అమ్మణ్ని కథలు!-9

0
3

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

యాడ జూసినా అమ్మణ్నే!!

[dropcap]మా[/dropcap] ఊరు కొంచెం పట్నవాసపు లక్షణాలూ, చాలా పల్లెటూరు పద్ధతులూ కలిగిన పెద్ద ఊరు. తాలూకా హెడ్ క్వార్టర్స్ కావడంతో చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా వుండేది.

పెద్ద గవర్నమెంటాసుపత్రి వుంది. చాలా పెద్ద స్థలంలో విశాలంగా, పరచుకున్నట్టుగా వుంటుంది. బ్రిటిష్ వాళ్ల నిర్మాణ పద్ధతిలో, బంగాళా పెంకుల కప్పు, చుట్టూ విశాలమైన వరండా, కాస్త దూరంలో కొత్తగా కట్టిన రోగుల వార్డులు, గదులు వుండేవి.

నాకు, నా స్నేహితురాళ్లకూ పొద్దుపోనప్పుడల్లా ఏదో ఒక నొప్పి అని చెప్పి, ఆస్పత్రికి పోయి అక్కడ డాక్టరు ఎవరు, యేం చేస్తున్నారు, పాత డాక్టరు మంచివాడా? లేదా కొత్త డాక్టరు మంచివాడా.. లాంటి ఆరాలన్నీ తెలుసుకుని రావడం అలవాటు.

లేదా ఎవరికి ఒంట్లో బాగా లేకపోయినా వాళ్లకు తోడు కోసమని స్నేహితురాళ్లందరం ఆస్పత్రికి రెడీ అయ్యేవాళ్లం! అప్పట్లో ఆడపిల్లలు ఒంటరిగా, తోడు లేకుండా ఎక్కడికైనా పోవడం నిషిద్ధం!

ఒకరోజు నా స్నేహితురాలు శాంత, “అమ్మణ్నీ.. నాకు తోడు వస్తావా? ఆస్పత్రికి పోదాం. నాకు దగ్గు వస్తా వుంది” అన్నది.

నిజానికి నాకూ దగ్గు మొదలైంది రెండ్రోజుల నించి. నాకు సంవత్సరానికి రెండుమూడు సార్లయినా పెద్ద యెత్తున దగ్గు వస్తుంది. అప్పుడు ఆస్పత్రికి పోవడం, డాక్టరు మందులివ్వడం, త్రోట్ టచ్ చేయించుకోమని చెప్పడం మామూలే!

అమ్మ ఆస్పత్రికి పోయిరమ్మనింది.

మా ఊళ్లలో మా పనులన్నీ మేమే చేసుకోవాల. ఒంట్లో బాగాలేకపోతే మేమే ఆస్పత్రిలో చూపించుకోవాల. అంతంతమంది పిల్లలుంటే తల్లిదండ్రులు ఎక్కడికని చేస్తారు పాపం?

మరీ శ్రుతిమించితే మల్లికార్జునరావు డాక్టరు దగ్గరికి తీసుకెళ్తారు. లేదా ఆయనే ఇంటికి వొస్తారు. అప్పట్లో ఆయన మా వూళ్లోని ఏకైక ప్రైవేటు డాక్టరు.

ఆస్పత్రిలో జనం బాగానే వున్నారు. డాక్టరుకు ఒక పక్కన ఆడవాళ్లూ, మరో వైపు మొగవాళ్లూ నిలుచుకున్నారు.

మేమిద్దరం ఆడవాళ్ల గుంపులో నిల్చుకున్నాము.

ఆస్పత్రిలో వుండే ‘పుల్లింగ్ పంఖా’ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడున్నంతసేపూ అదెలా పనిచేస్తుందా.. అని గమనిస్తూ వుంటాను.

ఒక వెడల్పాటి కర్రకు మందపాటి గుడ్డను కుచ్చులు కుచ్చులుగా పెట్టి బిగించి వుంటారు. ఆ చెక్కకు ఒక తాడుకట్టి, తాడును ఒక గిలకకు అమర్చి వుంటారు. ఒక మనిషి ఆ తాడును లాగుతూ కూర్చుని వుంటాడు. ఆ చెక్క కదులుతూ ఆ కుచ్చుల గుడ్డను ముందుకూ, వెనిక్కీ కదిలిస్తూ వుంటుంది. దాని వల్ల గాలి వస్తుంది. ఆ పంఖాను లాగే అతనిని ‘పంఖా పుల్లర్’ అంటారట.

అప్పటికి మా వూరికి కరెంటు వచ్చినా ఆ పంఖా పుల్లర్ ఉద్యోగం పోతుందని పంఖాను అలా కొనసాగిస్తున్నారట.

ఆ విషయంలో నాకు అనుమానమొచ్చి “సీలింగ్ ఫాన్ వేసుకోవచ్చు కదా.. కరెంటొచ్చినా ఈ పంఖా ఎందుకు వాడడం?” అని కాంపౌండర్‌ను అడిగితే పై విషయం చెప్పాడు.

అయినా మా వూళ్లో కరెంటు ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు? దానికంటే పంఖా వుంచుకోవడమే నయమని సమాధానపడ్డాను. నాకు ఏదైనా సందేహం వొచ్చిందంటే తెలుసుకునేదాకా ఎవరినో ఒకరిని అడుగుతూనే వుంటాను మరి! మరి డవుటు అట్లనే వుండిపోతే నిద్రెట్లా పడుతుందీ?

మా తాతగారికి కూడా అలాంటి పంఖా వుండేదట. కరెంటు వచ్చాక దాన్ని తీసేశారట. దానికి గుర్తుగా ఒక చిన్న గిలక మాత్రం మిగిలింది మా యింట్లో.

అప్పుడు డా. వహాబ్ అని ఒక డాక్టరు వుండినారు మా ఊరి ఆస్పత్రిలో.

ఇంతలో మగవాళ్ల వైపు మా వూళ్లో బుగ్యాల (బజ్జీలు) దుకాణం కామయ్య శెట్టి ముందుకు వొచ్చి, “దగ్గుతో మా శానా బాదగా వుంది డాక్టరయ్యా.. మంచి మందియ్యవా? నీకు పుణ్యముంటాది (అక్కడ ఏకవచన ప్రయోగం నిషిద్ధమేం కాదు). నీకు సాయంత్రం బుగ్యాలు (బజ్జీలు) పంపిస్తాలే డాక్టరయ్యా.. ఇక్కడికి తెచ్చియ్యమంటావా? నాకైతే మంచి మందు ఇయ్యి” అని డాక్టరును వేడుకుంటున్నాడు.

అతని మాటలకు అందరూ నవ్వినారు.

డాక్టరు నవ్వుతూ అతని వైపు తలెత్తి చూసి,

“ఆమైన బుగ్యాలు తింటే, రోజంతా నూనె వాసన పీలిస్తే దగ్గు రాకుంటే యేమొస్తది? బుగ్యాలు ఆస్పత్రి కెందుకు.. ఇంటికి పంపిచ్చు. మా బేగమ్ ఇంట్లో వుంటాది కదా? సరే, ఈ మందులు పొద్దున, రాత్రి యేసుకో” అని అతనికి మందులిచ్చి మా వైపు చూసినాడు డాక్టరు.. విషయం యేమిటన్నట్టు..

చెప్పినాము మా దగ్గు సమస్య గురించి.

ఆయన నన్నూ, శాంతనూ పరీక్షించి, “త్రోట్ టచ్ చేయించు కోండి. మిక్స్చర్ పోయించుకోండి. ఈ మాత్రలు వేసుకోండి పొద్దునొకటీ, సాయంత్రం ఒకటీ మూడురోజులు..” అని చెరో తెల్లకాయితంలో మాత్రలు వేసి ఇచ్చినారు. మా తాతగారి గురించి అడిగినారు. నేను తాతగారి అనారోగ్యం గురించి చెప్పినాను. సరేనన్నట్టు తల పంకించినాడు ఆయన.

మేము ఆయనకు నమస్తే చెప్పి పక్కకొచ్చాము.

మేము మాతో తీసికెళ్లిన గాజుసీసాల్లో కార్మినేటివ్ మిక్స్చర్ (అప్పట్లో గవర్నమెంటాసుపత్రుల్లో ఇచ్చేవారు. కొంచెం ఘాటుగా, కొద్ది తియ్యగా వుండేది) పోయించుకున్నాము కాంపౌండర్ దగ్గర.

త్రోట్ టచ్ చేయించుకోవడం కోసం ఆయా నాగలక్ష్మి దగ్గరకు పోయినాము. ఆమె ఎప్పుడూ ధుమధుమలాడుతూ వుండేది.

నన్ను చూసి, “వొచ్చినావా తల్లీ? దసరా పండగ కదా! బచ్చాలు, స్వీట్లు బాగా పెట్టిందేమో కదా మీయమ్మ.. నేతులు పోసుకోని తింటారు ఈ బాపనోళ్లు.. దగ్గు లెయ్యమంటే లెయ్యదా?” అంటూ “నోరు తెర్సు!!” అని విసురుగా, విదిలించినట్లుగా అని, ఒక పెద్ద వెదురు పుల్లకు దూదిచుట్టి, దాన్ని గ్లిజరిన్‌లో అద్ది, నా గొంతులో చుట్టూ పూసింది. అదీ అన్నమాట త్రోట్ టచ్ చేయడం అంటే!

అయితే నాగలక్ష్మి మాటలు ఎంత కరుగ్గా వున్నా, ఆమె నా గొంతులో పూసిన గ్లిజరిన్ అంత చల్లగా, తియ్యగా నా దగ్గుకు ఉపశమనంగా గొంతులోకి జారింది. నన్ను ఆవిడ విసుక్కున్న తీరు ఒంటిమీద వాలిన పురుగును దులిపి వేసినట్టుగా అనిపించింది. నా అహం మీద దెబ్బతగిలింది. గవర్నమెంటు జీతాలు తీసుకుంటూ పేషెంట్లపైన అంత విసుగెందుకో.. అర్థం కాదు. తిరగబడి మాట్లాడాలనిపించింది కానీ, చిన్నపిల్లను కదా.. యేం మాట్లాడాలో, యేం మాట్లాడితే యేమి తప్పు నా పైకి వొస్తుందో.. యేమోనని భయం! పెద్దవాళ్లను ఎల్లవేళలా గౌరవంగా చూడాలనే బోధ ఒకటి ఇంట్లో నిరంతరం సాగుతుంటుంది. దానివల్ల యేమీ మాట్లాడలేదు. అయినా ఆమెను శిక్షించకుండా వదిలేయాలనిపించలేదు. మనసులోని అసమ్మతి నంతా కళ్లలోకి తెచ్చుకుని ఒక్క తిరస్కారపు చూపు చూసినాను. అలాంటివి నాగలక్ష్మికి లెక్కా జమా వుండవనిపించింది, ఆమె మొహాన్ని చూస్తే! ఒక్క క్షణం ఆశ్చర్యపడినట్టు చూసి, మళ్లీ మామూలయిపోయింది.

శాంతకూ అలాగే విసుక్కుంటూ గ్లిజరిన్ ను పూసింది నాగలక్ష్మి .

పెద్దవాళ్లు వెంట లేకుండా పిల్లలే ఆస్పత్రులకు పోతే వాళ్లను ఎవరూ లెక్కజెయ్యరు. ఈసడిస్తూనే మాట్లాడతారు. అవన్నీ లెక్కజెయ్యకుండా మన పని మనం చేయించుకోని రావాలని ఆ వయసుకే నాకు బోధపడింది.

ఆస్పత్రి నించి తిరిగి వొచ్చేటప్పుడు అమ్మ డా. వహాబ్ గారింటికెళ్లి ఆయన భార్యనూ, పిల్లలనూ మా బొమ్మల పేరంటానికి రమ్మని పిలవమని చెప్పింది. వాళ్లు బొట్టు పెట్టుకోకపోయినా ఫరవాలేదు, ఊరికే వొచ్చి బొమ్మలు చూసి పొమ్మని చెప్పమని చెప్పింది అమ్మ.

నేను శాంతతో పాటు వాళ్లింటి కెళ్లాను. వాళ్ల ఇల్లు ఐదుల్యాంపుల దగ్గరే!

ఐదుల్యాంపులు అనేది మా ఊరిలో ఒక సెంటర్ పాయింట్. నాలుగు రోడ్ల కూడలి.

కరెంటు లేని కాలంలో అక్కడ ఐదు పెద్ద కిరోసిన్ దీపాలను ఆ సెంటర్‌లో పెట్టేవారు. అందుకే దానికా పేరు వొచ్చింది.

వహాబ్ గారి భార్య నన్ను ఆదరంగా పలకరించి కుర్చీలో కూర్చోబెట్టింది. అమ్మ గురించి, అక్కావాళ్ల గురించీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది.

ఆమె తెల్లగా, అందంగా వుంది. ఖరీదైన సిల్కుచీర కట్టుకుంది.

మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో అయితే నూలు చీరలూ, బయటికెళ్తే పట్టుచీరలూ కట్టుకుంటుంది. ఇలాంటి అందమైన సిల్కుచీర అమ్మ కట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు.

ఏవో స్వీట్లు తెచ్చియిచ్చింది. తినమని ప్రేమతో బతిమిలాడింది. నాకు నోరూరింది.

కానీ, అలా వేరే కులాల, మతాల వాళ్ల ఇళ్లలో తింటే మా కులం పోతుందని మా పెద్దమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘అమ్మో.. నా కులంపోతే ఎట్లా?’ అని నాకు భయం వేసింది.

కానీ, వాళ్ల ముందు అట్లా చెప్పకూడదు కదా..అందుకే

“దగ్గు బాగా వుందనీ, స్వీట్లు తింటే ఎక్కువవుతుందనీ” చెప్పి, తప్పించుకున్నాను.

చెరో అరటిపండు చేతిలో పెట్టింది ఆవిడ.

ఇంతలో వాళ్ల అమ్మాయిలు మేడ మీది నించి దిగి వొచ్చినారు. వాళ్లు నాకంటే చాలా పెద్దవాళ్లు. గులాబీరంగు, పసుపు, ఆకాశనీలం రంగు లంగాలు, ఓణీలు వేసుకున్నారు. ఎంత తెల్లగా వున్నారంటే.. ఆ బట్టల్లో వాళ్లు దేవకన్యల్లా వున్నారు.

మా అమ్మకు ఆ రంగులు అసలు నచ్చవు ఎందుకో! మాకు కొననే కొనదు.

నేను పెద్దయ్యాక, పెళ్లి అయి స్వతంత్రం వొచ్చాక అలాంటి రంగుల బట్టలు కొని కట్టుకోవాలని మనసులోనే నిశ్చయించేసు కున్నాను.

ఆ అమ్మాయిల పేర్లు షహీదా అక్తర్, వహీదా అక్తర్, రషీదా అక్తర్ అట.

పరిచయాలయ్యాక ‘దసరాకు మా ఇంట్లో బొమ్మలు పెట్టినామనీ, వొచ్చి చూసిపొమ్మనీ’ పిలిచాను. వాళ్లు వొస్తామన్నట్టుగా తలలూపారు.

డాక్టరు గారి భార్య నేను కూచున్న కుర్చీమీద చేతులు వేసి, నాపైకి ఒంగి,

“అమ్మణ్నీ! నేను యాడికీ బయటకు రాను. నాకు ఘోషా ఎక్కువ. డాక్టర్ సాబ్ నన్ను యాడికీ అంపించడు. మా పిల్లలను అంపిస్తానని అమ్మకు చెప్పు” అని అనునయంగా అన్నది డాక్టర్ గారి భార్య. సరేనన్నాను నేను.

వాళ్లతో ఆదరంగా మాట్లాడి ఇంటికి ఒచ్చేశాము నేనూ, శాంత.

మేము బయటికి వొస్తుంటే డాక్టర్ వహాబ్ ఇంట్లోకి వొస్తున్నారు. నన్ను చూసి అభిమానంగా నవ్వారు ఆయన. ఆవిడ నేను వొచ్చిన కారణం చెప్పింది ఉర్దూలో. ‘ఓహో’ అన్నట్టు తలూపి, నా తలపైన చేత్తో చిన్న దెబ్బ వేసి లోపలికి వెళ్లిపోయినారు.

ఇంటికిపోయి అమ్మకు అన్ని విషయాలూ పూసలో దారమెక్కించినట్టు చెప్పినాను. నాగలక్ష్మి అన్న మాటలతో సహా. అమ్మ “ఆ నాగలక్ష్మికి పొగురెక్కువ. అదెప్పుడైనా కనబడనీ.. దాని పీడాజెష్టా విడిపిస్తాను” అని వ్యాఖ్యానించింది.

మా అమ్మ ఇంట్లో నించి బయటకే రాదు. నాకేమో ఇంట్లో వుంటే తోచదు. మా అమ్మ నాగలక్ష్మిని ఎప్పుడు కలుస్తుందా.. ఎప్పుడు ఆమె పీడాజెష్టా విడిపిస్తుందా.. అని ఆలోచిస్తూ ఆటల్లో పడిపోయాను.

సాయంత్రం నాలుగు గంటలవేళ డా. వహాబ్ మా తాతగారిని చూడటానికి వొచ్చినారు. మా తాతగారికి పెద్దవయసు కదా.. ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వుంటూ వుండేది. డాక్టరు గారికి కాఫీ ఇచ్చి రమ్మని మిద్దెమీదికి నన్ను పంపించింది అమ్మ.

తాతకూ, నాయనకూ, డాక్టరుకూ ప్లేటులో కాఫీ గ్లాసులు పెట్టుకోని, పైకెళ్లి మా తాతగారి గదిలో కూర్చున్న వాళ్లు ముగ్గురికీ కాఫీ ఇచ్చినాను. కాఫీ గ్లాసు చేతిలో పట్టుకొని, తల ఓ పక్కకు వొంచి, కళ్లు తమాషాగా పెట్టి, నా వైపు చూస్తూ..

“ఇదుగో.. ఇంగ జూడండి.. శాస్తిరీ సాబ్! ఇదో మళ్లీ యీడ కూడా మీ అమ్మణ్నే కానొచ్చింది. యాడ జూసినా మీ అమ్మణ్నే వుంటాది శాస్తిరి సాబ్! పొద్దున ఆస్పత్రికి పోతే ఆడికీ అమ్మణ్నే వొచ్చిందీ దోస్తును తీసుకోని!

ఆస్పత్రి నించి మా ఇంటికి పోతే ఆడా అమ్మణ్నే వుండాది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా గదా.. ఈడా అమ్మణ్నే ఎదురైంది. ఎట్లబ్బా యాడికి బోయినా ఈ అమ్మణ్నే వుంటాదే! ఎట్ల జెయ్యాలె? ఏం జెయ్యాలె?” అంటూ యేదో పేద్ద జోక్ వేసినట్టు పకపకా నవ్వాడు ఆయన. నాకు కొంచెం బాధ, కోపం, సిగ్గూ వచ్చినాయి.

“మా అమ్మణ్నికి వాళ్లమ్మ ‘పెత్తనాల పేరిందేవి’ అని పేరు పెట్టింది డాక్టర్ సాబ్. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ వుంటుంది. ఊరంతా తిరుగుతుంటుంది. చిన్నపిల్ల గదా! అంతేకాదు.. రోజూ బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ వుంటుంది.. వాళ్ల చెల్లెలితో కలిసి..! చాలా యాక్టివ్ గర్ల్.. ఆడుకోనీయండి.. మన దగ్గరున్నప్పుడే కదా ఆడపిల్లలు స్వేచ్ఛగా వుండేది. పెండ్లయి అత్తగారిళ్లకు పోయినాక యేమి స్వతంత్రముంటుంది వాళ్లకు?” అని తానూ నవ్వినారు మా నాయన.

తాత నవ్వలేదు. మౌనంగానే వున్నారు. మనవరాలి గురించి డాక్టరుగారు అట్లా మాట్లాడ్డం నచ్చినట్టులేదు. కొంచెం చురచుర చూస్తున్నారు డాక్టరు వైపు.

“రోజూ బొమ్మల పెండ్లిండ్లు చేస్తాదా అమ్మణ్ని? నాకు ముగ్గురు ఆడిబిల్లల పెండ్లిండ్లు ఎట్లా చెయ్యాల్నా అని దిగులుపట్టుకుంది శాస్తిరీ సాబ్! మా ముస్లిమ్ లలో సదువుకున్నోళ్లు, పెద్ద వుద్యోగస్తులు దొరకడం లేదు. దొరికితే శానా పెద్ద కట్నాలు అడుగుతా వున్నారు గాడ్ది కొడుకులు! ఇక్కడ జూస్తే అమ్మణ్నేమో రోజూ తన బొమ్మలకు పెండ్లి చేస్తాది! మా బొమ్మలకు నేనెప్పుడు జేస్తానో నిఖాలు! అమ్మణ్నీ యు ఆర్ సో లక్కీ! రోజూ నీ బొమ్మలకు పెండ్లి చేస్తావు!” అన్నాడు డాక్టర్ విరక్తిగా నవ్వుతూ.

“దేవుడి దయతో అన్నీ బాగా జరుగుతాయిలెండి.. దిగులుపడకండి..” అని డాక్టరుకు ధైర్యం చెబుతున్నారు నాయన.

నా బొమ్మల పెండ్లిండ్ల గురించీ, నా ఆటల గురించీ మాట్లాడినందుకు నాకు కొంచెం చిరాకు, చాలా కోపం వొచ్చి విసవిసా దిగివొచ్చేసినాను.

అందరికీ అన్ని పనులూ నేనే చెయ్యాల. కానీ అందరూ నన్నే అంటారు.

డాక్టరు గారింటికి పోయి చెప్పమన్నదీ అమ్మే! దగ్గు వొస్తే ఆస్పత్రికి పొమ్మన్నదీ అమ్మే! ఇప్పుడు కాఫీలు ఇచ్చిరమ్మన్నదీ అమ్మే! నా తప్పేముందో అర్థం కాలేదు నాకు!

నేను రెండుమూడు చోట్ల ఒకరోజు వరుసగా కనిపించినంత మాత్రాన నేను రోజల్లా రోడ్డు మీద తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఈ డాక్టరు.. అని కొన్ని శాపనార్థాలు పెట్టాను.. మనసులోనే.

అయినా ఈ పెద్దవాళ్లందరూ ఇంతే! పిల్లలను వాళ్ల ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారు. కారణం లేకుండా విసుక్కోవడం, తేలికచెయ్యడం నాకు అస్సలు నచ్చదు.

వాళ్లకు మనతో పనుంటే మాత్రం చక్కగా బుజ్జగిస్తారు. లేదంటే అనవసరంగా కోపం ప్రదర్శిస్తారు.

నేనైతే నా పిల్లలను చచ్చినా ఇట్లా తేలిక చెయ్యను. మర్యాదగా, ప్రేమగా, గౌరవంగా చూస్తాను. వాళ్ల మనసుకు బాధ కలగకుండా పెంచుతాను.. అని మనసులో నిశ్చయించుకున్నాను.

నా పిల్లలను ఎట్లా పెంచాలా.. అమ్మావాళ్లు చేసిన తప్పులు నేను ఎట్లా చెయ్యకుండా వుండాలా.. పిల్లల మనసులు తెలుసుకోని ఎట్లా ప్రవర్తించాలా.. అని మా హాల్లో స్తంభాన్నానుకుని కూర్చుని ఆలోచనలో పడిపోయాను కొద్దిసేపు!

ఇంతలో వెనకనించి వొచ్చి భాగ్య కళ్లు మూసింది.

“ఏయ్! భాగ్యా.. వొదులు.. నువ్వు రావడం చూసినాలే!” అంటూ భాగ్య చేతులు వొదిలించుకున్నాను నేను.

“పదా.. ఆడుకుందాం!” అన్నది భాగ్య.

ఇద్దరం ఆటల్లో పడ్డాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here