతి తీసుకొని, ఇదంతా ముందే ప్లాన్ చేశారు.

‘నాసా’ కమాండ్ కంట్రోల్‌కు అధిపతి మిస్టర్ బ్రియాన్. కమాండ్ సెంటర్ నుంచి మిషన్ పనితీరును ట్రాక్ చేసే నెట్‌వర్క్‌ను ఆయన ఏర్పాటు చేశాడు. కౌంట్‌డౌన్ పరిణామాల గురించి ప్రొఫెసర్ ఆయనకు క్లుప్తంగా వివరించారు.

వారు వెళ్లి పోయేముందు, యూరీ, నీల్ చాలా భావావేశంతో వారితో గడిపారు. మిషన్‌లో ఏం జరిగినా సరే, మళ్లీ తమ కుటుంబాలను తాము తిరిగి చేరుకోవాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు.

రెండు గంటలు గడిచాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో, ప్రపంచమంతా వారిని వీక్షిస్తూ ఉండగా, అంతరిక్ష నౌకను అధిరోహించడానికి వారు సిద్ధమయ్యారు. లాంచ్ సైట్ లోకి కేవలం రెండు మీడియా ఛానెల్స్‌కే అనుమతి లభించింది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వారికి అవకాశం ఇస్తే పరిస్థితి అదుపు తప్పి, ఉక్కిరిబిక్కిరిగా తయారవుతుంది మొత్తం వ్యవహారం అంతా! ఉన్నవి రెండు ఛానెల్సే అయినా, లైవ్ వీడియో, ఆడియో కవరేజ్ ద్వారా ప్రపంచమంతా జరుగుతున్న దానిని ప్రత్యక్షంగా వీక్షిస్తుంది.

MSM సిబ్బంది డ్రెస్సింగ్ హాల్లోంచి నేరుగా బయట ఎండలోకి వచ్చారు. కుడి నుంచి ఎడమకు వారిని వరుసగా నిలబెట్టారు, ప్రజలకు నాటకీయంగా కనబడాలని. పూర్తి ఎడమవైపున, కుడి పక్క ఒలీవియా స్పెన్సర్ తన గుండ్రటి హెల్మెట్‌ను చేతితో పట్టుకొని ఉంది. తర్వాత రాజేష్ కృష్ణ, ఆ తర్వాత యూరీ ఇవానోవ్. తర్వాత వరుసలో నీల్. ఇద్దరిదీ మంచి జోడీ కద! అటువైపు పక్కనే వ్లాదిమిర్ నోవిక్.. అందరికంటే చివరేగాని, తక్కువేమి కాని, టోరిమోటో శాటో ఉంది. ఆమె ఆ బృందంలోని రెండో మహిళా గణిత శాస్త్రవేత్త.

ఆమె నాన్నగారు కూడా ఆమెను చూడడానికి వచ్చారు. ఆయన, మిషన్ సజావుగా సాగడం కోసం, తద్వారా తన కూతురు క్షేమంగా భూమికి దిగడం కోసం బోలెడు డబ్బు ఇచ్చారని తెలిసింది.

వాళ్లంతా సిద్ధంగా ఉన్న స్పేస్ రాకెట్ వైపు నడుస్తున్నారు. దాని ఎత్తును, అందాన్ని, ఠీవిని చూసి వారు అచ్చెరువు చెందకుండా ఉండలేకపోయారు. కాసేపటికి, వారంతా, కెన్నెడీ స్పేస్ సెంటర్ లోని, లాంచ్ కాంప్లెక్స్ 42A లోని MSM 6 పై భాగాన కూర్చొని ఉన్నారు. ఆ రాకెట్ మూడు భాగాలుగా, 432 అడుగుల ఎత్తుంది. వారందరినీ ఒక్క ఉదుటున పైకి రయ్యిన తీసుకపోవడానికి, మళ్లీ అంతే స్థాయిలో క్రిందికి తీసుకురావడానికీ, ఆ ప్రచండమైన ‘త్రోపుడు’కై, 8.9 మిలియన్ పౌండ్ల శక్తిని ఉపయోగించుకుంటుంది.

ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, మిషన్ కంట్రోల్ షిప్ నుంచి సౌండ్ చెక్స్ చేసిన తర్వాత, వారంతా ఇతర చెక్స్ కోసం కదిలారు. భూమి మీద ఉన్న అన్ని ఖండాలూ దాని విస్ఫోటనాన్ని దర్శించడానికి ఎదురుచూస్తూన్నాయి. కొంతమంది పౌరులు, ఆ ప్రాంతంలో నివసించేవారు స్పేస్ షిప్ అంతరిక్షం లోకి దూసుకోపోవడాన్ని చూడడానికి, దగ్గరగా గుమిగూడారు.

ఫాన్సిస్ మైకులో చెప్పిన “ప్యూయల్ చెక్?” అన్న మాటలను రేడియో రిలే చేసింది.

“చెక్! ప్యూయల్ పేర్చడం పూర్తయింది. వెళ్లడానికి సిద్ధం!” కృష్ణ చిరునవ్వుతో, తన హెల్మెట్ క్రింది నుంచి ఖవాబిచ్చాడు.

“సందేశం స్వీకరించాం. లాంచ్‌కు కౌంట్‌డౌన్ కోసం, సిద్ధంగా ఉండండి” ఆ గొంతు స్పందించింది. క్రింద కొంత రణగొణ శబ్దాలు.

సరిగ్గా 1.19 PM EDT (Eastern Day Light Time) కి రాకెట్ గాల్లోకి ఎగిరింది. దానినుండి విపరీతమైన పొగ వెలువడింది. ఆ ప్రచండమైన త్రోపుడు వారిని ఆకాశంలోకి సర్రున తీసుకుపోయింది. దాని ఎస్కేప్ వెలాసిటీ (తప్పించుకొనే వీగం, త్వరణం) వారిని భూమ్యాకర్షణశక్తి నుంచి వేరు చేసింది. ఖచ్చితంగా 12 నిమిషాల తర్వాత వారు భూకక్ష్యలో ప్రవేశించారు.

క్రింద కంట్రోల్ షిప్ దగ్గర బిగ్గరగా హర్షధ్వానాలు! అంతరిక్ష కార్యాచరణ బృందం వారు ఉద్వేగంతో కేకలు వేశారు. ఆ ప్రయాణం, నౌకలోని యువకులకు, పెద్దలకు అంతే ఉత్సాహంగా ఉంది. విశ్యంలో ప్రస్తుతం తామున్న స్థానాన్ని చూసి వారంతా అబ్బురపడ్డారు.

ఒకటిన్నర కక్ష్యల ద్వారా ప్రయాణించారు. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ గొంతు, క్రింద కంట్రోల్ షిప్ నుండి వారికి ఆదేశాలు రిలే చేయసాగింది, రేడియో ద్వారా. వారు ప్రయాణించవలసిన కో-ఆర్డినేట్స్‌ను (ఒక మిషన్ లోని కీలక అంశాలు) ఆయన వారికి పంపసాగాడు. శాటో, అంతరిక్ష నౌక లోని తన పనిని మళ్లీ మొదలుపెట్టింది. ట్రాజెక్టరీ, అంటే నౌక ప్రయాణించే మార్గాన్ని, లెక్కించసాగింది. వ్యర్థాలను, తీసుకుపోతున్న వాహనాన్ని ట్రాక్ చేయడానికి పనికొచ్చే సంఖ్యలను ఆమె రాబట్టింది.

“బాగా వేగంగా చేశావు” అని ప్రశంసించాడు వ్లాదిమిర్ నోవిక్. అతడు తన సీట్లో సౌకర్యంగా కూర్చుని ఉన్నాడు.

అతడు ఆ సంఖ్యలను పరికరంలోకి ప్రవేశపెట్టాడు. మామూలు ఆకుపచ్చరంగు గల వాటిని వృత్తాలలో ప్రత్యేకంగా గుర్తించాడు. చివరికి వారంతా ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్నది రానే వచ్చింది. వారి ట్రాకింగ్ డివైస్‌ మీద ఆ నౌక కనబడింది! మళ్లీ వీరి స్పేస్ షిప్‍లో, భూమ్మీద కంట్రోల్ కేంద్రంలో హర్షాతిరేకాలు!

మీడియా, అంతవరకు కంట్రోల్ షిప్ నుంచి తమకు వచ్చిన సమాచారాన్ని మటుకే రిలే చేస్తోంది. మిషన్ ప్రణాళికాబద్ధంగా, ఇంకా మెరుగ్గా ముందుకు సాగుతున్నదని వారు ప్రకటించినపుడు ప్రపంచమంతటా ఆనందం వెల్లివిరిసింది.

అంతరిక్ష నౌకను అదుపు చేస్తున్నవాడు నీల్. అతడు చేయాల్సిందల్లా నౌకను నిర్దేశత దిశలో నడపడమే. దాన్నతడు అతి సులభంగా, తనకందిన ఆదేశాలను కనుగుణంగా చేయగలుగుతున్నాడు. వారు అణుధార్మిక వ్యర్థాలను మోసుకెళుతూన్న ఆ వాహనం వైపుగా సాగుతున్నారు.

అది పూర్తవుతే, వారి మిషన్‍లో మొదటి భాగం పూర్తయినట్లే. శాటో, తాము సరైన ట్రాక్ లోనే వెళుతున్నామా లేదా అని మరోసారి గణించి చూసింది. నంబర్లు సిద్ధమై, డివైస్‌లో ఎంటర్ చేశాక, నౌక సరైన మార్గంలోనే పయనిస్తున్నదని తెలిసి మరోసారి విజయధ్వానాలు!

“దాని పథం (ట్రాజెక్టరీ) దగ్గరవుతున్నట్లనిపిస్తుంది” అన్నాడు యూరీ.

అతని ప్రకటన ప్రొఫెసర్‌కు ఊరట నిచ్చింది. ఆయన కుర్చీలో వెనక్కు వాలి నిట్టూర్చాడు. మొత్తం బృందమంతా హాయిగా నవ్వింది!

“MSM 6, కూర్చోండి, రైడ్‌ను ఎంజాయ్ చేయండి”

మార్స్‌ను రక్షించే మిషన్ సజావుగా, ఒడిదుడుకులు లేకుండా వెళుతూన్నందుకు మరోసారి ప్రపంచ ప్రజలంతా కేరింతలు కొట్టారు. సిబ్బంది ఇంకా నౌక లోని మొదటి మాడ్యూల్ (కాలప్రమాణము) లోనే ఉన్నారు. యూరోపియన్ యూనియన్ పంపిన మొదటి మాడ్యూల్ ఎప్పుడు వినియోగం అయిపోతుందా అని చూస్తున్నారు.

సిబ్బంది తాము కట్టుకొన్న పట్టీలను తొలగించుకొని, అంతరిక్షంలోని భారహీనతను, నౌకలో తేలుతూ, అనుభవించసాగారు. అంతరిక్షంలో గ్రావిటీ పనిచేయదు!

“కొత్తగా వచ్చినవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి! తెలియకుండా ఏ బటన్‌నూ ముట్టుకోకండేం?” అన్నాడు యూరీ, అందర్నీ నవ్విస్తూ. వారంతా నౌకను గట్టిగా పట్టుకొని, అంతరిక్షంలోని అంధకారపు అందాన్ని చూడసాగారు. అది వేలవేల నక్షత్రాలను తనలో పెట్టుకోంది, వారి కనుచూపు మేర.

MSM 6, అదృష్టవశాత్తు, నూక్లియర్ వేస్టు ఉన్న నౌకకు కొన్ని కిలోమీటర్ల దగ్గరగా చేరుకోసాగింది; చంద్రుడికి భూమికి మధ్య నున్న దూరాన్ని దాటి. భూమి నుంచి చంద్రుడికి 384,400 కి.మీ. దూరం. భూమి నుండి వ్యర్థాల నౌక ఉన్న దూరం 502,312 కి.మీ. అంటే బాగా దగ్గరికి వచ్చేశారన్నమాట! అదృష్టమే! అది ఎంత దగ్గర అనుకున్నా, దాన్ని చేరడానికి వారింకా ఐదు రోజులు అంతరిక్షంలో గడపాలి.

చంద్రగ్రహనికి ప్రయాణం చాలా క్లిష్టమైనది. ఇప్పుడు వీళ్లు చేస్తున్నది మరీను. అపోలో 11 నౌకలో పని చేసినవారు ఆ బృందంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. కాని క్లిష్టత క్లిష్టతే కదా! అపోలో 11, స్పుత్నిక్ టీములే లేకపోయి ఉంటే, అది చంద్రుని మీద కాలు మోపడం కంటే పది రెట్లు కష్టమయ్యేది.

వారు ఆ వాహనానికి దగ్గరగా వెళుతున్నామని, ఇక ఏ ఇబ్బందులూ ఉండవని అనుకున్న కాసేపటికే, అంటే రెండు గంటల తర్వాత వ్లాదిమిర్ కనిపెట్టాడు, అది తమ రేంజ్‌లో ఎంత మాత్రమూ లేదని. పైన వ్యోమనౌకలో, క్రింద కంట్రోల్ షిప్‍లో కొంత అందోళన, ఆతృత వ్యాపించాయి. ప్రతి ఒక్కరు దానిమీద పనిచేయడానికి ఉపక్రమించారు. చాలా నిమిషాల తర్వాత, శాటో శ్రమించి, అది ఎక్కడ ఉందో, ఎందుకు మిస్ అయ్యిందో కనిపెట్టగలిగింది.

దాన్ని వారు ట్రాక్ చేసిన తర్వాత, తేలిందేమంటే, అది తన పయన మార్గాన్ని మార్చుకుంటూ ఉంది. కాని మార్స్ గ్రహం మీదే దాని చివరి మజిలీ అని అర్థమైంది. ఇది వాళ్లు ఊహించినదే. దానికి సిద్ధపడి ఉన్నదే.

రోజులు నిదానంగా గడిచాయి. నిరీక్షణ అనంతం అనిపించింది. వారు ఎక్కువ సమయాన్ని నౌకని యుక్తిగా నిర్వహించండం లోనే గడిపారు. తమ ట్రాకింగ్ డివైస్‌ మీద కనపడుతున్న ఆ వ్యర్థాల నౌక పైనే దృష్టిపెట్టి ఉన్నారు. అంతేగాకుండా, గత సంవత్సరాలలో జరిగిన యుద్ధం తాలూకు కథలను చెప్పుకుంటూ గడిపారు. సిబ్బంది లోని, వయసులో పెద్దవారే ఎక్కువగా మాట్లాడారు.

ఒక మెరుపు దాడిలా ముగిసిన, తాను వెళ్లిన ఒక మిషన్ గురించి చెప్పాడు నీల్. అతని మాటల్లోనే చెప్పాలంటే, అది ఒక తీవ్రమైన యుద్ధం. దానిలో అతని మనుషులెందరో గాయపడ్డారు. అతని సైనికులలో ఒకరు మరణించడం అతనిలోని శౌర్యాన్ని నిద్రలేపింది.

“స్కాట్ గనుక ఇక్కడ ఉండి ఉంటే, మీకు మరిన్ని విషయాలు చెప్పేవాడు” అన్నాడు నీల్ తన తలను భుజం మీదుగా పక్కకు తిప్పుతూ. “నేను దుమ్ము కొట్టుకొనిపోయి, మట్టిలో పడి ఉండగా, శత్రువుల్లో ఒకరు స్కాట్‌ను కాలి మీద కాల్చారు. నేను అతని ప్రాణాన్ని కాపాడలేకపోయాను” అన్నాడు విచారంగా. అతని చిరునవ్వులో పెను విషాదం.

“తర్వాత, శత్రువును స్వర్గానికి పంపి, స్కాట్‌ను భుజాల మీద వేసుకొని, నా ప్రాణాల కోసం, మా బేస్‌కు పరిగెత్తసాగాను. బుల్లెట్లు నా చెవి పక్కన శబ్దం చేస్తూ దూసుకుపోతున్నాయి. ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అది భయంకరమైన యుద్ధం అన్నది నిజం. నా వీపులో ఒక బల్లెట్ దిగబడింది. మిగతా మా వాళ్ళున్న గుంతలో నేను పడిపోయాడు. ఆ బుల్లెట్ గాయపు మచ్చను మీకు చూపించి ఉండేవాణ్ణి. కాని అది అయ్యే పని కాదు, ఈ వ్యోమగామి దుస్తుల్లో!” అన్నాడు.

అలాంటి ఉత్కంఠభరితమైన ఎన్నో కథలు చెప్పాడు నీల్. ఇతరులు కూడా తమ అనుభవాలు వివరించారు. వారంతా యుద్ధవీరులే, ముగ్గురు యువకులు తప్ప. జర్మనీ వారు లెనిన్‌గ్రాడ్‌పై చేసిన దాడిలో, యూరీ, రహస్య స్థావరాల నుంచి దాడి చేసే స్నైపర్ నుండి ఎలా విజయవంతంగా తప్పించుకున్నాడో ఒలివియాకు కూడా తెలుసు. ఆమె ఇలా అన్నది –

“ప్రతి మూల స్నైపర్స్ పొంచి ఉన్నారు. నేను విన్నదాన్ని బట్టి మీరు (యూరీ), వారి నిశితమైన గద్ద చూపుల నుండి అద్భుతంగా తప్పించుకున్నారు.”

“నిజంగా ఆశ్చర్యం! నేను కూడా మీలాంటి వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎదగాలని ఉంది” అన్నాడు రాకేష్ కృష్ణ సాలోచనగా.

“మార్స్‌ని రక్షించడం కంటే మెరుగైన వారసత్యం ఏముంటుంది?” అని అరిచాడు వ్లాదిమిర్. అందరూ నవ్వారు.

“ఒకసారి నీవు ఈ నౌకలో లేవని ఊహించుకో. ఒక రోజు ముందు ఏం జరిగిందో గుర్తుచేసుకో. దీనిని ఎవరికి ఆపాదిస్తావు? పైలట్ ఐన నీల్‌కా, లేక గణిత శాస్త్రవేత్త శాటోకా? ఇది నీ వారసత్వం. నీ మిషన్ ఇది. నీవే గనక లేకపోయి ఉంటే, అత్యంత క్లిష్టమైన ఆ అల్గారిథమ్‌ను ఎవరూ విజయవంతంగా ప్రోగ్రాం చేసి ఉండేవారు కాదు. స్పేస్ బాడీస్ తాలూకు టెలిమెట్రి మార్గాలను అంచనాలు వేసి, ముందుగానే చెప్పడంతో నీవు ఘటికుడివి. ఈ మిషన్‌లో, నౌకలో నీవు చాలా అవసరం కృష్ణా! అది నేను గుర్తుచేయనవసరం లేదు. దానికి ఉదాహరణ ఇదే. నిన్న నీవు నిరంతరాయంగా కంప్యూటర్ ప్రోగ్రాములను మారుస్తూ, టార్గెట్స్‌ను, స్పేస్‌షిప్‌ను తిరిగి ట్రాక్ చేయవలసివచ్చింది కదా!”

“ఓహ్ మిస్టర్ వ్లాదిమిర్! మీరు ఆ విధంగా వర్ణించేంతవరకు, నేనంత అందమైన కిరీటం నా తలపై పెట్టుకున్నానని నాకు తెలియని తెలియదు” అన్నాడు కృష్ణ ఎత్తిపొడుస్తున్నట్లుగా. టీమంతా నవ్వులతో పరుచుకుంది.

“భగవంతుడా! ఫ్రెండ్స్, దొరికింది!” అని అరిచింది ఒలివియా. అందరూ తమ మానసిక స్థితిని పని వైపు మళ్లించారు. తమ తమ పొజిషన్స్‌ను కొనసాగించారు. టార్గెట్‌ను చూశామని కంట్రోల్ షిప్‍కు వర్తమానం పంపారు రేడియో ద్వారా. ఆ వార్త మంచిదైనా, బృందం మొత్తానికే కాకుండా, ఆ మిషన్‌కు సంబంధించిన ప్రతి ఒక్కరిలో ఒత్తిడి పెంచింది.

కిటికీలోంచి, న్యూక్లియర్ వ్యర్థాలను తీసుకు వెడుతున్న వాహనాన్ని (నౌకను) వారు దగ్గరగా చూడగలిగారు. వారు దాని కంటే చాలా వేగంగా కదులుతున్నట్లు అర్థమైంది. వారి వ్యోమనౌకను, వేగం తగ్గించి, నెమ్మదిగా ఆ వ్యర్థాల నౌకకు తగిలించాలనే వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ నౌక ఒక సిలిండర్ ఆకారంలో ఉంది.

వారు నిర్వర్తించాల్సిన ఉపాయాలు చాలా సంక్లిష్టమైనవి. వారి వ్యోమనౌక ఇంచుమించు వ్యర్థాల నౌకను గుద్దుకోబోయేది; కొంచెం ఏమరుపాటుగా ఉండి ఉంటే! వారి ముందు అది దూరంగా వెళ్లింది. వారు కేవలం దాన్ని తమ నౌకకు తగిలించుకుందామని ప్రయత్నించారు. కాని ఫలితం తప్పుగా వచ్చింది. వారి జీవితాల్లోని అత్యంత వ్యగ్రతతో కూడిన క్షణాలవి.

కాక్‌పి‍ట్‌లో పూర్తి నిశ్శబ్దం. డివైస్ చేస్తున్న ఎడతెగని బీపింగ్ శబ్దాలు తప్ప ఏమి వినపడడం లేదు.

“ఏమిటి సమస్య?” నీల్ అడిగాడు, ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించకుండా.

కాసేపటికి శాటో చెప్పింది “రేడియేషన్!”

“రేడియేషన్‌తో ఏమిటి?” అన్నదో గొంతు. అమె దాన్ని పట్టించుకోలేదు. వెంటనే అమె కంట్రల్ షిప్‌ను రేడియోలో సంప్రదించింది.

ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అక్కడే ఉన్నారు. అతని స్పందనలో అతడెంత క్రుంగిపోయాడో తెలిసింది.

“MSM 6 కు ఏమయింది?”

“మేము ట్రాజెక్టరీ (నౌక మార్గం), కోణం. అన్నీ పకడ్బందీగా గణించాము సర్. కాని మాకు మరింత గడ్డు పరిస్థితి ఎదురైంది. ఏదో సమాచార లోపం! మా లెక్కలు 99.99 శాతం పక్కాగా ఉన్నాయి.”

“సమాచార లోపమా? ఏమిటది?” అడిగాడు ప్రొఫెసర్, కొంచెం ఉత్కంఠగా.

“మనం ప్రతిదీ ప్లాన్ చేశాం. ట్రాజెక్టరీని, దిశను, డిగ్రీని, వెలాసిటీ (వేగాన్ని). దేన్ని మరిచాం?”

“మీరు చెప్పిందంతా కరెక్టే సర్. కోణం (డిగ్రీ) గురించి ఒక చిన్న సమాచార శకలం మిస్ అయింది. మన కోణం కాదు. న్యూక్లియర్ వేస్ట్ రేడియేషన్ మన నౌకకు ఇవ్వబోయే కోణం (డిగ్రీ). అది అందులో లేదు!” తన శక్తిమేరకు శాటో వివరించింది.

“ఎంత పనైంది? ఇంకా దాని పరిణామం సంభవించలేదా?” మిస్టర్ బ్రియాన్ అడిగాడు.

“దాని స్పిన్నింగ్ యాక్సిస్ (అక్షం చుట్టూ తనంతట తానే పరిభ్రమించడం)ను ఒకసారి చెక్ చేయండి.”

“నాకు భయం వేస్తుంది” అన్నాడు నీల్ ఈసారి, జవాబిస్తూ.

మిస్టర్ బ్రియాన్ తన ముందున్న కంప్యూటర్‍పై మోచేతిని ఆనించాడు. నిలబడే ఉన్నాడు; గడ్డాన్ని చేతితో పెట్టుకొని. అతని టీం సభ్యులంతా ట్రాకర్‌నే కుతూహలంగా చూస్తూ ఉన్నారు.

“ఈ విక్షేపం (పక్కకు తొలగడం) స్పిన్నింగ్ యాక్సిస్‌ని మనం తప్పుగా నిర్ణయించడమా? మనం ట్రాక్ నుండి ఎన్ని డిగ్రీలు డిప్లెక్ట్ (పక్కకు మళ్లడం) అయ్యాము?”

“అది సుమారు 0.498 డిగ్రీలుంటుంది సర్. వ్యోమనౌక కుదుపును బట్టి, చివరగా తీసిన లెక్క ప్రకారం, నేను ఇంజన్ల కాంప్యూటేషన్‌ని అడ్జస్ట్ చేశాను” అన్నాడు కృష్ణ.

“అయితే మీరు వందశాతం కాదని చెబుతున్నారు మౌలికంగా. మన మిషన్ నెరవేరలేదయితే”

“అనే భయపడుతున్నా. మరో యాంగిల్‍లో నౌకను నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాని కొంచెం ఆలస్యమైంది” యూరీ అన్నాడు. “అంతే కాదు, ట్రబుల్ అంతటితో ఆగలేదు!”

ఆ మాటలు వినడానికి ఫ్రొఫెసర్ ఫ్రాన్సిస్ ఇష్టపడలేడు. అవి ఆయనను ఆందోళనకు గురిచేశాయి. ఆ రూములో ఆందోళనకు గురయ్యింది ఆయనొక్కడే కాదు, అందరూ. మిషన్ సాఫల్యం చెందలేదు. అది పూర్తి కాకపోయినా, క్రింద నౌక లోని సభ్యలంతా చేతులెత్తేశారు.

“ఏమిటి ట్రబుల్?”

“ఒక ఇంధన ట్యాంకు సామర్థ్యం మధ్య స్థాయిలో ఉండొచ్చు, సర్!” కృష్ణ చెప్పాడు, స్పందించడానికి యూరీ వెనుకాడుతుండడం గమనించి.

ఆ వార్త మీడియాకు చేరింది. మీడియా దాన్ని ప్రపంచానికి చేర్చింది. ప్రపంచం గగ్గోలు పెట్టసాగింది. ‘బ్రేకింగ్ న్యూస్! మార్స్ పని అయిపోయింది. తర్వాత భూమే!’

“మొట్టమొదట, మనకున్న ప్రత్యామ్నాయాలేమిటి? వరుసగా చెప్పండి. తర్వాత చెయ్యాల్సింది తెలుసుకొందాం.”

రెండు నిమిషాల తర్వాత, వారు లెక్కలు వేశారు. ఎలా చేస్తే ఫలితాలు బాగుంటాయో కనుగొన్నారు. గ్రూపులోని గణిత శాస్త్రవేత్తలు, పోగ్రామర్స్, ఇద్దరూ దీని మీద పని చేశారు.

తర్వాత శాటో వాటిని అంటార్కిటికాలోని కంట్రల్ షిప్‌కు రేడియో ద్వారా తెలిపింది.

“రెండు లేదా మూడు ఫలితాలున్నాయి. మనం భూమి నుంచి తెచ్చుకున్నఇంధనం, సాలిడ్ ప్రొపెల్లెంట్, లిక్విడ్ ఆక్సిజన్ కలిసి 1.5 టన్నుల గ్యాలన్లు. అందులోనుంచి 0.81 టన్నుల ఇంధనాన్ని వాడాము.

“పోల్చి చూస్తే, అంతరిక్షం లోకి వెళ్లడం కంటే, భూమికి తిరిగిరావడం సులభం. కేవలం మనల్ని క్రిందికి తోయడానికి తగినంత చాలు. భూమ్యాకర్షణశక్తి మిగతా పని చూసుకుంటుంది. మన దగ్గర కావలసిన దాని కంటే కొంచెం ఎక్కువే ఉంది.” అని శాటో వివరించింది. ఊపిరి తీసుకోవడానికి కాసేపు ఆగింది.

“మనం మార్స్ ఖర్మకు దాన్నొదిలేసి, టీం మెంబర్లందరితో, క్షేమంగా క్రిందికి దిగొచ్చు. లేదా ముందుకు సాగడానికే మొగ్గు చూపవచ్చు. కొన్ని కొత్త లెక్కలు వేయడం జరిగిన తర్వాత, రేడియేషన్‌ను మనసులో ఉంచుకొని, అది కదులుతూన్న మార్గాన్ని మరొకసారి గుణించి, ఆ వ్యర్థాల నౌకను తగిలించుకోవాలి. రెండో ఆప్షన్‌లో జరుగబోయేది ఏమిటంటే, మనందరికీ భూమికి తిరిగి వెళ్లేంత ఇంధనం మిగలదు. ఎందుకంటే మనం భూమినుంచి చాలా దూరం వచ్చేశాం. తిరిగి రావడమంటే మరణం తప్పదని అర్థం!”

ప్రతి ఒక్కరూ అతి నిశ్శబ్దంగా ఉండిపోయారు. తాము ఉన్న సంధిగ్ధావస్థను వారు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. అంటార్కిటికాలోని కంట్రోల్ షిప్ లోని పరిస్థితి కూడా ఇదే. యంత్రాలే గనుక ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకుంటే, అవి తమ బీపింగ్ శబ్దాలను ఆపేసి, వాతావరణానికి అవసరమైన అధివాస్తవిక నిశ్శచ్దాన్ని అందించి ఉండేవి.

ఈ వార్త మీడియాకు అందింది. ప్రపంచమంతా భయాందోళనలు వ్యాపించాయి. టెస్సా తన లివింగ్ రూంలో ఉంది. వార్తలు చదివే వ్యక్తి గొంతు ఇలా అంటుంది. “మార్స్‌ను రక్షించే మిషన్ విఫలమైనట్లే. తరువాత భూగ్రహమేనా ఇక? కాకపోతే, అక్కడి సిబ్బంది ఏం కానున్నారు?”

ఆమె చేతిలోని ట్రీ క్రిందపడి పోయింది. అమె కూడ నేల మీదికి జారిపోయింది. అమె ముఖం కందిపోయి, కళ్లనుండి నీళ్లు ప్రవహించసాగాయి.

“కంట్రోల్ షిప్, నా మాట వినబడుతూందా?” అనడిగాడు నీల్ రేడియోలో, కాక్‍పిట్‌లో చాలా సేపట్నించి ఉన్న నిశబ్దాన్ని ఛేదిస్తూ. అతని మనసులో ఏ ప్రణాళిక రూపుదిద్దుకుంటూందో ఎవరికీ తెలియలేదు.

“వృథా అయ్యే ప్రతి నిమిషం, పరిస్థితి లోని క్లిష్టతను మరింత పెంచుతుంది” అన్నాడు యూరీ విషయాన్ని మరింత జటిలం చేస్తూ.

“గట్టిగా, స్పష్టంగా చెప్పండి. మీ స్టేటస్ ఏమిటి?” ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అడిగాడు.

“మనం ఆలస్యం చేసే కొద్దీ, మరింత ఇంధనాన్ని నష్టపోతాం. ప్రపంచం లోని ప్రజలను అడగండి, ఏం చేయాలా? MSM 6 రెండు గ్రూపులుగా విడిపోవాలి. కొందరు సబ్ మాడ్యూల్‌లో, మరికొందరు మెయిన్ మాడ్యూల్‍లో ఉండాలి. ఎలాగైనా సరే మార్స్‌ని రక్షించాలనుకుంటే ఒక్క ఊపున వెళ్ళి దాన్ని తాకాలి. మిగతావాళ్లు కిందికి తిరిగి రావాలి. ప్రపంచ దేశాల నాయకులు ఏమంటారో విందాం”

“మెసేజ్ అందింది నీల్. తర్వాతి ఆదేశాల కోసం వెయిట్ చేయండి. మార్స్‌ని కాపాడటానికి ఇంకా ఆశ ఏమైనా ఉందేమో లెక్కలు వేయడానికి ప్రయత్నించండి. త్వరగా మళ్లీ మీతో మాట్లాడతా.”

క్షణం లోపే, ప్రొఫెసర్ ఫ్రాన్సిన్ ఇలాషాకు సైగ చేశాడు. ఆమెకు ఏం చేయాలో తెలుసు. మరుక్షణంలో, ఆమె ప్రపంచం నలుమాలలకూ కాల్స్ పంపడం ప్రారంభించింది. ప్రపంచ దేశాల నాయకులందరికీ పరిస్థితిని ఆమె వివరించాలి. ప్రముఖ నాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు కావాలని అందరికీ పిలుపు వెళ్లింది. త్వరలోనే ముఫ్ఫై దేశాల నుంచి స్పందన వచ్చింది.

ఆ సమాచారం దావానలంలా వ్యాపించడంతో, మీడియా అంతా పాకింది. వారి ముందు ప్రస్తుతం విఫలమైన మిషన్ ఉంది. ఐక్యరాజ్యసమితి వారు నిర్వహించిన గత సమావేశంలో మిస్టర్ మార్టిన్ వారిని ముందే హెచ్చరించినా, వారు వినలేదు. మిషన్ పూర్తిగా విఫలం కాకపోయినా, ఏదో ఆశ మినుకుమినుకుమంటూ ఉంది.

మరో రెండు గంటల తర్వాత వచ్చి చెబుతానని MSM 6 సిబ్బందికి భరోసా ఇచ్చి, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కంట్రోలు రూం నుంచి బయటకు వచ్చాడు. అందరు నాయకుల కోసం అసహనంగా ఎదురు చూసిన తర్వాత, పదిహేడు గంటలకు అందరూ ఒక్కచోట చేరగలిగారు

వారంతా ఎంత ఆలస్యం చేస్తే, అంతరిక్షంలోని సిబ్బందికి అంత ప్రమాదం. ఈ విషయం ఫ్రాన్సిస్‌కి తెలుసు. వేగంగా, క్లుప్తంగా, ఆయన తమ ముందున్న రెండు ఆప్షన్లను వారికి వివరించాడు. నాయికులందరికీ అదే సందిగ్ధత! మొదట్లో బహిరంగంగా మిషన్‌కు మద్దతిచ్చిన నాయకులు కూడా అయోమయానికి లోనయ్యారు. ఎంతో ధనాన్ని, మానవ వరులను మిషన్‌లో పోసిన దేశాలన్నీ సర్వనాశనమైనాయి.

వారు చాలా సేపు చర్చించుకున్నారు. మొదట్లో జరిగినట్లే, కొందరేమో మిషన్‌ను ఆపివేయాలని, మరి కొందరు మిషన్ అన్నిటికంటే ముఖ్యం, అందుకేగదా మొదట దాన్ని సక్రియం చేశాం అని వాదించారు. ఎక్కువ సేపు చర్చించేంత టైం లేదు. మరీ ఆలస్యం చేస్తే వ్యోమగాములు భూమికి తిరిగి రావడం అసాధ్యం.

ఈ సమయంలో, కొన్ని దేశాలు మళ్లీ తూష్ణీంభావం వహించి అమెరికా, రష్యా దేశాలను – అసలు ఆ వ్యర్థాలను అంతరిక్షంలో డంప్ చేసిన అనాగరిక దేశం ఏదని అడిగాయి. ఆ దేశాలను బాధ్యులుగా చేసి, అవి చేసిన నిర్హేతుక చర్యలకు వాటిని శిక్షించాలని కోరాయి. కాని అటు రష్యాగాని, ఇటు అమెరికా గాని దాని మీద ఆసక్తి చూపలేదు.

భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి చర్చించసాగారు. లేవనెత్తిన ప్రశ్న చాలా సేపు గాలితో కదలాడింది. నేరుగా స్పందించేందుకు ఎవరికీ ధైర్యం లేదు. తాము ప్రతిపాదించే ఫలితానికి బాధ్యత వహించాలని ఎవరూ అనుకోలేదు. అంతరిక్షంలోని వ్యోమగాములా? లేక తాము ఊహించలేని భవితా? మిషన్‌ను కొనసాగించడం ఇంచుమించు అసాధ్యం. మార్స్ ప్రయాణం ఇంకా చాలా దూరం, పైగా ఆలస్యం. అదీగాక, మిషన్ కయ్యే ఖర్చు కూడా చూసుకోవాలి. మొదటి ప్రయత్నమే ప్రపంచపు మొత్తం ఆదాయంలో నాల్గవ వంతును తినేసింది.

“ఇక మిషన్ గురించి ఎక్కువగా చెప్పాల్సిందేమీ లేదు. ఇది మన చేయి దాటి పోయింది. ఇది అక్షరాలా నిజం!” అన్నాడు మిస్టర్ గ్యారిసన్. ఆయన యూరోపియన్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

“విషయం ఏమిటంటే, యుద్ధరంగంలోని వారినే నిర్ణయం తీసుకోమని మనం వారికే ఎందుకు వదిలేయకూడదు? మొదట వారి సమ్మతి లేకుండానే మనం నిర్ణయం తీసుకున్నాం. వారు కాదనలేదు. ఎందుకంటే వారి దేశాన్ని వారు గౌరవించారు కాబట్టి. ఇప్పుడు దేశం కాదు, మొత్తం మానవజాతి గౌరవం వారి మీద ఆధారపడి ఉంది. దాని కోసం వారిని నిర్ణయం తీసుకోనిద్దాం. భవిష్యత్తు వారి చేతిలో ఉంది.”

దేశాలు అంగీకరించాయి. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ అంటార్కిటికా షిప్‌ లోని కంట్రోల్ రూమ్ లోకి వెంటనే ప్రవేశించాడు.

“MSM 6, నామాట వినబడుతూందా?” అని అడిగాడాయన. ఒక వేలితో నోటి మీద నెర్వస్‌గా కొట్టుకొన్నాడు.

“వినబడుతూంది. ఏం నిర్ణయం తీసుకున్నారు?” శాటో  అడిగింది. రేడియోలో మొదటగా ప్రొఫెసర్ మాటలకు స్పందించింది ఆమే. మిగతా అందరూ తమ జీవితం లోని జ్ఞాపకాలను తవ్వుకుంటూ బిజీగా ఉన్నారు.

“నిర్ణయం మీదే! మీరే తీసుకోవాలి! మిమ్మల్ని మీరు రక్షించుకుంటారా లేక మానవజాతిని కాపాడతారా, అనేది?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here