[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
పక్కపక్కనే..
~
చిత్రం: ముకుంద
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం : మిక్కీ జె మేయర్
గానం : రాహుల్ నంబియార్, రేవంత్
~
సాహిత్యం
పల్లవి:
చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా
ఆచి తూచి అడుగెయ్యొద్దా
ఈతే తెలియాలి నది ఎదురైతే
పూర్తై తీరాలి కథ మొదలెడితే
గెలుపే పొందాలి తగువుకి దిగితే పడినా లేవాలి ఏ పూటైనా ఏ చోటైనా నిలవని పయనం సాగాలి రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా గానీ కోరే గమ్యం చూపించాలి
పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా
నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా
చరణం:
స్పష్టంగా పోల్చుకో శక్తుందా తేల్చుకో
అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా కష్టాలే ఓర్చుకో ఇష్టంగా మార్చుకో అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా కలలకి, కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని నమ్మకం నిజమయే లోపుగా తప్పని నొప్పి ఉందని ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని
గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం అనవా ॥ పక్క పక్కనే ॥
చరణం:
శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే ఛేదించదా నీ లక్ష్యము యముడెదురైనా
కృష్ణుని సారథ్యమై సాగిన సామర్థ్యమే సాధించదా ఘన విజయము ప్రతి సమరాన కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి ఊహతో నిచ్చెనే వెయ్యకు అందని గగనానికి వ్యర్థంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి ॥ పక్క పక్కనే ॥
♠
‘Poetry can trigger profound moments of self-awareness or take you to another place and time, expanding your view of the world around you.’
ఒక కవిత కానీ, కథ కానీ, పాట కానీ, గేయం కానీ, పద్యం కానీ, మన లోపలి చైతన్యాన్ని మరింత ఉత్తేజపరిచి, మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్లి, మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద మనకున్న అవగాహనని మరింత విస్తృతం చేస్తుంది. ఇక సినిమా మాధ్యమమైతే, ఆ ప్రేరణ, ఆ మార్పు, మరింత వేగంగా ఎక్కువమందికి చేరువ అవుతుంది. మన thought process మీద ప్రభావం చూపగలిగే, మంచి సందేశం ఉన్న ‘ముకుంద’ చిత్రంలోని ఒక పాటను ఈరోజు విశ్లేషించుకుందాం.
‘చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా ఆచి తూచి అడుగెయ్యొద్దా..’ అసలు ఈ వాక్యాలు వినగానే, ఈ పాట సీతారామశాస్త్రి గారే వ్రాశారా? అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏది ఏమైనా చేసి అనుకున్న గమ్యం చేరాలి, అలా చేయడంలో వేగం ఉండాలి, ఎలాగైనా ప్రాణం ఫణంగా పెట్టి పోరాడాలి, ..అని సందేశం ఇచ్చే సిరివెన్నెలగారు, ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించే కథానాయకుడి character ని ప్రతిబింబిస్తూ, తన సహజమైన attitude కు భిన్నంగా, తొందరపాటు వద్దని, ఆచి తూచి అడుగు వేయమని.. సందేశం ఇస్తూ పాట వ్రాశారు. అలాగని ఈ పాటలో, motivation లేదని కాదు, ఏం చేసినా, నీ జీవితానికి నీదైన నిర్వచనమిచ్చుకో! అన్న బలమైన పంచ్ లైన్ ఈ పాటలో కనిపిస్తుంది. రిస్క్ ఉండాలి కానీ, ప్రణాళిక బద్ధంగా ఉండాలి, అంటారు సిరివెన్నెల ఈ పాటలో. అంటే ఈ పాట theme, calculated risk అన్నమాట! Look before you leap అన్న భావాన్ని వివరిస్తున్నారన్నమాట!
ఇక కథా నేపథ్యానికి వస్తే, ముకుంద (వరుణ్ తేజ్) మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు అమ్ముకునే ఒక సామాన్య వ్యాపారి కొడుకు. తన స్నేహితుడు అర్జున్ స్థానిక మున్సిపల్ చైర్మెన్ (రావు రమేష్) తమ్ముడి కూతురిని ప్రేమిస్తాడు. అర్జున్‌కు మున్సిపల్ చైర్మెన్ & వారి గుండాల నుండి ఎటువంటి ఆపద లేకుండా కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు మున్సిపల్ చైర్మెన్ కూతురు పూజా హెడ్గేను చూసి ప్రేమిస్తాడు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. 25 సంవత్సరాల నుండి ఎన్నికలలో రావు రమేష్‌దే విజయం. అధికార బలం చూసుకుని అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న రావు రమేష్ ఆగడాలకు ముకుంద అడ్డుకట్ట వేయలనుకుంటాడు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చికాకు తెప్పిస్తున్న ‘ముకుంద’ అడ్డు తొలగించుకోవాలని రావు రమేష్ ప్రణాళికలు రచిస్తాడు.
అలాంటి కథానాయకుడి స్వరూప స్వభావాలను వివరిస్తూ, ఒక background పాటగా ఇది నడుస్తుంది.
చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా
ఆచి తూచి అడుగెయ్యొద్దా..
ఒక పని చేసే ముందే, మనకు Self-Management లో చెప్పినట్టు SWOT (Strength, Weakness, Opportunities, Threats) analysis చేసుకోవాలి. ఎదుటివారి బలాలు, బలహీనతలు, మన బలం, అవకాశాలు అన్ని పరిగణనలోకి తీసుకొని, ఒక విజయ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలి, అని దీని అర్థం.
ఈతే తెలియాలి నది ఎదురైతే
పూర్తై తీరాలి కథ మొదలెడితే
గెలుపే పొందాలి తగువుకి దిగితే పడినా లేవాలి ఏ పూటైనా ఏ చోటైనా నిలవని పయనం సాగాలి రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా గానీ కోరే గమ్యం చూపించాలి
చాలా lengthy గా సాగే ఈ పల్లవిలో ఈత రాకుండా నదిలో దిగకూడదు, ఏదైనా మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదలకూడదు, ఏ కష్టం ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించకూడదు, అన్న స్ట్రాంగ్ motivation మనకి ఇస్తున్నారు, సిరివెన్నెల, Great Expectations గురించి ఒక unknown poet చెప్పినట్లు..
“If a task is once begun, never leave it ‘till it’s done.
Be the labor great or small, do it well or not at all.”
పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా
నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా..
మనకి అక్షరాలు వచ్చు కదా అని ఎలా అంటే అలా వాటిని కూరిస్తే, వ్యర్థాలే వస్తాయి కానీ అర్థాలు రావు. సిరివెన్నెల వ్రాసిన సాహిత్యంలో, ‘అర్థమున్న ఓ పదము కానిదే ఫలితముండునా’ అని రాశారట! అయితే అది రికార్డింగ్ లోకి వచ్చేసరికి, పొరపాటుగా ‘అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా’, గా మారిపోయిందట! మొత్తం మీద, అక్షరాలు అంటే మనకున్న శక్తిసామర్థ్యాలు, వనరులు. అవన్నీ ఉపయోగించి, కోరుకున్న గమ్యాన్ని చేరుకొని, మన జీవితాన్ని మనమే నిర్వచించుకోవాలి. ఎవరో శాసించేంత బలహీనంగా, ఒకరి అధీనంలోకి మన జీవితాన్ని నడిపించ కూడదు, అన్నది సిరివెన్నెల గారి, strong warning.
స్పష్టంగా పోల్చుకో శక్తుందా తేల్చుకో,
అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో
అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా కలలకి, కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని
నమ్మకం నిజమయే లోపుగా తప్పని నొప్పి ఉందని ఆటనే వేటగా మార్చడం కాలం
అలవాటని
గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం అనవా..
మన లక్ష్యం మనమే నిర్ణయించుకున్నది అయినప్పుడు, ఎలాంటి ఒడిదొడుకులనైన తట్టుకొని ఇష్టంగా జీవితంలో ముందుకు సాగగలం. ఆ పయనంలో ఏది సులువుగా అవుతుందో, ఏది శక్తి మేరకు సాధించాలో అర్థం చేసుకోవాలి. కలల తీరం చేరడానికి మనకి ఏ శక్తి అడ్డు వస్తున్నా, దాన్ని ఛేదించడంలో నొప్పి ఉన్నా, కాలం యొక్క స్వభావాన్ని మనం విధిగా అర్థం చేసుకోవాలి. ‘No pains, No gains’ అన్నట్టు, సరదాగా సాగాల్సిన ఆటని, వేటగా మార్చడమే, ప్రకృతి నియమం. దీన్ని మీరు గుర్తించగలిగితే, ప్రళయాన్ని కూడా ప్రణయంగా, ప్రేమగా గుర్తించగలరు. అలాంటి జ్ఞానాన్ని పెంచుకోండి, అని ప్రబోధిస్తున్నారు సిరివెన్నెల.
ఎదురొచ్చే కష్టాన్ని, మన శక్తి సామర్థ్యాలను తట్టి లేపడానికి అని అర్థం చేసుకుంటే, ‘దేవుడు నా మీద ఇంతలా ఎందుకు పగబట్టాడో!’ అని అనుకోము. ‘దేవుడికి నా మీద ఎంత ప్రేమ ఉందో!’ అని అర్థం చేసుకుంటాం.
And then the day came,
when the risk
to remain tight
in a bud
was more painful
than the risk
it took
to blossom.(Risk, by Anaïs Nin)
మొగ్గలా బిగుసుకుని ఉండడం అన్న రిస్క్ కన్నా, నొప్పితో కూడుకున్నదైనా, వికసించడానికి ఒక పువ్వు తీసుకునే రిస్క్ మంచిదని నిర్ణయించుకునే రోజు వస్తుంది.. అన్నది దీని సారాంశం. అంటే నిన్ను నువ్వు నిరూపించుకునే, అవకాశం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి.
శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే ఛేదించదా నీ లక్ష్యము యముడెదురైనా
కృష్ణుని సారథ్యమై సాగిన సామర్థ్యమే సాధించదా ఘన విజయము ప్రతి సమరాన కయ్యమో
నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి ఊహతో
నిచ్చెనే వెయ్యకు అందని గగనానికి వ్యర్థంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి..
గమ్యాన్ని సాధించడంలో రామబాణమంత, బలంగా, విశ్వాసంగా, స్థిరంగా, తిరుగులేని శక్తిలా రూపొందాలి. ఈ కథలో అర్జున్ అనే స్నేహితునికి, ముకుంద అన్న నాయకుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ, శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేస్తూ తన ప్రాణాలు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కావచ్చు, అర్జునుడి సామర్థ్యానికి కృష్ణుడి సారథ్యం తోడైతే, ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి కదా, అన్న భావనను పలికించారు. అందని గగనానికి నిచ్చెన వేయడం, ఊహించుకున్న శత్రువుతో పోరాడడానికి గాలిలో కత్తులు దూయడం – రెండూ పొరపాటేనని, జాగ్రత్తగా ఆలోచించాలనీ, practical గా ఉండాలనీ, warning ఇస్తున్నారు సిరివెన్నెల. వందేళ్ళ ఈ జీవితాన్ని వ్యర్థం కానివ్వకూడదని, అనుకున్నది సాధించి తీరాలని, ఈ జీవితానికి ఒక సార్థకతను చేకూర్చుకోవాలని సిరివెన్నెల బలమైన సందేశం ఇస్తున్నారు.
A Psalm of Life అని పోయంలో, Henry Wadsworth Longfellow, జీవితం ఒక కల కాదు, అది చాలా అమూల్యమైనది. జీవితం అనే యుద్ధంలో, స్తబ్ధంగా, ఒక గొర్రె దాటు లాగా గడపకుండా, హీరోలా ఉండమంటారు.
Life is real! Life is earnest! And the grave is not its goal; Dust thou art, to dust returnest, Was not spoken of the soul..
…………
In the world’s broad field of battle, In the bivouac of Life, Be not like dumb, driven cattle! Be a hero in the strife!
“సినిమా పాట అంటే, కేవలం వినోదమ్ కోసమే కాదు. అది సినిమా కథకు మాత్రమే పరిమితమై ఉండాలని లేదు. సినిమా తెరను దాటి మనిషి గుండెల దాకా, హృదయాల దాకా వెళ్లి మనిషిలోని మనిషి తనానికి అది సొంతం అవ్వాలి. దాన్ని వారు own చేసుకోగలగాలి”, అని సిరివెన్నెల గారు ఒక ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. ఆయన ప్రతిపాట, ప్రతిపూట, మన జీవిత వికాస గ్రంథంలో ఒక పుటలా మనల్ని వెన్నంటే నడిపిస్తూనే ఉంటుంది.
Images Courtesy: Internet