నేను మరణించాల్సి వస్తే..?

0
5

[పాలస్తీనా కవి రెఫాత్ అలరీర్ రచించిన ‘If I Must Die’ అనే కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Refaat Alareer’s poem ‘If I Must Die’ by Mrs. Geetanjali.]

~

[dropcap]అ[/dropcap]వును నేను గనుక చనిపోవాల్సి వస్తే..
నా కథ చెప్పటానికైనా నువ్వు బతికి ఉండాలి.
నా వస్తువులు అమ్మడానికైనా..
ఒక చిన్న గుడ్డ ముక్క కొనడానికైనా..
పోనీ కొన్ని దారాలు.. (దాన్ని తెల్లని రంగులోకి మార్చి పొడవైన తోక లాంటి దాన్ని చేయాలి)
గాజాలో ఎక్కడో స్వర్గాన్ని చూస్తున్న ఒక చిన్నపిల్లాడు..
ఎవరికీ.. కనీసం తన రక్త సంబంధీకుల కైనా..
పోనీ తనకు తానైనా సరే వీడ్కోలు చెప్పకుండా
చనిపోయిన తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న పిల్లవాడు..
ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న
నువ్వు తయారు చేసిన గాలి పటాన్ని..
నా గాలి పటాన్ని చూస్తాడు.
ఒక్క క్షణం అక్కడో దేవదూత ఉందనుకుంటాడు.
కనీసం భ్రమ పడతాడు.
ఆమె బోలెడంత ప్రేమని
తనతో తెస్తుందని కూడా అనుకుంటాడు.. బహుశా!
పోనీలే.. నేను చనిపోవాల్సి వస్తే..
నా మృత్యువు ఆ గాలిపటం రూపంలో అయినా ఒక ఆశని తెస్తుందేమో..?
అందుకే.. నేను గనుక చనిపోవాల్సి వస్తే..
నువ్వు బతికి ఉండాలి!

~

మూలం: రెఫాత్ అలరీర్

అనుసృజన: గీతాంజలి


దివంగత పాలస్తీనా కవి రెఫాత్ అలరీర్ ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజాలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ‘We Are Not Numbers’ ప్రాజెక్టు సహవ్యవస్థాపకులలో ఒకరు. 07 డిసెంబర్ 2023 నాడు ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులలో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here