[box type=’note’ fontsize=’16’] తన మౌనం ఆ వ్యక్తి మార్పు తెస్తుందని అనుకున్నారు, కాని మౌనయుద్ధం విఫలమవడంతో అంతర్యుద్ధం చేస్తానంటున్నారు చెంగల్వ రామలక్ష్మి “యుద్ధం” అనే కవితలో [/box]
[dropcap]మొ[/dropcap]దట
మౌన యుద్ధం చేశా
నా మౌనం నీలో మార్పు తెస్తుందని
అనాలనుకున్న వేల మాటలు
నాలో నేనే, నాలో నిన్నే
తిట్లు, దూషణలు, వ్యంగ్యాస్త్రాలు,
పెదవి దాటని పెను మాటల బరువును
సంస్కారపు ముసుగులో గొంతులోనే నొక్కేసా.
కసి, కోపం, ప్రతీకారం
నిస్సహాయం, నీ సహాయం
గొంతు దాటని భాషను వెక్కిరిస్తుంటే
మౌనం అనర్ధమని హెచ్చరిస్తుంటే
మాటల ఈటెలు, పదాల తూటాలు
వెటకారాల ఉపమలు
నీ వాగ్దానాల అతిశయోక్తులు
సాధింపుల, బెదిరింపుల శర పరంపరలు
సంధిస్తూ
మాటల యుద్ధం చేశా
మొండివాడు రాజు కన్న బలవంతుడు
ఇపుడు
బతుకు పోరులో
నాతో నేను అంతర్యుద్ధం చేస్తున్నా