అలనాటి అపురూపాలు – 197

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నాకు తెలిసిన మీనా కుమారి:

ప్రముఖ నటి మీనా కుమారి గురించి సహ నటి నాదిరా ఏమన్నారో ఆమె మాటల్లోనే చదువుదాం.

***

మనలో చాలా మందికి, మీనా కుమారి అంటే, 10 x 12 సైజులోని పోస్టరులో అందమైన ముఖంతో కన్నీళ్లు కారుస్తూండడం తెలుసు, అంతే.. బహుశా ఆమెకున్న లక్షలాది మంది అభిమానుల్లాగే నేను కూడా – ఆమెను కలుసుకునే ముందు వరకూ అలాగే ఆలోచించాను. బహుశా ఆమె మిత్రులు కూడా అలాగే ఆలోచిస్తారేమో అని నేను అనలేను! ఎందుకంటే ఆమెకు స్నేహితులు లేరు. ఇప్పుడు, మీరు నా ఈ వ్యాఖ్యపై ఆశ్చర్యపోవచ్చు, నేను ధైర్యంగా చెప్పగలను, ఆమెకు స్నేహితులు లేకపోవడానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉన్నాయి. ఏమైనా, ఆమె ఎవరినీ కలిసేంత తీరిక లేనంత బిజీగా ఉంటుంది, నాలాగా ఆమె స్నేహితులమని భావించేవారు పక్షం రోజులకోసారి, మళ్లీ మేము సెట్స్‌లో కలుసుకునే వరకు, ఒక చిన్న టెలిఫోన్ సంభాషణతో సంతృప్తి చెందాలి.

ఇంతకు ముందు ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయ్’ చిత్రంలో ఆమెతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరే ఇతర ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేయడాన్ని నేను ఎన్నడూ ఇంతలా ఆస్వాదించలేదని నమ్మకంగా చెప్పగలను. ఆమె గొప్ప కళాకారిణి. ఆ విషయం ఆమెకు తెలుసు. ఆమె అద్భుతమైన సౌందర్యవతి.. ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. మరో విశేషం ఏమిటంటే, నటనలో ఆమె – సొగసుని, పరిణతిని వ్యక్తం చేయడం! నటనకి సంబంధించిన సాంకేతికతలలో, చిట్కాలలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె ‘అండరాక్ట్’ చేసినప్పటికీ, ఆమె సున్నితమైన వదనం – ‘సైలెంట్ క్లోజప్‌’లలో ఎన్నో విషయాలు చెబుతుంది. ఆమెకు ఇది కూడా తెలుసు.

కానీ, వీటన్నింటితో పాటు, చక్కని నటన కనబరిస్తే సరిపోదని, ఫ్రేమ్‌లో ఉన్నవారితో సహకరించాలని ఆమె ఎప్పుడూ ఆత్రుతగా ఉండేది, అందువల్ల తనతో పని చేయడానికి తనను తాను అద్భుతమైన వ్యక్తిగా మార్చుకుంది. ప్రతి షాట్‌ను తన సొంత దృక్కోణంతో పాటు సినిమా మొత్తం పరిపూర్ణంగా రావడానికి ఆమె ఎంతో తపించేది.

కానీ ఆమె గురించి నాకు తెలిసినది ఇది మాత్రమే కాదు.. నేను ఆమెను తెలుసుకోవటానికి లేదా గమనించడానికి ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. ఆమె గురించి నాకు ఎక్కువగా తెలియడానికి కారణం నా సమక్షంలో ఆమె చాలా విశ్రాంతిగా ఉండేది. ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు – ఆమె ఇతరుల వ్యవహారాలలో, ముఖ్యంగా తన వ్యవహారాలలో తలదూర్చే వ్యక్తులను దూరంగా ఉంచింది. ఆమె తన అంతరంగాన్ని, తన సన్నిహితులకు కూడా వెల్లడి చేయడానికి ఇష్టపడేది కాదు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదని, అందులో మరొకరి ప్రమేయం అవసరం లేదని ఖచ్చితంగా నమ్మేది. జనాలను అంత తేలికగా నమ్మకూడదని కూడా ఆమె నేర్చుకుంది. ఇవన్నీ ఆమె గొప్ప సంకల్ప శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని చాటుతాయి.

మీనా కుమారి అని పిలవబడే 10 x 12 సైజు పోస్టర్ లోని సాంద్రీకృత స్త్రీత్వం వెనుక ఓ అతివాది, ఆలోచనాపరురాలు, అపరిమితమైన ఊహాశక్తి గల రచయిత్రి, సనాతన ఆదర్శవాది, చాలా దృఢ నిశ్చయం ఆత్మగౌరవం ఉన్న స్త్రీ; దైవాన్ని, భర్తను గౌరవించే మహిళ, ఇంకా ఓ హాస్యనటి కూడా దాగున్నరు.

అత్యంత విషాదకరమైన లేదా నిజమైన విషాదకరమైన విషయాలు మాత్రమే ఆమెకు కన్నీళ్లు తెస్తాయి, నిజమైన తమాషా సంగతులు, సూక్ష్మమైన విషయాలు మాత్రమే ఆమెను నవ్విస్తాయి. ఆమెలో హాస్య చతురత ఎక్కువ. అయినప్పటికీ ఓ స్త్రీ కావడం వల్ల, అందరి ముందూ జోక్ చేయడానికి ఇష్టపడేది కాదు, కానీ సరదా సంగతి ఏదీ ఆమె దృష్టి నుండి తప్పించుకోలేదు. అంతేకాకుండా, ముతకగా లేనివి, తెలివైన జోక్స్‌కీ; కొంటెగా ఉన్నప్పటికీ అసభ్యంగా లేని జోక్స్‌కీ హాయిగా నవ్వగలిగేంత నిరాడంబరంగా ఉంటుందామె. చవకబారుతనం, అసభ్యత ఆమెకు చిరాకు కలిగించేవి. ఇక ఆమెకి కోపం కూడా ఎక్కువే, నన్ను నమ్మండి, ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఆమె పిడికిలి విసరడం నేను చూశాను. అయితే, ఆమె నిగ్రహం ఎంతసేపు ఉంటుందని నన్ను అడగకండి, ఎందుకంటే నేను ఆమె నుదురుపై చెమట చుక్కలు, ఆమె పాదాలలో ఒకటి తీవ్రంగా వణకడం చూస్తే, అక్కడి నుండి పారిపోతాను.. గుర్తుంచుకోండి, ఆ చిహ్నాలు ఆమె నుంచి రాబోయే విస్ఫోటానికి ఖచ్చితంగా సంకేతాలు! అయితే, తనకు చికాకు కలిగించిన వ్యక్తిపై కాకుండా, వేరే వాళ్లని లక్ష్యంగా చేసుకుంటుందామె. గట్టిగా  అరుస్తుంది!

ఆమె మూగదేమో అని భావించే వ్యక్తులకు – ఆమె వారిని ఇష్టపడలేదని చెప్తాను; పైగా ఆమెకి ఎవరైనా నచ్చకపోతే, వాళ్ళని అస్సలు పట్టించుకోదు. నిజానికి మీనా ఓ తెలివైన మహిళగా చక్కని మాటకారి కూడా. ఏదైనా విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి వస్తే, ఆమె మౌనం వహిస్తుంది లేదా క్రూరంగా వాస్తవం తెలియజేస్తుంది.

అసహ్యకరమైన వాటిని మీనా ఖచ్చితంగా సంపూర్ణంగా తిరస్కరిస్తుంది. ఆమె విషయంలో ప్రతీదానికీ – అది ఏనుగు లేదా పురుగు, భవనం లేదా దేవాలయం, పేదరికం లేదా వ్యాధి అయినా దానిలో కొంత అందం లేదా ఏదైనా కళాత్మకత ఉండాలి.

ఆమెకి విలాసాలంటే ఇష్టం కానీ అదే సమయంలో సెట్స్‌పై చాలా కష్టపడుతుంది. సౌకర్యాలని కోరుకునే మీనా – పడుకోగలిగే అవకాశం ఉంటే మాత్రం ఎప్పుడూ కూర్చోదు. తనతో సహా ఇద్దరు కుర్చీలలో కూర్చుని ఉంటే, అవతలి వ్యక్తి కొన్ని నిమిషాలలో వెళ్లిపోతే, మీనా కుమారి తన పాదాలను రెండవ కుర్చీపై ఉంచుతుంది.

కానీ మీనా తొందరపడి ఏదీ చేయదు. కనుబొమలను పెంచడం నుండి నడక వరకు, ఆమె అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా, నెమ్మదిగా, సాఫీగా ఉంటాయి. కుదుపులు, గెంతులు, అసమానతలు లేవు. కొనసాగింపులో ప్రతిదీ సరిగ్గా ఉండాలి; పైగా తప్పనిసరిగా, నెమ్మదిగా చేయాలి. ఆమె చర్యలు ‘స్లో మోషన్‌’లో ఉన్న చిత్రాన్ని గుర్తు చేస్తాయి. వాస్తవానికి, ఈ మందగమనాన్ని ఆమె వేగంగా ఆలోచించడం ద్వారా భర్తీ చేస్తుంది. మీరు ఆమెతో ఏదైనా మాట్లాడబోతే, మీకన్నా ముందే ఆ విషయంపై ఆమె అన్ని వివరాలతో సిద్ధంగా ఉంది. తాను చూసే ప్రతిదాన్ని ఆమె మనసులో చిత్రించుకుంటుంది; ఫలితంగా ఆమె దాదాపు లక్షలాది మనోచిత్రాలను చూస్తుంది, అవన్నీ సంపూర్ణమైనవి, సెన్సార్ చేయబడనివినూ.

ఆమెకు మంచి కథల పట్ల గొప్ప అభిరుచి ఉంది; తనతో ఉన్నవారిని వాటి గురించి వినిపిస్తుంది. ఆమె ఏదైనా పుస్తకం చదువుతుంటే, మీరు ఆ పుస్తకం గురించి మొత్తం విషయాలను వింటూ మరో గంట గడపాలని కోరుకుంటే తప్ప, మీరు ఆమెను అదేం పుస్తకం అని అడిగే ధైర్యం చేయరు. కథను చెప్పడంలో, ఆమె తన భర్త కమల్ గారికి సరిపోదు, అయినా ఆమె తనదైన భావోద్వేగాలను వ్యక్తీకరించే శైలితో వారి శైలిని మిళితం చేస్తుది. పైగా ఆమెకు పాడటం (చాలా బాగా), నృత్యం చేయడం కూడా వచ్చు కాబట్టి, ఆమె చెప్పేవి వినడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఆమె రోజుకు దాదాపు యాభై కిళ్ళీలు నమలుతుంది; ప్రతి కిళ్ళీ తర్వాత అర డజను ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక పెద్ద గ్లాసు నీటిని తాగుతుంది. నా అంచనా తప్పు కాకపోతే, ఆమె ప్రతిరోజూ కనీసం ఒక బకెట్ నీటిని తాగేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆమె నోరు మూతపడదు, ఎందుకంటే మాట్లాడేందుకు ఆమెకు నచ్చిన (నాలాంటి) వాళ్ళు ఎక్కువగా దొరకరు కాబట్టి, ఆమె ఎక్కడో ఒక మూలన కూర్చుని కిళ్లీలు తింటూ, ఆ తర్వాత కూడా గ్లాసుల కొద్దీ నీరు తాగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే – చాలా వరకూ నోట్లో కిళ్ళీ ఉంటూనే ఉండేది!

మీనా కుమారిని సరదాగా ఏడిపించడం చాలా సులువు. ఏ రంగులోని పిల్లినైనా, ఏ సైజులో ఉన్నా, తెచ్చి ఆమెకి కనబడే చోట ఉంచితే చాలు! మీరు దానిని ఆమె ఒడిలో ఉంచగలిగారంటే, మీరో మేధావనే అనుకోవాలి. ఆమెకి పిల్లి అంటే రోత. దానిని తాకనక్కర్లా, చూస్తూనే, తానే ఓ చిన్న; దయనీయమైన ఎలుకగా మారిపోతుంది.

ఆమె కాస్త పిసినారనే చెప్పాలి; అదే ఆమెలోని లోపం అని అనుకోవచ్చు. నేను ఆమెను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాను. పూర్తిగా తెలుసుకోవలసిన అద్భుతమైన వ్యక్తి మీనా అని గ్రహించాను. కానీ ఆమె గురించి చాలా ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, ఆమె ఓ ప్రేమిక. నిజమైన ప్రేమిక. ఆమె ప్రేమించదగిన ప్రతిదాన్ని ప్రేమిస్తుంది. అందమైన బట్టలు, పురాతన వస్తువులు, పాత ఆభరణాలు, పెయింటింగ్స్, కవిత్వం, సంగీతం, సాహిత్యం, పాత ఫ్యాషన్లు, ప్రాచ్య సంస్కృతి, వాస్తవికత, మనుషులను ఆమె ఎంతో ఇష్టపడుతుంది. ఇంకా ప్రేమను కూడా ప్రేమిస్తుంది.

కానీ అన్నింటికంటే, అందరికన్నా ఎక్కువగా, ఆమె తన భర్తని ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది, గౌరవిస్తుంది, ఆయనకు భయపడుతుంది. ఇంకా చెప్పాలంటే, ఆమె ఆయన విషయంలో చాలా పొజెస్సివ్! అవును, ఆయన ఏ అమ్మాయితో మాట్లాడినా ఆమెకు చాలా అసూయగా ఉండేది. నిజానికి, ఆమె అసూయపడని ఏకైక సజీవ స్త్రీని నేనేనుకుంటాను (ఇది నా ఆశ కూడా!).

***

మీనా కుమారిని, నాదిరాని ఈ పాటలో చూడండి.

https://www.youtube.com/watch?v=AU-hut9lGQ4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here