కారణంబేది?

0
3

(శ్రీ జిల్లేళ్ళ బాలాజీ రచించిన ‘కారణంబేది?’ అనే హాస్య కథని పాఠకులకు అందిస్తున్నాము.)

[dropcap]త[/dropcap]మ కొడుకు జి.బి. కాలనీలోని ఓ కుప్పతొట్టి దగ్గర స్పృహలేకుండా పడున్నాడని తెలిసి మంత్రి కోటిలింగం దంపతులు వెంటనే కారు తీసుకుని బయలుదేరారు.

చెత్తాచెదారాల మధ్య అస్తవ్యస్తంగా పడున్న కొడుకు పవన్‌ను చూసేసరికి కోటిలింగానికి కోపం నషాళానికెక్కింది. “ప్రతిపక్షాలు తననేమీ చెయ్యలేక తన కొడుకుపై చేసిన పిరికిపంద చర్య ఇది” అని పళ్లు పటపటమంటూ కొరికాడు. ఈలోపు ఆయన భార్య హైపిచ్‌లో ఏడుపు మొదలుపెట్టింది. కోటిలింగం ఉలిక్కిపడి అటు ఇటు చూస్తూ.. ‘థాంక్ గాడ్! వీణ్ణెవరూ ఇంకా తన కొడుకుగా గుర్తుపట్టలేదు. దీని ఏడుపు చూసి జనం గుమిగూడి గుర్తిస్తే ఇక అంతే!’ అనుకున్నాడు. వెంటనే కొడుకును కారులో వేసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రహస్యంగా అడ్మిట్ చేశారు కోటిలింగం దంపతులు.

ఇంటరు చదువుతున్న పవన్, కోటిలింగం దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెరుగుతున్న సుపుత్రుడు. ఆయన సంపాదించిన యావదాస్తికీ వారసుడు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్న వంశోద్ధారకుడు. ఓ గంట తర్వాత కొడుకు స్పృహలోకొచ్చినట్టు తెలిసి ఐసియులోకి వెళ్లారు కోటిలింగం దంపతులు. తల్లిదండ్రుల్ని చూడగానే నవ్వటానికి ప్రయత్నించి, నవ్వలేక సిగ్గుతో తల దించుకున్నాడు పవన్.

“నువ్వేం బాధపడకురా నాయనా. నిన్నీ స్థితికి తెచ్చినవాళ్లను మీ నాన్న ఊరికే వదిలిపెట్టడు.” అని ఓదార్చింది తల్లి.

***

“ఇది కచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. తెలివిగా ప్లాన్జేసి (ప్లాన్+చేసి) అమలుపరిచారు. వాళ్లు నన్నేమీ చెయ్యలేకిలా (చెయ్యలేక+ఇలా) దొంగదెబ్బ తీశారు. అమాయకుడైన నా కొడుకుపై అన్యాయంగా కస్తీర్చుకున్నారు. (కసి+తీర్చుకున్నారు)” అంటూ తన ఎదురుగా కూర్చొని వున్న డిటెక్టివ్ ఏకాంబరంతో ఆవేశంగా అన్నాడు కోటిలింగం.

‘ఈయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా పదాలను సంధిచేసి (రెండు పదాలను కలిపి) వాడుతున్నాడు. ఇది ఈయనకున్న బలహీనతనా? లేక తెలుగుపై వున్న మమకారమా?’ ఆలోచనలో పడ్డాడు డిటెక్టివ్ ఏకాంబరం.

తన కొడుకు పరిస్థితికి ప్రతిపక్షాలే కారణమని కోటిలింగం తిరుగులేని అనుమానం. వాళ్లే కుట్ర పన్నారని ఆధారాలు సేకరించి ప్రతిపక్షాన్ని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నాడు. కానీ విషయం బయటికి పొక్కి ప్రతిపక్ష సభ్యులు జాగ్రత్త పడతారేమోనని ఆలోచించి, ఓ ప్రైవేట్ డిటెక్టివ్ చేత రహస్యంగా పరిశోధన చెయ్యించాలని అతణ్ణి పిలిపించాడు. “..కాబట్టి, నువ్వెలాగైనా ఈ విషయాన్ని రహస్యంగా శోధించి రెండ్రోజుల్లో నాకు రిపోర్టువ్వాలి. నీకెంత కావాలన్నా డబ్బిస్తా.” అన్నాడు కోటిలింగం. అందుకు చిన్నగా నవ్వాడు ఏకాంబరం.

***

దొరికిన అన్ని సిసి కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట.. కోటిలింగం కొడుకు పవన్ అపస్మారక స్థితిలో పడి వున్న జి.బి.కాలనీలోని కుప్పతొట్టి దగ్గరకి చేరుకున్నాడు డిటెక్టివ్ ఏకాంబరం.

‘సంఘటన జరిగినరోజు పవన్ ఈ జి.బి. కాలనీకి ఏ పనిమీద వచ్చుంటాడు? ఎవరిని కలవటానికి వచ్చుంటాడు? ఈ చెత్త కుప్పతొట్టి దగ్గర ఎందుకు పడున్నాడు? ఈ విషయాలన్నీ తేలితే కానీ తన పని సుళువు కాదు.’ అనుకుంటూ చుట్టూ చూశాడు ఏకాంబరం.

చప్పున అతణ్ణి అక్కడున్న ఓ హోటల్ నేమ్ బోర్డు ఇట్టే ఆకర్షించింది.

‘గోరుముద్ద’ మాంసాహార భోజనశాల! వేడి వేడి స్పాట్ బిరియానీ క్షణాలలో తయార్.

దానికింద కనిపించిన వాక్యం అతణ్ణి మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

‘మీకు ఏ బిరియానీ ఇష్టమైతే దాన్ని ప్రియంగా వడ్డించటమే కాదు ప్రేమగా తినిపించటమూ మా ప్రత్యేకత’.

ఇదేదో గమ్మత్తుగా ఉందే అనిపించి, ఆ హోటల్లోకి అడుగుపెట్టాడు ఏకాంబరం.

ఖాళీగా వున్న టేబుల్ దగ్గరున్న ఓ కుర్చీలో కూర్చున్నాడు.

అంతలో ఒక సర్వర్ అతని దగ్గరికొచ్చి “ఏం కావాలి సార్?” అని అడిగాడు.

తనకేం కావాలో చెప్పాడు ఏకాంబరం. “తింటారా? తినిపించాలా?” ఆసక్తిగా అడిగాడు సర్వర్.

“తింటా!” అని అతను చెప్పగానే సర్వర్ నిరుత్సాహంగా అక్కణ్ణించి కదిలాడు.

కొంతసేపటికి ఏకాంబరం ఆర్డరిచ్చిన ఐటమ్స్‌ను తెచ్చి టేబుల్ మీద పెట్టి దూరంగా వెళ్లి నిలబడ్డాడు ఆ సర్వర్. వాటిని మెల్లగా కొరికి తింటూ పరిసరాలను గమనించసాగాడు ఏకాంబరం.

ఇంతలో ఒక వ్యక్తి వూగుతూ ఏకాంబరం కూర్చోనున్న టేబుల్ దగ్గరికొచ్చి ఖాళీ కుర్చీలో దభేల్మని కూర్చున్నాడు. తలతిప్పి చుట్టూ చూశాడు. అతనికెవరూ కనిపించలేదు. “రేయ్.. ఎవర్రా ఈడ?” అని గట్టిగా కేకపెట్టాడు.

ఇందాకటి సర్వర్ పరుగు పరుగున అక్కడికొచ్చి “ఏం కావాలి సార్?” అని వినయంగా అడిగాడు.

“ఏంరా ఒళ్లు బలుపెక్కిందా? కుర్చీలో కూసోగానే వొచ్చి ఏం కావాల్నో అడగాలని తెలీదా?” అని దబాయించాడు.

“చెప్పండి సార్, ఏం తెమ్మంటారు?”

“అదీ.. అట్టా అడగాల. చికెన్ బిరియానీ బకెట్ ఒకటి, మటన్ రోస్ట్ రొండు ప్లేట్లు, పీతల వేపుడు ఒక ప్లేటు.. తర్వాత.. ముందు ఇవి తే. తిన్నాక ఇంకేం తేవాల్నో సెప్తా. రైతా మర్సిపోవద్దు.” ఊగుతూ చెప్పాడు తాగుబోతు.

‘ఇతను నీసు బాగా తినే మనిషిలా వున్నాడు. ఏ జంతువునూ వదిలా లేడు.’ మనసులో అనుకున్నాడు ఏకాంబరం.

“తింటారా, తినిపించాలా?” ఆసక్తిగా అడిగాడు సర్వర్.

“నా సేతుల్తో నేను తిని సానా దినాలైంది. తినిపించాల. రమ్యాను రమ్మను.” గిలిగిలిగా అన్నాడు తాగుబోతు.

“రమ్య లేదు సార్.”

“ఏం? మొగుడు దగ్గరికి పొయ్యిందా?” కోపంగా అన్నాడు మళ్లీ ఆ తాగుబోతు.

“లీవులో వుంది.”

“కళాను రమ్మను.”

“కళా ఖాళీగా లేదు. 4వ నెంబర్ టేబుల్‍కు బుక్కయ్యిండాది. అది పూర్తయ్యేటందుకు అర్ధగంట పడతాది.”

“అయితే ఇప్పుడు ఖాళీగా వుండేది ఎవుర్రా బోడకోవ్.” విసుగొచ్చి తిట్టాడు తాగుబోతు.

“నేనే సార్.”

“చుంచు మొహమూ, నువ్వూను. సరేలే, ఈ పూటకి సర్దుకుంటాను. ఎల్లి నేను చెప్పింది త్వరగా తేపో.”

“అలాగే సార్. అన్నట్టు.. తెల్సుగా సార్, మా రూల్సు. మేం తినిపించాలంటే ఎగస్ట్రా రెండొందలు అవతాది. టిప్స్ వంద ఇయ్యాల. అసలు బిల్లుకు జి.ఎస్.టి అదనం.”

“ఇయ్యన్నీ తెలినోడికి చెప్పు రా పాగల్, నాక్కాదు, నేను పాత కస్టమర్ నని నీకు తెలీదా బే.”

తనను అన్ని తిట్లు తిడుతున్నా టిప్స్ వస్తుందన్న ఆశతో, “తెల్సు సార్.” అని ఉత్సాహంగా కదిలాడు సర్వర్.

అన్నింటిని గమనిస్తూ తన ప్లేట్లోని పదార్థాన్ని మెల్లగా తింటున్నాడు ఏకాంబరం.

ఇంతలో.. పక్క టేబుల్ దగ్గర నుండి ఎవరో గురకపెడుతున్న శబ్దం వినిపిచటంతో తలతిప్పి చూశాడు. పక్క టేబుల్ దగ్గర లావుగా వున్న ఒక వ్యక్తి (ఊబకాయుడు) తాను ఆర్డరిచ్చిన పదార్థాలు ఎంతకూ రాకపోవటంతో టేబుల్‍పై తలవాల్చి నిద్రలోకి జారుకున్నట్టున్నాడు. అతనే నోరు తెరుచుకుని భయంకరంగా గురకపెడుతున్నాడు.

‘పాపం, నిద్ర బాగా కరవైనట్టుంది! ఏం పనిచేస్తుంటాడో ఏంటో?’ మనసులో అనుకున్నాడు ఏకాంబరం.

మిగతా మూడు కుర్చీలూ ఖాళీగా వుండటంతో అక్కడికొక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చుంటున్నారు. మొత్తం ఐదుమంది. భార్యాభర్తలు, ఆమె చేతిలో చంటిపిల్లాడు కాక ఇద్దరు పిల్లలు. పెద్దది ఐదేళ్లపిల్ల. చిన్నోడికి నాలుగేళ్లుండొచ్చు. వాళ్లు శబ్దం చేస్తూ కుర్చీలను అటు జరిపి, ఇటు కదిపి, ఎవరి పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించుకుని కూర్చోగానే ఆ కుదుపులకు చంటిపిల్లాడు నిద్రలేచి ఏడుపు మొదలు పెట్టాడు. వాణ్ణి సముదాయించసాగింది తల్లి.

వాళ్లను చూసి సర్వర్ వచ్చి ఏం కావాలో అడిగి తెలుసుకుంటున్నాడు. ఈలోపు నిద్రపోతున్న ఊబకాయుడు మేల్కొని, “నాకన్నా వీళ్లు వెనకొచ్చారు. నేను ఆర్డర్ ఇచ్చిన ఐటెమ్స్ ఏవీ?” అని అడిగాడు ఆవులిస్తూ.

“మీరు సెప్పింది బాండల్లో ఏగతా వుండాది సార్.”

“అర్ధగంటైనా ఇంకా ఏగతా వుండాదా? అయితే అవి నాకొద్దు, క్యాన్సిల్.” అని కోపంతో పైకి లేవబోయి లేవలేక మళ్లీ కుర్చీలోనే దబ్బుమని కూలబడ్డాడు.

“అది కాదు సార్, కొంచెం నా మాటినండి..” అంటూ అతణ్ణి సముదాయించబోయాడు సర్వర్.

“నో! నేను నా భార్య మాటే వినను. ఇంకెవరి మాటైనా ఎందుకింటాను? నెవర్?” అంటూ సర్వర్ కేసి ఉరిమి చూశాడు.

“సరే, ఇప్పుడేం కావాలో చెప్పండి.” మెల్లగా అడిగాడు సర్వర్.

“ఉడకబెట్టింది ఏముంది?”

“మెరుపుతీగలు.” చెప్పాడు సర్వర్.

“మెరుపు తీగా? ఏంటవి? కొత్తగా వింటున్నానే?”

“అవున్సార్. అవి పండ్లులేని చేపలు.”

“పండ్ల, ముండ్లా?” అనుమానంగా అడిగాడు ఊ.కా.

“పండ్లే సార్, అవి పండ్లతో ఆహారాన్ని తీసుకోలేవు. ముక్కుతో తీసుకుంటాయి. కొత్తగా సూడ్డానికి బాగుండాయి. ఈమధ్యే మనూరి సెరువులోకి ఎంటరైంది సార్.”

“మరి అవి గాలిని ఎక్కణ్ణించి పీల్చుకుంటాయి” అని అడగబోయి, ‘దానికీ ఎక్కడో ఓచోట ఏర్పాటు వుంటుందిలే మనకెందుకు’ అనుకుని, “ఓర్నీ, అప్పుడే వాట్ని పట్టేసినారా. అయితే అవి రెండు ప్లేట్లు పట్రా.” ఆవులిస్తూ అన్నాడు ఊ.కా.

“అలాగే సార్.” అంటూ ముందుకు ఉరకబోయాడు సర్వర్.

“ఆగూ.. రెండు ప్లేట్లంటే ఏమనుకునావు?” అని స్టైల్‌గా ప్రశ్నించాడు.

“రెండు ప్లేట్ల మెరుపు తీగలు సార్.” ఉత్సాహంగా చెప్పాడు సర్వర్.

“కాదు, ఒక ప్లేటే మెరుపు తీగలు, ఇంకో ప్లేట్ ఖాళీది పట్టుకురా. వాటిలో ముండ్లు పడేసేందుకు.” నోరెళ్లబెట్టుకుంటూ వెళ్లిపోయాడు సర్వర్. ఊ.కా. మళ్లీ టేబుల్‌పై తలవాల్చి పడుకుని గురకపెట్టసాగాడు.

***

సర్వర్ తాను తెచ్చిన పదార్థాలను ఇందాకటి తాగుబోతు ముందు పెట్టి “మీ బిర్యానీ రెడీ..” అన్నాడు నవ్వుతూ.

ఆ నవ్వు ఆ తాగుబోతు మత్తును చిత్తు చేసినట్టుంది. “ఏంట్రా ఇంతాలెస్యం, నేను ఆర్డర్ ఇచ్చింది ఎప్పుడూ.. నువ్వు తెచ్చేది ఎ..” అంటూ అతను మాటను పూర్తిచేసేలోపు గబుక్కున ఒకముద్ద బిర్యానీని అతని నోట్లో పెట్టి అతని కోపాన్ని అడ్డుకున్నాడు సర్వర్. తన కోపాన్ని కంటిన్యూ చేసేందుకు గబగబ నోట్లోని ముద్దను నములుతూ, “నేను చేసిన ఆర్డర్ క్యాన్సి..” అతను తన మాటల్ని పూర్తిచేసేలోపు ప్లేట్ లోని మటన్ ముక్కను అతని నోట్లో పెట్టాడు సర్వర్. దాన్ని నమిలే పనిలో పడ్డాడు తాగుబోతు. మొత్తానికి అతణ్ణి నోరెత్తకుండా బిర్యానీ మొత్తం తినిపించాడు సర్వర్.

***

పక్క టేబుల్ దగ్గర ఏడుపు ఆపని చంటిపిల్లాడు.. సర్ర్‌మంటూ ఒంటేలు పోశాడు. అది సరాసరి పైకెళ్లి డౌనయ్యి క్షణాల్లో ఎదుటివ్యక్తి గ్లాసులో పడి సగం నిండింది. పూర్తిగా తన పనికానిచ్చాక శాంతంగా బోసినవ్వు నవ్వాడు చంటోడు. జలజలమన్న నీళ్ల శబ్దానికి మెలకువ తెచ్చుకున్న ఊబకాయుడు లేచి ప్లేట్‍లో వున్న మెరుపుతీగ చేపముక్కను తీసుకుని ఆబగా కొరికి నమిలి మింగటానికి ప్రయత్నించి.. మింగుడు పడకపోయేసరికి, నీళ్లగ్లాసు తీసుకుని గుక్కెడు తాగి ముఖం చిట్లిస్తూ.. ‘ఏంటిది ఇందాక తాగినప్పుడు లేని ఉప్పదనం ఇప్పుడెలా వచ్చింది?’ అనుకుంటూ “సర్వర్..” అని గట్టిగా కేకపెట్టాడు.

“ఏం సార్, ఏం కావాలి?” అంటూ పరుగెత్తుకొచ్చాడు సర్వర్.

“ఏంటిది నీళ్లు ఉప్పగా వున్నాయి? ఇప్పటికిప్పుడు దీని రుచి ఎలా మారింది?” అని నిలదీశాడు ఊ.కా.

“లేదు సార్, మేము కస్టమర్లకు ఎప్పుడూ మినరల్ వాటరే సప్లై చేస్తాం, ఉప్పగా ఉండే అవకాశమే లేదు సార్.”

“అంటే నేను కావాలనే అబద్దం చెప్తున్నానా?” అంటూ కళ్లు ఉరిమిచూశాడు ఊ.కా.

“అయ్యో, నన్ను నమ్మండి సార్, కావాలంటే ఇప్పుడు తాగి చూడండి.” జగ్గులోని వాటర్‍ను గ్లాసు నిండా నింపి అన్నాడు సర్వర్.

అది కొద్దిగా తాగి, “యస్, ఇప్పుడు రుచిగా, బాగున్నాయి.” అంటూ గటగటా గ్లాసుడు నీళ్లు తాగేశాడు ఊ.కా.

***

ఇంతలో.. ఎదురు టేబుల్ దగ్గరికి ఒక కాలేజీ అమ్మాయి రాగానే, అక్కడే ఓ కుర్చీలో కూర్చుని సర్వర్ చేత తినిపించుకుంటున్న ఓ కష్టమర్, “సర్వ..” ర్‌ని మింగేస్తూ గుసగుసగా పిలిచాడు.

“ఏంటి సార్?” అని సర్వరూ మెల్లగా కష్టమర్ చెవి దగ్గరికి వంగి గుసగుసగా అన్నాడు.

“నా చొక్కా జేబులో దువ్వెనుంది, తియ్యి.” అన్నాడతను ఇందాక వచ్చిన అమ్మాయినే నంజుకు తినేసేలా చూస్తూ.

‘చేతులు రెండూ ఖాళీగానేగా వున్నాయి, తనే తీసుకోవచ్చుగా. ఒళ్లు బద్దకం కాకపోతే..’ గొణుక్కుంటూ చొక్కా జేబులో నుండి దువ్వెన తీసిచ్చాడు సర్వర్.

దువ్వెనతో స్టైల్‍గా తలపై నున్న నాలుగు వెంట్రుకల్ని సరిచేసుకున్నాడా కష్టమర్.

రెండు నిమిషాలు కూడా కాకముందే, “సర్వర్, నా ముక్కుమీద ఈగ వాలినట్టుంది, కాస్త తోలవా ప్లీజ్?” అన్నాడు.

‘ఓరి నీ బద్దకం పాడుగానూ.. ప్రపంచంలోని బద్దకమంతా ఇతన్లోనే వున్నట్టుంది.’ అనుకున్నాడు డిటెక్టివ్.

సర్వర్ ఈగను తోలే క్రమంలో అతని చేతిలోని ప్లేట్లో నుండి సేర్వా కొంత కష్టమర్ చొక్కా మీదికి ఒలికింది. దాంతో ఆవేశంతో సర్వర్ చెంపమీద ఒక్కటిచ్చాడు కష్టమర్.

అంతే! చేతిలోని ప్లేట్‌ను కోపంగా అక్కడ పారేసి విసవిసా నడుచుకుంటూ ఓనర్ దగ్గరికెళ్లాడు ఆ సర్వర్.

***

ఇంతలో.. సర్వర్ తినిపించిన అన్నాన్ని తుపుక్కున సర్వర్ ముఖంలోకి ఉమ్మేసి, “కారం.. కారం..” అంటూ కెవ్వుమని కేకపెట్టి అరవసాగాడు పక్క టేబుల్ లోని పిల్లవాడు.

“అయ్యో, అయ్యో.. పప్పూ నెయ్యి కలిపి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడని కూడా చూడకుండా గొడ్డుకారం పెడతావటయ్యా. బుద్దుందా నీకు? నువ్వసలు మనిషివా, దున్నపోతువా! ముదనష్టపు మూర్ఖుడా..” అంటూ అతనిపై తిట్ల దండకం అందుకుంది ఆ పిల్లవాడి తల్లి.

నిర్ఘాంతపోతూ ముఖం నిండా పరుచుకున్న అన్నం మెతుకుల్ని కూడా శుభ్రం చేసుకోకుండా కోపంగా ఓనర్ దగ్గరికెళ్లాడు ఆ సర్వర్.

***

సర్వర్లందరూ అలా ఏదో ఒక కారణంతో, ఓనరు ముందు వరుసగా నిలబడి “మాకు తక్షణం రక్షణ కావాలి. లేకపోతే మేము ఒక్కక్షణం కూడా ఇక్కడ పనిచెయ్యలేం.” అంటూ తమ నిరసనను తెలియజేశారు.

“దయచేసి వెళ్లిపోకండి, ఎలాంటి రక్షణ కావాలో మీరే చెప్పండి, వెంటనే ఏర్పాటుచేస్తాను.” హామీ ఇచ్చాడు ఓనర్.

సర్వర్లు వాళ్లల్లో వాళ్లు గుసగుసలాడుకుని, “మాకు ఇప్పుడే హెల్మెట్లు కావాలి. లేకపోతే మా మూతిలో అన్నం ఊసేవాడొకడైతే, కోపంతో చెంప పగలకొట్టేవాడు మరొకడు. ఇలా అయితే మా ప్రాణాలకు ఏది గ్యారెంటీ?” అన్నారు.

పదే పదినిమిషాల్లో ఓనర్ హెల్మెట్లు తెప్పించటం, సర్వర్లు వాటిని ధరించి ధీమాగా కష్టమర్ల దగ్గరకు వెళ్లటం జరిగిపోయాయి.

ఇందాక తనను చెంపదెబ్బ కొట్టిన బద్దకిష్టు కష్టమరు ఆర్డరిచ్చిన ఐటమ్‌ను ఒక ప్లేట్‍లో పెట్టుకుని వెళ్లి అతని ముందు విసురుగా పెట్టాడు సర్వర్. ఆ విసురుకు ప్లేట్‍లోని నాటు కోడిగుడ్డు ఎగిరి అతని చొక్కా జేబులో పడింది.

“ఏందిరా బద్మాష్, ఒళ్లు కొవ్వెక్కిందా? కోడిగుడ్డును మీదికేస్తున్నవ్?” అనటం పూర్తికాక మునుపే అతని తలపై గట్టిగా ఒక మొట్టు మొట్టి పక్కకెళ్లిపోయాడు ఆ సర్వర్.

దాంతో తల దిమ్మతిరిగిన బద్ధకిష్టు కష్టమరు, తడబడుతూ క్యాష్ కౌంటరు దగ్గరికి వెళ్లి, “ఇది తిండి పెట్టే హోటలా, లేక తలలు పగలకొట్టే రౌడీలుండే సెంటరా?” అని నిలదీశాడు.

“ఏమైంది సార్, ఏం జరిగింది?” అని ఆతృతగా అడిగాడు ఓనర్.

“ఇటు చూడూ, సర్వర్ ప్లేట్ విసురుగా పెట్టటంతో కోడిగుడ్డు జేబులో పడిందని నిలదీసి అడిగితే ఇలా మొటిక్కాయ వేస్తాడా, చూడండీ..” అంటూ తన తలను వంచి చూపించాడు. అక్కడ గుడ్డు ఆకారంలో తల బొప్పికట్టి వుండటం కనిపించింది.

“కొట్టింది ఎవరో చెప్పండి, అతణ్ణి ఇప్పుడే ఇంటికి పంపించేస్తాను.” అన్నాడు ఓనర్.

“రమ్మనండి మీ వాళ్లను, వాడెవడో చూపిస్తాను.” ఆవేశంతో అన్నాడు బద్ధకిష్టు కష్టమరు. “వెయిటర్లందరూ ఇలా రండి..” అని ఓనర్ పిలిచేసరికి అందరూ వచ్చి వరుసగా నిలబడ్డారు.

“వీళ్లల్లో మిమ్మల్ని కొట్టిందెవరో చెప్పండి, ఇప్పుడే అతని సీటు చింపేస్తాను.” చెప్పాడు ఓనర్.

అందరూ ఒకే యూనిఫామ్‍లో ఉన్నారు. అందరికీ హెల్మెట్లున్నాయి. కనిపెట్టటం కష్టంగా తోచింది కష్టమరుకు. దాంతో ఒళ్లు మండిపోయి, “మర్యాదగా మీలో ఎవరు నన్ను మొట్టారో చెప్పండి?” అన్నాడు కష్టమరు.

అందరూ మౌనంగా తాము కాదన్నట్టుగా తలల్ని అడ్డంగా ఊపారు.

దాంతో మరింత చిర్రెత్తుకొచ్చి, “చెప్పండ్రా బేవార్సుల్లారా, నన్ను కొట్టింది ఎవరు?” అన్నాడు బద్దకిష్టు కష్టమరు.

సర్వర్లు ఒకరినొకరు చూసుకుని ఒక అండర్‌స్టాండుకొచ్చి, “నేనే.. నేనే..” అంటే అందరూ కూడబలుక్కుని బద్ధకిష్టు కష్టమర్‌ను వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్ది ఈడ్చుకెళ్లి హోటల్ బయట పడేశారు.

***

“ఇన్ని సౌకర్యాలుండి, ఇన్ని కార్లుండి, ఇంత మంది పనిమనుషులున్నా నా కొడుకు ఆఫ్ట్రాల్ ఒక చెత్త కుప్పతొట్టి దగ్గర అనామకుడుగా పడుండటానికి కారణంబేది?” ఆవేశంగా అడిగాడు మంత్రి కోటిలింగం.

ఒక్కక్షణం మౌనంగా ఉండి, “కారణం.. బేది!” నింపాదిగా చెప్పాడు డిటెక్టివ్ ఏకాంబరం.

“ఏం నీకు తిక్కతిక్కగా ఉందా? నేను చెప్పిందే చెబ్తునావు?” అసహనంగా అన్నాడు కోటిలింగం.

“నేను పదాల మధ్య గ్యాప్ ఇచ్చాను. మీరు గమనించలేదా! పైగా ఏకవచనంలో చెప్పాను. అర్థం కాలేదా?”

“అర్థం కాలేదు. దాన్ని బహువచనంలో చెప్పండి.”

“బేదులు..”

“బేదులా?.. అంటే విరోచనాలా?”

“ఔను. పైగా మీ వాడికి ‘శీత బేది’..”

“ఆగాగు. ఏందేందో చెప్తున్నావు. శీత బేదంటే?”

“విరోచనాల్లో రక్తం పడటం!” చెప్పాడు డిటెక్టివ్.

“ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల పనే. మావాడికి రక్తం పైన్నుండి కారేలా కొడితే కనిపెట్టేస్తామని కింద నుండి రక్తం కారేటట్టుగా కొట్టారన్నమాట.”

“ఆవేశపడకండి. మీ అబ్బాయిని ఎవరూ కొట్టలేదు. ఇది మీవాడు తనకు తాను చేసుకున్న స్వయంకృతాపరాదం.”

“అంటే?..”

“నా పరిశోధనలో తేలిందేమిటంటే, బాగా ఒళ్లు బలిసినవాళ్లు (ఊబకాయులు), తాగుబోతులు, సోమరిపోతులు వెళ్లే హోటల్ ఒకటి జి.బి.కాలనీలో ఉంది. దాని పేరు గోరుముద్ద. అక్కడ ‘స్పాట్(పాట్) బిరియానీ’ క్షణాలలో తయారుచేస్తారు. సంఘటన జరిగిన రోజున మీ అబ్బాయి ఫ్రెండ్స్‌తో కలిసి పూటుగా తాగి అక్కడికెళ్లాడు.”

“నో! ఇది పచ్చి అబద్దం. నేను నమ్మను.” గట్టిగా అరిచాడు కోటిలింగం.

“నమ్మాల్సిందే! నేనేమీ మీ అబ్బాయి పైన చాడీలు చెప్పటం లేదు. మీ కళ్లు గప్పి, స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటున్నాడు మీ అబ్బాయి. అలా ఆ రోజు పార్టీ చేసుకుని బయటికొచ్చి జి. బి. కాలనీలోని హోటల్ ‘గోరుముద్ద’కు వెళ్లాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అక్కడికెళ్లిన కష్టమర్లకు సర్వర్లే అన్నీ తినిపిస్తారు. అయితే తాము ఏమి తినిపిస్తున్నామో తెలియనంతగా కస్టమర్లను మాయ చేస్తారు. బిరియానీ బకెట్ ఆర్డరిస్తే అందులో సగమే తినిపిస్తారు. మిగతా సగం మళ్లీ కిచెన్లోకే వెళ్లిపోతుంది. కారం ఎక్కువేసి పదార్థాలు వండటంతో పదే పదే నీళ్లు తాగించి దాంతోనే సగం కడుపు నింపేస్తారు. నీళ్లు ఎక్కువగా తాగకపోతే ఉడికీ ఉడకని లెగ్ పీసుల్ని నోట్లో పెట్టి నమలమంటారు. అది నమిలేసరికే వాళ్లు సగం నీరసించిపోతారు. ఇంకో విషయం, కష్టమరు ఆర్డరిచ్చింది ఏదైనా సరే లేదనకుండా ఏదో ఒక పదార్థం తెచ్చి తినిపించేస్తారు. మత్తులో అదేమిటో తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు కష్టమరు. మీకు ఇంకొక భయంకరమైన విషయం చెబుతాను, ఆవేశపడకండి.. వాళ్లు బిరియానీ చేసేది కోడి మాంసంతోనో, మేక మాంసంతోనో కాదు!”

“మరి? ఆవు మాంసంతోనా?”

“కాదు, కుక్క మాంసంతో! ఇదిగోండి ఎవిడెన్స్!” అంటూ తాను సీక్రెట్‌గా తీసిన ఫోటోలను చూపించాడు ఏకాంబరం.

“సో! ఆ రోజు మీ అబ్బాయికి ఏమేం తినిపించారో కానీ, అన్నీ కడుపులోకి చేరి గిర్రున కలబెట్టి, శీత బేది (రక్త విరోచనాలు) పట్టుకుని సర్రున లూజ్ మోషన్స్ అయ్యి ఒంట్లోని శక్తంతా నశించటంతో, మీవాడి దగ్గరున్న డబ్బునంతా తీసుకుని అతణ్ణి పట్టుకెళ్లి కుప్పతొట్టి దగ్గర పడేశారు.” అంటూ ముగించాడు ఏకాంబరం.

మరుసటిరోజే ఆ హోటల్‌కు సీల్ వేసేలా ఆర్డర్స్ ప్యాస్ చెయ్యించి తన కసిని తీర్చుకున్నాడు మంత్రి కోటిలింగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here