[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘జీవన రాగంలో పదనిసలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]‘కౌ[/dropcap]సల్య సుప్రజ రామ’ అంటూ నాన్నమ్మ తాత పూజలు చేస్తున్నారు. కార్తీక మాసం. ఎంతో తెల్లవారగట్లే ఆ ఇంట పూజలు, సాంబ్రాణి ఘుమఘుమలు. ఆ తరువాత ఇంగువ ఘుమఘుమ వంటలు, పులిహోర వాసనలు మామూలే.
“శ్రద్ధా శ్రద్ధా” అని అరిచినట్లు పిలిచి, “కోసిన పువ్వులు ఫ్రిజ్‌లో ఉన్నాయి. పట్టుకెళ్ళి నాన్నమ్మకి ఇయ్యి” అని తండ్రి శ్రీనివాస్ చెప్పాడు. ‘ఆడపిల్లకి పనులు నేర్పాలి’ అనుకుంటూ పిలిచి ఆ పని చెప్పాడు. శ్రీనివాస్ చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. బ్యాంక్ మేనేజర్. కూతురికి శ్రద్ధ అని పేరు పెట్టుకున్నాడు. “దానికి శ్రద్ధ లేదు అన్ని చెప్పాలి నేర్పాలి నీ పోలిక అసలు రాలేదు” అన్నాడు భార్య రూపిణితో.
“అది చిన్న పిల్ల” అంటూ రూపిణి కూతురిని సమర్థించింది. భర్త ఏది అడగకుండానే అన్నీ సర్ది పెడుతుంది రూపిణి. ఒక్కోసారి ఆఫీస్ వర్క్‌లో కూడా సలహాలు ఇస్తుంది.
“దీనికి ఎవరి బుద్దులు వచ్చాయీ? తల్లి తండ్రి పద్ధతి రాలేదు. స్కూల్ వర్క్ బాగానే చేస్తుంది అంటారు. తెలివైన పిల్లే. దానిది చిన్న వయసు. పెద్ద అయ్యాక అదే నేర్చుకుంటుంది” అంటూ తాతగారు సమర్థిస్తారు.
రూపిణి ఒకసారి కాలిఫ్లవర్‍లో పువ్వులు విడదీసి కొమ్మలు వంటివి సన్నగా తరిగి ఫ్రిజ్‌లో పెట్టింది. ఆకులు విడదీసి కడిగి పచ్చడి చేసింది. అత్తగారు రూపిణి శ్రద్ధకి మెచ్చుకుంది ఒక ప్రక్క. మరోప్రక్క జంతువులకి ఆహారం లేకుండా మనుష్యులే ఆకులు కొమ్మలు తినేస్తున్న విషయం బాగుంది, ఫ్రిజ్ వచ్చాక మనుష్యులలో శ్రద్ధ పెరిగిపోయింది” అంటూ మాట్లాడింది. అది ప్రశంసా లేక విమర్శా మీరే చెప్పండి.
అత్తగారిది పెద్ద చెయ్యి. ఇద్దరు ఉన్నా కేజీ కూర వండాలి అంటుది. ఇరుగు పొరుగు వారికి పెట్టాలి అంటుంది.
రూపిణి కూతురుకి అన్నీ చెపుతుంది. శ్రద్ధ సరదాగా తీసుకుంటుంది, పట్టించుకోదు. సాయంత్రం కూర్చోపెట్టుకుని రూపిణి కూతురికి సంగీతం నేర్పిస్తుంది. స్వరాలు బాగా రావాలి. నోరు తిరగడానికి కొన్ని స్వరాలు, వాటితో పాటు శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు ‘ముద్దు గాదె యశోదా’ వంటివి నేర్పిస్తుంది. ఇప్పుడు ‘పిల్లలు పాడితే అందంగా ముద్దుగా ఉంటుంది కదా’ అంటారు ఇంటిల్లిపాదీ. శ్రద్ధ పాటలు శ్రద్ధగా వింటారు.
ఒకసారి శ్రద్ధ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకు వచ్చి తల్లికి చూపింది.
“మార్కులను బట్టి నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో తెలుస్తోంది. అవును కదా!”
“అమ్మా, స్కూల్‌లో తెలుగు క్లాస్‌కి పిల్లలు ఉండరు. ఉన్నా కబుర్లు చెప్పుకుంటారు. అయన మమ్మల్ని ఏమి అనరు. మరి సైన్స్ క్లాసులో అసలు ఎవరు ఎదురు చెప్పరు. అదే లెక్కలు అయితే మరీ భయం! బెంచి ఎక్కించి నిలబెడతారు లేదా డస్టర్ విసిరేసారు. సార్‍కి కోపం ఎక్కువ” అంది శ్రద్ధ.
“కోపం కాదు, మిమ్మల్ని బాగా కంట్రోల్ చేస్తారు. లెక్కలు రానిదే జీవితంలో విజయం ఉండదు. బాగా చదువుకుని మంచి మార్కులు ర్యాంక్‌లు తెచ్చుకుని పేరు వచ్చి బాగా ఉండాలి. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అందుకే మిమ్మల్ని అలా అంటారు టీచర్లు. ప్రతి స్కూల్‌లో పేరెంట్స్ వచ్చి మేము ఫీస్ కడుతున్నాము, మీరు కొట్టి అయినా చదువు చెప్పాలి అంటారు. అందుకు అదే కావాలి, అందరినీ చేరుస్తారు. మంచి పిల్లలు, పెంకిపిల్లలు కూడా ఉంటారు. అందరికీ ఒకటే పద్ధతి కుదరదు.” అంది రూపిణి.
“ఏమో మమ్మీ” అంటూ శ్రద్ధ బ్యాగ్ సర్దుకుని రెడీ అయ్యింది. శ్రీనివాస్ ఆఫీస్‌కి వెడుతూ స్కూల్ దగ్గర దింపుతాడు. అక్కడ ఏమి కొని డబ్బు ఖర్చు చేసి తినవద్దని ఇంట్లో అంటారు. కానీ స్కూల్ వారు అక్కడే స్టాల్ పెట్టి అందులో అమ్ముతారు, బయట ఎవరిని తిననివ్వరు. అందుకే రూపిణి వేరే బ్యాగ్‌లో మధ్యాహ్నానికి స్నాక్స్ చేసి పెట్టి పిల్లకి భర్తకి కూడా ఇస్తుంది. రూపిణి పని బద్ధకం లేదు.
పెద్దలు ఏమి చెప్పినా ప్రేమతో ఉన్నతి కోరుతూ చెపుతారు. అది కోపం కాదని గ్రహించాలి. మానవ జీవితంలో పిల్లలపై ప్రేమ తప్ప ద్వేషం ఉండదని అందరు తెలిసికొని జీవిస్తే మంచిది. చిన్నప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళు ఎంత గారం చేసినా డిసిప్లిన్‌గా ఉండాలనే చెప్తారు.
శ్రీనివాస్‌ని మీటింగ్‍కి పిలిస్తే అందరు వాచ్‌లు సరి చేసుకోవాలి. ఐదు నిముషాల ముందు కారు దిగుతాడు. కరెక్ట్ టైమ్‌కి మీటింగ్ మొదలుపెడతాడు. అందుకే అందరూ ఎలర్ట్‌గా ఉంటారు.
సమయం విలువైనది. గడచిన కాలం తిరిగి రాదు. కేవలం సంపాదన ఉంటేనే కాలం అని కాక స్వచ్ఛంద సేవలో కూడా కాలం విలువ తెలుసుకుంటే విజయాలు మీ వెంట వస్తాయి. ఇది సమయ పాలన చేసే పెద్దల సూక్తి.
కాలంతో పాటు మనము, మనతో పాటు కాలము – సదా ప్రయాణము. చిన్న ముల్లు వెంట పెద్ద ముల్లులా మన పరుగు. మరి జీవన ప్రయాణంలో ఎన్నో పదనిసలు. సరిగమల వెంట పదనిసలు ఉంటాయి.
అమ్మ నాన్న వెంట పిల్లలు ఉంటారు. వాళ్ళ స్వభావమే పిల్లలకి వస్తుంది. ఒక్కోసారి అంతర్గతంగా ఉన్న జీన్స్ కొన్ని వస్తాయి. ఇంట్లో ఎవరో ఉంటారో వాళ్ల పోలిక కూడా వస్తూ ఉంటుంది. అదే – బద్ధకం, విసుగు, చిరాకు, పరాకు వంటివి పిల్లలలో ఉంటే వెంటనే పెద్దలు మార్పు చేస్తూ వారిని పెంచాలి. లేదంటే పెద్ద అయ్యాక తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు వీళ్ళ జీవితం వీరితో పోదు. పెళ్లి అయ్యాక మగాడు భార్య మీద, ఆడది భర్త మీద ప్రభావం చూపుతూ ఉంటారు. అందుకే పెంపకం సవ్యంగా ఉండాలి. ఆ తరువాత వాళ్ళు వెళ్లిన చోట పరిస్థితి స్థితిగతులను బట్టి జీవితం ఉంటుంది. మంచి ప్రవర్తన ఎప్పుడు మంచిదే అనే భావన ఎప్పుడు సమర్థిస్తారు. అప్పుడే జీవితాలు బాగుంటాయి. మంచి అంశాలు నేర్పడంలో విజయం ఉంటుందని అభిప్రాయం వల్లే అందరు అటు సమర్థిస్తారు కదా!
***
జీవితంలో మంచి ఎప్పుడు జయాన్ని ఇస్తుంది. రూపిణి చాలా నెమ్మది అయినపిల్ల. తెలివైనది. ఇంట్లో పెద్ద వాళ్ల వెనుక అన్ని నేర్చుకున్నది. ఉమ్మడి కుటుంబం. కొంచెం పొలం ఉన్నది. తాతగారు ఆయుర్వేదం డాక్టర్. లేని వాళ్ళకి ఉచిత వైద్యం చేసి, ఉన్న వాళ్ళ వద్ద మందులకే డబ్బులు తీసుకునేవారు. ఏ పిల్ల పెళ్లి అయితేనే, చదివింపులు బహుమతులు వచ్చేవి. అవన్నీ ఆయనకి అనవసరం. అయన ధన్వంతరి, వెంకటరమణా స్వామివారిని పూజించే వారు. వైద్యం బాగా చేసేవారు.
క్షీరసాగర మథనంలో పుట్టి అమృత కలశం పట్టుకున్న ధన్వంతరి ఆయుర్వేద అధిపతి. అయితే సూర్యనారాయణ గారు గొప్ప వైద్యుడు. అందరికీ అయన దేముడు లాంటి వైద్యుడు. బాలింతలకు పాత బియ్యము ఊరగాయ. ఇచ్చి పంపేవారు. పాత బట్టలు కూడా లేని వారికి ఇచ్చేవారు. ఇలాంటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది రూపిణి.
అందరు జీవితాలు అన్ని రకాలుగా పరిశీలించింది. అందుకే పెద్దల మాట చద్ది మూట అని వింటుంది. ఇప్పటి తరం పిల్లలు అయితే పెద్దల మాట చేదుల మూట అంటున్నారు. కానీ రూపిణి మంచిగా అన్ని బాగా తెలుసుకునే చేసి పెట్టేది. పిల్ల సౌమ్యంగా ఉంటుంది, కలివిడిగా ఉంటుంది. ఒక మాట అన్నా వింటుంది. చెప్పినట్లు చేస్తుంది. తెలియక సారీ అని చెపుతుంది, ఎలా చెయ్యాలి అని అడుగుతుంది.
ఇవన్నీ చూసి నాలిక లేని మేధకురాలు, మెతక మనిషి, పెళ్లి చేసుకుని పెత్తనం చెయ్యవచ్చు అనే విచిత్ర విమర్శ వికృత విశ్లేషణ భావాలతో బంధువులు పెళ్లికి సిద్ధం అయ్యారు. పెళ్లి సంభందాలు చాలా వచ్చాయి. అంతా కావాల్సిన వాళ్ళే, కానీ చెయ్యడానికి భయమే. పిల్లని వంటలో కుక్కుతారు, అన్ని వచ్చని. అందరు కూర్చుని బాగా కబుర్లు చెపుతూ తింటారు. అందుకే భయము. ఈ రోజుల్లో భర్త అంటే భాధించేవాడు. కాన్వెంట్ గేట్స్ నేడు అన్ని చదువుల వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చే సంస్థలు. అప్పుడు చిన్న చదువులకి కాన్వెంట్ పెద్ద బియిడిల టీచర్స్ ఉండేవారు.
ఇప్పుడు ఇంజినీర్స్ ఇతర పెద్ద చదువులు అందరు కాన్వెంట్ లోనే. ఎంత చదివినా ఐ.ఐ.టీ కోచింగ్ అంటు ఎల్.కే.జి నుంచి ఐ.ఐ.టి విద్యకు ఇంజినీర్స్ టీచర్స్.
ఇలా ఉన్న పరిస్థితిని ఎవరు మార్చలేరు. మగపిల్లలు కాన్వెంట్‌లలో చేస్తే ఆడపిల్లలు సాఫ్ట్‌వేర్ అంటు పెళ్ళిళ్ళు వద్దు, మాకు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అంటున్నారు. ఇది ఎలా సాధ్యం?
పెళ్లి చేసుకునా సరే అత్తింటి వారి ప్రవర్తన నచ్చక, ఇమడామన్నా ఇమడనివ్వక వెళ్లి పోతున్నారు. నమ్మకం లేని మనుష్యులు. ఒకరితో మరొకరికి ఇలా కూడా ఇంకొకరికి పడదు.
కోడలు వస్తే కొడుకు వినడు అంటూ అత్తగారు విసవిసలు; ఆడబడుచుల సాధింపులు – ఇవన్నీ మామూలే. నిత్య జీవితంలో ఉచ్ఛ్వాసనిశ్వాసాల మాదిరి ఉంటున్నాయి.
రూపిణి పెద్దమ్మ కూతురు శోభశ్రీ ఉన్నది. పిల్ల తెలివైనది. ఎంతో బాగా పనిమంతురాలు. యుక్తవయసు వచ్చాక పిల్ల ముద్దు అనే కన్నా పని ముద్దు అంటారు. అందుకే పనిమంతురాలికి విలువ ఎక్కువ అని చెప్పాలి. ఆ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తుంటే తెలుసున్న వాళ్ళు మేము చేసుకుంటాము, పిల్లని గారంగా పెంచారు మేము అలాగే చూస్తాము అని అన్నారు. అయితే పిల్లాడు మెరైన్ ఇంజినీర్. ఆరు నెలలు షిప్‌లో ఉంటాడు, ఆరు నెలలు ఆఫీస్ వర్క్‌లో ఉంటాడు. పిల్లని ఈ ఆరు నెలలు ఎవరు చూస్తారు? పుట్టింటి వారు లేక అత్తింటి వారు చూడాలి. ఏడాది పాటు ఆలోచించారు. పెద్ద జీతం, హోదా, అంతకు తగ్గ ఆఫీస్ పని ఉంటుంది. లేనిదే జీతాలు ఊరికే ఎందుకు ఇస్తారు? అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్‌లో పోల్చితే నెలకి యాబై అరవై వేలు తెచ్చే జీతగాడు ఉదయం ఎనిమిదికి బయలు దేరి రాత్రి ఎనిమిది లేక తొమ్మిదికి ఇంటికి చేరుతాడు.
ఈలోగా ఇంటి పనులు, పిల్లల స్కూళ్ల పనులు అన్నీ భార్య చూడాలి. అందుకు చదువుకున్న పిల్లలు కావాలి. కానీ ఎటువంటి ఉద్యోగం చెయ్యకూడదు, ఇంటికే పరిమితం అవ్వాలి. ఇది నేటి రూల్స్. ఇంట్లో బావగారు తోటి కోడలు, పిల్లలు ఇద్దరు అత్త మామ అంతా ఉంటారు. కొత్త కోడలు పనులు మెచ్చుకోవాలి. “ఏమిటిది ఏముంది? ఆరు నెలలు ఇట్టే గడిస్తే యి మధ్యలో మీరు వచ్చి పిల్లని చూడవచ్చును; మా ఇంట్లో సర్వ సౌఖ్యాలు ఉన్నాయి పనిమనుషులు ఉన్నారు. మీ అమ్మాయి తిని కూర్చుని హాబీలు ఇంప్రూవ్ చేసుకోవడం; మా అమ్మ నాన్నకి మందులు ఇవ్వడం వరకే, అంతకు మించి పని లేదు” అన్నాడు పెళ్లి కొడుకు. అన్ని అతనే మాట్లాడుకున్నాడు.
సరే ఆలోచించి ఆలోచించి పెళ్లికి ఒప్పుకుని చేశారు. ఏముంది ఇంట్లో అన్ని సమస్యలు చెప్పినట్లు లేదు. వంట మనిషి వండి వెడుతుంది. ఎవరు తిన్నా వారు పెట్టుకుని అన్ని తింటారు. ఆఖరికి ఉన్న వాళ్ళకి ఏమి ఉండవు. ఊరగాయ పచ్చడి, మజ్జిగ ఇది వాళ్ల గొప్ప కబురులు. నేను వండుకుంటా అంటే వినరు. నువ్వు శ్రమ పడవద్దు అంటారు.
పెళ్లి తరువాత ఒక నెల ఉండి భర్త షిప్‌పై వెళ్ళిపోయాడు. అక్కడ శోభశ్రీ ఒకర్తి ఇంట్లో ఉన్నది. బావగారు పెళ్ళాం కలిసి ఎక్కడికో అక్కడికి భోజనాలకి పార్టీలకి వెళ్ళేవారు. పిల్లల్ని అత్త మామకి అప్పచెప్పేవారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక “శోభశ్రీ, నువ్వు వాళ్ల సంగతి చూడు” అనేవారు. వాళ్ళు మహా దిట్టలు, ఎవరికీ లొంగరు. అలాగే తిప్పలు పడేది.
ఒకరోజు అమ్మ నాన్న చూడటానికి వచ్చారు. ఆ రోజు వంటమనిషి పని చేసి వెళ్ళిపోయింది. “రండి రండి” అంటూ సాదరంగా ఆహ్వానించారు. “మీ అమ్మాయి వంట బాగా చేస్తుంది, పనిమంతురాలు” అని మెచ్చుకున్నారు. “మా వంట మనిషి బెంగాలీ ఆమె. అవే వంటలు చేస్తుంది. అది రాకపోతే మా శోభశ్రీ ఎంత బాగా వండి పెడుతుందో. రోజు అనుకుంటాము. కానీ చిన్న పిల్ల, పెద్దవాళ్ళం కూర్చుని వండించడం పద్దతి కాదు కదా, అందుకే మా వాడిని ఆ ఉద్యోగంలో వాలంటీర్‌ని పెట్టి వేరే జాబ్ చూసుకోమంటున్నాము” అన్నారు.
“మేము ఏమి చెప్పలేము. మీ ఇష్టం అండి మా పిల్లని బాగా చూడండి” అని చెప్పి పట్టుకెళ్ళిన పిండివంటలు ఇచ్చి వెళ్ళారు. ఇది మొదటి సారి పిల్ల అత్తవారి ఇల్లు పరిస్థితులు!
రెండవ సారి వెళ్ళేటప్పటికి వంట మనిషి రాలేదు అనే కంటే వీళ్ళ రిస్ట్రిక్షన్స్ పడలేక మానేసింది. ఇంట్లో యాబై చపాతీలు చెయ్యాలి, కూర చెయ్యాలి, వంట చెయ్యాలి. ఇప్పుడు అన్ని శోభశ్రీ చేస్తోంది. భర్తతో ఉండి ఆనందంగా పని చేసుకోవడం వేరు, కేవలం అత్త మామ బావగారు పిల్లల కోసం అక్కడ ఉండి వంట చెయ్యడం పద్దతి కాదు అని ఆలోచించి పుట్టింటికి తీసుకు వెళ్ళారు.
అప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని పిల్లాడు సొమ్ముతో ఇక్కడ వీళ్ళు అప్పులు చేస్తూ జల్సా చేస్తున్నారు, “మా పిల్లని ఒక నెల పంపం” అన్నారు. “అయ్యో మేము బెంగ పెట్టుకుంటాం” అన్నారు వాళ్ళు.
అయినా సరే, “అల్లుడు వచ్చాక పిల్లని సారె పెట్టి పంపుతాం” అన్నారు. విషయం గ్రహించారు అనుకుని ఊరుకున్నారు అత్తమామలు.
అల్లుడు ఫోన్ లేదు. వాళ్ళు ఏమి అబద్ధాలు చెప్పరా ఏమిటి? అసలు గడ్డు మనుష్యులు, అన్ని అబద్ధాలు చెప్పి కొడుకుని వాళ్ల వైపు మాట్లాడించారు. ఒక నెల తరువాత అత్తింటి నుంచి ఫోన్ వచ్చింది “మా కోడలు మా దగ్గరే ఉండాలి, మీ ఇంట్లో కాదు” అంటూ. అయితే అల్లుడు పెళ్లికి ముందు మిఠాయి కబుర్లు చెపుతూ పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి అయ్యాక ఒక్కసారి కూడా మామగారు అంటు ఫోన్ చెయ్యలేదు. ఎప్పుడైనా తను చేసిన బిజీ రింగ్ పెడతాడు ఎందుకో మాటలు చేప్పడే ఇందులో ఏదో సమస్య ఉన్నది అనుకున్నాడు శోభశ్రీ తండ్రి.
పిల్లని వెళ్ళవే అంటే నా భర్త వచ్చాక వెడ్తాను ఇప్పుడు వెళ్ళాను అంటుంది. ఏమిటి? అంటే ఏమి లేదు అంటుంది. ఏమిటో ఈ పిల్లలు పెళ్లికి ముందు ఒక లాగా పెళ్లి అయ్యాక ఇంకో లాగా మారి పోతున్నారు. పెద్దలు అర్థం ఎలా చేసుకోవాలి ?
శోభశ్రీ తల్లి తండ్రి ఆలోచనలో పడ్డారు. అంతా మంచివాళ్ళే, కొంచెం తెలిసినవాళ్ళే. ఎందుకో ఈ సమస్య అనుకున్నారు. సరే శోభశ్రీ తండ్రి రామానందంగారు కొంచెం ఆలోచించారు. ఇక్కడ యూట్యూబ్, మరో ప్రక్క టివి జాతకులు కూడా కుజ దోషం అంటున్నారు. పిల్లకి పాతిక రాకుండానే పెళ్లి అయ్యింది కానీ మెరైన్ ఇంజినీర్ అంటే చెరో చోట ఉన్నారు, ఇది అత్త ఇంటిలో పరిస్థితి లో ఇమడలేకపోతోంది. కుజదోషం అంటే పెళ్లి అయ్యాక విడి విడిగా ఉండటం, పిల్లలు లేక పోవడం ఒక చోట ఉన్న మాట కుదరక పోవడం, ఇవన్నీ రక రకాలుగా దోషాలు ఎన్నో చెపుతారు. కొందరికి పిల్లలున్న వినరు, పెంకి వాళ్ళుగా ఉంటారు. ఏది కుదరదు. ఇది మనస్థితిపై ఆధారం. చంద్ర ప్రభావం కూడా ఉంటుంది అని ఆలోచించి వాళ్ళకి తెలిసిన సిద్ధాంతి ద్వారా ఎన్నో దానాలు జపాలు చేసి మొత్తనికి సాధించారు.
“మీ పిల్లని మా అబ్బాయి వచ్చాక పంపండి” అన్నారు శోభశ్రీ అత్తామామలు.
అలా నాలుగు ఏళ్ళు గడిచాయి. ఒక బిడ్డ పుట్టాడు. ఇంక అల్లుడు వాలంటరీ పెట్టి వచ్చేసి వేరే బిజినెస్ పెట్టాడు.
పోనీ షిప్ లోకి తీసుకెళ్ళి ఉంటారా అంటే ఇంకా పెర్మిషన్ రాలేదు, వచ్చిన ఆ ఉప్పు నీటిలో ప్రయాణం, ఆరు నెలలు ఎలా? గడవడం కష్టం. ఎలా అని ఆలోచించి ఆడపిల్లను పెళ్లి చేసుకుని కష్టపెట్టకూడదు. సరి అయిన ఆవాసం లేకుండా జీవితం ఎలా? ఎందుకు పెళ్లి చేశారు అంటు అటు ఇటు బంధువులు దుయ్యబట్టి – ఒక పద్ధతికి తెచ్చి సంసారం సరి చేశారు. తప్పు ఒప్పుకున్నాడు అల్లుడు. దానితో రామానందం మనస్సు తేలిక పడింది.
తల్లి తండ్రి బ్రతికి వుండగానే ఆడపిల్ల జీవితం సరి చెయ్యాలి. మగపిల్లాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పిల్లల్ని కంటే సరా, వారి జీవితాలని చక్కబెట్టాలి.
ఇది ఒక గుణపాఠం రూపిణి బంధువులకు అందరికీ. ఆడపిల్లను పువ్వులా చూడాలి. అందులో కోడలు పరాయి పిల్ల. దాన్ని ఇంకా బాగా చూడాలి: ఇలా ఆలోచించే అత్తింటి వారు దొరకడం అదృష్టమే.
ఈ కళ నున్నాడో అల్లుడు రఘు కొంచెం బాగానే మాట్లాడాడు. ఏమిటి వింత లోకంలో ఎలా ఉండాలి చెప్పండి అంటూ రామానందం సిద్ధాంతితో అన్నాడు.
మనం పిల్ల జీవితాన్ని బాగు చెయ్యాలని పట్టు పట్టి బాగు చేసాం. అవును, రఘు విన్నాడు కనుక. దానికి కారణం ఒక్కటే. “నేను శోభశ్రీకి విదేశీ యోగం ఉన్నది. విదేశాలకి విజిటర్స్ విసాలో పంపుతాను. అది కొన్నాళ్ళు అక్కడ అవగాహన చేసుకుని అక్కడే ఉద్యోగం చేసుకుంటుంది. నువ్వు నీ షిప్ వర్క్ తరువాత వెళ్ళు నాయనా, మీ ఇద్దరు సుఖం కోరుతున్నాను. మా పిల్ల అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, పూజ కొద్దీ పురుషుడు అన్నాను. అదే మార్పు తెచ్చింది. ఈ లోగా పిల్లాడు పిల్లకి అన్ని కాగితాలు పూర్తి చేశాడు. దానితో అతనిలో మార్పు వచ్చింది. ఆ మార్పు కొత్త జీవితానికి నాంది అయ్యింది” అని సంతోషపడ్డాడు రామానందం.
ఇవన్నీ కూడా ఆడపిల్లల తల్లి తండ్రులకు ఒక నీతి, ఒక పాఠం అనే చెప్పాలి.
***
ఆడపిల్లలు సవ్యసాచిలా ఉండాలి అన్నారు. నిజమే. జీవితాన్ని రాగమయం చెయ్యాలి అంటే అంతా ఎంతో కాస్త పాడాలి. ఒక రాగంలో పాడటం ఒక ఎత్తు అయితే జీవితంలో ఎన్నో రాగాలతో రాగ మాలికలు సృష్టించడం ఇంకా ఎంత కష్టమో ఆలోచించండి.
రూపిణి పిల్ల శ్రద్ధ గురిచి పరి పరి విధాల ఆలోచిస్తుంది. ‘ఏదో తన అదృష్టం వల్ల భర్త చాలా యోగ్యుడు. అత్తగారు అప్పుడప్పుడు సాధిస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది’ అనుకుంది.
జీవితంలో ఆడపిల్లలు పుట్టింట గారంగా పెరిగి ఆడింది అట పాడింది పాటగా గడుపుతారు. పెళ్లి అయ్యాక ఎన్నో మార్పులు ఉంటాయి. కనుక ఆడపిల్ల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కాలేజికి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చే వరకు భయం. పెళ్లి చేసిన పిల్ల ఎపుడు వస్తుందో కూడా అసలు తెలియదు. సుఖంగా ఉంటే పర్వాలేదు, సమస్యకు పరిష్కారం ఏమిటి ఎలా చెప్పాలి ఇదే ధోరణి ఉంటుంది.
ఇదివరకు పెళ్లి చేస్తే ఆడపిల్ల భాధ్యత తీరిపోయింది అనుకునేవారు. ఇప్పుడు అది మారింది. పూర్వం పెద్దలను బట్టి పిల్లల జీవితాలు ఉంటాయి అనేవారు. ఇప్పుడు పిల్లల సంపాదన కోసం పిల్లల మాట వింటున్న పెద్దలను సరి చేసేవారే లేరు.
నేటి వ్యవస్థలో ఆరోహణలో సరిగమ ఉంటే అవరోహణలో పదనిసలు ఉంటాయి. ఇప్పుడు అన్ని పదనిసలు ఎక్కువ, అన్ని ఆరోహణలో సరిగమలు ఉన్నతి కావాలి. ఇదే జీవితంలో అశాశ్వతం, మంచితనమే శాశ్వతము. ఇంటికి వచ్చిన ఆడపిల్లకి నచ్చినట్టు కాక పోయిన సవ్యంగా జీవితం ఉండాలి, అభివృద్ధి ఆదరణ ఉండాలి.
***
పెళ్లి అంటే సిగ్గు పడి వారు మొగ్గలు మాదిరి ముడుచుకుని వెళ్లి పోయేవారు. ఇప్పుడు అసలు పెళ్లి అంటే కోప్పడుతున్నారు, విసుక్కుంటున్నారు. భయపడి పారిపోతున్నారు.
ఏమిటి భేదం? చదువు వల్ల మనుష్యులలో సంస్కారం లేదు. ఏమిటి వింత విచిత్ర మార్పు? నేటి తరంలో అమ్మాయిలు సంధించిన బాణాలు సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. భర్త అంటే గతంలో భరించేవాడు; ఇప్పుడు బాధించేవాడు. మాటలు మన్ననలు మారాయి.
రూపిణి పెళ్లి విషయంలో ఎన్నో సంబంధాలు చూశారు. కొన్ని వచ్చాయి. స్నేహితుల పిల్లలు ఉన్నారు, చేద్దాం అనుకున్నాడు తండ్రి. “ఆస్తులు, అతిగా చెప్పే గొప్పలు కాదు. పిల్లని బాగా చూడాలి. అలాంటి వాళ్ళు కావాలి. మన స్వామినాథన్ పిల్లని వాళ్ల అబ్బాయికి చెయ్యమని అడిగారు కదండీ? అమ్మ అన్నది.
“వద్దే మా స్నేహం పోతుంది”
“వాళ్ళ పిల్లాడు మాటకారి అని చాలా సార్లు చెప్పాడు.”
“అప్పుడప్పుడు మాటల్లో అనేవాడు. ఇప్పుడు చెయ్యమంటున్నారు. ఏదో చిన్నతనంలో వేరు”
“ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. ఏదో కంపెనీ మేనేజర్ కూడా”
“అది కాదు తండ్రి దగ్గర వేరు భార్య దగ్గర వేరు అని తెలుసుకోండి”
“ఆహా మీ ఆడాళ్ళు సమయానికి తగు మాటలాడెనే అంటూ పిల్ల పెళ్లి చెయ్యాలి అనే ఆరాటంలో ఇలా అంటున్నావు. రేపు పెళ్లి అయ్యాక వాళ్ళు ఏదైనా బాధపడితే ఇంక ఏమి చెయ్యగలం చెప్పు?” అన్నాడు.
“జీవితంలో పెళ్లి ఒక్కసారే. అందునా మనవి సంప్రదాయ కుటుంబాలు. కనుక చాలా ఆలోచించాలి. ఎంత ఆలోచించినా విధి రాత అస్సలు తప్పదు అని మీకు బాగా తెలుసు.”
“అవును మన పెళ్లి విషయంలో అంతే కదా”
“పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయమా? రిజర్వ్ బ్యాంక్ లో నిర్ణయమా? విధి వల్ల నిర్ణయమా? మన ప్రజ్ఞ వల్ల నిర్ణయమా?”
“సమయం వచ్చిందని సాధించకు. ఏదో అలా జరిగింది. అయినా నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను కదా”
“మరి అదే చెప్పేది, రాత అది”
~
పెళ్లి విషయంలో అమ్మమ్మ అయినా మేనత్త అయినా సరే దగ్గర బంధువులు ఎవరైనా సరే డబ్బు విషయంలో ఎక్స్‌క్యూజ్ ఉండదు. పిల్ల మంచిదే కానీ వాళ్ల ఇల్లు బాగుండదు. ఇప్పుడే అంతా మంచి నీట్‌గా ఇల్లు ఫర్నీచర్ ఉండాలి. చక్కగా మెత్తని పరుపులు కుర్చీలు ఉండాలి. వెళ్లినప్పుడు అయినా ఎంతో బాగా చూసుకోవాలి.
“ఏమిటి పాతకాలం ఇల్లు? ఒక మంచి కుర్చీ లేదు. అన్ని పాత సామాన్లు ఉన్నాయి. పిల్లాడు ఏమి సుఖ పడతాడు అన్నయ్యా?” అన్నది చెల్లెలు.
“నా కూతురు నీ ఇంటికి వస్తుంది. అంతే కానీ నీ కొడుకు నా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు కదా. పిల్లని బాగా చూసుకో, నీకు మాత్రం ఏమంత గొప్ప ఇల్లు ఉన్నది?”
“ఆహా అలాగే నువ్వు నన్ను ఏమి ఉందని అప్పుడు పెళ్లి చేశావు? ఇప్పుడు అలా అంటున్నావు? నీ కూతురు సుఖపడాలి, చెల్లెలు సామాన్యంగా ఉండాలి. అంతేకదా అన్నయ్యా?”
“అప్పుడు చెల్లెలికి సారె లేదు. ఇప్పుడు కూతురుకి అన్ని నువ్వే పెట్టి పంపుకో. ఇల్లు కూడా మంచిది కొని ఇయ్యి” అన్నది చెల్లెలు.
దానితో, ముందు ముందు కూడా నిత్యం ఇలాగే గొడవ పెడుతుందో ఏమో అంటూ రూపిణి భయపడింది. అత్తయ్యకి నోరు ఎక్కువ అన్నది.
ఇలా తల్లి తండ్రి రూపిణి ఆలోచిస్తున్నారు. ‘సరేలే. దీనికు రాసిన వాడు వాడే అవుతాడు’ అనుకున్నారు. అలా రూపిణి పెళ్లి విషయంలో అయిన వాళ్ళకి భయపడి ఎవర్నీ చెయ్యలేదు. కానీ పై వాళ్ళు పైకి బాగానే ఉంటారు, చేసుకున్నాక వాళ్ల విద్యలు విషయాలు బయటికి వస్తాయి. ఇలా ఎంతో మంది అయినవాళ్ళని వదిలినా మంచి వాళ్ళు వస్తారనే నమ్మకం ఉన్నది.
ఎన్ని సంబంధాలు వచ్చిన కుదరడం లేదు – వాళ్ళకి నచ్చినా పిల్ల భయపడటం వల్ల. ఎంతో గొప్ప సంబంధాలు వచ్చాయి, విదేశీ సంబంధాలు వచ్చాయి. ఎవరు కుదరడం లేదు. రూపిణికి ఫాస్ట్ కల్చర్ ఇష్టం ఉండదు.
సరే మన సొమ్ము దాని చాకిరీ ఎవరికీ రుణం ఉన్నదో వాళ్ళే అవుతారు అనుకున్నారు తల్లిదండ్రులు.
అలా ఒకసారి రూపిణి తండ్రి బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ దగ్గరకి వెళ్ళి డిపాజిట్ విషయం మాట్లాడితే – డబ్బు బాండ్‌గా వెయ్యడంలో ఎన్నో విషయాలు చెప్పి “మీరు ఇలా వేస్తే రెట్టింపు అవుతుంది ఇంటరెస్ట్ ఎక్కువ వస్తుంది” అని చెప్పి డబ్బు వేసే విధానంలో మెళుకువలు చెప్పాడు. అప్పటికి శ్రీనివాస్ అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే.
మాటల్లో “నీ భార్య కూడా ఉద్యోగం చేస్తున్నారా?” అని అడిగితే, “అబ్బే నాకు పెళ్ళి కాలేదు. ఉద్యోగం చేసే పిల్ల వద్దు సర్. పెద్ద వయసు అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళని చూడాలి. ఒక్కడే కొడుకు నేను” అన్నాడు.
“అలాగా బాబు సరే” అన్నాడు రూపిణి తండ్రి.
ఆ తరువాత వివరాలు అడగడంలో ఒక అక్క పెళ్లి కి ఉన్నదని చెప్పాడు. ఆమె డాక్టర్ చదివింది. దానికి నచ్చడం లేదు అన్నాడు శ్రీనివాస్.
“సరే బాబు మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి” అని అడిగి తీసుకుని – అలా ప్రొసీడ్ అయ్యి వాళ్ల ఇంటికి వెళ్ళి సంబంధం చెప్పారు. కాలం కలిసి వచ్చింది. శ్రీనివాస్ వాళ్ళ అక్కని తన ఫ్రెండ్ అన్న గారు చేసుకుంటాను అంటే అతనికి అన్ని కుదిర్చి చేశారు. రూపిణి సంబంధం చెప్పిన వేళ మంచిది అని ఆనందపడి పెళ్లి చేశారు. అలా విధి రాత ప్రకారం జరిగిపోయింది. ఇండియాలోనే ఉన్నది. అది చాలు. ఆకాశానికి ఆర్రులు చాచే నిచ్చెనలు వేసే
ప్రయత్నం చేయలేదు. పరిగెత్తి పాలు కాదు నిలబడి నీళ్ళు తాగే స్వభావం కలది రూపిణి. పిల్లల మనస్తత్వం అనుగుణంగా పెళ్లి చెయ్యాలి.
కాలక్రమంలో శ్రద్ధకి తల్లి అయ్యింది. అయితే ఒక్కోసారి పెద్దల గుణాలు అన్నీ పిల్లలకి రావాలి అనీ లేదు.
***
స్కూల్‌లో కార్తీక మాసం పిక్నిక్ ఉన్నది, వెళ్ళాలి అన్నది శ్రద్ధ. “అవసరం లేదు. మా బ్యాంక్ వారి పిక్నిక్ అదే రోజు ఉన్నది. దానికి తీసుకు వెడతాను. అందరం వెళ్దాం” అన్నాడు శ్రీనివాస్. శ్రద్ధకి కొంచెం కోపం వచ్చింది. “ఎప్పుడు ఇంతే, నాన్న ఒప్పుకోరు, పిల్లలతో ఆటలు సరదాలు వేరే. మీతో వస్తే వేరు. అన్నీ ఆంక్షలు” అన్నది. “అయినా సరే మాతోనే రావాలి” అని కూడా తీసుకు వెళ్ళారు.
అక్కడ ఉదయం ఉసిరి చెట్టు పూజ శ్రీ సత్యనారాయణ వ్రతము శ్రీ వేంకటేశ్వర దీపారాధన చేశారు స్టాఫ్‍లో వయసులో పెద్ద వాళ్ళు. అంతా చక్కగా జరిగింది. మంచి అల్పాహారం, సత్యనారాయణ స్వామి ప్రసాదం, చక్ర పొంగలి కట్టు పొంగలి, ఇడ్లి, గారె రెండు రకాల పచ్చళ్ళు ఘనంగా ఉన్నది.
ఆ తరువాత చిన్న మీటింగ్, హౌసీ ఆడారు. పిల్లకి పాటల పోటీలు, మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి, నిమ్మకాయ ఆట – ఇలా ఐదు రకాల ఆటల పోటీలు జరిగాయి. అందరు సినిమా పాటలు పాడితే శ్రద్ధ మాత్రం శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన – ‘కులుకక నడవరో కొమ్మ లాలా’ పాడింది. మరి ఈ పాటకు మొదటి బహుమతి వచ్చింది.
ఇంకో పిల్ల ‘కన్నులతో చూసేది’ అంటు జీన్స్‌లో పాట పాడింది. ఇంకో పిల్ల ‘చిన్ని చిన్ని ఆశా’ పాడింది. అలా మూడు బహుమతులు వచ్చాయి.
పాల్గొన్న పిల్లలు అందరు స్టాఫ్ పిల్లలే. ఓ పదిహేను మంది ఉంటారు. శ్రీనివాస్ ప్రోగ్రామ్ చివరలో అందరికీ ప్రత్యేకంగా మిల్టన్ కంపెనీ టిఫిన్ బాక్లు తెప్పించి ఇచ్చాడు. అవన్నీ కూడా శ్రద్ధ చేత ఇప్పించాడు.
“మనం బహుమతి పుచ్చుకోవడం ఆనందం పొందుతాం, మరి ఇవ్వడంలో కూడా ఆనందం ఉంటుంది అన్నారు. అవునా శ్రద్ధా?” అడిగాడు శ్రీనివాస్.
శ్రద్ధ చాలా ఆనందించింది. “చూసావా, మాతో వచ్చావు కదా, బాగుందా?” అన్నాడు తండ్రి.
“అవును” అని మెలికలు తిరిగింది.
ఆడపిల్లలు ఎప్పుడు అపురూపం. తండ్రి చెపితే వింటారు. తల్లి చెపితే నీకేమి తెలుసు మమ్మీ అంటారు. పెద్ద వాళ్ళు చెపితే వాళ్ళలా మేము ఎలా ఉంటాము అంటారు. ఫ్రాయిడ్ అనే మానసిక శాస్త్రవేత్త సిద్దాంతం ప్రకారం తల్లి కొడుకుని ప్రేమగా పెంచుతుంది వాడి పైనే ఆశలు పెంచుకుంటుంది.
తండ్రులు ఆడపిల్లల పై శ్రద్ధా, ప్రేమ చూపుతారు. “పాతిక ఏళ్ళు వస్తే పరాయి పిల్ల అవుతుంది, మనం పెళ్లి చేసే వరకు గార్డ్స్ మాదిరి చూడాలి. వాళ్ళకి నచ్చినట్లు కాకపోయినా మన సమర్థత కొద్దీ పెంచాలి. అన్ని ఇచ్చి పంపాలి లేదంటే అత్త ఇంట్లో విలువ ఉండదు కదా” అంటారు.
అంతా ధనం మూలం ఇదం జగత్. మరి కన్య దానం వరకు అన్ని చూడాలి శ్రద్ధ జీవితాన్ని!
కూతురిని భార్యభర్తలు ఎంతో పద్ధతిగా పెంచారు. ఒక్క పిల్ల. చదువు, సంస్కారం ఉన్నది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చదివింది. రిజర్వు బ్యాంక్ లాంటి సొమ్ము ఉన్నది.
ఎవరు పూజలు చేస్తున్నారో ఎవరికీ తెలుసు? మంచి భర్త వస్తాడని ఆశిద్దాం. దీవిద్దాము, మరి మీరు దీవించండి!