ప్రఖ్యాత కవి, రచయిత, విమర్శకులు డా. అట్టెం దత్తయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ

2
3

[‘సారాంశం’ అనే వ్యాస సంకలనం వెలువరించిన ప్రముఖ కవి, రచయిత డా. అట్టెం దత్తయ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.]

సంచిక టీమ్: నమస్కారం డా. అట్టెం దత్తయ్య గారూ.

డా. అట్టెం దత్తయ్య: నమస్కారం.

~

ప్రశ్న 1: పరిశోధన గ్రంథాల పరిచయ వ్యాసాలవంటి ఉపయుక్తమైన పుస్తకాన్ని తెలుగు సాహిత్య లోకానికి, సాహిత్య పరిశోధనాసక్తి కలవారికి అందించిన మీకు అభినందనలు. ధన్యవాదాలు. ముందుగా, సాహిత్యాభివృద్ధికి సాహిత్య పరిశోధనలు ఏ రకంగా దోహదం చేస్తాయో వివరిస్తారా?

జ. పరిశోధన అంటేనే ఒక తవ్వకం. ఇప్పటి వరకు పరిశోధనలు అన్నిరకాల సాహిత్యం మీద జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఒక అంశం మీద పరిశోధన జరిగింది అంటే ఆ అంశానికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తారు. ఈ పరిశీలన ఆధారంగా ఆ రంగంలో వచ్చింది ఎంత? రావాల్సింది ఏమిటి? వచ్చిన దానిలో మంచి ఎంత చెడు ఎంత అని తేల్చేది పరిశోధననే. వీటి ఆధారంగా ముందు ముందు లోటుపాట్లను ఖాళీలను పూరించే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం.

ప్రశ్న 2: మొదటి సంపుటికి ముందుమాటలో మీరు తెలుగు సాహిత్య పరిశోధన ఎక్కువగా ప్రక్రియనుబట్టి సాగిందనిపిస్తుందన్నారు. మీరీ నిర్ణయానికి రావటానికి దోహదం చేసిన పరిశీనలను తెలుపుతారా?

జ. ప్రారంభ పరిశోధన గ్రంథాలు ఎక్కువ శాతం ప్రక్రియల వారిగానే వచ్చాయి. తెలంగాణ మండి వచ్చిన వాటిని చేసినప్పటికి ఉదాహరణకు బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’. ఎం. కులశేఖరరావు ‘ఆంధ్ర వచనవాఙ్మయము – ఉత్పత్తి వికాసాలు’. కె. గోపాలకృష్ణారావు ‘ఆంధ్ర శతకవాఙ్మయము ఉత్పత్తి వికాసాలు’. అమరేశం రాజేశ్వరశర్మ ‘ఆంధ్ర వ్యాకరణ – వికాసము’. ఎస్.వి. రామారావు ‘తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసములు’. ఎన్.జి. రామానుజాచార్యులు ‘ఆంధ్రాలంకార శాస్త్ర సాహిత్య చరిత్ర’. కె.వి.సుందరాచార్యులు ‘అచ్చతెలుగు కృతులు – పరిశీలన’. తిరుమల శ్రీనివాసాచార్య ‘తెలుగులో గేయ నాటికలు’. జి.చెన్నకేశవరెడ్డి ‘ఆధునికాంధ్ర గేయ కవిత్వము’. సంగనభట్ల నరసయ్య ‘తెలుగులో దేశీ ఛందస్సు – ప్రారంభ వికాస దశలు’. డి. చంద్రశేఖరరెడ్డి ‘తెలుగు కావ్య పీఠికలు’. మచ్చ హరిదాసు ‘తెలుగులో యాత్రా చరిత్రలు’. వెలుదండ నిత్యానందరావు ‘తెలుగు సాహిత్యంలో పేరడీ’. సిహెచ్. సితాలక్ష్మి ‘తెలుగులో లేఖా సాహిత్యం’. వడ్డెపల్లి కృష్ణ ‘తెలుగులో లలిత గీతాలు’ వంటి అనేక తెలంగాణీయుల సిద్ధాంత గ్రంథాలు సాహిత్య ప్రక్రియల కోణంలో సాగడమే కాకుండా ప్రక్రియలను పరిపుష్టం చేసాయి.

ప్రశ్న 3: ఈ సారాంశం గ్రంథాల వంటి ప్రయత్నం ఇంతకుముందు ఏమైనా జరిగిందా?

జ. ఇలాంటి ప్రయత్నం తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు కూడా కొంత జరిగింది. తెలుగు అకాడమి ‘తెలుగు పరిశోధన సంహిత’ (పరిశోధన పట్టభద్రుల, పరిశోధకుల, పరిశోధనాంశం సంగ్రహ వివరణలు) పేరుతో 1975లో మొదటి సంపుటాన్ని, 1986లో రెండవ సంపుటాన్ని ప్రచురించింది. ఈ రెండు గ్రంథాలలో అప్పటి వరకు వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల సిత గ్రంథాల సంక్షిప్త సమాచారం పొందుపర్చబడింది. వీటిలో ప్రధానంగా ఆయా వ్యక్తుల జనన, ఉద్యోగ, పరిశోధన, పర్యవేక్షణలతో పాటు పరిశోధిత విషయాన్ని గూర్చి క్లుప్తంగా పొందుపర్చింది. ఈ రెండు సంపుటాలలో కలిపి 16 విశ్వవిద్యాలయాలకు సమర్పించిన 278 సిద్ధాంత వ్యాసాలను గురించి అరపేజీ చొప్పున ప్రాథమికంగా అందించింది.

రెండవ ప్రయత్నంగా 2004లో వెలువడ్డ గ్రంథం ‘జానపద విజ్ఞానంలో పరిశోధనలు సంక్షిప్త వివరణలు’ అనేది. దీనిని దాక్షిణాత్య జానపద విజ్ఞానసంస్థ వారు ప్రచురించారు. ప్రధాన సంపాదకులుగా ఆచార్య యన్. భక్తవత్సల రెడ్డి, సంపాదకులుగా డా. భట్టు రమేష్‌లు వ్యవహరించారు. ఈ గ్రంథం పూర్తిగా దాక్షిణాత్య జానపద విజ్ఞానం మీద వచ్చిన పరిశోధన గ్రంథసూచీలకు మాత్రమే పరిమితం అయింది. ఇందులో పిహెచ్.డి., ఎం.ఫిల్. గ్రంథాలను పరిశోధకుల పేరు ప్రాతిపదికన అందించారు. ఇక్కడ పరిశోధకుడి పేరు, అంశం, శాఖ, విశ్వవిద్యాలయం, సిద్ధాంత గ్రంథం సమర్పించిన లేదా అవార్డు అయిన సంవత్సరం, పుటల వివరాలను పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా, కాకతీయ, హైదరాబాద్ కేంద్రీయ, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో 126 పిహెచ్. డి. సిద్ధాంత వ్యాసాలు, 183 ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసాలు గురించిన సమాచారం ఉంది.

మూడవ ప్రయత్నంగా కనిపిస్తున్న గ్రంథాలు ‘తెలుగు పరిశోధన వ్యాసమంజరి’ (2005 నుండి 2009 వరకు వచ్చిన తెలుగు పిహెచ్. డి. పరిశోధనల సారసంగ్రహ సూచి). ‘సి.పి.బ్రౌన్ అకాడమి’ వారు 2009లో మొదటి సంపుటాన్ని, 2010లో రెండవ సంపుటాన్ని ప్రచురించారు. వీటి సంపాదకులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, మొదటి సంపుటిలో 10 విశ్వవిద్యాలయాలకు 2005 నుండి 2007 మధ్యకాలంలో సమర్పించిన 61 సిద్ధాంత వ్యాసాల సమాచారం ఉంది, రెండవ సంపటిలో 9 విశ్వవిద్యాలయాలలో సమర్పించిన 43 సిద్ధాంత వ్యాసాల గురించి ఉంది.

ప్రశ్న 4: రెండు సంపుటాలు కలిపి మొత్తం నూటాపది పరిశోధనల పరిచయ వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాల ఎంపికలో పాటించిన ప్రామాణికాలు వివరిస్తారా?

జ. నాకు వచ్చిన ఈ ఆలోచనతో తెలంగాణ సాహిత్య అకాడమీలో అధ్యక్షులు నందిని సిధారెడ్డి గారిని కలిసాను. అభినందించి ఈ పనిని మన అకాడమీ నుంచే చేద్దాం అన్నారు. సంతోషంతో అంగీకరించాను. తర్వాత తీసుకోవల్సిన నియమాల గురించి, ఎంపిక గురించి చర్చించాం. ప్రధానమైన నియమాలలో పరిశోధకులు తెలంగాణ ప్రాంతీయులై ఉండాలి. పరిశోధన గ్రంథం ముద్రణ పొంది ఉండాలి అనేవి ముఖ్యమైనవి. తెలంగాణ నుండి వచ్చిన మొదటిదైన బిరుదురాజు రామురాజు గారి పరిశోధన మొదలుకొని ప్రసిద్ధమైన వాటిని ఎంపిక చేసుకున్నాను.

ప్రశ్న 5: పుస్తకంలో ఇన్ని పరిశోధనలను పరిచయం చేసినా, ఇంకా ఏవైనా పరిశోధనలను వదిలేసినందుకు బాధపడ్డారా? అంటే, పలు కారణాలవల్ల ఆ పరిశోధనకు చోటు కల్పించనందుకు విచారించిన సందర్భం వుందా?

జ. అవును ఉంది. మా ఎంపిక చేసిన వాటిని కొందరు రచయితలను  రాయమని అడిగాను, కొందరికి మా దగ్గర ఉన్న పుస్తకాలకు కూడా అందించాను. వారి దగ్గరి నుండి వ్యాసం రాలేదు. పుస్తకం కూడా రాలేదు. ఇక్కడ పుస్తకాల పేర్లు, వ్యాసం అందివ్వని వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. కొందరు మాత్రం పుస్తకాలు ప్రింటుకు వళ్ళిన తర్వాత వ్యాసాలు పంపించారు. ఆ విధంగా అందిన వాటిలో నా వద్ద ఇప్పుడు 15 వ్యాసాలు ఉన్నాయి.

ప్రశ్న 6: పరిశోధనల ఎంపిక ప్రక్రియ, ఆయా పరిశోధనలను పరిచయం చేసే వ్యాసకర్త ఎంపిక ప్రక్రియను వివరిస్తారా?

జ. పరిశోధనల ఎంపికలో ప్రక్రియల వారిగా ప్రధానంగా దృష్టి పెట్టాము. ఈ ప్రాంతం నుండి వచ్చిన అన్ని ప్రక్రియలను ఎంపిక చేసుకున్నారు. వ్యక్తుల సాహిత్యం మీద వచ్చిన పరిశోధన గ్రంథాల ఎంపిక దగ్గర మాత్రం కాలం చేసిన వారివే తీసుకుందాం అని నిర్ణయించుకున్నాం. వ్యాస రచయితలను ఆ ప్రక్రియల మీద, వ్యక్తుల మీద పనిచేసిన వారిని ఎంపిక చేసుకున్నాము.

ప్రశ్న 7: ఇన్ని పరిశోధనల పరిచయాలను చదివి ఎడిట్ చేసిన తరువాత, కాలక్రమేణా పరిశోధనల నాణ్యతలోనూ, పరిశోధనల ప్రామాణికతలోనూ, పరిశోధకుల దృష్టిలోనూ వచ్చిన మార్పులేమయినా గమనించారా? గమనిస్తే ఏమిటవి?

జ. చాలా మార్పులు కనిపించాయి. ప్రారంభంలో వచ్చిన పరిశోధన గ్రంథాలు వాటికి అవే సాటి, మేటి. రాను రాను కొన్ని విలువలు పడిపోతున్నాయి అనే విషయం వాస్తవం.

ప్రశ్న 8: ఇందులోని వ్యాసాలన్నిటినీ చదివిన తరువాత ఆరంభంలోని పరిశోధనల్లోని సార్వజనీనత తరువాతి పరిశోధనల్లో లోపించిందనిపిస్తుంది. తరువాతి పరిశోధనల్లో ఒక రచయిత లేక కవికి పరిమితమవటం కనిపిస్తుంది. ఇందుకు కారణాలేమిటి మీ ఉద్దేశ్యంలో?

జ. ప్రారంభంలో వచ్చిన పరిశోధకులకు మంచి అంశాల మీద చేసే అవకాశం కలిగింది. మా ‘సారాంశం’ గ్రంథంలో కూడా ప్రారంభంలో వాటన్నింటిని తీసుకున్నారు. 80, 90, వ్యాసాలు దాటిన తర్వాత కొంత కొత్త తరం వారివి ఎంపిక చేసుకోవల్సి వచ్చింది. కారణం కొన్ని మంచి పరిశోధన గ్రంథాలు కూడా ప్రచురణకు నోచుకోక మా పరిధిలోనికి రాలేక పోయాయి.

ప్రశ్న 9: ఈ పుస్తకాన్ని తయారు చేయటంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? మీకు సహాయ సహకారాలందించిన వారెవరెవరు?

జ. ఇబ్బందులు అంటే పెద్దగా ఏమీ లేవు. వ్యాసాలను వివిధ రచయితల దగ్గరి నుండి తెప్పించుకొనడమే పెద్ద సమస్య. ఈ సంపుటిలో నేను కాకుండా 85 మంది ఇతరులు రాసారు. వారందరి దగ్గరి చేత రాయించడం అనేది చాలా ఇబ్బంది గానే మారింది. కొందరు రచయితలతో బద్నాం అయ్యాను కూడా. అయినా వదలకుండా విసిగించి రాయించుకున్నాను.

సహకరించిన వారు చాలా ఉన్నారు. ఇంత పెద్ద పని చేసినపుడు నా ఒక్కరితో ఎలా సాధ్యం అవుతుంది? సహకరించిన వారిలో గురువులు ఆచార్య సాగి కమలాకర శర్మ, బి. మనోహరి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య సూర్యా ధనంజయ్, ఎం.ఎ. యూసుఫ్ లు.

పెద్దలు డా. బుక్కా బాలస్వామి, శ్రీ ఘట్టమరాజు.

మిత్రులు బోళ్ళ ప్రవీణ్ కుమార్, డా. మంత్రి శ్రీనివాస్, డా. చంద్రయ్య ఎస్, డా. వై. నర్సింలు, డా. వడ్కాపురం కృష్ణ, వి. వేణు, టి. లక్ష్మీనారాయణ, పిల్లి సురేశ్, బి. సత్యనారాయణలు.

వీరందరు ఒక ఎత్తు అయితే ఈ గ్రంథాలు ప్రింటు కావడానికి ఆర్థిక సహాయాన్ని అందించిన దుండె లక్ష్మణ్ గారు మరొక ఎత్తు.

ప్రశ్న 10: ఈ వ్యాసాలలో వ్యాసకర్త అభిప్రాయంతో మీరు విభేదించిన సంఘటనలేమైనా వున్నాయా? వుంటే ఆ సమస్యనెలా పరిష్కరించారు?

జ. ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే నేను ప్రతి వ్యాస రచయితకు 10 సూచనలతో కూడిన ఒక పత్రం తయారు చేసి అందించాను. నేను పాటించమని అందించిన 10 సూచనలను అందరు దృష్టిలో పెట్టుకొని రాసారు. ఒక్కరు మాత్రం పాటించలేదు. వారి పేరు నేను చెప్పలేను.

ప్రశ్న 11: ఈ వ్యాసాల ఏకరూపత కోసం పాటించిన 10 సూచనలు ఏమిటి?

జ. ఈ వ్యాసాల ఏకరూపత కోసం పది అంశాలమీద ప్రత్యేక దృష్టి సారించాం. అవి:

  1. ప్రాథమిక సమాచారం (పరిశోధకుడు, పర్యవేక్షకుడు, అంశం, విశ్వవిద్యాలయం, అవార్డుపొందిన సంవత్సరం, పట్టిన కాలం, ముద్రణ విశేషాలు)
  2. పరిశోధకుడు అనుసరించిన పద్ధతులు (పరిశోధన పరిధులు, సమాచార సేకరణ పద్ధతులు, సమాచార విశ్లేషణ పద్ధతులు)
  3. పరిశోధకుడు అధ్యాయాల విభజనలో పాటించిన పద్ధతి.
  4. అధ్యాయాల్లో చర్చించిన అంశాల పరిచయం.
  5. ఆ రంగంలో ఆ సిద్ధాంత గ్రంథ ప్రత్యేకత
  6. ఆ సిద్ధాంతవ్యాసం పూరించిన ఖాళీలు.
  7. పరిశోధన ఫలితాల క్రోడీకరింపు
  8. పరిశోధన రచనా శైలి.
  9. భావి పరిశోధకులకు సలహాలు.
  10. తరువాత పరిశోధన రంగంపై చూపిన ప్రభావం

వీటన్నిటిని వ్యాస రచయితలకు అందించాం. అందరూ సుమారుగా పాటించారు. పైన తెలిపినట్లు ఒకరు తప్ప.

ప్రశ్న 12: ఇందులోని వ్యాసాల్లో ఏదైనా మీకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన వ్యాసం గురించి చెప్తారా?

జ. నాకు ఇందులో బాగా నచ్చిన వ్యాసం ఎన్. వేణుగోపాల్ గారిది. వరవరరావు గారి పరిశోధన గ్రంథం మీద రాసారు. మేము కోరుకున్న పద్ధతిలో, ఏర్పరచుకున్న సూత్రాలన్నిటిని తూచా తప్పకుండా పాటించి రాసారు.

ప్రశ్న 13: నిజానికి తెలంగాణా సాహిత్యానికి సంబంధించి పలుకోణాలు ఇకా అస్పృశ్యంగానే వున్నాయి. భవిష్యత్తులో పరిశోధనాసక్తులకు అలాంటి అంశాలేమైనా సూచిస్తారా?

జ. తెలంగాణ భాష మీద రావలసినంత పరిశోధన రాలేదు. భాష గురించి ఇంకా పరిశోధనలు చేయవచ్చు. ఇప్పుడు పద్య సాహిత్యం మీద పరిశోధన చేసే వారు కరువు అయ్యారు. తెలంగాణలో ప్రాచీన పద్య కావ్యాలు ఉన్నాయి. ఉదా. కామినేని మల్లారెడ్డి షట్చక్రవర్తులచరిత్ర వంటివి.

ప్రశ్న 14: సాహిత్య పరిశోధనలు ఎందుకని సామాన్య సాహిత్యాభిమానులకు అందటంలేదు? ఈ విషయంలో మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది?

జ. నిజమే సామాన్య సాహిత్యాభిమానులకు అందటం లేదు.

పరిశోధన అనేది ఒక శ్రేణి వారిదే అన్నట్టుగా ఉంటుంది. కాని కొన్ని పరిశోధనలు అన్ని రకాల పాఠకుల దగ్గరకు చేరుకోవాలి. మీడియా చేయాల్సి పని ఏమిటి అంటే కొన్ని పరిశోధన గ్రంథాలను ధారావాహికంగా ప్రచురించాలని. కష్టపడి నాలుగు పేజీల పరిశోధన వ్యాసం రాస్తే కళ్ళకు అద్దుకుని ప్రచురించినపుడు కొన్ని పండుగా శోధించి రాసిన గ్రంథాలను ప్రచురించడంలో తప్పు ఏమీ లేదు. కనీసం ఆ గ్రంథాల సారాంశాలను అయిన ప్రచురించాలని. (సం// పరిశోధన గ్రంథాలను  ధారావాహికగా ప్రచురిస్తున్న ఏకైక  పత్రిక సంచిక.)

ప్రశ్న 15: మొదటి సంపుటి ముందుమాటలో మీరు మరిన్ని వ్యాసాలతో ఇంకో సంపుటి తీసుకువచ్చే ఉద్దేశం వుందన్నారు. ఆ సంపుటి గురించి మీ ఆలోచనలను పంచుకుంటారా?

జ. ఇప్పుడు మేము 110 వ్యాసాలతో రెండు సంపుటాలు తీసుకువచ్చాం. పరిశోధన సారాంశాలను ఇంకా తీసుకు రావాలని ఉంది. మా ప్రచురణకర్త అంగీకరిస్తే కచ్చితంగా తీసుకు వస్తాము.

ప్రశ్న 16: ఈ గ్రంథాలను ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు, ఆచార్య వై. రెడ్డి శ్యామల గారికి అంకితం ఇవ్వడం వెనక గల అభిమానం?

జ. నన్ను తీర్చి దిద్దుతున్న వారు.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు దత్తయ్య గారూ.

డా. అట్టెం దత్తయ్య: కృతజ్ఞతలు.

***

సారాంశం (పరిశోధన గ్రంథాలు – పరిచయ వ్యాసాలు)
(రెండు సంపుటాలు)
సంపాదకుడు: డా. అట్టెం దత్తయ్య
పేజీలు: ఒక్కో సంపుటం 608
వెల: ఒక్కో సంపుటం ₹ 360/-
ప్రతులకు:
ధృవ ఫౌండేషన్, కరీంనగర్. ఫోన్: 9989477755, 9989475899
‘మూసీ’ మాసపత్రిక కార్యాలయం, హైదరాబాద్. ఫోన్ : 9494715445, 9347971177

~

సారాంశం పుస్తకంపై సమీక్షని చదవండి:
https://sanchika.com/saramsham-book-review-st/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here