అక్కరకు రాని..

2
3

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘అక్కరకు రాని..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]బ[/dropcap]స్టాప్‌లో జనం చాలా మంది ఉన్నారు. ఇంతమంది జనంలో నేను ఎక్కగలనా? ఇప్పుడు వచ్చేది వదిలేస్తే మళ్ళీ ఎప్పటికి వస్తుందో? అప్పుడే సాయంత్రం ఐదున్నరయింది.

ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంతవుతుందో! ‘రోజూ ఈ బస్సుల కోసం పడిగాపులతో ప్రాణం పోతోంది’ అనుకుంటూ ఉండగానే ఎక్కవలసిన బస్సు వచ్చేసింది. అందరూ తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఇంకో బస్సు కోసం నిరీక్షించే ఓపిక లేక సీటు దొరకక పోతే నిల్చుందాంలే అని ఎక్కేసాను. కాని, అదృష్టవశాత్తు సీటు దొరికింది. నా పక్కన కాలేజీ అమ్మాయిలా ఉంది. కూర్చుంది.

బస్సులో అక్కడక్కడా కొందరు నిల్చున్నారు. అనుకున్నంత కిక్కిరిసి లేరు. నా ఆలోచనలు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పాటికి అత్తగారు, మామగారు ఊరి నుంచి వచ్చి ఉంటారు. ‘లాస్ట్ పీరియడ్ పర్మిషన్ అడుగుదామనుకుంటే క్లాస్ పడింది. ఉండక తప్పలేదు’, అనుకుంటూ టికెట్‌కి సరిపడా డబ్బులు తీసి చేత్తో పట్టుకున్నాను. కండక్టర్ డబ్బులు తీసుకుని నాకు టికెట్టిచ్చి, పక్కన అమ్మాయిని ఎక్కడికని అడిగాడు. ఆ అమ్మాయి చెప్పింది. ఇరవై రూపాయలు ఇవ్వమన్నాడు.

ఆ అమ్మాయి బ్యాగ్ అంతా వెతుకుతోంది. ఏవో కాయితం ముక్కలు తీస్తోంది. మళ్ళీ వెతుకుతోంది. కండక్టర్ ముందుకు వెళ్ళి వాళ్లకు టికెట్లిచ్చి మళ్ళీ వచ్చాడు.

“టికెట్ తీసుకోమ్మా” అన్నాడు కొంచెం విసుగు ధ్వనించే గొంతుతో.

“చిల్లర లేదు. గూగుల్ పే చేయనా?” అంది ఆ అమ్మాయి.

“మీ దగ్గర పది, ఇరవై రూపాయలకు ఒక్కొక్కరి దగ్గర గూగుల్ పే తీసుకుంటుంటే నా పని అయినట్లే. ఇక్కడ అది కుదరదు. డబ్బులివ్వమ్మా. బస్సెక్కేముందు చూసుకోవద్దా?” అన్నాడు కండక్టర్.

నాకు ఈ సంభాషణ చాలా చిరాగ్గా ఉంది. అసలే కాలేజీలో పిల్లలతో గొడవ, వాళ్ళ నిర్లక్ష్యపు సమాధానాలతో తలనొప్పిగా ఉంది.

ఆ అమ్మాయిని చూస్తుంటే కూడా కోపంగా ఉంది. చూడటానికి చక్కగా ఉంది. కాలేజీ స్టూడెంట్‌లా ఉంది. బస్సు టికెట్‌కి సరిపడా డబ్బులు కూడా చేతిలో లేకుండా ఈ కాలపు పిల్లలు ఎందుకిలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ప్రతిచోట గూగుల్ పే చెల్లుతుందా? అంత ధైర్యంగా ఎలా ఉంటారు? సముద్రం ఎదురుగా ఉన్నా తాగటానికి నీళ్లు లేనట్లు, దాహం తీరటానికి లేనట్లు, ఫోన్‌లో ఎన్ని వేల రూపాయలుంటే ఏం లాభం? ఇప్పుడా అమ్మాయికి పనికివస్తాయా? వెంటనే నాకు మా మేనల్లుడు పాండు గుర్తుకు వచ్చాడు. ఈ మధ్య వాణ్ణి ఒకరోజు పాల పాకెట్ తెమ్మని పంపితే వెళ్ళి, “ఫోన్ పే లేదుట అత్తా! డబ్బులిమ్మంటున్నారు”, అని ఫోన్ చేసాడు. ఇంటికి వచ్చేయమన్నాను. వచ్చాక కేకలేసి, జేబులో ఓ వందైనా ఉంచుకోకపోతే ఎలా ఏదైనా అవసరమొస్తే? అంటే వాడు డబ్బులుంటే పోతాయి అత్తా, ఇదే మంచిది అంటూ నవ్వేసాడు. ఏం పిల్లలు వీళ్ళు! గుళ్లో దక్షిణ వేయాలన్నా ఇలాగే చేస్తారా! నవ్వొచ్చింది నాకు. మళ్ళీ ఆ అమ్మాయికేసి చూసాను. బ్యాగ్ అంతా వెతుకుతోంది. ఎంత వెతికితే మాత్రం లేనిది ఏం దొరుకుతుంది? కండక్టర్ మళ్ళీ వచ్చాడు.

“ఇవ్వమ్మా, బస్సు లో అందరి టిక్కెట్లు అయిపోయాయి”, అన్నాడు, స్త్రీల పట్ల గౌరవం వల్ల సహనంతో.

“లేవండీ”, అంది నిస్సహాయంగా.

నా వంక చూసి.. “ఆంటీ, ఒక ఇరవై రూపాయలిస్తారా” అంది సిగ్గుపడుతూ. నాకు ఇవ్వాలనిపించలేదు. కాని, నేను కాకపోతే బస్సులో మరెవరైనా ఇస్తారు. నేనెందుకు అందరి దృష్టిలో ఆ చిన్న మొత్తం కోసం చెడ్డవ్వాలి? డబ్బుల గురించి కాదు, పాండు గాని, ఈ పిల్ల గాని, ఇంకా ఇలాంటి వాళ్ళు గాని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు? అని నా బాధ. మౌనంగా తీసి ఇచ్చాను.

“థాంక్స్ ఆంటీ మీకు గూగుల్ పే చేస్తాను. నెంబర్ చెప్పండి”, అంది.

“నాకే గూగుల్ పే లేదు. నాకా డబ్బులు ఇవ్వక్కరలేదు గాని ఇటువంటి పరిస్థితి ఇంకోసారి తెచ్చుకోకు. నీ దగ్గర వేల రూపాయలున్నా ఇప్పుడు నీ అవసరానికి పనికిరాలేదు. ముక్కు, మొహం తెలీని నన్ను అడగవలసి వచ్చింది. ఈ సారి బైటకి వచ్చినప్పుడు ఎంతోకొంత డబ్బు దగ్గర పెట్టుకో. అన్నిచోట్ల, అన్నిసార్లు ఈ సాంకేతికత పనికిరాదు” అంటూ హితబోధ చేసాను.

“థాంక్స్ ఆంటీ. మీరు లెక్చరరా?” అంటూ తన స్టాప్ రావటంతో దిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here