కలవల కబుర్లు-46

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]అ[/dropcap]ప్పట్లో.. అంటే మా రోజుల్లో అన్నమాట..

నెలవారీ సరుకులు కొనాలంటే, కావలిసిన సామాన్లు లిస్టు కాయితం మీదనో లేదా ఖాతా పుస్తకంలోనో రాసుకుని పచారీ కొట్టుకి వెళ్లి, షావుకారుకి ఇస్తే.. ఆయన ఒకటొకటీ చదవడం, కొట్లో కుర్రాడు వాటిని పొట్లం కట్టి, పురికోసతో పేక్ చేయడం జరిగేది. ఈ లోగా మనం అక్కడ గోతాంలో కనపడిని వేరుశెనగపప్పులో, అటుకులో నోట్లో వేసుకుని పరపరలాడిస్తూ, షావుకారుతో కబుర్లు చెపుతూ కూర్చునే వాళ్ళం. ఎప్పుడూ వాడుకగా వెళ్ళే కొట్టే కదా! అరువు కూడా ఇచ్చేవారు. ఖాతా పుస్తకంలో కొంత సొమ్ము ఇచ్చి జమ రాయించుకునేవాళ్ళం.

చిన్న చిన్న జీతాలయినా కూడా ఎలాగోలా నెట్టుకొచ్చేసేవాళ్ళం. ముందుగా ప్రతీదీ వాటి ఖరీదులు అడిగి.. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకునేవాళ్ళం. ఎంత అరువు ఇస్తే మాత్రం.. ఖరీదు ఎక్కువవీ, అనవసరమైనవీ కొనడం మాత్రం చేసేవారే కాదు.

చూసి చూసి ఖర్చులు పెట్టుకోవడం, దుబారా లేకపోవడం వుండేది. ఏ అవసరాలున్నా చేయి చాపి అడగకుండానే ఇరుగు పొరుగులు ఆదుకునేవారు. ఒకరికొకరు సహాయం సహకారాలు చేసుకుంటూ వుండేవారు.

తెచ్చుకున్న సరుకులు పొట్లాలు విప్పి, డబ్బాలలో నింపికున్నాక, ఆ పురికోసలని జాగ్రత్తగా చిక్కులు విడదీసి ఏదైనా కండెకి చుట్టపెట్టడం మీలో ఎవరికైనా గుర్తుందా? తర్వాత ఎందుకో ఒకందుకు ఉపయోగపడుతుంది అనుకుంటూ అప్పటివాళ్ళు జాగ్రత్తలు పడడం, దాచడం అనేది వుండేది. తెచ్చుకునే సరుకులు, సామాన్లు కూడా అనవసరమైనవి కాకుండా, ఎప్పటికేది అవసరమో అంతవరకే తెచ్చుకుంటూ వుండేవారు. కొన్ని సీజన్లలో మాత్రం ఏ వస్తువు తక్కువ రేటుకి వస్తుందో చూసుకుని, చింతపండు, కందిపప్పు, మిరపకాయలు వంటివి ఎక్కువగా తెచ్చుకుని నిలవ వుంచుకునేవారు. పాడవకుండా దాచుకోవాలంటే అప్పట్లో ఫ్రిజ్జులు గట్రాలు లేవుగా! అందుకే మధ్య మధ్యలో వాటిని ఎండపెట్టుకోవడం, జల్లించుకుని బాగుచేసుకోవడం వంటివి శ్రద్ధగా, ఓపికగా చేసుకునేవారు.

పిండివంటలు వంటివి కేవలం పండగ సమయాల్లోనే చేసుకునేవారు. ఏ నెలకోసారో తినుబండారాలు చేసుకుని డబ్బా నింపితే ఇంట్లో పిల్లలు బడి నుంచి వచ్చాక , తినడానికి ఏమన్నా పెట్టు అంటూ చేయి చాపితే.. నెలంతా కూడా అవే వుండేవి పిల్లలకి. అవి అన్నీ కూడా పిల్లలకీ , పెద్దలకూ.. బలవర్ధకమైనవీ, ఆరోగ్యాన్ని పెంపొందించేలా, ఆయా కాలాలకు అనుగుణంగా వుండేవి. సున్నుండలూ, జంతికలూ, వేరుశెనగ బెల్లం వుండలు.. ఇలా ఏది చూసినా ఆరోగ్యానికి దోహదం చేసేవే వుండేవి. ఏ కాలానికి తగ్గ పళ్ళు, కాయలు, అందరిళ్ళలోనూ పెరట్లోనే పెంచుకునే చెట్లకి కాసేవి. కల్తీలు అనేవే దేంట్లోనూ కూడా వుండేవి కాదు.. ఆరు బయట చెట్ల కింద ఆడుకుంటూ.. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ.. ఆ రోజులే రోజులు అనుకునేలా వుండేవారు.

ఇవన్నీ ఈరోజు కబుర్లలో ఎందుకు చెపుతున్నానంటే.. ఈ కబుర్లు అన్నీ ఇక మన గత చరిత్రలో మాత్రమే కనపడతాయి కనక.. అప్పుడప్పుడు ఇలా తలుచుకుని తృప్తి పడాలి కనుక. ఎందుకంటే..

ఇప్పుడు.. ఈ రోజుల్లో..

ఈ రోజుల్లో అరిచేతిలో స్వర్గం.. ఆ స్వర్గంలో విహరించే రోజులు వచ్చేసాయి అందరికీనూ..

పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ సెంటర్లు.. ఎక్కడో చిన్న ఊళ్ళల్లో తప్ప ఇంచుమించుగా పచారీ కొట్టులలోనూ, కిరాణా కొట్లలోనూ సరుకులు కొనడం చాలా వరకూ తగ్గిపోయింది. డి మార్టు, బిగ్ బజార్, మోర్, ఇలా ఇటువంటి దుకాణ సముదాయాలు పెరిగిపోయాయి. ఎదురుగా కంటికింపుగా, రంగులు రంగులుగా రకరకాల వస్తువులు పేర్చిపెడితే ఆకర్షితులు కాని వారెవరు? పిల్లలు అయితే మరీ టెంప్ట్ అయిపోయేలా.. ఎప్పుడూ పేరూ ఊరూ తెలీని కొత్త కొత్త రకాల బిస్కెట్లు, చాక్లెట్లు, మేగీలు, చిప్సూ వగైరాలు కలర్‌ఫుల్ పేకెట్లతో ఎదురుగా కనపడుతుంటే.. చేతికొచ్చిన పేకెట్లు వాళ్ళే అందిపుచ్చుకుని, ఆ తోపుడుబండిలో వేసేస్తూంటారు. అవి ఎంతవరకు ఆరోగ్యం అనేది చూసుకునే పనే లేదు. అవి తినడానికి పనికి వచ్చినా, రాకపోయినా.. పిల్లలని ఆకట్టుకునేలా అందులో ఏదో చిన్న చిన్న బొమ్మలు బహుమతిగా పెడుతూ మరింత ఆకట్టుకునేలా చేయడం ఆ వ్యాపారవేత్తల తెలివితేటలు.

పిల్లలేంటీ.. పెద్దవాళ్ళు కూడా.. ఈ వస్తువు అవసరం.. ఇది అవసరం లేదు అనుకోకుండా కనపడినవన్నీ వేసుకోవడమే. ఒకటి కొంటే మరోటి ఫ్రీ అని రాసుంటే.. గబగబా తీసుకోవడమే. ఆ మొదటిదే అనవసరం అయితే ఆ రెండోది మరీ అనవసరం. ఆ తర్వాత రెండూ కలిసి డస్ట్ బిన్ లోకి తొయ్యడమే. ఇలాంటి అవసరంలేని సరుకులు.. ఏవో కొత్త రకాలు ఆ యూట్యూబ్ లలోనూ, ఇన్‌స్టా గ్రాములలోనూ చూడడం.. వచ్చి కొనడం.. తర్వాత చెయ్యడానికి బద్ధకాలు.. ఇనన్నీ తారీకులు ఎక్స్‌పైర్ అయిపోవడాలూ, ఆ తర్వాత బయటకి గిరాటెయ్యడం.. చాలా మందికి అలవాటైపోయింది లెండి.

తొయ్యలేక తొయ్యలేక ఈ సరుకుల బండిని తోసుకుంటూ బిల్లింగ్ దగ్గరకి వచ్చి, హనుమంతుడి తోకంతటి బిల్లుని చూసి.. అబ్బే.. భయపడే పనేలేదు.. జేబు నిండా డబ్బులు వుండకపోయినా కార్డులు వుంటాయిగా.. వాటిని గీకడమే..

ఇప్పుడు ఇల్లు కదలకుండా ఆన్‌లైన్ షాపింగ్ సదుపాయాలు కూడా వచ్చేసాయి. ఇలా ఆర్డర్ పెట్టగానే.. అలా మన ముందుకు ప్రత్యక్షమయిపోతున్నాయి. రకరకాల యాప్‌లు.. రకరకాల ఆకర్షణలు, రకరకాల సదుపాయాలు.. అమెజాన్‌లో తెప్పించామండీ! అనడం వాడుకై పోయింది. ఇంకోటి అదేదో ‘బ్లింక్ ఇట్’ అట.. నిజంగా కనురెప్పపాటులో మనం ఆర్డర్ ఇచ్చినవి తెచ్చేస్తున్నారు. నాకైతే వాడు మన వీథి చివరే కాసుకుని కూర్చున్నాడా అనిపిస్తుంది.

సరే.. ఈ వారం ఈ కబుర్లు ఆపి.. మళ్లీ వచ్చే వారం కొనసాగిద్దాం.. నాకూ కాస్త ఆన్‌లైన్ షాపింగ్ పని వుంది..😁

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here