మరుగునపడ్డ మాణిక్యాలు – 71: హిల్‌బిల్లీ ఎలిజీ

1
3

[సంచిక పాఠకుల కోసం ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

పేదరికంతో పోరాడి విజయం సాధించిన వ్యక్తుల కథలు చాలానే వచ్చాయి. కానీ తల్లే పురోగతికి అడ్డు పడితే ఎంత కష్టం? కావాలని చేయకపోయినా అది పెద్ద అవరోధం. ఎదిగే వయసులో చెడు సావాసాలు మరో అవరోధం. ఆ సమయంలో తలిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలి. తండ్రి లేక, తల్లి అండ లేక అమ్మమ్మ సాయంతో పేదరికపు శృంఖలాల నుంచి బయటపడిన ఒక వ్యక్తి నిజజీవిత కథ ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ (2020). ‘హిల్‌బిల్లీ’ అనేది కొండ ప్రాంతాల్లో నివసించేవారిని హేళన చేయటానికి వాడే పదం. ఎలిజీ అంటే కవితాత్మకమైన సందేశం. ఎవరైనా మరణిస్తే సంస్మరణ సభల్లో ఎలిజీ ఇవ్వటం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మరణంతో సంబంధం లేదు. హేళనకి గురైనవారి ఔన్నత్యాన్ని పరిచయం చేసే కళారూపం అనే అర్థం వస్తుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

జేడీ అమెరికాలోని ఆపలాచియా అనే కొండ ప్రాంతానికి చెందినవాడు. అది ఆదివాసీల ప్రాంతం. మిగతా ప్రపంచం వారిని చిన్నచూపు చూస్తుంది. జేడీ కుటుంబం ఆ ప్రాంతం వదిలి ఒక పారిశ్రామిక ప్రాంతంలో స్థిరపడింది. జేడీకి తల్లి, అక్క, అమ్మమ్మ, తాతయ్య ఉంటారు. తండ్రి తల్లిని వదిలి వెళ్ళిపోయాడు. జేడీ తల్లి బెవర్లీ పద్దెనిమిది ఏళ్ళ వయసులో తొలిసారి గర్భవతి అయింది. స్కూల్లో మంచి మార్కులు వచ్చేవి. కానీ బిడ్డను చూసుకోవటం కోసం ఆమె చదువుని వదులుకుంది. “అమ్మాయిల గ్రహచారమే అంత” అంటుంది ఒకసారి. లైంగిక స్వేచ్ఛ పెరగటంతో లైంగిక కార్యకలాపాలు చేయటం, గర్భం ధరించటం, మగవాడు వదిలించుకుని వెళ్ళిపోవటం మామూలే అని ఆమె భావిస్తుంది. అమె తల్లి, తండ్రి విడిపోయారు. విచిత్రమేమిటంటే అందరూ ఒకే వీధిలో ఉంటారు కానీ బెవర్లీ తన పిల్లలతో ఒక ఇంట్లో, ఆమె తల్లి ఒక ఇంట్లో, ఆమె తండ్రి ఒక ఇంట్లో ఉంటారు. అన్నీ అద్దె ఇళ్ళే.

చిత్రంలో జేడీ బాల్యం, యౌవనంలో జరిగిన సంఘటనలు మార్చి మార్చి వస్తూ ఉంటాయి. యౌవనంలో జేడీ ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయంలో లా చదువుతుంటాడు. అప్పటికి అతని అమ్మమ్మ, తాతయ్య మరణించారు. వేసవిలో ఇచ్చే ఇంటర్న్‌షిప్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. జేడీ ప్రేయసి ఉష ఒక భారతీయ యువతి. ఆమెకి వాషింగ్టన్‌లో ఇంటర్న్‌గా అవకాశం వచ్చింది. జేడీ కూడా ఆ నగరంలోనే ఇంటర్న్‌గా పని చేయాలని ఆశిస్తాడు. ఒక లా ఫర్మ్‌లో ఇంటర్న్‌గా చేరాలని అతని ప్రయత్నం. ఇంటర్వ్యూలో భాగంగా ఆ సంస్థ లోని వారితో భోజనం చేస్తూ మాట్లాడుతుంటే ఆ సంస్థలోని సీనియర్ లాయరు అతని కుటుంబం గురించి విని “నువ్వు ఆపలాచియాకి వెళ్ళినపుడు ఈ రెడ్‌నెక్స్ అందరూ ఎవరు అని అనుకుంటావా?” అని హాస్యమాడతాడు. రెడ్‌నెక్స్ అంటే ఎండలో కాయకష్టం చేసుకునేవారు. వారి మెడలు ఎండలో కంది ఎర్రగా ఉంటాయని వారిని రెడ్‌నెక్స్ అంటారు. జేడీకి కోపం వస్తుంది. “మా అమ్మ ఇక్కడున్నవారందరి కంటే తెలివైనది” అంటాడు. ఆ లాయరు “నేను ఎవరినీ కించపరచాలని అనలేదు” అంటాడు. జేడీ అలా అసహనానికి గురవ్వటానికి కారణం ఉంది. అతని తల్లి హాస్పిటల్లో ఉందని అతని అక్క కొంతసేపటి క్రితమే ఫోన్ చేసింది. అలాంటి సమయంలో తన కుటుంబం గురించి ఆ లాయరు మాట్లాడిన మాటలకి జేడీకి కోపం వచ్చింది. ఆ కోపం పైకి చూపించటంతో తనకు ఆ సంస్థలో ఇంటర్న్‌గా అవకాశం రాదని అనుకుంటాడు.

బెవర్లీ హెరాయిన్ ఓవర్ డోసుతో స్పృహ కోల్పోయి హాస్పిటల్లో చేరింది. జేడీ అక్క లిండ్సీ అతన్ని ఇంటికి రమ్మని అడుగుతుంది. మర్నాడు వేరే ఇంటర్వ్యూలు ఉన్నా జేడీ నాలుగైదు రాష్ట్రాల అవతల ఉన్న తన ఊరికి కారులో బయల్దేరుతాడు. ఉషకి ఫోన్ చేసి తల్లి హాస్పిటల్లో ఉందని చెబుతాడు కానీ హెరాయిన్ ఓవర్ డోసని చెప్పడు. రాత్రంతా ప్రయాణం చేసి తన ఊరికి చేరుకుంటాడు. అప్పటికే బెవర్లీకి స్పృహ వస్తుంది. ఆమెకి ఆరోగ్య బీమా లేకపోవటంతో హాస్పిటల్ వారు ఆమెకి ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఉండటానికి గడువు ఇస్తారు. ఆమెని పంపేస్తే ఇంకో పేషంటుని చేర్చుకోవచ్చని వారి ఆలోచన. జేడీ కుటుంబం పేదవారు కావటం ఇంకో కారణం. జేడీ హై స్కూల్ తర్వాత నౌకా దళంలో చేరాడు. తర్వాత ఇరాక్ యుద్ధంలో పోరాడటానికి వెళ్ళాడు. సైనికులకి డిగ్రీ చదవటానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. అతను అలా ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసి తర్వాత లా కాలేజీలో చేరాడు. రెస్టారెంట్లో సర్వరుగా పని చేస్తూ చదువుకుంటున్నాడు. అతని అక్క లిండ్సీ ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తుంది. ఆమెకి పెళ్ళయింది. ముగ్గురు పిల్లలు. వారి పరిస్థితీ అంతంత మాత్రమే.

బెవర్లీ తాను చేరిన హాస్పిటల్లోనే ఇంతకు ముందు నర్సుగా పని చేసేది. అయినా హాస్పిటల్ వారు కనికరం చూపరు. వారికంతా వ్యాపారమే. జేడీ డాక్టరులో మాట్లాడతాడు. మూడు గంటలవరకే సమయం ఉందని తల్లితో చెబుతాడు. “పెద్ద లా కాలేజీలో చదువుతున్నావు. ఇదేనా నీ పనితనం?” అని ఎద్దేవా చేస్తుంది. కొడుకు తన కోసం అంత దూరం నుంచి హడావిడిగా వచ్చాడని కూడా ఆలోచించదు. జేడీ పట్టించుకోడు. ఏదైనా డీఎడిక్షన్ సెంటర్లో చేర్పించాలని ప్రయత్నం మొదలుపెడతాడు. జేడీ బాల్యంలో బెవర్లీ ఎలా ఉండేదో ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో తెలుస్తుంది. పిల్లలని అదుపులో ఉంచేది. అలాగని ప్రేమ చూపించటంలో లోటు లేదు. లిండ్సీకి అప్పటికే ఒక ప్రియుడు ఉంటాడు. బెవర్లీ కూడా ఎవరో ఒక మగవాడిని ప్రేమించటం, తర్వాత విడిపోవటం మామూలే. చిప్ అనే పోలీసు వాడు తాజా ప్రియుడు. ఒకరోజు బెవర్లీ జేడీని కారులో ఇంటికి తీసుకువస్తూ “మనం చిప్ ఇంట్లోకి మారబోతున్నాం. నీకు ప్రత్యేకమైన గది ఇస్తాం” అంటుంది. జేడీ “వద్దు. మీరిద్దరూ విడిపోతే మళ్ళీ కొత్త ఇంటి కోసం వెతుక్కోవాలి. నీకు చిప్ కేవలం ఈ మాసపు ఆకర్షణ అని నా ఫ్రెండ్ అన్నాడు” అంటాడు నవ్వుతూ. బెవర్లీకి చిర్రెత్తుకొస్తుంది. “నా గురించి నీ ఫ్రెండ్ అలా మాట్లాడుతుంటే వింటూ ఊరుకున్నావా? ఈ మగవెధవల్ని నేను ఎందుకు భరిస్తానో తెలుసా? నీకు, లిండ్సీకి కావల్సినవి ఇవ్వటానికి. నాకు ఎవరూ సాయం చేయలేదు. నీకు నా విలువ తెలియటం లేదు” అని కారు ఆపి అతన్ని కొడుతుంది. జేడీ కారు దిగి పారిపోయి దగ్గరున్న ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఆ ఇంట్లో ఉన్నామె బెవర్లీ తరుముకుంటూ రావటం చూసి జేడీని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. జేడీ తన అమ్మమ్మకి ఫోన్ చేయమంటాడు. ఆమె చేస్తుంది. బెవర్లీ ఇంటి లోపలికి వెళ్ళి జేడీని లాక్కొస్తుంది. ఇంతలో ఒక పోలీసు వస్తాడు. బెవర్లీకి సంకెళ్ళు వేస్తాడు. కాసేపటికి జేడీ అమ్మమ్మ, తాతయ్య, అక్క కారులో వస్తారు. పోలీసు “మీ అమ్మ నిన్ను కొట్టిందా?” అని జేడీని అడుగుతాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటారు. జేడీ ఆలోచించి “లేదు. నేనే మూర్ఖంగా ప్రవర్తించాను” అంటాడు. పోలీసు బెవర్లీని వదిలేస్తాడు. అమ్మమ్మ జేడీని “నువ్వు మంచివాడివి” అని హత్తుకుంటుంది. బెవర్లీ తనకి అందని జీవితం తన పిల్లలకి అందాలని అనుకుంటుంది కానీ తన జీవితం పాడైందనే అక్కసు కూడా ఉంటుంది. దానికి ఒకరకంగా పిల్లలే కారణం అనుకుంటుంది. అందుకని వారి మీద కసి ఉంటుంది. జేడీ లా కాలేజీలో చేరితే ఆమెకి ఆనందమే, కానీ ‘నువ్వు ఏదో ఘనకార్యం చేశానని అనుకోకు’ అన్నట్టు కూడా ఉంటుంది ఆమె ధోరణి. ఆమె తప్పిదం వల్లే ఆమె హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించి జేడీ ప్రశ్నిస్తాడేమోనని ముందే ఎదురుదాడి చేస్తుంది. అతన్ని ఎద్దేవా చేస్తుంది.

బెవర్లీ నర్సింగ్ కోర్సు చేసి నర్సుగా పని చేసేది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె తండ్రి మరణిస్తాడు. తల్లి కఠినంగా ఉన్నా తండ్రి ఆమెని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు ఆ ఆసరా కూడా లేదు. ఓ పక్క కుటుంబం గురించి చింత. ఆ బాధలో ఆమె హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ మందులు దొంగిలించి వేసుకోవటం మొదలు పెడుతుంది. అవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. అలా ఆమె మత్తు పదార్థాలకి అలవాటు పడింది. ఆమె ప్రవర్తన బాగుండకపోవటంతో ఆమెని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. “నీ నర్సు లైసెన్సు రద్దు చేస్తే ఏం చేస్తావు? పిల్లల గురించి ఆలోచించవద్దా?” అంటుంది ఆమె తల్లి. “పద్దెనిమిదేళ్ళ వయసు నుంచి పిల్లల గురించే ఆలోచించాను” అంటుంది విసురుగా బెవర్లీ. లిండ్సీ ఆమెని ఎగతాళి చేస్తుంది. “జీతమొచ్చే పని చేయటం కష్టంగా ఉంది పాపం. తప్పంతా మాదే మరి.” అంటుంది. “నీకు కడుపొస్తే తెలుస్తుంది” అంటుంది బెవర్లీ. లైంగిక స్వేచ్ఛ ఎంత వెర్రితలలు వేసిందో ఈ మాటతో తెలుస్తుంది. “నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు” అంటుంది లిండ్సీ. బెవర్లీ ఆమెని చెంపదెబ్బ కొడుతుంది. ఇద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుంటారు. ముసలావిడ ఇద్దర్నీ ఆపటానికి ప్రయత్నిస్తుంది. హోమ్‌వర్క్ చేయటానికి ప్రయత్నిస్తున్న జేడీ ఈ గొడవతో పుస్తకం విసిరికొట్టి తలపట్టుకుంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఎలా చదువుకోగలరు?

మళ్ళీ కథ ఫ్లాష్ ఫార్వర్డ్ అవుతుంది. జేడీకి కింది రోజు రాత్రి ఇంటర్వ్యూ చేసిన సంస్థ నుంచి ఫోన్ వస్తుంది. మర్నాడు ఉదయం పది గంటలకు తుది ఇంటర్వ్యూకి రమ్మని. అతను ఊహించని పరిణామమిది. ఆ లాయరుతో అసహనంగా మాట్లాడిన తర్వాత వాళ్ళు తనకి అవకాశం ఇవ్వరనుకున్నాడు. ఆ సంస్థ అతని మూలాల పట్ల అతనికున్న గౌరవాన్ని గుర్తించింది. ఇలా ఎన్ని సంస్థలు ఆలోచిస్తాయి? అయితే మర్నాడు పది గంటలకు అక్కడ ఉండాలంటే ఇక్కడి నుంచి త్వరగా బయల్దేరాలి. కింది రోజు రాత్రి నిద్ర కూడా లేదు. తల్లిని డీఎడిక్షన్ సెంటర్లో చేర్పించాలి. ఉషకి ఫోన్ చేస్తాడు. ఆమె అతన్ని బయల్దేరమంటుంది. తాను అతని ఊరికి వెళ్ళి అతని తల్లికి సేవ చేస్తానంటుంది. అతను అసలు విషయం చెబుతాడు. తల్లి ఓవర్ డోసు గురించి చెబుతాడు. ఆ రొంపిలోకి ఆమెని దిగవద్దని అంటాడు. ఒక మిత్రుడి ద్వారా ప్రయత్నిస్తే ఒక డీఎడిక్షన్ సెంటర్లో చోటు ఉందని తెలుస్తుంది. బెవర్లీని అక్కడికి తీసుకువెళతారు జేడీ, లిండ్సీ. అక్కడ డబ్బు కట్టటానికి జేడీ తన దగ్గరున్న క్రెడిట్ కార్డులు వాడతాడు. వాళ్ళు కేవలం ఆ క్రెడిట్ కార్డుల పరిమితి మాత్రం చూస్తారు. డబ్బు తర్వాత కట్టించుకుంటామంటారు. తన కోసం జేడీ డబ్బు కట్టడం బెవర్లీకి ఇష్టం లేదు. ఆమె ఆ సెంటర్లో ఉండనంటుంది. “నాకు ఎవరి దాక్షిణ్యం అవసరం లేదు” అంటుంది. “నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా అమ్మా?” అంటాడు జేడీ. “మాకంటే నువ్వు గొప్పవాడివని చూపించుకోవటానికేగా” అంటుంది బెవర్లీ. జేడీకి నిస్పృహ కలుగుతుంది. “చావాలనుకుంటున్నావా? గట్టిగా ప్రయత్నించవచ్చుగా” అంటాడు. బెవర్లీ “ప్రయత్నించాను” అని వెళ్ళి కార్లో కూర్చుంటుంది. లిండ్సీ జేడీని వారిస్తుంది. జేడీ “మన చిన్నప్పటి నుంచీ అమ్మ ఇంతే” అంటాడు. “కథ మనతోనే మొదలవ్వలేదు. అమ్మా, పిన్నీ ఇంకా గడ్డురోజులు చూశారు. తాతయ్య తాగివచ్చి అమ్మమ్మని కొట్టేవాడు. రోజూ దెబ్బలాటే. అమ్మా, పిన్నీ ఎంతో క్షోభపడ్డారు. నేను అమ్మని వెనకేసుకురావట్లేదు. ఆమెని క్షమించటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు కూడా క్షమించు. లేకపోతే ఈ రొంపి లోనుంచి బయటపడలేవు” అంటుంది లిండ్సీ. కుటుంబ విషయాలు కూతుళ్ళకి తెలిసినట్టు కొడుకులకి తెలియవు. తల్లి ఎన్నో తప్పులు చేసిందని లిండ్సీకి తెలుసు. కానీ క్షమించకపోతే శాంతి ఉండదు. ‘నా తల్లి/తండ్రి వల్లే నా జీవితం ఇలా ఉంది’ అనుకుంటే కసి పెరుగుతుంది. కసిలో తప్పులు జరుగుతాయి. క్షమ చాలా ముఖ్యం. అవతలివారి కోసం కాదు. మన కోసమే. తండ్రి తల్లిని కొట్టేవాడని తెలిసి కూడా బెవర్లీ తండ్రిని ఎందుకు అంత ప్రేమించింది? కష్టాలు మర్చిపోవటానికి తాగటం తప్పు కాదని, తల్లి గొడవపడకుండా ఉండాల్సిందని ఆమె అనుకుంది. ఒక సందర్భంలో జేడీ అమ్మమ్మ జేడీతో “మీ తాతయ్య ఎవరితోనో పోల్చుకుని తనని తాను తక్కువ చేసుకునేవాడు. అది ఎవరికీ మంచిది కాదు” అంటుంది. అతని తాగుడు వెనకాల అసలు కారణం ఆమెకి తెలుసు.

జేడీ వ్యాన్స్ తన జ్ఞాపకాలతో రాసిన ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ ఆధారంగా వ్యానెసా టేలర్ స్క్రీన్ ప్లే రాయగా రాన్ హవర్డ్ దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే మరి కాస్త పకడ్బందీగా ఉంటే బావుండేది అనిపిస్తుంది. చివరికి ఏం జరగబోతోందో అని సస్పెన్స్ ఉండదు. కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే సందేశానికి ఈ కథ శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. బెవర్లీగా ఏమీ యాడమ్స్, చిన్నప్పటి జేడీగా ఓవెన్ ఆజ్తలాస్, పెద్ద జేడీగా గాబ్రియెల్ బాసో, అమ్మమ్మగా గ్లెన్ క్లోజ్ నటించారు. ముఖ్యంగా చిన్న జేడీకి, అమ్మమ్మకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అమ్మమ్మగా నటించిన గ్లెన్ క్లోజ్‌కి ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఉషగా ఫ్రీడా పింటో నటించింది. ఈమె ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్ డాగ్ మిలియనియర్’ చిత్రంలో నటించి ఖ్యాతి సంపాదించింది. లిండ్సీగా హేలీ బెనెట్ మనసున్న కూతురిగా, అక్కగా చక్కగా నటించింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

లిండ్సీ మాటలతో జేడీ శాంతిస్తాడు. ఆమెని ఆమె భర్త వచ్చి తీసుకుని వెళ్తాడు. జేడీ కారులో కూర్చుని తల్లికి ఉష గురించి చెబుతాడు. ఇన్నాళ్ళూ కోపంతో చెప్పలేదు. ఇప్పుడు కోపం కన్నా ప్రేమే ముఖ్యమని తెలుసుకున్నాడు. తన జీవితం గురించి తల్లికి చెబితే ఆమె కూడా తనవైపు ఉన్న భావన వస్తుంది. లేకపోతే ఆమెని దూరం చేసినట్టవుతుంది. బెవర్లీ కూడా స్థిమితపడుతుంది. కుటుంబంలో కోపతాపాలు వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ పోవాలి. చివరికి జేడీ “ఈ సెంటర్లో ఉండొచ్చు కదా?” అంటాడు. ఆమె వద్దంటుంది. “ఎక్కడికి వెళదాం?” అంటాడతను. “రే ఇంటికి తీసుకెళ్ళు” అంటుందామె. రే ఆమె ప్రియుడు. అతని వల్లే ఆమెకి డ్రగ్స్ వ్యసనం పెరిగింది. జేడీకి తెలుసు. అయినా అక్కడికే తీసుకువెళతాడు. ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అందరికీ అనుభవంలో ఉన్నదే. అతనికి మర్నాటి ఇంటర్వ్యూ ముఖ్యం. రే ఇంటికి వెళితే అతను ఆమె బట్టలు బయట విసిరేసి ఆమెని దుర్భాషలాడుతూ వెళ్ళిపొమ్మంటాడు. జేడీ అతనితో కలబడటానికి వెళతాడు కానీ అక్కడ వేరే వాటాలో ఉన్న స్త్రీ తనకి పిల్లలున్నారని, గొడవ చేయొద్దని అనటంతో వెనక్కి తగ్గుతాడు. మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. బెవర్లీకి ఉండటానికి చోటు లేదు. లిండ్సీ తన ఇంట్లో పిల్లలున్నారని, తల్లిని ఆమె ఉన్న పరిస్థితిలో తన ఇంట్లో ఉండనివ్వలేనని అంటుంది. చివరికి బెవర్లీని మోటల్లో ఉంచటానికి నిశ్చయించుకుంటారు. రాత్రికి తాను వచ్చి తల్లి దగ్గర ఉంటానని లిండ్సీ అంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మళ్ళీ గతంలోకి వెళితే బెవర్లీ ఒకతన్ని పెళ్ళి చేసుకుని జేడీని తనతో తీసుకువెళుతుంది. ఒకరోజు జేడీ అమ్మమ్మ ఇంట్లో ఉండగా బెవర్లీ వస్తుంది. తనకి నర్సింగ్ బోర్డ్ వాళ్ళు డ్రగ్స్ పరీక్షలు చేస్తున్నరని, మూత్రం పరీక్షిస్తారు కాబట్టి ఒక చిన్న డబ్బాలో అతని మూత్రం ఇవ్వమని జేడీని అడుగుతుంది. అంటే ఆమె మూత్రం పరీక్షిస్తే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసిపోతుంది. నర్సు లైసెన్స్ పోయే ప్రమాదం ఉంది. ఆమె తల్లి మందులు వాడుతుంది కాబట్టి ఆమె మూత్రం పనికి రాదు. జేడీ మూత్రం ఇవ్వనంటాడు. అమ్మమ్మ జేడీని ఒప్పిస్తుంది. కుటుంబం చాలా ముఖ్యమని, ఒకరి కోసం ఒకరు నిలబడాలని అంటుంది. జేడీ ఒప్పుకుంటాడు. కుటుంబంలోని వారు తప్పు చేసినా వారికి అండగా ఉండాలా? ఇది ఒక చిక్కు ప్రశ్న. కలియుగంలో ఇదే పరిపాటి అయిపోయింది. ప్రలోభాలు ఎక్కువ. ఆ ప్రలోభాలలో పడకుండా ఉండే సంయమనం తక్కువ. మనవాళ్ళకి మనం తోడుగా ఉండకపోతే ఎవరుంటారు అనే ప్రశ్నే ఎక్కువ వస్తుంది. అయితే చివరికి అమ్మమ్మ జేడీకి తల్లి దగ్గర పూర్తి రక్షణ లేదని తెలుసుకుని అతన్ని తన దగ్గరకి తెచ్చుకుంటుంది. తప్పులని క్షమిస్తూ పోవటం కన్నా ఎత్తి చూపిస్తే కనీసం మార్పు వస్తుంది. తన దాకా వస్తే కానీ తెలియదన్నట్టు జేడీకి రక్షణ లేదని తెలిస్తే కానీ అమ్మమ్మ మేలుకోలేదు. స్వార్థం ఇలాగే ఉంటుంది.

అమ్మమ్మకి న్యుమోనియా వస్తుంది. ఆమె హాస్పిటల్లో ఉంటుంది. జేడీ చెడు సవాసాలకి అలవాటు పడతాడు. ఈ విషయం తెలిసి జేడీ భవిష్యత్తు పాడవుతుందని అమ్మమ్మ హాస్పిటల్ నుంచి వచ్చాక జేడీని తనతో తన ఇంటికి తెచ్చుకుంటుంది. బెవర్లీ అడ్డుపడుతుంది కానీ ఆమె తల్లి ఆమెని బెదిరిస్తుంది. జేడీ కూడా అమ్మమ్మతో వెళతానంటాడు. “ఆ పిచ్చిదానితో పోతానంటే పో” అంటుంది బెవర్లీ. జేడీ అమ్మమ్మ ఇంటికి వస్తాడు. అక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చని, అమ్మమ్మ గారాబంగా చూస్తుందని అనుకుంటాడు. కానీ అమ్మమ్మ గట్టి మనిషి. జేడీ స్నేహితులు ఎందుకూ కొరగానివారని తెలిసి వారిని తరిమేస్తుంది. “నేనెవరితో మాట్లాడాలి?” అని జేడీ అంటే “నీతో నువ్వే మాట్లాడుకో. ఏం పర్లేదు” అంటుంది.

జేడీ హోమ్‌వర్క్ చేయటానికి గ్రాఫిక్ కాల్క్యులేటర్ అవసరమౌతుంది. ఖరీదు ఎక్కువ. ఒక దుకాణం నుంచి దాన్ని దొంగతనం చేస్తుంటే యజమాని పట్టుకుంటాడు. అమ్మమ్మ వచ్చి విడిపిస్తుంది. కాల్క్యులేటర్ కూడా కొనిస్తుంది. ఇద్దరూ కారులో ఇంటికి వెళుతుంటారు. ఆమె అతన్ని బుద్ధిగా ఉండమని చెబుతుంది. జేడీకి ఉక్రోషం వస్తుంది. “ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నువ్వు మా అమ్మవి కాదు” అంటాడు. “నేను తప్ప నీకెవరూ లేరు” అంటుంది అమ్మమ్మ. ఇద్దరూ గొడవపడతారు. “నన్నెందుకు నీ దగ్గర పెట్టుకున్నావు?” అంటాడు జేడీ. “నాకేం సరదా కాదు. నువ్వు ఏమన్నా సాధించాలనుకుంటే బాగా చదువుకోవాలి” అంటుందామె. “అమ్మ బాగా చదువుకుంది. ఏం లాభం?” అంటాడు జేడీ. “చదువుకుంటే అవకాశాలొస్తాయి. ఆ అవకాశం కోసం చదువుకోవాలి. అయినా చివరికి ఏమీ సాధించకపోవచ్చు. అది వేరే విషయం. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే కచ్చితంగా ఏమీ సాధించలేవు. నేను పోయిన తర్వాత ఈ కుటుంబానికి దిక్కెవరు? మీ అమ్మ పరిస్థితులకి తలవంచింది. రాజీ పడిపోయింది. నేను కూడా చూస్తూ ఊరుకున్నాను. నువ్వు మాత్రం ఆలోచించుకో. సరైన దారిలో వెళ్ళు” అంటుందామె. జేడీ కుటుంబానికి విలువ ఇస్తాడని తెలుసు. ఆ విలువలు కూడా ఆమే నేర్పించింది. అతను వృధ్ధిలోకొస్తే ఆ కుటుంబానికి ఢోకా ఉండదని ఆమె తాపత్రయం. అందరూ తమ కుటుంబాలని సరిదిద్దుకుంటే సమాజం దానికదే బాగుపడుతుంది. సమాజసేవ అంటూ ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఉండదు. జేడీ తల్లి చేయలేకపోయిన పనిని అమ్మమ్మ చేసింది. దేవుడు ఒక తలుపు మూస్తే మరొక తలుపు తెరుస్తాడు. జేడీది చిన్న వయసు కాబట్టి ఆ రెండో తలుపు అమ్మమ్మ రూపంలో పదే పదే అతని ముందుకొచ్చి అతన్ని నడిపించింది. అది అతని అదృష్టం.

అమ్మమ్మ తనకు ఎక్కువ పెట్టి తాను తక్కువ తింటోందని జేడీ గమనిస్తాడు. ఇంటిపనిలో సాయం చేయటం మొదలుపెడతాడు. ఒక దుకాణంలో పని సంపాదిస్తాడు. కష్టపడి చదువుతాడు. మార్కులు బాగా వస్తాయి. అమ్మమ్మ సంతోషిస్తుంది. అలా జేడీ మంచి మార్కులతో హై స్కూల్ పూర్తి చేసి చివరికి లా కాలేజీలో చేరతాడు. అతను సైన్యంలో ఉండగా అమ్మమ్మ మంచాన పడుతుంది. జేడీ వస్తాడు. కుటుంబమంతా దగ్గర ఉండగా ఆమె ప్రశాంతంగా కన్ను మూస్తుంది. కానీ బెవర్లీ రోజురోజుకీ డ్రగ్స్‌కి బానిస అవుతుంది. ఆఖరికి ఒక మోటల్‌లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జేడీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళక తప్పని పరిస్థితి. లిండ్సీ మోటల్‌కి వచ్చే లోపల ఏమైనా తిని, తల్లికి ఏమైనా తీసుకురావాలని జేడీ వెళతాడు. అతను తిరిగి వచ్చేసరికి బెవర్లీ బాత్రూములో మళ్ళీ హెరాయిన్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. జేడీ అడ్డుపడతాడు. బెవర్లీ అతన్ని తిడుతుంది, కొడుతుంది. డ్రగ్స్ అంటే ఒక పెనుభూతం. మన మీద మనమే నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. బెవర్లీ ఏడుస్తూ కాసేపటికి తేరుకుంటుంది. జేడీకి సారీ చెబుతుంది. అతన్ని తనతోనే ఉండమంటుంది. జేడీ ఉండలేనంటాడు. అప్పటికి అది కఠినంగా అనిపించినా తన భవిష్యత్తుకి అది అవసరమని అతనికి తెలుసు. తల్లిని సముదాయించి లిండ్సీకి అప్పగించి బయల్దేరుతాడు. అప్పటికే చీకటి పడుతుంది. క్రితం రాత్రి కూడా నిద్ర లేదు. కారులో నుంచి ఉషకి ఫోన్ చేస్తాడు. ఆమె అతనితో మాట్లాడుతూ అతన్ని నిద్ర ఆవహించకుండా చూస్తుంది. అతను మర్నాడు ఇంటర్వ్యూకి హాజరయ్యి ఇంటర్న్‌షిప్ సాధిస్తాడు. ఆ తర్వాత అతను తన రాష్టంలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. ఉషని పెళ్ళి చేసుకుంటాడు. బెవర్లీ తన బిడ్డల సాయంతో డ్రగ్స్‌కి దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటుంది.

ఒక్కోసారి మనవాళ్ళే మన పురోగతికి అవరోధాలవుతారు. నిస్పృహకి లోను కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు అవతలి వారికి కఠినంగా ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంలో అవే మంచి నిర్ణయాలవుతాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే విచక్షణ, దృఢచిత్తం అవసరం. అదే అమ్మమ్మ జేడీకి నేర్పించింది. తమ సంస్కృతిని కాపాడుకోవాలని కూడా నేర్పించింది. తాతయ్య మరణించినపుడు అతన్ని ఆపలాచియాకి తీసుకువెళ్ళి ఖననం చేస్తారు. శవయాత్ర జరుగుతుంటే దారిలో వెళ్ళేవాళ్ళందరూ ఆగి అభివాదం చేస్తారు. జేడీ “ఎందుకలా చేస్తున్నారు?” అని అడిగితే అమ్మమ్మ “మనం గిరిపుత్రులం. చనిపోయినవారిని గౌరవిస్తాం” అంటుంది. ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. నాగరికత పేరు మీద వాటిని దూరం చేసుకోకూడదు. మన ఉనికిని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here