సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు.
అనిర్వేదః శ్రియోమూలం
అనిర్వేదః పరమ్ సుఖమ్ । 
అనిర్వేదో హి సతతం
సర్వార్థేషు ప్రవర్తకః ॥ 
కందం:
ఉత్సాహమె సిరుల నొసగు
ఉత్సాహమె సుఖము లొసగు నున్నతు జేయున్
ఉత్సాహమె సకల మొసగు
ఉత్సాహమె విజయ మిచ్చు ఉర్విని యెపుడున్ ౧
ఉత్సాహంగా జీవిద్దాం ! 
ఉన్నతాశయాలను సాధిద్దాం !! 
***
వాక్ పారుష్యాత్ సర్వలోకాప్రియత్వం
వాఙ్మాధుర్యాత్ సర్వ లోక ప్రియత్వమ్ । 
కోవా లోకే వాయసేనాపకారః
కోవా లోకే కోకిలే నోపకారః ॥ 
ఆటవెలది:
మనసు చీల్చు రీతి మాటాడ వలదయ్య
మనసు దోచు రీతి మాట లాడు
కాకి గోల యెవరి కర్ణపేయ మగును
పికము పాట వినగ ప్రియము కాదె ౨
మధురంగా మాట్లాడదాం ! 
మనసులను దోచేద్దాం !! 
***
శ్రద్ధయా దేయం, అశ్రద్ధయాఽదేయం ॥
శ్రియా దేయం, హ్రియా దేయం ॥ 
భియా దేయం, సంవిదా దేయం ॥
ఆటవెలది:
శ్రద్ధ తోడ నిమ్ము శ్రద్ధ లేక నిడకు
వలసి నంత యిమ్ము వంగి యిమ్ము
భయము తోడ నిమ్ము భవుని కనుచు నిమ్ము
దయను గలిగి యిమ్ము ధరణి నెపుడు ౩
సాత్త్విక దానం చేద్దాం ! 
సత్ఫలముల పొందుదాం !! 
***
పరోపకారాయ ఫలంతి వృక్షాః
పరోపకారాయ వహంతి నద్యః । 
పరోపకారాయ దుహంతి గావః
పరోపకారాయ సంతా విభూతయః ॥ 
ఆటవెలది:
దీక్ష బూని యిలను వృక్ష రాజము లెపుడు
పరుల మేలు గోరి ఫలము లిచ్చు
అవని యందు జూడ ఆలమంద లెపుడు
పరుల కొఱకె తాము పాలు గురియు
పరుల కొరకె తాము పరమ ప్రీతితోడ
ఏఱు లన్ని యెపుడు పాఱు చుండు
పరుల మేలు గోరి పరమ సంతసమున
సొమ్ము లిడుదు రెపుడు సుజన కోటి ౪
పరుల హితుము గోరు ! 
పరుని యెదను జేరు !! 
***
న చౌర హార్యం న చ రాజ హార్యమ్
న భ్రాతృ భాజ్యం న చ భారకారీ । 
వ్యయే కృతే వర్ధతే ఏవ నిత్యమ్
విద్యా ధనం సర్వ ధనం ప్రధానమ్ ॥ 
ఆటవెలది:
తస్క రాదు లెపుడు తస్కరింపగ లేరు
అన్న దమ్ము లడుగు ఆస్తి కాదు
ధరణి నేలు వారు హరియింపగా లేరు
మోయ లేని బరువు మొదలె కాదు
పంచుచున్న కొలది మించి పోవుచు నుండు
తరుగ బోని ధనము ధరణి యందు
సకల ధనము లందు సర్వోత్తమ ధనము
విద్య యొకటె సుమ్మి విశ్వ మందు ౫
విశ్వవర్ధనమ్ము !
విద్యాధనమ్ము !!

