ఉట్టి మాటలు కట్టిపెట్టి – గట్టి చేతలు చేపట్టాలి

0
3

[గ్లేసియర్లు కరిగిపోవడాన్ని అడ్దుకుని తీసుకోవల్సిన చర్యల వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]

CoP 28 లో పర్వత శ్రేణులను కలిగి ఉన్న దేశాలలో జరిగిన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ – కరిగిపోతున్న హిమనీనదాలను గురించి ఆందోళన వెలిబుచ్చారు. గడచిన 30 సంవత్సరాలలో నేపాల్ లోని గ్లేసియర్స్ 30% వరకు కరగిపోయాయని, భూమండలాన్ని వేడెక్కిస్తున్న హరితగృహవాయువులే కాలుష్య ప్రభావానికి ప్రత్యక్ష కారణమనీ నిష్కర్షగా వెల్లడించారు. ప్రతిపాదిత 100 బిలియన్ డాలర్స్ నిధులు – అవసరాలతో పోలిస్తే ఏమాత్రం సరిపోవని, మరిన్ని నిధులు సమకూర్చటం ద్వారా ఇటువంటి ప్రమాదాలలో ఉన్న దేశాలను వెంటనే ఆదుకోవాలని స్పష్టం చేశారు. లేనట్టయితే గ్లేసియర్స్ మొత్తంగా మాయమైపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

పర్వత శ్రేణులన్నీ సహాయం కోసం విలపిస్తున్నాయనీ CoP 28 వాటికి ప్రతిస్పందించాలనీ ఆయన ఎంతో భావోద్వేగంతో సదస్సును ఉద్దేశించి పిలుపునిచ్చారు. రమారమి 240 మిలియన్ల ప్రజలు హిమనీనదాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. 10 వరకు పెద్ద నదులు – ఇండస్, గంగ, బ్రహ్మపుత్ర వంటి వాటికి హిమాలయాలు పుట్టినిల్లు. ఈ నదుల పరివాహక ప్రాంతాలలో సమారు మరో బిలియన్ ప్రజలు (8 దేశాలలో) నివసిసున్నారు. ఆ కారణంగా వెంటనే రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్న దేశాలుగా వీటిని ఆయన అభివర్ణించారు. ఆయన మాటలు అక్షరసత్యాలు.

దెబ్బతిన్న పర్యావరణ సమతౌల్యం – వ్యక్తుల స్థాయిలో, సమూహాల స్థాయిలో చేపట్టే మరమ్మత్తులకు చక్కబడే పరిస్థితి ఏనాడో దాటిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో తగినన్ని అర్థిక వనరులతో, పటిష్ఠమైన ప్రణాళికతో చిత్తశుద్ధితో నడుం బిగిస్తే కనీసం ఇక్కడితో ఆగే అవకాశం అయినా ఉంది.

ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ ఇనీషియేటివ్:

ఈ సంస్థ క్రయోస్ఫియర్ పరిరక్షణకోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిశోధకులు, మేధావులు, పాలసీ నిపుణులు వంటివారంతా ఈ సంస్థలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఇది ఒక విస్తృతమైన కార్యకలాపాలతో,  ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న సంస్థ.

పారిస్ ఒప్పందం నిర్దేశించుకున్న 2° సెల్సియస్ కూడా ఈ క్రయోస్ఫియర్‌కు ప్రమాదకరమేనని వీరు హెచ్చరిస్తున్నారు. 2°-1.5° నడుమ హెర్మోఫ్రాస్ట్ కరగడం మొదలుపెడితే CO₂ తో బాటుగా మిథేన్ వాయువు కూడా వాతావరణంలోకి వెలువడటం మొదలవుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. మిథేన్ వాయవు స్వల్పకాలానికే అయినా CO₂ కన్న ప్రమాదకరమైనది కావడమే దానికి కారణం. మిథేన్ CO₂ వలె వాతావరణంలో తిష్ట వేయదు. కానీ అది వాతావరణంలో నిలచిఉంటే 10/12 సంవత్సరాలలోనే CO₂ కన్నా ఎక్కువ రేటుతో హానిని కలిగిస్తుంది.

గ్లేసియర్స్:

ఆర్కిటిక్ సముద్రం 2° సెల్సియస్ వద్ద ఏడాది పొడవుగా గడ్డకట్టి ఉంటుంది. అందుకే ఇది సముద్రపు మంచు. ఏడాదికి నాలుగు నెలలు మాత్రం సముద్రం మంచు లేకుండా ఉంటుంది.

అంటార్కిటికాలో ప్రతి వేసవిలోనూ సముద్రపు మంచు వేగంగా కరిగిపోతోందని నిపుణుల అంచనా.

స్విట్జర్లాండ్ లోని గ్లేసియర్స్ గడచిన రెండు సంవత్సరాలలో 16% హిమసిరులను పోగొట్టుకున్నాయి.

తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియా, ఉత్తర ఆండీస్ పర్వత శ్రేణలు మొదలైన చోట్ల గ్లేసియర్స్ వేగంగా అదృశ్యం అయిపోతున్నాయి.

సాగరతలాల మంచు, దృవ ప్రాంతపు ప్రవహాలు, మంచు ఫలకాలు వాటి దిగువన ఉన్న నీరు – ఇవన్నీ ‘క్రయోస్ఫియర్’ కోవ లోనికే వస్తాయి. ఈ వ్యవస్థ అంతా గ్లోబల్ వార్మింగ్ కారణం పెను ప్రమాదానికి లోనవుతోంది.

పెరూలో 1962లో – 2399 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండిన 2080 పైగా గ్లేసియర్స్ 2020 నాటికి 1050 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి తగ్గిపోయాయి. ఉష్ణమండల గ్లేసియర్స్‌లో సగానికి పైగా కలిగి ఉన్న పెరూ గత అర్ధ శతాబ్దిలో 50% పైగా హిమనీ నదాలను పోగొట్టుకుంది.

సాధారణంగా హిమనీనదాలు కరిగినపుడు దారిలో ఏర్పడే నీటి మడుగులు స్థానికుల నీటి అవసరాలను తీరుస్తూ ఉంటాయి. సుమారు రెండు మిలియన్ల ప్రజలు ఇటువంటి జలవనరులపై ఆధారపడి జీవిక సాగిస్తున్నారు. అయితే భూమికి బాగా ఎత్తున ఉన్న హిమనీనదాలు కరుగుతున్న వేగం పెరిగినపుడు అవి వరదలుగా పరిణమించి విపత్తులకూ కారణమవున్నాయి.

పాకిస్తాన్ లోనూ కరుగున్న గ్లేసియర్స్ నుండి పలు గ్రామాలకు ప్రమాదం ఉంది.

10, 15 సంవత్సరాల క్రిందట వరకు లడాఖ్ ప్రాంతానికి నీటి ఎద్దడి ఉండేది కాదు. మంచు కరిగిన నీరు, గ్లేసియర్స్ కరిగినప్పుడు వాలుకు ప్రవహించే నీటితో ఆ పరిసరాలన్నీ సుభిక్షంగా ఉండేవి. పశుపోషణ, వ్యవసాయం వంటి ఉపాధులతో ప్రజలు హాయిగా జీవించేవారు. శీతాకాలం, ఎండాకాలం అక్కడ నీటి వసతి కారణంగా సమృద్ధి కాలం. అంటువంటిది మంచు కరిగి నీరు దిగువకు రావడం, తరిగిపోయిన గ్లేసియర్స్ కారణంగా గ్లేసియర్స్ కరిగి నీరు వాలుకు ప్రవహించి లడాఖ్ ప్రాంతానికి చేరడం ఇటీవల అంచనాలకు అందని విషయం అయిపోయింది. నీటి కొరత కారణంగా పచ్చదనం హరించుకుపోయింది/పోతోంది. పశువుల కాపరులు తమ వృత్తి మాని ఉపాధి కోసం వలసల బాట పడుతున్నారు.  నీరు లేక బార్లీ, ఆప్రికాట్ వంటి పంటలూ రైతులకు నష్టాలనే మిగులుస్తున్నాయి.

లడాఖ్‍లో ఇటీవలి కాలం వరకు రెండు మూడు నెలలు తప్ప సంవత్సరం పొడవునా సూర్యరశ్మి ఉండేది. అంత విస్తారమైన ఆ పర్వత ప్రాంతంలో 4″ ల వర్షం పడటమే గొప్పగా ఉండేది. వరదల గురించిన ఊసే లేదు. అయితే 2010 నాటి అనూహ్యమైన వరదలు/బీభత్సం తరువాత ఆకస్మిక వరదలు ఆ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలలో లేనిది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వరదల తాకిడికి ఆ ప్రాంతం అల్లల్లాడుతోంది. ఇదంతా వాతావరణ మార్పుల ఫలితమని/ప్రభావమని నిపుణులు అంటున్నారు. భూమండలంపై వేరే ఎక్కడో వెలువడిన ఉద్గారాల తాలూకు దుష్రభావాన్ని లడాఖ్ వాసులు అనుభవిస్తున్నారు.

సోనమ్ వాంగ్ చుక్:

ఈయన ఒక ఇంజనీర్. 2013 నుండి ‘మంచు స్థూపాల’ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. స్థానికులను కూడగట్టి పర్వత శిఖరాల నుండి వాలుకు ప్రవహిస్తున్నప్పుడు వృథాగా పోయే నీటిని క్రిందకు పల్లపు ప్రాంతాలలోనికి చేరేలా పైపులను ఏర్పాటు చేసి సేకరించి జాగ్రత్త చేస్తే శీతాకాలం ఆ నీరు గట్టకట్టి చిన్న మంచుకొండలా ఏర్పడుతుంది. వసంత ఋతువులో ఈ నీటిని వాడుకొవచ్చు. ఈ ‘పిరమిడ్ మోడల్’ లో మంచు నిదానంగా కరుగుతుంది. ఆ కారణంగా వృథా కాదు. ఆ విధంగా నీరు వినియోగించకోగల కాల వ్యవధి పెరుగుతుంది. ఈ విధానం విజయవంతం కావడంతో మంచు స్థూపాలుగా ప్రసిద్ధి చెందడమే కాక చాలా చోట్ల వాడుకలోనికి వచ్చింది.

లడాఖ్‍ – సహజ వనరులన్నీ దెబ్బతిని ప్రజలు అష్టకష్టాలు అనుభవించిన ఒక ప్రాంతం. 30 మీటర్ల ఎత్తు ఉన్న ఒక మంచు స్థూపంతో నీటి ఎద్దటి తీరి పూర్వపు సాధారణ జీవితానికి తిరిగి రాగలిగారు.

అసలు నీటిని గడ్డకట్టించ వచ్చన్న ఆలోచనే తనకు చాలా కాకతాళీయంగా వచ్చిందని చాలా సంవత్సరాల క్రింద ‘ఆల్ ఇండియా నేషనల్’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సూర్మరక్ష్మి తగలని చోట మంచు యథాతథంగా ఉండిపోవడాన్ని గమనించినపుడు ‘కృత్రిమంగా గడ్డకట్టించి నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదా’ అన్న మీమాంశ తలెత్తిందని; ప్రయత్నించి చూడగా ఆ ప్రయత్నం ఫలించిందనీ ఆయన చెప్పారు. ఆచరణ లోకి దిగాక మరింత శాస్త్రీయంగా విధానాలను చేపట్టడం, మంచు స్థూపాల ఆవిష్కారం జరిగిందని అన్నారు.

ఈ సిద్ధాంతం చక్కని ఫలితాలను ఈయడంతో సహజంగానే విస్తృతంగా ప్రచారం లభించడమూ, వినియోగంలోనికి రావడమూ జరిగింది. తద్వారా పలు ప్రాంతాలలో నీటి ఎద్దడి తొలగిపోయింది. ఆకస్మిక వరదల ముప్పు ఒక్కటే ఇప్పుడు సమస్య అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here