ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -8

0
4

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ ఎనిమిదవ భాగం. [/box]

[dropcap]ఎ[/dropcap]వరికైనా సుపారీ ఇచ్చి అస్తవ్యస్తని లేపేద్దాం. లేదా తానే స్వయంగా కారుతో వేగంగా వెళ్లి గుద్దేసి చంపేద్దాం… అని ప్లాన్‌లు వేశాడు.

కొడుకు సంగతి తెలిసిన శాంతికుమార్ ముందే హెచ్చరించాడు.

‘తొందరపడి గొడవలు తెచ్చుకోకు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. నేరం చేసి పట్టు పడితే జైలు శిక్ష. నీ జీవితం నాశనం అవుతుంది’ అన్నాడు.

‘ఏం పర్వాలేదు. కొండలరావ్ వున్నాడు’ అన్నాడు ధీమాగా.

‘కోళ్లనీ, గొర్రెలనీ చంపితే కొండలరావు చూసుకుంటాడు. మనుషులను చంపితే అతనేం చేస్తాడు. అందులోనూ అస్తవ్యస్త అల్లాటప్పా వాడు కాదు. నలుగురిలో పేరు ప్రతిష్ఠలు వున్నవాడు. ఇప్పుడు కాబోయే మామగారి అండ కూడా తోడయింది. అతనికి ఏమైనా జరిగితే గొడవలు అవుతాయి’ అన్నాడు తండ్రి.

‘మరేం చెయ్యను’ అన్నాడు వినాష్ విసుగ్గా.

‘ఆ అమ్మాయిని. మర్చిపో’ అన్నాడు

“అది నాకు సాధ్యం కాదు. ఇన్నాళ్టికి ఓ అమ్మాయి నచ్చింది. నేను చచ్చినా ఇంకోరిని పెళ్లి చేసుకోను. నాకు డోలాయ కావాలంతే” అన్నాడు.

‘నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చెయ్యమంటే చేస్తాను గానీ, ఇంకెవరినో ప్రేమించి, పెళ్ళి కుదిరిన పిల్ల కావాలంటే ఏం చెయ్యను’ అన్నాడాయన విసుగ్గా.

‘ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు డోలాయ కావాలంతే’ అన్నాడు మొండిగా.

తల పట్టుకున్నాడు శాంతికుమార్.

‘మొండి వెధవ. మెల్లిగా చెప్పాలి’ అనుకుని, “చూడు నాయనా ఇందులో నేనూ కొండలరావు ఏమీ చేయలేము. నువ్వే ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలి. చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్లూ అస్తవ్యస్త కంటే గొప్ప వాడిని అనిపించుకోవాలి” అని నచ్చ చెప్పాడు.

ఆ ఆలోచన నచ్చింది వినాష్‌కి.

వెంటనే ఇద్దరు మనుషులని నియమించాడు.

అనుక్షణం అస్తవ్యస్త మీద కన్నేసి ఉంటూ ఎప్పటికప్పుడు అతని చర్యలు వినాష్‌కి తెలియజెయ్యటం వాళ్ళ పని.

అతను హెయిర్ కట్ చేయించుకున్నా, గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టినా ఇతనికి తెలియాలి.

ఒక రోజు అస్తవ్యస్త డోలాయకి బొకే పంపించాడు. డోలాయ సరదా పడింది.

ఆ వార్త అందగానే ఓ ఫేమస్ ఫ్లోరిస్ట్‌కి ఫోన్ చేసి మీరు ఖరీదైన బొకేలు గంటకి ఒకటి చొప్పున 24 గంటలూ ఫలానా వ్యక్తికి పంపండి అని పురమాయించాడు.

నాలుగు వరసగా అందుకున్న డోలాయకి విసుగు వేసింది. ‘ఇటు వస్తే కాళ్ళు విరగ్గొడతా’ అంది.

‘క్షమించండి మేడం. కస్టమర్ డబ్బు కట్టేశారు. కాబట్టి మీరు కాళ్ళు విరగ్గొట్టినా ఆగవు. నా కాళ్ళు విరగ్గొడితే వేరే వాళ్ళని పంపిస్తారు మా ఓనర్. మీకు ఇబ్బందిగా వుంటే ఆ కస్టమర్‌తో మాట్లాడండి’ అన్నాడు.

వినాష్‌కి ఫోన్ చేసి తిట్టిపోసింది డోలాయ.

‘మరి నా ప్రేమ అస్తవ్యస్త ప్రేమ లాగా అణా కానీ ప్రేమ అనుకున్నావా? నా లెవెల్ వేరు’ అన్నాడు గర్వంగా.

అస్తవ్యస్త పనిమీద బందరు వెళ్లి కిలో బందరు లడ్డూ, అరకిలో నల్ల హల్వా తెచ్చాడు డోలాయ కోసం.

ఆ విషయం తెలుసుకున్న వినాష్ మధుర నుండి పేడా, ఆగ్రా నుండీ పేఠాలు, కలకత్తా నుండి రసగుల్లా, లోనావాలా నుండీ చిక్కి… అట్లా బోలెడన్ని ఊళ్ళ నుండి బోలెడన్ని రకాలు ఒక్కోటీ పది కిలోల చొప్పున తెప్పించి డోలాయ వాళ్ళింటికి పంపించాడు.

డోలాయకి కోపం వచ్చి పోలీసు కంప్లైంట్ ఇచ్చింది.

వాళ్ళు బుర్ర గోక్కున్నారు. ఇదో పిచ్చికేసు. ఏ నేరం కింద అరెస్టు చెయ్యాలి. ‘ఇవన్నీ ఏ అనాథలకో పంచి పెట్టండి’ అన్నారు.

డోలాయకి బహుమతులు ఇవ్వడంలోనే కాదు. వ్యాపారంలోనూ అతనికి పోటీయే. అస్తవ్యస్త దశతిరిగి అతను పట్టిందల్లా బంగారం అవటం, ఇటు వినాష్‌కేమో ఏలినాటి శని ప్రవేశించి అన్నిటా నష్టాలు.

ఫలితంగా వాళ్లిద్దరి ఆర్ధిక పరిస్థితి లోనూ తేడా తగ్గిపోతోంది.

అస్తవ్యస్త ఒక స్పెషల్ కారు తయారు చేయించుకున్నాడు.

అంతా ఆటోమేటిక్. బుల్లెట్ ప్రూఫ్. ఇంకా బోలెడన్ని ఫీచర్స్ వున్నాయి. లోపలికి ఎక్కి డెస్టినేషన్ సెట్ చేస్తే చాలు. వెళ్లి అక్కడ ఆగుతుంది.

(ఇక్కడ కాస్త ఆగి నవల ప్రారంభం గుర్తు చేసుకోవాలి).

బయటకి వస్తూ ఆత్రతని జాలిగా చూసి లిఫ్టులో కిందికి వచ్చాడు అస్తవ్యస్త.

జేబు లోంచి రిమోట్ తీసాడు. నొక్కగానే అంత దూరాన గెరాజ్ తలుపు తెరుచుకుని కార్ బయటకు వచ్చింది.

ముట్టుకోగానే తలుపు తెరుచుకుంది. లొపలికి ఎక్కాడు. సరదాగా కావలిస్తే డ్రైవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వెళ్లిపోవచ్చు.

ఆవేళ ఆటోమేటిక్ డివైజ్ ఆన్ చేసి డోలాయ ఇంటికి వెళ్ళాలి అని సెట్ చేసి హాయిగా సీట్‌లో వెనక్కి వాలి డోలాయని తలచుకుంటూ తియ్యని ఊహల్లో తేలిపోతూ గమ్యం చేరిన విషయం గమనించలేదు అతను.

కారు ఆగిన వెంటనే అతను స్పందించకపోతే వరసన చర్యలు తీసుకుంటుంది కారు.

ముందుగా సీట్ పైన చిన్న తలుపు తెరుచుకుని ఓ చిన్న రబ్బరు చెయ్యి బయటికి వచ్చి నెత్తిన మెల్లిగా మొట్టికాయలు వేస్తుంది.

ఆ తరువాత ఎదురుగా వున్న నీళ్ల గన్ తెరుచుకుని మొహాన నీళ్లు కొడుతుంది.

అప్పటికీ స్పందించకపోతే పోలీసులకి సమాచారం అందుతుంది.

మొట్టికాయలు పడేసరికి ఉలిక్కిపడ్డాడు అస్తవ్యస్త. తల విదుల్చుకుని చిరునవ్వుతో కారు దిగాడు.

అదే సమయంలో వినాష్ గొప్ప చిక్కుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు.

అస్తవ్యస్తకి పోటీగా తనూ ఓ ఆటోమేటిక్ కార్ కొనుక్కున్నాడు.

‘విదేశాల్లో తయారైన కారొద్దు నాకు. స్వదేశీ కారులో ఎక్కి డోలాయని ఇంప్రెస్ చేస్తాను’ అనుకున్నాడు.

పోనీ ఏదైనా మంచి కంపెనీ వారిని సంప్రదిస్తే వాళ్ళు… చేసే వాళ్లేమో మూసేస్తున్న కంపెనీ జి.యం.బలదేవ్ సింగ్ అనే సర్దార్జీకి ఆ బాధ్యతను అప్పగించాడు.

అతను తన శక్తిని అంతా వినియోగించి కారు తయారు చేశాడు. అస్తవ్యస్త కారులో కంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ వున్నాయి.

అది ఎక్కి బయలు దేరాడు. రామ నగరం అని గమ్యం సెట్ చేశాడు.

ఆ రామ నగరం యాభై కిలో మీటర్ల దూరం లో ఉంది. గంటకి 120 కిలో మీటర్ల వేగం సెట్ చేసి.

ఆటోమేటిక్‌లో పెట్టి కూచున్నాడు.

అతనూ డోలాయనే తల్చుకుంటూ వున్నాడు.

2000 కిలోమీటర్ల దూరంలో మరో రామనగరం వుంది. అదేమో అని తప్పుగా అర్ధం చేసుకున్న కారు అటు పడి పోవడం మొదలు పెట్టింది.

అరగంటకి గమ్యం చేరాల్సింది ఆగకుండా పోతుంటే అనుమానం వచ్చింది.

దారి తప్పానని గ్రహించి ఆపాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here