[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘మహానది’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]“న[/dropcap]దీసుందరి సుధాస్యందిని నగాధీశ్వర నందినీ
నడిచి కోన నడుమ కాన తడచి వచ్చిన నవఝరీ..”
నదీ సుందరి.. కొండల్లో ఎక్కడో మారుమూల ఊటగా పుట్టి చిన్న కాలువగా మారి కొండపైనుండి గంతులేస్తూ కిందకు దుమికి ప్రవాహంగా విస్తరించి ఎదురైన దారిని బట్టి తనను తాను మార్చుకుంటూ, ఎన్నో కరుకురాళ్లను తాకుతూ వనాలను దాటుతూ చెట్లనుండి పడి తనతో స్నేహం చేసిన ఆకులను పూవులను తన ప్రవాహంతో పాటు జతచేసుకొని వాటితో పాటు వచ్చే చెత్తాచెదారాన్ని కూడా మోసుకుంటూ ఎన్నో మైళ్లు ప్రవహించి ఎందరికో జీవనమై మరెందరినో ఉద్ధరిస్తూ సాగుతూ పోయి సారవంతమైన ఒండ్రుమట్టై ప్రయాణించి ప్రయాణించి అలసి సొలసి చివరకు సాగరంలో కలిసి తన అస్థిత్వాన్ని కోల్పోయినా తన వారసత్వాన్ని ఔన్నత్వాన్ని తను నడిచిన దారిలో మిగిల్చిపోతుంది.. నది మహానది జీవనది..
నదీ ప్రవాహం వంటి జీవితాలెన్నో..
***
వేంకటేశ్వరస్వామి గుడి. సుమారు వందేళ్ల ప్రాచీనమైన ఆలయం. ఎకరంన్నర ఆవరణ నిండా పూల చెట్లు పండ్ల చెట్ల పద్ధతిగా పెంచబడి ఉన్నాయి. గుడి ప్రాంగణమంతా శుభ్రంగా ఉన్నది. ఎక్కడా చిన్న దుమ్ము రేణువు లేకుండా తుడిచి ఆ ఆవరణ నిండా ముగ్గులు వేసి ఉన్నాయి. గుడి ఆవరణలో ఉన్న పూవులను తెంపి మాలలు కడుతూ కూర్చుంది సుందరమ్మ.
నందివర్ధనాలు, మందారాలు, రంగురంగుల గులాబీలు చామంతులు సంపెంగలు.. మరువం అన్నిటినీ శ్రద్ధగా ఓ పద్ధతిగా అందమైన మాలగా కట్టి రెండు చేతులతో అలా పైకెత్తి చూసుకొని తృప్తిగా తూలూపి బుట్టలో పెట్టి లేవబోతూ ఉంటే
“మాలలు కట్టడం అయిందా సుందరమ్మా!” భుజం మీద అభిషేకానికి నీరు తెస్తూ అడిగారు పూజారి గోవింద శర్మ.
అయిందని తలూపి పూల దండలున్న బట్టను గర్భగుడి గడప దగ్గర పెట్టి వెళ్లింది. అప్పటికి పూర్తి సూర్యోదయం అయింది. అదే ఆవరణలో వెనక వైపు ఉన్న చిన్నగది లోకి వెళ్లింది సుందరమ్మ. మళ్లీ స్నానం చేసి మడి కట్టుకొని ప్రసాదం తయారు చేయడం మొదలుపెట్టింది. గత ఐదేళ్ల నుండి సుందరమ్మ చేసే పని ఇదే. ఒక్క విషయంలో తేడా కానీ, ఒక్క నిమిషం ఆలస్యం కానీ జరగదు. ఏ పని చేసినా చాలా శ్రద్ధగా ఓపికగా చేస్తుంది. ఆ ఊరి వాళ్లందరికీ సుందరమ్మ అంటే వల్లనాలిన గౌరవం ప్రేమ.
ఎవరికీ ఏ అవసరమొచ్చినా క్షణాల్లో సహాయం చేస్తుంది. మాటల్లో ఆప్యాయత, కళ్లలో కరుణ ఆర్ద్రత పలకరింపులో ప్రేమ సుందరమ్మ ప్రత్యేకతలు.
***
తెలంగాణలో అదొక మారుమూల చిన్న గ్రామం. ఆదర్శగ్రామం అనడానికి అన్ని హంగులు ఉన్నాయి. పట్టణ వాసనలు వంట పట్టించుకోని గ్రామం.
ఊరి వాళ్లంతా ఒక మాట మీద ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరిపై ఒకరు ఆధారపడుతూ సఖ్యంగా జీవించే నిరాడంబరమైన పల్లెటూరు. అలా అని నిరక్షరాస్యులు కాదు. చదువుకున్నవారూ తమ పిల్లలను చదివిస్తున్న వారూ, వ్యవసాయం చేస్తున్నవారూ ఉన్నారు.
ఆ ఊరి పెద్ద జగన్నాధరావు ఊరి ప్రజల సంక్షేమం కోసం పాటుపడడానికి తన సమయం మొత్తం వెచ్చిస్తాడు. ఆయన పిల్లలంతా ఎక్కడో పట్టణాలలో స్థిరపడిపోయారు. రావుగారు ఆయన భార్యా ఊరిని వదలకుండా ఇక్కడే ఊరి బాగోగులు చూసుకుంటూ ఉన్నారు.
ఆ రోజు వైకుంఠ ఏకాదశి.
తెల్లవారుఝామున మూడింటినుండి గుడిలో హడావిడి మొదలైంది. ఊరి వాళ్లు తోరణాలు పూలమాలలు కట్టుతున్నారు. ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సుందరమ్మ ఇంకో ఇద్దరు ఆడవాళ్లు కలిసి గుడి శుభ్రం చేసి ముగ్గులు పెట్టేసారు. నాలుగున్నరకి ఉత్తర ద్వార దర్శనానికి ఊరి వారే కాక చుట్టుపక్కల ఊరివాళ్లు కూడా బారులు తీరి నిలబడినారు. ఆ ప్రాంతమంతా గోవింద నామాలతో మారుమ్రోగిపోతోంది. ఆవరణ అంతా భక్తి పారవశ్యంతో పరవళ్లు తొక్కుతున్న నదిలా శబ్దిస్తోంది.
అప్పటికే స్వామి నైవేద్యానికి వంట పూర్తిచేసి దర్శనం కోసం వచ్చి అందరితో పాటు నిలబడింది సుందరమ్మ.
సరిగ్గా నాలుగున్నర గంటలకు ఉత్తరం వైపు ఏర్పాటు చేసిన ద్వారపు తెర తొలగించారు. ధూపపు మేఘాలను చీల్చుతుంటూ స్వామి దర్శనానికై తహతహలాడుతూ ఒకరివెంట ఒకరు నడుస్తున్నారు. స్వాములు తిరుప్పావై పాశురాలను ముక్తకంఠంతో చదువుతున్నారు. భక్తులు ఒకవిధమైన పారవశ్యంతో భక్తితో స్వామిని దర్శించుకుంటూ మెల్లిగా ముందుకు జరుగుతున్నారు. సుందరమ్మ ఒకప్రక్కగా నిలబడి స్వామిని స్మరిస్తూ చూస్తోంది.
క్యూలో వెనక వాళ్లు ఎవరో కాస్త గట్టిగా తోసినట్టున్నారు. ముందున్నవాళ్లంతా ఒక క్షణం తూలారు. సుందరమ్మ కూడా తూలింది. తల పక్కకు తిప్పి చూసింది.తన కళ్లను నమ్మలేక నలుముకొని మళ్లీ చూసింది.
ఒక్కసారి భయంతో వణికిపోయింది. ముఖం తిప్పుకొని కొంగు నిండా కప్పుకొని వెనకకు తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకొని నేలమీద కూలబడిపోయింది. గోడకానుకుని మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టి గడ్డం ఆనించి కూర్చుంది. భయం వదలడం లేదు. శరీరమంతా వణుకుతుంది. తనను తాను గట్టిగా పట్టుకున్నది. ఇటువంటి సమయంలో తనవారంటూ ఎవరైనా ఉంటే బాగుంటుంది. కానీ తనకెవరున్నారు? తన కోసం ఎవరు వస్తారు.
‘ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఎప్పుడు ఎవరికి ద్రోహం చేసానో! ఎప్పుడు ఎవరిని బాధించానో!’ అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తోంది సుందరమ్మ. అలా తలను గోడకానించి కళ్లుమూసుకుంది. ఈ ఐదేళ్లూ మరో జన్మ ఎత్తినట్టు గడిచిపోయింది. ఎప్పుడో తప్ప గతం గుర్తుకురావడం లేదు. మళ్లీ గత జన్మ లోనికి వెళ్లినట్లు..
***
త్రిపుర సుందరి.. నిజంగానే చక్కటి సౌందర్యవతి. వరంగల్ ప్రాంతంలో మహదేవపురం మారుమూల పల్లె. ఆ ఊరు దొరగారి కూతురు. ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు. కలిమికి కరువులేదు. తండ్రి పురుషోత్తమ రాయుడు ఆ కాలం లోనే ఆడపిల్లకు చదువు అవసరమని పన్నెండవ తరగతి వరకు చదివించాడు. అక్క వర్ధనమ్మ కొడుక్కిచ్చి పెళ్లి చేసాడు.
రెండూర్ల అవతల వర్ధనమ్మ వాళ్ల ఊరు. ఆమె కొడుకు సోమశేఖర్ ఎంఎస్‌సి చదివి వరంగల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ప్రవర్తన ఉన్నవాడు, అదీకాక తన అక్క తన కూతురిని బాగా చూసుకుంటుందని నమ్మకంతో రాయుడు కూతురిని సకల లాంఛనాలతో వందెకరాల పొలం ఒక మేడ కట్నంగా ఇచ్చి పెళ్లి చేసాడు. రాయుడు అనుకున్నట్లే అత్తింట్లో సుందరిని చాలా అపురూపంగా చూసుకున్నారు.
ఎక్కువ ఎదురు చూడకుండానే సుందరి ఇద్దరు మగ పిల్లలకు తల్లైంది.
***
దడదడమన్న శబ్దానికి ఉలికిపడి గతం నుండి బయటకొచ్చింది సుందరమ్మ. కళ్లు తుడుచుకుంటూ జుట్టు సరిచేసుకొని వచ్చి తలుపు తీసింది. గోవిందశర్మ తలుపు దగ్గర నిలబడి ఉన్నారు.
“ఏమైంది సుందరమ్మా! ఎప్పుడనగా వచ్చావు వొంట్లో బాగాలేదా? అయినా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటావు.. ఎట్లా బాగుంటుంది..”
“ఏమీ లేదు అన్నగారూ! రాత్రంతా నిద్ర లేదుగా కాస్త కునుకు పట్టింది.”
“సరేలే! ఇదుగో ఈ పళ్లు తిను! మధ్యాహ్నం అయింది.. ఆ.. ఇదుగో ఈ అబ్బాయి నీ కోసం అడుగుతున్నాడు చూడు!”
అప్పుడు చూసింది! అటు పక్కగా నిలబడిన ఒకతన్ని.. పొద్దున ఎవరినైతే తప్పించుకొని వచ్చిందో అతనే..
సుందరమ్మ ముఖం వివర్ణమైంది!
“ఈవిడనే నా బాబూ నీవు వెతుకుతున్నది?” అన్నారు శర్మ.
ఆమెనే చూస్తూ అవునన్నట్టు తలూపాడు.
“అమ్మా! నీకితను తెలుసా?”
ఏమీ మాట్లాడలేదు సుందరమ్మ!
“సరే మీరు మీరు మాట్లాడుకోండి! నాకు పనుంది” అంటూ వెళ్లిపోయారు.
అక్కడే ఉన్న అరుగు మీద కూర్చున్నాడతను! ఆమె ఆ పక్కన కూలబడి ఏడుస్తోంది.
“అత్తా! నీవేనా! పొద్దున నేను నిన్ను చూసి భయపడ్డాను. నీవు కాదేమో! నీ పోలికలతో ఉన్న ఇంకెవరైనా నేమో అనుకున్నాను! నన్ను తప్పించుకొని వెళ్లినపుడు నీవే అని నమ్మాను! ఐదేళ్ల నుండి అందరూ నీవు చనిపోయావని ప్రతి ఏడు తద్దినాలు పెట్టి దానాలు చేస్తున్నారు. నీవేమో ఇక్కడ ఇట్లా అజ్ఞాతం ఉన్నావు!”
“అదేంటబ్బాయీ! అమంగళం మాట్లాడుతావూ! నిక్షేపంగా ఉన్న మనిషిని చచ్చిపోయావు అంటున్నావూ?” అప్పుడే అక్కడకొచ్చిన శర్మ కోపంగా అరిచారు!
“ఇంతకీ నీవెవరూ?” అన్నారు.
“నా పేరు శరత్ అండి! మా చెల్లెల్ని ఈవిడ చిన్న కొడుక్కి ఇచ్చాము. మా చెల్లి పెళ్లి అవగానే అమెరికాలో జాబ్ వచ్చి వెళ్లిన నేను దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చాను. ఈ పక్క ఊరిలో మా స్నేహితుడుంటాడు. వాడిని కలవడానికి వచ్చాను. ఈ గుడిలో ఏకాదశి చాలా బాగా జరుగుతుందని అంటే వచ్చాము.”
“ఇంతకీ సుందరమ్మ చనిపోయిందని ఎవరు ఎందుకు అనుకుంటున్నారు? తను అనాథ కదా!” అన్నారు శర్మ
“అత్తయ్య అనాథ ఎందుకౌతుంది పంతులుగారు? చక్కగా ఇద్దరు కొడుకులు కోడుళ్లు ముగ్గురు మనవలు ఒక మనవరాలు ఉన్నారు. కోట్ల ఆస్తికి యజమానురాలు తను.” అన్నాడు శరత్.
“శరత్! ఆపు! నిన్ను చెప్పమని నేను చెప్పానా?” గట్టిగా అరిచింది సుందరమ్మ.
“అదేంటి సుందరమ్మా! అలా అంటావు! ఇతను చెప్పినవి అబద్ధాలా! మరి నీవెందుకు అనాథనన్నావు!” అన్నారు శర్మ
ఏమీ మాట్లాడకుండా వెక్కుతూనే ఉంది సుందరమ్మ.
“అత్తయ్యా! ఏం జరిగింది? అంత మంది బలగం కలిగిన మీరు ఇలా ఒంటరిగా? ఎందుకు?” శర్మ శరత్‌ని ఆపి – “బాబూ! తనను కొంచం సాంత్వన పడనీ! ఇంతలో నీవు ఏమైనా తిందువు కానీ!” అన్నారు.
“సరే! పంతులుగారూ! నేను గంటలో వస్తాను. మా స్నేహితుని పంపేసి . ఈ రాత్రి ఇక్కడే ఉంటాను” అంటూ శరత్ వెళ్లిపోయాడు.
“అమ్మా! లే తల్లి! ముఖం కడుక్కుని కాస్త ఆ పండు తిని పాలు తాగెయ్యి! నేను మళ్లీ వస్తాను! తినకపోతే నా మీదొట్టు!” అంటూ శర్మ కూడా వెళ్లి పోయారు.
సుందరమ్మ నిస్త్రాణంగా కూర్చుని అలా ఉండిపోయింది! సాయంత్రం ఐదవుతుండగా శరత్ వచ్చాడు.
వస్తూ స్వామికి పెద్ద పూలమాల పళ్లు సుందరమ్మకు రెండు చీరలు శర్మగారికి పంచల చాపు పట్టుకొచ్చాడు. ఏకాదశి కావడాన శర్మ అర్చనలు పూజలతో బాగా హైరానా పడుతున్నారు.
రాత్రి తొమ్మిది తర్వాత శర్మతో పాటు సుందరమ్మ ఉన్న గది దగ్గరికి వెళ్లాడు. సుందరమ్మ కూడా తలుపునానుకుని కూర్చుంది.
“అత్తయ్యా! ఏమైనా తిన్నావా?” అన్నాడు శరత్.
“ఆ! పండు తిన్నాను..” అన్నది
శర్మ తన చేతిలోని గ్లాసు ఇచ్చి “ఈ కొబ్బరి నీళ్లు తాగమ్మా!” అన్నారు.
“ఇప్పుడు చెప్పు అత్తయ్యా! ఏం జరిగింది?” శరత్ ఆతృత పట్టలేక.
“చెప్తాను కానీ ఒక మాట ఇవ్వాలి నీవు.. నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు.. మళ్లీ నేను ఆ నరకకూపం లోకి పోదలుచుకోలేదు. నా అవసరం వాళ్లకు లేదు. అలా కాదంటే ఇక్కడ కూడా ఉండను.” అని ఖచ్చితంగా అన్నది సుందరమ్మ
“సరే అత్తయ్యా! చెప్పను, నా పాప మీద ఒట్టు”
“ఏమని చెప్పను శరత్! ఆస్తుల కోసం మోసం చేసారని చెప్పనా! చావకముందే చచ్చిపోయిందని చెప్పారని చెప్పనా?నా కొడుకులు కూడా వాళ్ల మాటే నమ్మి కనీసం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చెప్పనా? మీ మామయ్య ఆస్తిని రెండు భాగాలుగా చేసి రెండు నా పేరు మీదే రాసినారు. నా తదనంతరం వాళ్లకు చెందుతుందని వీలునామా రాసారు. అది కూడా నాకు చాలా రోజులకు తెలిసింది. ఏమైందో కానీ ఆ వీలునామా రాసిన ఏడాదికి ఆయన హఠాత్తుగా పోయారు.
ఊళ్లో వ్యవసాయం కౌలుకిచ్చి పిల్లల దగ్గరికి వచ్చేసాను. ఇక సిటీలో ఉన్న రైస్ మిల్లులు ఊళ్లో వ్యవహారాలన్నీ వాళ్లే చూసుకోసాగారు. ఈ డబ్బు విషయాలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. మీ అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చేసారు. మా పెద్దకోడలి మేనమామ కూడా మాతో పాటే ఉండేవాడు. నేను వాళ్లు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని ఏ రోజు అడగలేదు. క్రమంగా పనివాళ్లను తగ్గించారు. నాకు పనులు పురమాయించడం మొదలుపెట్టారు.
ఓ రోజు పెద్దవాడు అమ్మెందుకు పనిచేస్తుంది అని అడిగితే.. మామయ్య పోయిన దుఃఖం నుండి కాస్త మనుసు మళ్లుతుంది అని మేము కూడా ఏమీ అనలేదన్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక వాళ్లకుండేదే కాదు.
అలా నేను పూర్తి వంటమనిషిని అయ్యాను. అందరికీ వండి పెట్టడమే తప్ప తినే ప్రాప్తం ఉండేది కాదు. బయటికి వెళ్లనిచ్చేవారు కాదు. వాళ్లు అందరూ ఒకేసారి తినేవారు. తినగానే టేబుల్ మీదివన్నీ పని వాళ్లకు లేదా కుక్కలకు వేసేవారు. నా గురించి ఆలోచించేవారే కాదు. నన్ను తమతో తినమని ఏ రోజు అనలేదు. నా పిల్లలతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్లు కాదు.
ఒక రోజు అయ్యో నేనింకా తినలేదు అన్నాను. అయ్యో పారేసాక చెప్తారే? ఇప్పటికెలాగో సర్దుకోండి అన్నారు. ఒక రోజు తినీ తినక అలా మూడేళ్లు గడిచాయి. నా కొడుకులకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. తరుచుగా నా కొడుకులు ఊరికెళ్లేవారు.
ఒకరోజు వాళ్లిద్దరు కౌలు విషయమై ఊరికెళ్లారు. ఇంట్లో వాళ్లందరు ఎక్కడకో ప్రయాణమౌతున్నారు. నా పని నేను చేస్తున్నాను. వాళ్లందరూ తినేసి ‘మేము శ్రీశైలం వెళ్తున్నాము.. వచ్చేవరకు కాస్త రాత్రి అవుతుంది.మీరు జాగ్రత్త’ అని చెప్పి వెళ్లిపోయారు.
ఆ రోజు టేబుల్ మీద అన్నీ మూతలు పెట్టి అలాగే ఉన్నాయి. మరిచిపోయారో ఏమో అనుకొని పనంతా ముగించి నేను కడుపునిండా తిన్నాను. అంతే గుర్తుంది నాకు.. తర్వాత ఆసుపత్రిలో కళ్లు తెరిచాను.
అప్పటికి అక్కడికి నేను వచ్చి పద్దెనిమిది రోజులైందని చెప్పారు. డాక్టర్‌ని అడిగాను.
అతను చెప్పింది విని శిలలా మారిపోయాను.
నేను తిన్న భోజనంలో ఏదో ఘాటైన విషాన్ని కలిపారట. తెచ్చి ఆసుపత్రిలో చేర్చారట.. నా కొడుకులకు చనిపోయినట్లు చెప్పమనినారట. మీ నాన్న, మా కోడలి మేనమామ హార్ట్ అటాక్ అని చెప్పమన్నారట.. కాదని ఇంటికి పంపితే మళ్లీ మేం ఏదో రకంగా చంపుతాము అదేదో మీరే చేయండి.. అని చెప్పారట.
ఆ తర్వాత ఏం చేసారో నాకు తెలియదు.. నేను చనిపోయినట్లు ప్రకటించారు. నేను చనిపోదామనే ప్రయత్నం చేసాను. నాకెవరూ లేరనిపించింది. తండ్రి అన్నలు అందరూ పోయారు. నా దురదృష్టం.. భర్త కూడా దూరమయ్యాడు. ఎవరికి అవసరం లేని నేను బతికి ఏం చేయాలనిపించింది. మళ్లీ నా కొడుకుల దగ్గరికి మాత్రం వెళ్లకూడదనుకున్నాను. ఆసుపత్రిలో చేర్చేముందే నా వంటిమీది నగలు కూడా తీసేసుకున్నారు. ఎక్కడి వెళ్లను? ఎలా వెళ్లను? అని ఆ ఆసుపత్రి మేడ మీద నుండి దూకుదామని వెళ్లాను.
ఆ ఆసుపత్రిలో పనిచేసే కంపౌండరు నన్ను చూసి ఆపేసాడు. మీ మామయ్య ఉన్నపుడు రైస్ మిల్‌కు వచ్చేవాడట.. ఆ పిల్లోడు నన్ను గుర్తుపట్టి సహాయం చేసాడు. ఇక్కడికి దగ్గరలో ఒక గూడెం వాళ్ల ఊరట. ఈ గుడి, గుడి పూజారి ఊరివాళ్లు మంచివారని నన్ను ఇక్కడికి తెచ్చి శర్మ గారికి అప్పగించి వెళ్లాడు. తన ఊరికి వచ్చినపుడు నన్ను చూసి వెళ్తాడు..” అంటూ ముగించింది సుందరమ్మ.
అంతా విన్న శరత్ చాలా సేపు మాట్లాడలేదు.
ఒక నిట్టూర్పు విడిచి.. “చాలా అన్యాయం జరిగిందత్తయ్యా! అంత ఆస్తి ఉన్న నీవు అంతా వదలేసి ఎలా వచ్చావు. మా నాన్న శకుని బుద్ధి నాకు కొంత తెలుసు కానీ ఇంత దగజారుతారని అనుకోలేదు. ఏమైనా తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలి.” అన్నాడు.
“వద్దు శరత్! నువ్వేమీ చెయ్యొద్దు, ఎవరికీ చెప్పొద్దు” అన్నది ఆమె.
“సరే అత్తయ్యా! ఎవరికీ చెప్పను! మళ్లీ రేపు సాయంత్రం వెళ్లేముందు వస్తాను.” అంటూ లేచి వెళ్లిపోయాడు.
మర్నాడు సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో శరత్ అతని స్నేహితుడు వచ్చారు. శర్మ దిగులుగా అటూ ఇటూ తిరుగుతూ పని చేసుకుంటున్నారు. శరత్ కాళ్లు కడుక్కొని గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. శర్మగారిచ్చిన ప్రసాదం తింటూ అక్కడే కూర్చున్నారు.
శర్మ వచ్చారు.. “బాబూ!..” అంటూ తలదించుకొని నిలబడ్డారు.
“చెప్పండి పంతులుగారూ! అత్తయ్య దగ్గరికివెళ్దామా!”
“బాబూ! సుందరమ్మ కనిపించడం లేదు!” అన్నారు.
“వాట్!!!!” ఒక్కసారి అరిచి నిలబడ్డాడు. “అదేంటి! ఎక్కడికి వెళ్లింది అత్తయ్య..” అడిగాడు.
“ఏమో! నాయనా! మామూలుగా పొద్దునే లేచి గుడి ప్రాంగణం ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులేసేది.. నేను వచ్చేసరికి తన బట్టలు మాత్రం సర్దుకొని వెళ్లిపోయింది.”
శరత్ తల పట్టుకొని కూర్చుండిపోయాడు. ఇంక చేసేదేమి లేక వెళ్లిపోయాడు..
తన గమ్యాన్ని వెతుక్కుంటూ సుందరమ్మ వెళ్లిపోయింది. శరత్ అమెరికా వెళ్లే ముందు కూడా వచ్చాడు. కాని ఎవరూ ఏమీ చెప్పలేక పోయారు.
తర్వాత కూడా ఆమె ఎక్కడికి వెళ్లిందో ఏమో ఎవరికీ తెలియలేదు. తన గమ్యం ఏమిటో ఎక్కడో ఎవరూ కనుక్కోలేక పోయారు.
***
హైదరాబాదు వెళ్లిన శరత్ స్థిమితంగా ఉండలేకపోయాడు. అక్కడ జరిగిన విషయాలను ఎవరితోనైనా చెప్పాలనుపిస్తుంది. సుందరమ్మ అత్తయ్య చెప్పిన మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. ఒట్టు వేసాడు. ఆరు వారాల సెలవులో వచ్చిన తను ఈ జంఝాటంలో పడడం అవసరమా! అనిపించి, ఎవరితోనూ ఏం మాట్లాడడానికి మనసొప్పలేదు.
శరత్ భార్య స్వప్న పాపతో వరంగల్ లో వాళ్ల అమ్మవాళ్లింట్లో ఉంది. తను చెల్లెలు, సుందరమ్మ కోడలైన చిత్ర ఇంట్లో ఉండి వీసా పనులు చూసుకుంటున్నాడు.
ఓ సాయంత్రం టీ తాగుతూ “మీ అత్తగారు ఎలా చనిపోయారే చిత్రా?” అన్నాడు చాలా కాజువల్‍గా
ఎదురుగా ఉన్న భర్త చరణ్‍ని చూసింది చిత్ర. ఏభావం లేకుండా చూస్తూ ఉన్నాడు చరణ్.
“అదేంటన్నయ్యా! హార్ట్ ఎటాక్ అని అప్పుడే చెప్పాం కదా! మళ్లీ ఇప్పుడెందుకు ఆ విషయం తీస్తున్నావు?” కొంచం తడబడ్డట్టుగా అన్నది.
“మరి ఆస్తి అంతా మీ ఇద్దరికీ సమానంగా వచ్చేసినట్లేనా?”
“ఆ! వచ్చింది.. బిజినెస్ కూడా వేరువేరుగా చేసుకున్నాం! ఎవరింట్లో వాళ్లం చాలా హాపీగా ఉన్నాం!! చాలా??” అన్నది చిత్ర చిరాగ్గా!
“అంటే.. అత్తయ్య ఉన్నపుడు మీరు హ్యాపీగా లేరా?” అన్నాడు శరత్!
ఏమీ మాట్లాడకుండా చరణ్ ఇద్దరినీ చూస్తున్నాడు..
“మళ్లీ మళ్లీ ఆవిడ పేరు ఎత్తుతూ ఎందుకు విసిగిస్తావు.. ఏం పని లేదా నీకు? అయ్యింది అయిపోయింది.. పోయినావిడకు లేని దురద నీకెందుకూ!” అంటూ గయ్యిమన్నది
“అంత ఉలికిపాటెందుకూ? ఆవిడ పేరెత్తితే నీకు కంగారెందుకు? అత్తయ్య ఎంత మంచి వారో ఎంత సంస్కార వంతులో మన చుట్టాలందరికీ తెలుసు..” అని, “కదా! బావా..” అంటూ చరణ్ వైపు తిరిగి అడిగాడు శరత్
“పోనీ బావా.. కారణమేదైనా అమ్మ పోయి ఐదు సంవత్సరాలు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం?” విరక్తిగా అన్నాడు చరణ్ కళ్లలో నీరూరుతుండగా!
“అందుకే వీళ్ల ఆటలు ఇలా సాగుతున్నాయి.. అత్తయ్య లాగే మీరూ అమాయకులు.. ఎవరేమన్నా నమ్మేస్తారు..”
“అవును మరి మేము రాక్షసులము.. ఆవిడను చంపేసాము..” ఉరిమి చూస్తూ అంది చిత్ర.
“ఏమో!! ఎవరికి తెలుసు” అన్నాడు శరత్
“చూడూ! ఇంతసేపూ నా సొంత అన్నవని ఊరుకుంటున్నాను.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఆ మర్యాద కూడా ఇవ్వను” అంటూ చిత్ర గిరుక్కున తిరిగి వెళ్లిపోయింది.
ఇంక అక్కడ ఉండబుద్ధి కాలేదు శరత్‌కి. తన ఫ్రెండ్ రాజుని కలిసి హైదరాబాద్ అంతా ఊరికే అలా తిరిగాడు.. తన మనుసులో ఉన్నదంతా రాజుకి చెప్పేసాడు. ఎవరికో ఒకరికి చెప్పకపోతే గుండె బరువు తగ్గేలా లేదు..
అంతా విన్న రాజు.. నోట మాట రాక అలా ఉండిపోయాడు.. “ఏదో సినిమాలోనో డైలీ సీరియల్‌లోలా ఉందేంది రా ఇది.. వామ్మో ఇంత కిరాతకులుంటరా..?” అన్నాడు.
“అదే కదరా! వీళ్ల మోసం అందరికీ తెలిసేలా చేయాలి.. ఎలా?? ముఖ్యంగా మా నాన్న దీనంతటికీ సూత్రధారి” అన్నాడు శరత్.
“నాదో ఐడియా” అన్నాడు రాజు.
“ఏంది చెప్పు”
“ఆవిడని అదే మీ అత్తను ఏ హాస్పటల్‌లో చేర్చారప్పుడు?”
“ఏదో దిల్‌సుఖ్‍నగర్‌లో అన్నారు. బాగా గుర్తులేదు రా!” రాజు కొద్దిసేపు మౌనంగా ఉండి..
“అవునొరే! మీ అత్తయ్య ఇల్లు ఎక్కడో వారాసిగూడ.. మరి ఆమె హెల్త్ బాగాలేకపోతే దిల్‌సుఖ్‌నగర్ కెందుకు తెచ్చారు?” అన్నాడు రాజు..
శరత్ “నిజమే కదా!” అన్నాడు..
“ఓ పని చేద్దాం రా! రేపు పొద్దున మనం 10 గంటలకి అలా బయలుదేరి.. ఆ హాస్పటల్‌కి వెళ్లి వద్దాము.. ఈ రాత్రి మా యింటికి వచ్చేయి.” రాజు అన్నాడు.
“సరేరా! నాకూ మా చెల్లెలి ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు!” అన్నాడు శరత్.
***
మర్నాడు పొద్దునే టిఫిన్ చేసి ఇద్దరూ బయలుదేరి హాస్పటల్‍కి వచ్చారు. రిసెప్షన్‌లో డాక్టర్ గురించి అడిగారు. ఆ డాక్టర్ యు.కె. వెళ్లిపోయాడు అని చెప్పారు.
ఇద్దరూ ఏంచేయాలో అర్థంగాక బయటికి వచ్చి టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ కూర్చున్నారు.
“ఒరే శరత్! అసలు ఏం చేద్దామని? ఆ ఆంటీకి అన్యాయం చేసిన వాళ్లని శిక్షించాలనా? ఆమె ప్లేస్ ఆమెకు ఇప్పించి న్యాయం చేద్దామనా? లేక మీ చెల్లెలి వాళ్లకి బుద్ధి చెపుదామనా? ఏం చేద్దామని నీవు దీని వెంటపడుతున్నావు?” అన్నాడు రాజు
“ఏమో రా రాజూ! ఆమెను అలా గుడిలో పని చేస్తూ ఉండడం చూసాక నాకు చాలా బాధ అనిపించింది. ఉన్నదంతా కొడుకులకు ఇచ్చేసి అనామకురాలిలా అజ్ఞాతం లోకి వెళ్లకపోవడం ఎంత దారుణం. ఆమె తండ్రి, ఆమె భర్త ఇది ముందుగా ఊహించే ఆమె పేరు మీద విల్లు రాసారు.. అయినా వాళ్లు ఊహించిన దానికన్నా భయంకరంగా ప్రవర్తించారు.. అత్తయ్య తన పిల్లలకు కూడా కొంచం లౌక్యం నేర్పలేదు.. అదేంటో!!! వాళ్లు కూడా అందరినీ నమ్మేస్తారు! కనీసం ఆమె కొడుకులకు ఆమె బతికిఉన్నట్లు తెలిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం.. కానీ అత్తయ్య కు ప్రామిస్ చేసిన.. ఎవరికీ చెప్పనని..
కానీ రాజూ! అత్తయ్య వాళ్లూ చాలా మంచివాళ్లు రా! మామయ్య కూడా కోట్ల ఆస్తి ఉన్నా పాపం అందరికీ సహాయం చేసి ఆదరించే వారే తప్ప గర్వాన్ని, డాంబికాన్ని చూపించేవారు కాదు.ఇక అత్తయ్య అయితే అంత కలిమిలో పెరిగినా అన్ని పనులు చేసేది. ఒక్కరినీ ఒక మాట అనే వాళ్లు కాదు.
మా బావలు కూడా అంతే! సాఫ్ట్‌గా ఉంటారు. ఇటువంటి వాళ్లకి మా నాన్నలాంటి కన్నింగ్ మనుషులు ఎలా దొరికారురా!” అంటూ తలపట్టుకున్నాడు శరత్.
వీళ్లు ఇలా మాట్లాడుతూ ఉంటే.. పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి తిరిగి చూసాడు శరత్ .
టీకొట్టు బెంచి మీద ఒకతను కూర్చున్నాడు. బాగా పెరిగిన గడ్డంతో తిని చాలా రోజులైనట్లు ఉంది. నీరసంగా ఉన్నాడు. వీళ్లిద్దరినే చూస్తున్నాడు. శరత్‌కి అతను వీళ్లతో ఏదో చెప్పలనుకుంటున్నాడనిపించింది..
“టీ తాగుతారా?” అన్నాడు శరత్ అతన్ని చూసి. తాగుతాను అన్నట్లుగా వేగంగా తలూపాడతను.
“రెండు టీలు ఒకటిగా చేసి బిస్కట్ పాకెట్‌తో ఇవ్వన్నా!” అని టీ కొట్టతనితో చెప్పాడు.
“సార్! వాడు ఇదే హాస్పిటల్‌లో పనిచేసే రాములు.. ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు. ఈ దవఖానా అమ్ముడైన తర్వాత ఏమైందో కానీ ఇలా అయిపోయాడు. ఎవరితోనూ మాట్లాడడు ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు. ఎవరైనా పెడితే తింటాడు.. లేకుంటే ఆ వేప చెట్టు కింద పడుకుంటాడు” అన్నాడు టీకొట్టతను.
“సరే లే! ఎవరైతేనేంటి! ఇవ్వు” అన్నాడు శరత్.
బిస్కట్ పాకెట్ టీ తీసుకొని ఆబగా తినసాగాడు. శరత్ ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి.
ఇతనికేమైనా తెలిసుంటుందా? ఎందుకిలా అయ్యాడు? ఇంకేం ఆలోచించకుండా అతను వెళ్లిపోతుంటే వెంట వెళ్లాడు.
“రాములూ! రాములూ!” అని పిలిచాడు
ఆగకుండా పరిగెడుతున్నట్లు నడుస్తున్నాడు. శరత్, రాజు గబగబా వెళ్లి అతన్ని ఆపారు.
రాములు చెయ్యి విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
“రాములూ! భయపడకు నిన్నేమీ చేయను! నాతో వస్తావా? మా ఇంట్లో ఉంటావా? అన్నం పెడతా.. పడుకునేందుకు నీకు రూం ఇస్తాను..” అంటూ బతిమిలాడాడు శరత్.
రాములు నెమ్మదిగా గింజుకోవడం తగ్గించాడు. అదే అదనుగా శరత్ మళ్లీ మొదలుపెట్టాడు.
రాములు చేయిపట్టుకొనే రాజుతో కారు స్టార్ట్ చెయ్యిరా అన్నాడు. ముగ్గురు రాజు వాళ్లింటికి వెళ్లారు.
ఎందుకో శరత్‌కి రాములుకి సుందరమ్మ విషయం తెలుసునేమో అని సందేహం తొలుస్తుంది. రెండు మూడు రోజులు శరత్ ఏమీ మాట్లాడలేదు. తర్వాత రాములు కొంచం స్థిరపడినట్లు అనిపించింది.
శరత్ “టీ తాగుదామా రాములూ” అనడిగాడు. ‘సరే’ అన్నట్టు తలూపాడు. ఇద్దరూ బయటికి వచ్చి నడవడం మొదలుపెట్టారు.
“రాములూ!” పిలిచాడు శరత్.
“చెప్పుండి సారూ!” అన్నాడు.
“ఇప్పుడు నీవు బాగున్నావు కదా!”
“బాగనే ఉన్న సారూ” తలవంచుకొని అన్నాడు రాములు.
“కొన్ని ప్రశ్నలు అడిగుతానూ ఏమనుకోవుకదా!!”
రాములు తలెత్తి శరత్ వంక చూసి.. “ఆయమ్మ గురించేగద సారూ!” అన్నాడు.
“ఏయమ్మ?” అన్నాడు శరత్!!
“గదే చరన్ సార్ వాల్లమ్మ!”
“నీకెట్లా తెలుసు?”
“మీరు మీ దోస్తు గా దినం మాట్లాడుకోలే? గదిన్నంక నాకు బుగులు వుట్టింది.. గందుకే గాన్నించి వురికిన..” అన్నాడు రాములు భయపడుతూ!
“అవునా? నీకేం తెలుసు.. ఎలా తెలుసు?” అన్నాడు శరత్.
కొంచం సేపు ఏం మాట్లాడలేదు..
“సారూ..!!” అంటూ మొదలుపెట్టాడు..
“ఆ దొర వాల్లది మాది ఒకటే ఊరు.. నేను ఇరవై ఏల్లునపుడు దొర తోని పట్నమొచ్చిన. ఊర్ల పదిదాక సదివిన.. దొర ఇంట్లనే ఇంటెన్క ఉన్న అర్రల ఉండి ఇంటిపని తోట పని బజారు పని కారు డ్రైవింగు నేర్చుకున్న.. ఆయమ్మ దేవత సార్! అన్నంబెడితే మల్ల రొండోపూట గూడ ఆకలి ముచ్చట ఉండదు.. ఇంట్ల వాల్లేది తింటే మా పనోల్లకు గూడ గదే పెట్టెటోల్లు. దొర పెద్దకొడుకు పెండ్లైంది. కోడలు దొరసాని మేనమామ ఆమెంటనే వొచ్చిండు. గాయిన చిన్న కతర్నాక్ గాదు సార్.. ఆయన ముకం జూస్తే, నవ్వు జూస్తే బేజారయ్యేది. ఏడాదిలనే మెల్లెగ దొర నౌకరీల వెట్టిన పనోల్లను ఏదో వొంక జూపి ఎల్లగొట్టిచిండు.
అప్పటికే దొర అన్ని కర్సులు వెట్టి నాకు లగ్గం జేసిండు ఇద్దరాడి పోరలు నాకు. నా ఇంటిదానిమీద దొంగతనం అంటగట్టి ఎల్లగొట్టిన్రు.. బయటకొచ్చి గా దవకాన్ల పనిజేసిన.. దొర సచ్చిండని తెల్వంగనె వోతె ఇంట్లగ్గూడ రానియ్యలే సార్.. ఒక ఏడాదికి ఒకనాడు దొరసానిని దెచ్చిన్రు.. గట్టిమనిసి ఒక్కనాడు ముక్కుసీదలేదు.. గసుంటామెను మోసుకంట వొస్తే పానం బేజారైంది సారూ నాకూ!
అందరు గలిసి ఆమెను బతికుండంగనె కాల్చేయ జూసిన్రు.. ఆ డాక్టర్ కాల్లమీద వడి బతికించమన్న.. పాపం ఆయన అదే రోజు ఇంకొకామె సచ్చిపోతె ఆ శవాన్ని తెల్ల బట్టల జుట్టి.. కండ్లు గుండె కిడ్నీలు దానంకి రాసిన కాగితాలు జూపిచ్చి.. అవన్ని దీసినం కట్లు ఇప్పకుండ తడపకుండ కార్యం చేయమనిచెప్పిన్రు.. దొరసానమ్మను నా దోస్తుగాడు ఆదిలాబాదు దగ్గర తండలుంటడు వాన్నిచ్చి ఆ ఊరికి పంపిన..
నన్ను ఇక్కడ జూసి గుర్తువట్టిగా ముసలోడు మా ఇంటిని తగలవెట్టిచిండు.. నా ఇద్దరు పిల్లలు మా ఇంటిది కాలి బూడిదైన్రు దొరా!!” అని భోరునా ఏడ్చేసిండు..
శరత్ నోట మాట రాలేదు.. ఎంత కిరాతకం.. అని విస్తుపోయిండు..
మళ్లీ వెక్కిళ్లతో “అప్పటినుంచి పిచ్చోడిలెక్కగా దవాఖాన ముందరనే కూకోవట్టిన.. మా దొర కొడుకులన్న ఎవరన్న ఒస్తరేమోనని.. మొన్న నిన్ను ఎక్కన్నో జూసిన అనిపించింది దొర. అందుకే పక్కనొచ్చికూసున్న.. మీరు మాట్లాడుకునేది ఇన్న.. వాల్లనెట్లైన సిచ్చించాలె దొర.. ఎవల్ల దగ్గరకు రమ్మంటే వాల్లవదగ్గరకొచ్చి చెప్త..”
శరత్ రాజులు కొయ్యబారినట్టైనారు..
శరత్ తన బావ చరణ్‌కి వాళ్ల అన్న కిరణ్‌కి ఫోన్ చేసి పిలిచాడు. రాముల్ని చూడగానే ఇద్దరూ గుర్తుపట్టారు.
“ఏమైంది రా! రాములూ! ఎక్కడికి పోయినవు.. ఎన్నేళ్లైంది నిన్ను చూసి” అంటూ కిరణ్ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.
“వీడు నేను కలిసి ఆడుకునేవాళ్లం చిన్నప్పుడు.. ఎక్కడికెళ్లినా నన్ను తమ్ముడిని జాగ్రత్తగా చూసుకునేవాడు. అమ్మ మాతో పాటు వీడికి అన్నం పెట్టేది.”
“చిన్న దొరా!” అంటూ కాళ్లను చుట్టుకొని ఏడవడం చూసి కిరణ్ కంగారు పడ్డాడు .
“ఏమైందిరా.. ఎందుకంత ఏడుస్తున్నవూ!” అంటూ రెండు భుజాలను పట్టి ఊపాడు చరణ్..
“నువ్వాగు చిన్నా! నేను మాట్లాడుతున్నా కదా!” అని రాములు వీపు మీద చేత్తో రాస్తూ “చెప్పు రామూ చెప్పు..” అన్నాడు కిరణ్..
రాములుకి వెక్కిళ్లు తప్ప నోట్లోనుంచి ఒక్కమాట రావడం లేదు..
ఇంక శరత్‌కి ఊరుకోబుద్ది కాక.. “బావా! నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. గాబరా పడి టెన్షన్‌కి గురి కావద్దు..” అన్నాడు. చెప్పు అన్నట్టు చూసారిద్దరు..
శరత్ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విని అన్నదమ్ములిద్దరూ కుప్పకూలిపోయారు ‘అమ్మా!!’ అంటూ. పదిహేను నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
చరణ్ తేరుకొని.. “పదన్నయ్యా పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. ముందు ఆ డాక్టర్ ని పట్టుకుందాం.” అన్నాడు.
రాములు “ఆ డాక్టర్ కూడా యాక్సిడెంటులో చచ్చిండయ్యా ! కానీ ఏదో దేసం పోయిండని నమ్మచ్చిన్రు అందరిని..” అన్నాడు
“మరెలా??”
“ఎస్.ఐ. గారు నాన్నగారికి తెలిసిన వారే కదా అన్నయ్యా! ముందు జరిగిందంతా ఆయనకు చెప్పుదాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. కానీ.. అమ్మను తీసుకొచ్చేద్దాం అన్నయ్యా ముందు..” అంటూ భోరున ఏడ్చేసాడు చరణ్.
చరణ్ కిరణ్ ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తుంటే అక్కడున్న అందరికీ మనుసు వికలమైంది.
అదేమైనా తమ తల్లి బ్రతికే ఉందన్న మాట అన్నదమ్ములిద్దరికీ వేయి ఏనుగుల బలాన్ని కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.