[పెరిగిపోతున్న భూతాపం గురించి, కొన్ని దేశాలు తీసుకున్న చర్యల వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]
[dropcap]1[/dropcap]992 నాటి ధరిత్రి ఒప్పందం నుండి నేటి CoP 28 సమావేశాల వరకు ఎన్ని సమావేశాలు! ఎన్ని ప్రోటోకాల్స్! ఇటీవల పారిస్ ఒప్పందం సైతం ఆర్భాటంగా ప్రణాళికలు వెలువరించిందే తప్ప ఆచరణలో జరిగింది శూన్యం. సంపన్న దేశాలు ఏనాటి నుండో విడుదల చేసిన ఉద్గారాలకు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాయి. చేయని అపరాధానికి చెల్లిస్తున్న పెనాల్టీ ఇది.
పర్యావరణ నిధికి కొంత మొత్తాన్ని జమ చేసి పర్యావరణ సంక్షుభిత దేశాలలో ఉపశమన చర్యలకు వినియోగించాలన్న ప్రతిపాదనకు అతి కష్టం మీద అంగీకారం కుదిరి ఆమోద ముద్ర పడినప్పటికే ఆ దిశగా నిధి జమ పడిందీ లేదు. 2015 నుండి ఈనాటి వరకూ ధనిక దేశాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయేగాని అడుగు ముందుకు వేసిందే లేదు. ‘తిలాపాపం తలా పిడికెడు’గా వాతావరణంలోకి చేరిపోయిన ఉద్గారాల దుష్ప్రభావాల నుండి నేల తల్లిని ఉపశమింప చేయడానికి తక్షణ చర్యలు చేపడుతున్న దేశాలు అవి చిన్నవైనా పెద్దవైనా వాటి నిబద్ధతకు ప్రశంసించి తీరవలసిందే. ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని దేశాలైనా అనుసరించవలసిందే.
కెనడా:
వాతావరణ మార్పుల పట్ల కెనడా ప్రజలు చాలా అవగాహనతో ఉన్నారు. ఏటా/తరచుగా సంభవిస్తున్న కార్చిచ్చుల వంటి వైపరీత్యాల వలన వారు పలు కష్ట నష్టాలకు లోనవుతున్నారు. నూటికి 70 మంది వాతావరణ మార్పుల పట్ల ఆందోళన చెందుతుండటమే కాక క్రియాశీలకంగా స్పందిస్తున్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా తక్షణం చేపట్టగలగిన చర్యలలో భాగంగా వారు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవటానికి సైతం సంసిద్ధులవుతున్నారు. పౌర సమాజంలో ఇటువంటి మార్పులు చక్కటి ఫలితాలను అందిస్తాయి.
కార్బన్ న్యూట్రల్ క్లబ్ – దీని సహ వ్యవస్థాపకుడు జాక్ బ్రూనర్.
చేపట్టే చర్యలు చిన్నవే కావచ్చు కాని అవే విస్తారమైన సంఖ్యలో ప్రజలు అమలు చేసినప్పుడు ఫలితాలు అదే హెచ్చు స్థాయిలో ఉంటాయి. పౌరులు కర్బన రహిత జీవన విధానాన్ని అవలంబింనప్పుడు ఉద్గారాల నియంత్రణ లక్ష్యం ఏ కొద్ది సంస్థలకో, సమూహాలకో మాత్రమే పరిమితం కాకుండా సార్వజనిక లక్ష్యంగా మారిపోతుంది.
కెనడాలో వ్యవసాయ సంబంధిత, ఆహార సంబంధిత కార్యకలాపాల ద్వారా వెలువడే మిథేన్ వాయువు వాటా తత్సంబధిత ఉద్గారాలలో 40% వరకు ఉంటుంది. గొర్రెలు వంటి పశు సంపద సంబంధిత వ్యర్థాలు దానికి కారణం.
ప్లాస్టిక్‌ని వాడకుండా పునర్వియోగానికి వీలుగా ఉండే చేతి సంచులను వాడటం, నీటిని పొదుపుగా వాడుకోవటం, స్వంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడం, విమానయానం తగ్గించడం దానికి బదులుగా రైలు ప్రయాణానికి అనువుగా ముందుగానే ప్లాన్ చేసుకోవటం, తక్కువ దూరానికి వస్తే టూవీలర్స్ బదులుగా సైకిల్ వినియోగించడం వంటి అంశాలపై ప్రచారం, ఆసక్తి రెండూ పెరుగుతున్నాయి.
సౌర ఫలకాలు, edible forest వివిధ రకాల ఆహార సంబంధిత మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా కాలక్రమేణా అవి వైవిధ్యంతో కూడుకున్న చిట్టడవులుగా రూపాంతరం చెంది అనేక జీవరాశులకు ఆశ్రయమవుతాయి. ఈ ఆలోచన ఒక సైకియాట్రిస్ట్‌ది. తన ఆలోచనలతో ఏకీభవించే వ్యక్తులను మరి కొందరిని కూడగట్టి ఈ విధానానికి ప్రచారం కల్పించాలని డా. ఛార్క్ ఆలోచన.
ప్రకృతి సిద్దంగా శీతోష్ణ స్థితిగతులను సంతులనం చేయగల పురాతన సాంప్రదాయ గృహనిర్మాణాల పట్ల అక్కడ ఆసక్తి పెరుగుతోంది. వీటిని అక్కడ నెట్‌జీరో హోమ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ప్రకృతిని పరిరక్షించుకోవలసిన అక్కరను గుర్తిస్తున్నారనడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
మలేసియా:
సరవాక్ నవంబరు నెలలో ఒక పర్యావరణ బిల్లను తీసుకువచ్చింది. హరిత గృహ వాయువులు లేదా ఉద్గారాల నియంత్రణ దిశగా మొట్ట మొదటగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్లును తీసుకొని వచ్చిన సరవాక్ పర్యావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను చాటుకుంది. ఆ రకంగా పర్యావరణం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టిన మొట్ట మొదటి దేశంగా మలేసియా ఖ్యాతిని దక్కంచుకుంది. ఏవైనా వ్యాపార సంస్థలు కర్బన ఉద్గారాలను నియంత్రించలేకపోతే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన కార్బన్ లెవీ విధించబడుతుంది. అది పరోక్షంగా ప్రభుత్వానికి రెవెన్యూ అవుతంది. దేశ ఆర్ధికంలో (G.D.P) 45% ఉద్గారాలను 2030 నాటికి తగ్గించాలని మలేసియా లక్ష్యం నిర్దేశించుకున్నది. ఆ దిశగా నిబద్ధతతో అడుగులు వేస్తోంది.