కాంచన శిఖరం-13

0
4

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[శ్రీశైలం సమీపంలో వెలసిన గ్రామం నాగశివ. మొదట గ్రామం వెలసిందో లేక దేవుని గుడి వెలసిందో చెప్పడం కష్టం. ఆ ఊరి పేరు, ఆలయం పేరు కూడా నాగశివయే. స్థలపురాణం ప్రకారం కొంతమంది ప్రజలు అనావృష్టి మూలంగా తమ గ్రామాన్ని, వ్యవసాయాన్ని వదులుకుని వలస వెళ్తారు. కొంత దూరం వెళ్ళాకా, వారొక రావి చెట్టు క్రింద సేదతీరుతారు. అయితే విచిత్రంగా, అక్కడ, రావిచెట్టు, వేపచెట్టు పెనవేసుకుని ఉంటాయి. వారంతా ఆశ్చర్యంగా ఆ చెట్టు వైపు చూస్తారు. దానికున్న ఎర్రని రెమ్మలు వాళ్ళని ఆకర్షిస్తాయి. రావిచెట్టు, వేపచెట్టు కలిస్తే శుభసూచకమని అంటారని వారు గుర్తు చేసుకుంటారు. రావిచెట్టు కొమ్మలకున్న కొన్ని చిహ్నాలని చూసి వారిలో కొందరు ఆశ్చర్యపోతారు. అవి కోరికలు తీర్చే చిహ్నాలని, ఏదైనా కోరుకుని ముడుపు కట్టి కొమ్మలకు వేలాడదీసి, కోరిక తీరాకా, ఆ మూటని విప్పి దేవుడికి అర్పించి కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆ బృందంలోని ఓ పెద్దమనిషి చెప్తాడు. మరిక్కడ ఆలయమేదీ లేదే అని ఒకరంటారు. ఒక్కప్పుడు ఉండేదేమో, నదిలో మునిగిపోయిందేమో అని ఇంకొకరు అంటారు. చీకటి పడుతుండడంతో, ఆ బృందం లోని ఆడవాళ్ళు అక్కడే వంటకి ఉపక్రమిస్తారు. కొన్ని కట్టెపుల్లలు ఏరి మంట పెడతారు. నీటి కోసం కొంచెం ముందుకు వెళ్ళిన లింగన్నకి అక్కడ ఒక జలధార కనిపిస్తుంది. గట్టిగా కేకలు వేసి అందరినీ పిలుస్తాడు. వారంతా వచ్చిన ఉన్న అడ్డంకులు తొలగింది, ఆ నీటిని ప్రవహాంలా మారుస్తారు. నీరు లభించడంతో అందరూ సంతోషిస్తారు. అక్కడే ఉండాలని నిశ్చయించుకుని ఆ మర్నాడు గుడిసెలు వేసుకుంటారు. కొన్నాళ్ళకి ఓ రోజు భూమన్న సెలయేటిలో స్నానం చేస్తుండగా అతని వేలికి ఏదో తగులుతుంది. పైకి తీసి చూస్తే అదొక శివలింగం. అందరూ హర హర మహాదేవ అని స్తుతిస్తారు. వారంతా ఏకాభిప్రాయంతో ఆ రెండు చెట్ల క్రింద ఉన్న ఒక రాతిపలక మీద శివలింగాన్ని ఉంచుతారు. అక్కడ పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ముగ్గులతో అలంకరించి దీపం వెలిగిస్తారు. శ్రీశైలం నుంచి పురోహితుడిని పిలుచుకుని వచ్చేందుకు భూమన్న, మరొకొందరు బయల్దేరుతారు. తెల్లవారుతుండగా మల్లమ్మ గట్టిగా పెట్టిన కేకకి అందరూ ఉలిక్కిపడతారు. పాము పాము అంటూ శివలింగాన్ని చూపిస్తుందామె. దగ్గరికి వెళ్ళి చూస్తే అది నిజం పాము కాదు. రాతి సర్పం, శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. నిన్న లేని ఈ పాము ఇప్పుడెలా వచ్చిందని ఆశ్చర్యపోతారు. ఈలోపు భూమన్న, అతని మిత్రులు శ్రీశైలం నుంచి ఓ పురోహితుడిని తీసుకుని వస్తారు. ఆయన ఆ శివలింగాన్ని చూస్తూనే శివుని స్తుతిస్తూ గీతాలాపన చేస్తాడు. త్వరలోనే నాగశివ ఆలయం మహిమ అంతటా పాకుతుంది. అక్కడో ఆలయం వెలుస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 23

[dropcap]‘స్పం[/dropcap]దన’ అనే మ్యూజియం ప్రాంగణం విశేషమైన వాస్తుకళతో సిద్ధమవుతోంది. అది ఒక కమలం ఆకారం గల కట్టడం; అదీ పారుతున్న సెలయేరు మధ్యన. అది అన్ని కోణాల నుంచి సుందరంగా కనిపిస్తుంది. మేరుకి అది భగవంతుని నాభి నుంచి ఉద్భవించిన కమలం లాగా ఉంది. వాస్తు శిల్పులు రాజు, మూర్తి నెలల తరబడి మేరుతో మంతనాలు సాగించిన తరువాత, ఆ భవనపు నమూనా చిత్రపటాన్ని చేశారు. వారు ఆంధ్రరాష్ట్రంలోని అన్ని ప్రదర్శనశాలలు, చిన్నవీ, పెద్దవీ దర్శించారు. వారు కలకత్తాకి వెళ్లి అక్కడ ఉన్న ప్రాచీనమైన ప్రదర్శనశాలకి కూడా వెళ్ళారు. చివరిగా వారి నమూనాకి ఆమోద ముద్ర లభించింది. ‘స్పందన’ సరస్సు మధ్యలో నిర్మింపబడుతోంది. పర్యాటకులు, నాగార్జున కొండలో వలె పెద్ద స్టీమర్లు కాకుండా, చిన్న పడవలలో ప్రదర్శనశాలని చేరుకోవచ్చు.

ఆ మ్యూజియం విజయనగరపు కాలాన్ని ప్రతిబించించే ఆర్చ్‌లు, తోరణాలతో అలంకరించబడుతోంది. వెనుకవైపు సహజసిద్ధంగా ఉండే నేపథ్యాన్ని అలాగే ఉంచేశారు.  పురాతన వృక్షాలు, నమ్మకస్తులైన బంటుల్లాగా, తమ ఆకుపచ్చని బావుటాలని ఎగరవేస్తున్నాయి. భూమిలో కూరుకొని ఉన్న చిన్నా పెద్దా బండరాళ్ళు, కాలానికి మూగ సాక్షుల లాగా ఉన్నాయి. వాటిపై చిత్రాలు చిత్రాలు చెక్కేందుకు తన స్నేహితుడు, వైకుంఠాన్ని హైదరాబాదు నుంచి రప్పించాడు మేరు. సింహద్వారం వద్ద రెండు వైపులా – ఎర్రని ఇసకరాయితో చేసిన – నాట్యం చేస్తున్న స్త్రీమూర్తుల బొమ్మలు రెండు ఉంచారు.

అవి కూడా కాలగతికి తట్టుకుని నిలిచాయి. ప్రహరీ కట్టడాల మీద జంతువుల, పుష్పాల చిత్రాలు మనోహరంగా మలచబడ్డాయి.

ప్రతి చిన్న వివరంపై సూచనలు, సలహాల కోసం మేరు కృష్ణశాస్త్రిని సంప్రదించాడు. ఆయన నుంచి ఎన్నో విషయాలు సేకరించాడు. ఇంత పెద్ద మ్యూజియంకి, తాము సేకరించిన కళాకృతులు సరిపోవేమో అన్న సంశయాన్ని మేరు వ్యక్తం చేసినప్పుడు, కృష్ణశాస్త్రి అర డజను పరిష్కారాలు సూచించారు.

“చూడు, మేరూ, భవిష్యత్తు విస్తరణను దృష్టిలో పెట్టుకొని, మనం దీనిని నిర్మించాలి. మనం దానిని విస్తృతంగా ప్లాన్ చేద్దాం. కళాకృతులు పెద్ద విషయమేమీ కాదు. మనం సాధ్యమైనన్ని కళాకృతులు మన రాష్ట్రంలో కల వివిధ త్రవ్వకాల స్థలాల నుండి సేకరించవచ్చు. ‘స్పందన’ మరో మామూలు వస్తు ప్రదర్శనశాల కాకూడదు. అది సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పునర్నిర్మాణానికి దోహదపడే అపూర్వ కళాఖండాల ప్రదేశంగా రూపొందాలి.”

మేరు పునరుత్సాహంతో, వెనుదిరిగాడు. దీని ఉద్ఘాటనకి మరి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. యాభై మందికి పైబడే, వాయు వేగంతో పని చేస్తూ, తుది మెరుగులు దిద్దుతున్నారు.

వస్తు ప్రదర్శనశాలకు మూడు విభాగాలున్నాయి. వీటిని కలుపుతూ, చుట్టలు తిరిగే మెట్లు కట్టబడ్డాయి. ప్రవేశ ద్వారంలో ఉన్న పాలరాతి అల్లికలు, రాజరికపు సోయగాల్ని, ఆ కట్టడానికి ఆపాదించాయి. ఒక్క అంతస్తులో నిర్మించబడిన 25 అద్దాల అరలు, ప్రదర్శన నిమిత్తం ఉంచబడిన వస్తువులను అమర్చడానికి తగిన స్థలం కలిగి ఉన్నాయి. వారు వస్తువులను కాలానుగుణంగా అమర్చడానికి మొదట ప్లాన్ చేశారు. పాత రాతియుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం. ఈ క్రమంలో అయితే ఒక్కో అంతస్తులో ఒక్కో కాలనికి చెందిన వస్తువులు ఉంచడం బాగుంటుందని చంద్రం సలహా ఇచ్చాడు. ఇలా చేస్తే ప్రదర్శనశాలకి వచ్చే పర్యాటకులు, మానవ పురోగతి శాస్త్రాన్ని అభివృద్ధి క్రమంలో అధ్యయనం చేయడానికి వీలుపడుతుంది.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎర్ర ఇసుకరాతితో 50 నమూనాలను చేసింది. ఈ నమూనాలన్నీ ప్రదర్శనశాలకు మరింత వన్నె తెచ్చాయి. కాళహస్తి త్రవ్వకాలలో దొరికిన అనేక శిల్ప కళాఖండాలను ప్రదర్శనకి ఉంచారు. అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. మొండెం వరకు గల శిల్పాలను నగల ప్రదర్శనకు ఉంచారు. పూసలను, అలంకరణలనూ సానపెట్టి, ఆకృతులపై ఆలంకరించడానికి నెలల సమయం పట్టింది.

రాళ్లను, ఒపల్, బైరేట్స్, బాక్సైట్, షేల్, స్పటికలుగా వర్గీకరించడానికి చాలా సమయం పట్టింది. అన్నీ ఒక అందమైన కూర్పులో అలంకరించబడ్డాయి. ఇవి ఏ కాలానికి చెందినవో, లేబుల్ ద్వారా తెలియజేయబడ్డాయి. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించడానికి దోహదపడతాయి. సామాన్యమైన శిలలు అనూహ్యంగా, వెలిగిపోతూ కనిపించసాగాయి. ప్రముఖ స్థలాలలో ఉంచబడిన విద్యుత్ బల్బులు గాజు అద్దాల గుండా ఆ శిలలు అద్భుతంగా కనిపించడానికి దోహద పడ్డాయి. ప్రత్యేకమైన శ్రద్ధతో పనిముట్లను ప్రదర్శనకి ఉంచారు. శతాబ్దాల కింద బండరాళ్ళ నుంచి ఆయుధాలు చేసినవారి సృజనాత్మకతకి ఎవరైనా ఆశ్చర్యపోతారు. అన్ని పనిముట్లూ పలుగులు, గునపాలు, నూరే వస్తువులు, స్థూపాకార సుత్తులు, శిలల నుంచి మలచబడ్డాయి. వీటిలో కొన్నింటిని గోడలపై గల గాజు అరలలో భద్రపరిచారు.

వందల కొద్దీ పనివారు, కళాకారులు పర్యవేక్షకులకు సహాయపడసాగారు. ‘స్పందన’లో పని వేగవంతంగా సాగుతుంది.

***

“మేరు ప్రదర్శనశాలని ప్రారంభం కాకముందే చూడాలనుకుంటున్నాను. సూర్యకి కూడా ఇప్పుడు సెలవలే. నీవు మమ్మల్ని తీసుకువెళ్ళకూడదా? నువ్వు అనేక మార్లు వెడుతున్నావు” శిల్ప మేరును బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది.

మేరు ఆశర్యపోయాడు. ‘ఈ శిల్పేనా కొన్నేళ్ళ క్రితం హంపీకి రావడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది? అప్పుడు ఆమెకు అవి కేవలం కుప్ప పోసిన రాళ్ళు, పాడుబడ్డ ప్రదేశం మాత్రమే. ఇప్పుడు ఆమెకు నా ప్రణాలిక పట్ల ఎందుకు ఆసక్తి కలిగింది?’ అనుకున్నాడు మేరు.

“నిజంగా, నేను నాగశివ దేవాలయం గురించి విన్న తరువాత నాకు చాలా ఆసక్తి కలిగింది. నేను సర్పంతో కూడిన శివలింగాన్ని ఊహించలేక పోతున్నాను, ఒక నిజమైన సర్పం వచ్చి రాయిగా మారిందని నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. నేను ప్రదర్శనశాలను కూడా చూడాలి. తుది రూపం కన్నా నిర్మాణ ప్రక్రియే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.” అంది శిల్ప.

సూర్య కూడా అమ్మ ఒత్తిడిని మరింత అధికం చేస్తూ, “నాన్నా, నువ్వు నాకు మన ఇంటి కన్నా పది రెట్లు పెద్దది, క్రిందకి దిగడనైకి మెట్లున్న బావిని చూపిస్తానన్నావు. మరెప్పుడు తీసుకుళ్తావు?” అంటూ బ్రతిమాలసాగాడు.

సపరివారంగా వెళ్ళేందుకు వారాంతర పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేశాడు మేరు.

***

“ఓహ్! నిజంగా అద్భుతమైన కట్టడం” అంది శిల్ప, జీపు నుంచి దిగుతూ. “గత రెండేళ్ళుగా నువ్వు శ్రమిస్తున్నది దీని మీదే కదా?” అని ఆమె అడిగింది.

“రెండు సంవత్సరాల కాలం ఏపాటిది? కట్టడం ఆకృతి కాదు, లోపలి భాగాలు, గ్యాలరీలు ముఖ్యం. ఇది దీని సూక్ష్మ నమూనా, పాలరాతి ప్రతిరూపం. దీనిని తయారు చేయడానికి మూర్తికి ఆరు నెలలు పట్టింది.” అంటూ ముఖద్వారం దగ్గర ఉన్న అద్దాల పేటికని చూపించాడు మేరు.

శిల్ప, సూర్య, ఆ ప్రాంతం గుండా నడుస్తున్నారు, మేరు వాళ్ళకి తమ ప్లాన్ గురించి వివరిస్తున్నాడు.

“ఆహా ఎంత పెద్ద కటారి?” అన్నాడు సూర్య ఒక్కసారిగా ఆగి, గోడ మీద ప్రదర్శితమవుతున్న వస్తువుని చూపిస్తూ.

“ఇది ఒక మంత్రయుక్తమైన కటారి. ఈ ప్రదేశం, మతానికి, మత సంబంధమైన క్రతువులకి చెందినది. ఎక్కువ భాగం తాంత్రిక వస్తువులు. రాజులు ఆ రోజులలో అపరిమితంగా యుద్ధాలు చేసేవారు. ప్రతీ యుద్ధం ఓ ఆచారపరమైన ఉత్సవంలా ఉండేది.  ఈ రాజ్యలక్ష్మి యొక్క ప్రతిమ చూడండి. ఆమె ముఖ్య ఇలవేలుపు.” చెప్పాడు మేరు.

“ఇది అంత ప్రాచీన శతాబ్దాల క్రిందటిదిలా కనిపించటం లేదే?” అంది శిల్ప కుతూహలంగా.

“నిజమే. కర్నూలు త్రవ్వకాల స్థలంలో శిరస్సు, చేతులతో లభించిన శిలని ఈ రూపంలో మేమే చేయించాం” అన్నాడు మేరు.

“నాన్నా, నీకీ విషయలాన్నీ ఎలా తెలుసు?” అడిగాడు సూర్య.

“పుస్తకాల నుంచి సూర్యా. చరిత్రని ఎంతోమంది విద్వాంసులు గ్రంథస్థం చేశారు. అరుదైన కళాకృతులే కాకుండా, పురాతన రాతప్రతులను కూడా మేము సేకరించగలిగం. ఈ పెద్ద గది చూడు, ఇది గ్రంథాలయం కోసం” చెప్పాడు మేరు.

“నాన్నా, నువ్వు మమ్మల్ని ఆ మెట్లున్న బావి దగ్గరకి తీసుకువెళ్తానన్నావు. నిక్షేపాల గని ఉన్న ఆ బావి లోకి నా అంతట నేనే దిగుతాను” చాలా ఉత్సాహంగా అన్నాడు సూర్య.

మేరు తనని తాను తన కొడుకులో చూసుకున్నాడు. హృదయపూర్వకంగా వెన్నుతట్టాడు.

“సూర్యా, పురావస్తు శాస్త్రం చాలా ఆసక్తికరమైనది. కానీ, దానికి లొంగిపోయేలా చేస్తుంది. నువ్వు ‘స్వప్నాల వాస్తుశిల్పి’ అయి నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకోవాలి” అన్నాడు మేరు.

శిల్ప ప్రతి వస్తువును ఆరాధనాపూర్వకంగా చూస్తోంది. వివిధ ఆకారాల్లోని పింగాణీ వస్తువులు రంగురంగులలో నగిషీలు చెక్కబడినట్లుగా మిరమిట్లు గొల్పుతున్నాయి. ప్రాచీన కాలపు ప్రజల సొగసైన, ఆకర్షణీయమైన జీవన శైలికి చెందిన ప్రతీకగా సున్నితంగా మలచచడ్డ దంతపు వస్తువులు, ఖడ్గమృగం కొమ్ముల నుంఛి చేసిన పాత్రలు, రంగురంగుల మద్యపు పాత్రలు, అలంకారపు గరిటెలు, డామాస్కు దేశపు రికాబులు, అత్తరు పాత్రలు – అక్కడ ప్రదర్శింపబడ్డాయి.

“కళాప్రియులందరూ ఈ ప్రదర్శనశాలను ప్రశంసిస్తారు. ఇది అత్యంత ఆకర్షణీయమైనది. ఇది పూర్తయిన తరువాత ఎలా ఉంటుందో నేను ఉహించుకోగలను. నాకు బాగా నచ్చింది” అంది శిల్ప అభినందన పూర్వకంగా.

అక్కడ ఉన్న బండరాళ్ళ మీద ఉన్న రేఖా చిత్రాలు చూడడానికి వాటి దగ్గరకి వెళ్తామన్నాడు సూర్య.

అక్కడ జరిగే పనులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేసి అక్కడ్నించి కదిలాడు మేరు.

అధ్యాయం 24

‘స్పందన’ ప్రదర్శనశాల ప్రారంభోత్సవం ఆ రోజే! అత్యంత సృజనాత్మకంగా ఓ బావిలో ఏర్పాటు చేసిన వేదికని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. శ్రీశైలం త్రవ్వకాల స్థలంలో గుర్తించిన మెట్ల బావిని లలిత కళలను ప్రదర్శించే సాంస్కృతిక కేంద్రంగా మార్చారు.

ఆ మొత్తం ప్రదేశం ఫ్లడ్ లైట్ల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మెట్లు వెడల్సుగా ఉన్న చోట్ల కుర్చీలు వేశారు. ఇరుకుగా ఉన్న చోట్ల శుభ్రపరిచి కూర్చోడానికి అనువుగా చేశారు. ప్రేక్షకులు బావి మూడు వేపులా కూర్చున్నారు. తూర్పు దిక్కున ఆర్చ్ గల వేదికను, దేవాలయం లాంటి కట్టడాన్ని – ప్రదర్శనలిచ్చే కళాకారుల కోసం నిర్మించారు. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి శిల్పులను రప్పించి – సాంప్రదాయ వాతావరణం కనిపించేలా – ఆధారంగా ఉన్న స్తంభాలపై నృత్యం చేస్తున్న యువతుల నున్నని శిల్పాలు చెక్కించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపాలు వేదిక పై కాంతులు విరజిమ్మాయి. కార్యక్రములు వీక్షించడానికి సరైన స్థలం దొరకని ప్రేక్షకులకు ఉపయోగపడేలా – సెన్సిటివ్ మైక్రోఫోన్స్, ఆంప్లిఫ్లయర్లు ఏర్పాటు చేశారు.

మేరు ఏర్పాట్లను పర్యవేక్షించడంలో తలమునకలయ్యాడు. పురావస్తు శాఖనుంచి రిటైర్ అవుతున్న డా. కృష్ణశాస్త్రి గారికి వీడ్కోలు పలకడానికి ఈ సందరాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఆయన సహాయంతోనే మేరు త్రవ్వకాల స్థలాన్ని, కళా కేంద్రంగా మార్చేందుకు రూపకల్పన చేశాడు. అది నిశ్చయంగా ఓ కళాకారుని దూరదృష్టి!

ఈ ప్రణాళికని ముగించడానికి దాదాపు రెండేళ్ళు పట్టింది. ఒక ప్రైవేటు సాంస్కృతిక సంస్థ ప్రవాస భారతీయ సమూహంతో కలసి ఈ డ్రీమ్ ప్రాజెక్టును సాకారం చేసింది. ఇప్పుడు శ్రీశైలానికి వచ్చే యాత్రికులు మరో మూడు ప్రదేశాలు చూడవచ్చు. అవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అవేమిటంటే – నాగశివ దేవాలయం,  తేలియాడే ప్రదర్శనశాల నందన, కళా ప్రదర్శనలకు ఆలవాలమైన స్పందన! ఈ మూడు కేంద్రాలు అనేక తరగతుల ప్రజలను ఆకర్షించాయి, వీరిలో విధ్యార్థులు, విద్వాంసులు, కళా పిపాసులు ఉన్నారు.

పండిత హరిప్రసాద్ చౌరాసియా వేణువు నుంచి పహాడి రాగం ముగ్ధమనోహరంగా వినిపిస్తోంది. ఆ గాన మాధుర్యం ఆ బావి అంతా విస్తరించింది. కట్టలు తెంచుకు పారింది. మహాసముద్రంలా ఉన్న ప్రేక్షక సమూహాం మెత్తాన్ని ఆవరించింది.

శిల్ప మేరు ప్రక్కన కూర్చుంది. మెత్తం పురావస్తు శాఖలో పని చేసే ఉద్యోగులు సకుటుంబ సమేతంగా ఈ కొత్త రకపు విందుని ఆనందించడానికి, తమ డైరక్టరు కృష్ణశాస్త్రి గారికి వీడ్కోలు చెప్పడానికి విచ్చేశారు.

ఆలాపన మొదలైన తరువాత, ప్రతి ఒక్కరు సౌఖ్యంగా స్థిరపడ్డాక, ఆ లయకు తగ్గట్టు తలలాడించసాగారు. ముందు అనుకున్నట్లుగానే ఫ్లోరోసెంట్ లైట్లు ఆర్పివేశారు. ఒక నిమిషం పాటు, బావి అడుగు భాగాన ఒక అడుగు మందాన నీటిని నింపారు. పూర్వపు బావిని పునరుజ్జీవింప చేసేందుకు దానిలో తేలియాడే దీపాలను వదిలారు. అవి కార్తీక దీపాలు వలె వెలిగిపోతున్నాయి.

“మేరు, ఎంత అద్భుతంగా ఉంది. దీనికి పండిత్‌జీ సంగీతాన్ని ఆస్వాదించడానికి దివి నుండి భువికి దిగి వచ్చిన నక్షత్రాలు లాగ ఉన్నాయి” అంటూ శిల్ప మేరు చెవిలో గుసగుసలాడింది.

కరతాళధ్వనునులతో ఆ ప్రదేశం రెండు నిమిషాల పాటు మారుమ్రోగిపోయింది. పహడీ రాగం తరువాత, జైజవంతి రాగం ఊపందుకుంది. లైట్లు వేయబడ్డాయి. నెమ్మదిగా సాగే లయకి నాట్యం చేస్తున్నట్లుగా తేలియాడే దీపాలు కదిలాయి.

మేరు శిల్ప కళ్ళలోకి చూశాడు. అవును, అవే తేనె రంగు కళ్ళు, సూటిగా కొనతేరిన ముక్కు, నల్లని పొడవాటి కురులు, ఉంగరాలు తిరిగిన కొన్ని కేశాలు ఆమె నుదుటి మీద పడుతున్నాయి. ఓ వనకన్య, ఓ జలకన్య, ఓ అప్సరస – కలబోసినట్లుగా సమ్మోహనాత్మకమైన సౌందర్యం ఆమె స్వంతం. పెళ్ళయి పది సంవత్సరాల తరువాత పరిణితి పొందిన మాతృమూర్తి లాగా, కలలు సాకారమైన కనులతో ఉంది.

తన చేతులు జాపి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ‘ఈమె నా శిల్ప, నా స్వంతం, నా స్వప్న సుందరి’ అని మేరు తనకి తాను మరోసారి భరోసా ఇచ్చుకున్నాడు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here