[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తానిక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను అని ఆలోచనలో పడతాడు సుందర్. కదంబ రాజుల పరిపాలనలోని అద్భుతమైన యంత్రాంగం, మంత్రాంగం గురించి తలచుకుంటాడు. శిలాశాసనంలో ప్రస్తావించిన సప్త ధాతువుల గురించి ఆలోచిస్తుండా ఋగ్వేదంలోని మాట గుర్తుకొస్తుంది. ఆ ప్రాంతం గురించి, ఆనాటి రాజగురువుల గురించి ఆలోచిస్తూ, తన అభిప్రాయాలను డైరీలో రాసుకుంటాడు సుందర్. చుట్టూ చూస్తే, కృష్ణప్రసాద్ గారిచ్చిన ఒక మందారం మొక్కపై సుందర్ దృష్టి నిలుస్తుంది. మందారం గురించి ఆయన చెప్పిన వివరాలు, బెంగాల్‍లో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఎర్ర మందారాలతో పూజించే పద్ధతిని గుర్తు చేసుకుంటాడు. బాల్కనీలో ఉన్న మొక్కని చూస్తూ తన మనసులో మెదిలిన అంశాలని డైరీలో రాసుకుంటూ ఉంటాడు. గోవాలో జరిగిన పింటో క్రాంతి గుర్తొస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగుతుంది. కమిన్ అని అంటాడు. మళ్ళీ బెల్ మ్రోగుతుంది. లేచి హాల్లో లైట్ వేసి తలుపు తీస్తాడు. ఎదురుగా చిత్ర, కొద్ది దూరంలో జ్యోతి కనిపిస్తారు. లోపలికి రండి అంటే, నేనొక్కదాన్నే అయితే లోపలికి వచ్చేసేదాన్నే, కానీ జ్యోతి కూడా ఉంది అంటుంది చిత్ర. జ్యోతికి నేను కొత్త కాదుగా అంటాడు సుందర్. లోపల ఎవరూ లేరని, లోపలికి రమ్మంటాడు. కానీ వాళ్ళు రారు. లోపల ఏదైనా మందారం మొక్క ఉంటే తాను లోపలికి రాలేనని జ్యోతి చెప్పిందని చిత్ర అంటుంది. సుందర్ ఆశ్చర్యపోతాడు. ఇక చదవండి.]
[dropcap]అ[/dropcap]నుకోకుండా చాలా ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. మందారాల గురించి ఆలోచించే సమయంలో సరిగ్గా జ్యోతిని వెంటబెట్టుకుని చిత్ర రావటం, డోర్ బయట నిలబడి ఆమె మందారం మొక్క ఇంట్లో ఉంటే రాలేననటం వింతగా తోచాయి. ఇంతకీ మందారం లోపల ఉన్నదని ఎలా తెలుసుకుంది? ఇలాంటప్పుడు బలవంతం పెట్టి లోపలికి రమ్మని – మందారానికీ, ఆమెకూ ఉన్న సంబంధాన్ని అన్వేషించాలా లేక ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి మందారాన్ని ఎక్కడో దాచేసి లేదా పారేసి ఈ అమ్మాయితో మాట్లాడాలా? వాస్తవానికి ఈ అమ్మయి సంగతి చాలా క్లిష్టమైనది. చరిత్రని, నిజానిజాలని అలా ఉంచితే ఒక చారిత్రాత్మకమైన దృశ్యాన్ని ఊహ లోంచి ప్రాణం పోసి బొమ్మలా దింపటం సామాన్యమైన విషయం కాదు. ఈ అమ్మాయి గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్న తరుణంలో ఈమె నాతో మాట్లాడాలనుకోవటం మంచి విషయం. ఈ వ్యవహరానికి మరో ముడి ఈ మందారం.
“ఆ మొక్క అలా అంటే ఏ మాత్రం లోనికి రావటం కుదరదా?”, అడిగాను. అప్పటికే జ్యోతి చాలా దూరం వెళ్ళి నిలబడింది. చిత్ర అటూ ఇటూ చూసింది.
“సార్, నా మాట నమ్మండి. కొందరికి ఎలర్జీ ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు నమ్మలేరు.”
“ఎలర్జీ సంగతి అర్థమవుతోంది. మరిప్పుడు ఏం చెయ్యను?”
“ఇంకెక్కడైనా.. పోనీ క్రింద ఏదైనా వీలైన చోట టీ త్రాగుతూ మాట్లాడవచ్చు కదా?”
“ఇప్పుడే వస్తాను” అంటూ లోపలికొచ్చి తయారయ్యాను.
***
“ఏదైనా సమస్య ఉంటే అటువంటి వాటిల్లో నిష్ణాతులైన వారితో మాట్లాడి ఉండవచ్చు కదా?”, సూటిగా జ్యోతిని అడిగాను. ఎంతో గంభీరంగా తల ఆడించింది.
“సమస్యలన్నిటికీ వైజ్ఞానికపరంగా సమాధానాలుంటాయని ఎన్నోసార్లు అనుకుంటాం. అది ఎంత మటుకు నిజం?”
ఈ సారి చిత్ర అందుకుంది.
“ఎన్నో అంశాలను పరిశోధిస్తూ, పరిశోధిస్తూ ఇది కాదు, ఇది అవును అని అప్పటికి నిర్ధారించుకున్నదంతా విజ్ఞానం లోకి చేరుతుంది. ఈ దారిలో ఏదో ఉంది అనే నమ్మకం తోనే కదా వైజ్ఞానికుడు కూడా ముందరికి సాగుతాడు? అందుచేత అన్వేషణకు కావలసిన ఏ ఆలోచనైనా నిజమైన సైంటిస్టు వదలిపెట్టడు. ఆ ఆలోచనల నేపథ్యంతో ఏదైనా వైయక్తికమైన ఇబ్బంది ఉన్నప్పుడు విజ్ఞానం పేరుతో దానిని వ్యతిరికిస్తూ ఉండటం ఒక సామాన్యమైన పరిపాటి. ఈ కోణంలో ఆలోచిస్తే ఏ ప్రక్రియలో అయినా విజ్ఞానం లోని భాగమే.”
జ్యోతి ఎందుకో నవ్వింది.
“చిత్ర ఇలాగే మాట్లాడుతుంది..” చెప్పింది. “..డాక్యుమెంటరీలు చేస్తుంది కదా? అన్నింటినీ డాక్యుమెంట్ చేసినట్లు అనవసరంగా అనుకుంటుంది.”
“నిజమే..”, అన్నాను. “..స్పష్టిలో ఎక్కువ శాతం డాక్యుమెంట్ చేయలేనిదే ఉంది. ఉంటుంది కూడా..!”
“ఎందుకంటారు?”
జ్యోతి అడిగిన ఈ ప్రశ్న నన్ను కదిలించింది. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రీతిగా కేవలం సారాన్ని గ్రహించే అంశాన్ని అందుకునేందుకు కొందరు సంవాదాలలోకి దిగుతారు. అక్కడ వాదన ఉండదు, చర్చ ఉంటుంది. ఇలాంటి చర్చలలో పాల్గొనేవారు పలు విషయాలను అంతఃకరణలో చర్చించుకుని అనుభవించి మెల్లగా ఎన్నో గొప్ప విషయాలను గ్రహించి అక్కడక్కడ రూఢి చేసుకోవాలనే అప్రకటితమైన కోరికతో ఉంటారు.
“జ్యోతీ..” చెప్పాను. “..అనంతమైన స్పష్టి అర్థమైనట్లు ఎంత కనిపిస్తుందో, దానికి వేయి రెట్లు అర్థం కాని వాటిని టక్కున అర్థం చేసుకునే ప్రయత్నం ఏ రోజూ మానవద్దంటుంది. అంటే డాక్యుమెంట్ అయిపోయిందని అనుకున్న రోజు అనంతం లోనిది ఏదీ సరిగ్గా అర్దం కాలేదని తెలుసుకోవాలి”
చిత్ర టీ చివరి గుటక మింగి కళ్ళు పెద్దవి చేసింది.
“బాగుంది. ఒప్పుకుంటాను. ఈ సో కాల్డ్ అనంతానికి ఈ మాయ రోగం ఎందుకు?”
ముగ్గురం నవ్వుకున్నాం.
“మాయరోగం కాదు..”, చెప్పాను. “..అనంతం యొక్క వ్యాకరణమే అది. ఇటూ అటూ అలా వ్యాపించుకుంటూ పోనిదే అది అనంతం కాదు.”
“మరి అనంతం శాశ్వతం కాదా?”
“తప్పకుండా. కాలానుగుణంగా ఆ మోతాదులో వ్యాప్తి చెందేదే శాశ్వతంగా కనిపిస్తుంది. మనం ఒక గీత దాటేస్తే ఇక గీత మనకంటే చిన్నదైపోయినట్లే.”
“అంటే..!”, అంటూ జ్యోతి ఆగిపోయింది.
“యస్? చెప్పు జ్యోతీ!”
“గణిత శాస్త్రం అన్నింటినీ చివరి దశ కోసం లెక్క ఇది మిగిలింది అంటుంది. వేదాంతం అనుభవాన్ని వివరిస్తుంది. లెక్కించ లేనిది తర్కం కాదు అని అనుకూడదన్నది సరైన ఆలోచనా?”
“ఈ మాటలు ఎక్కడో విన్నట్లుంది?”
“ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ రచించిన ‘ప్రాసెస్ అండ్ రియాలిటీ’ ”
“కరెక్ట్, జ్యోతీ, గొప్ప గ్రంథమే చదివావు.”
“లేదండీ. చదివిన వాటిలో గొప్పవే గుర్తున్నాయి.”
“ఇది ఇంకా గొప్పది.”
‘మీ ఇద్దరు ఒకర్నొకరు పొగుడుకుంటూ ఉంటారా లేక నా సంగతి కూడా చూస్తారా?” చిత్ర అడిగింది.
“ఓ తప్పకుండా..!” అన్నాను. “..చిత్రా! ఈ రోజెందుకో చాలా చక్కగా తయారయ్యావు. జుట్టు కూడా చాలా అందంగా దువ్వుకున్నావు. లిప్‌స్టిక్ లేతగా, సరైన మోతాదులో అద్దావు. చియర్‍ఫుల్‌గా, చక్కగా, యాక్టివ్‌గా ఉన్నావు. శభాష్!”
జ్యోతి పిచ్చి పిచ్చిగా నవ్వింది. చిత్ర కోపంగా చూస్తోంది. టేబుల్ మీద గాజు జార్‌లో మంచి నీళ్లున్నాయి. దానిని, నన్నూ, సీరియస్‍గా చూసింది.
“అది అంత తేలిగ్గా ఎత్తలేవు!” అన్నాను.
చిత్ర నవ్వేసింది .
“నువ్వు కూడా చర్చలో పాల్గొనవచ్చు.”
“ఊ.. బాగుంది చర్చ! ఇంతకీ ప్రాసెస్‌ను రియాలిటీ అనాలా? లేక రియాలిటీనే రియాల్టీ అనాలా?” అడిగింది.
“కలనీ, నిజాన్నీ కలిపేస్తే కలగూరగంప అయి కూర్చుంటుంది.”
“అంటే?”, జ్యోతి అడిగింది.
“అధ్యయనానికి కల కలే, నిజం నిజమే!”
“మరి నిజం యొక్క ప్రాసెస్ కల అని అనుకుంటే?” నా నోరు మూత పడింది.
“కొద్దిసేపు పిచ్చిగా మాట్లాడదాం..” చిత్ర అంది, “..అటు తిప్పికొడదాం. అసలు నిజం అనేది కల యొక్క ప్రాసెస్ ఎందుకు కాకూడదు?”
“ఊ.. నిజమా అబద్ధమా అనేది సరైన అధ్యయనంలో భాగాలు కాకూడదు. ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం రాలేదు.”
“ఏంటది?”
“నాతోనే ఎందుకు మాట్లాడాలనిపించింది?”
“ఊ.. నాకు జరిగే ఆ భావాలని చాలా మంది దగ్గర పంచుకున్నాను. మంచి ఫలితం ఉంటుందనుకున్నాను. ఫలితం అన్న మాట ప్రక్కన పెట్టి నన్ను బజారులో పెట్టే ప్రయత్నం చేసారు.”
“బజారు..”
“అవును. ఏదో కీర్తి గడిద్దామనుకున్నారు, ఏదో సంపాదిద్దామనుకున్నారు. నన్ను వాడుకుందామనుకున్నారు. వారిలో చాలామంది నన్నసలు సరిగ్గా నమ్మనూ లేదు. వారిలో మాధవ్ ఒకడు.”
“మాధవ్ అంటే..”
“అవును. ప్రస్తుతం జైల్లో అన్నాడు.”
“కరెక్ట్. విడిపించండి, నేను చంపుకోవాలి అని చెప్పావు. అతనే కదా?”
“అవును.”
“కానీ జైల్లో ఉంటే సమస్య ఏం లేదు కదా?”
నిట్టూర్చింది జ్యోతి.
“మధుకర్ గావడే గారి పుస్తకాలు, ఆయన గోవా విషయంలో ప్రభుత్వం వారికి చేస్తున్న సేవ ఇదంతా మీకు తెలిసిందే”
“అవును”
“మీకు మంచి మిత్రులు”
“అవును”
కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది.
“మాధవ్‍ని జైల్లో పెట్టించింది ఆయనే.”
“ఎందుకు?”
“నాకు తెలియక మాధవ్ గురించి చెప్పాను. ఏం జరిగిందో తెలియదు. ఒక రోజు జైల్లో ఉన్నాడని తెలిపింది – అక్కడితో కథ అయిపోలేదు. వారానికి రెండుసార్లు మధుకర్ జైలుకి వెళ్లి మాధవ్ చెప్పేవన్నీ వ్రాసుకుంటూ డాక్యుమెంట్ చేస్తున్నారు. త్వరలోనే ఓ సంచలనాత్మకమైన పుస్తకం రాబోతోంది.”
“అవన్నీ నీవు చెప్పిన.. స్కెచెస్. అవునా?”
“అవును. కానీ ఒక ఇన్‍స్క్రిప్షన్‌ను ముందర పెట్టుకుని పూర్తిగా నా స్కెచ్‌ను ఒప్పుకున్న మొదటి వ్యక్తి మీరు”
“అర్థమైంది”
“ఇది కేవలం లౌకికం. మీతోనే మాట్లాడాలి అని ఎందుకన్నానంటే..”
చిత్ర దీర్ఘంగా శ్వాస తీసుకుని బుగ్గ మీద చెయ్యి పెట్టింది.
“కాలగమనంలో నేను ఇక్కడ, ఇప్పుడున్నాను. కాని అలౌకికంగా ఆలోచిస్తే నేను ఇప్పటి దానిని కాను..”
“..”
“నేను మిమ్మల్ని చాలా సార్లు నా కలల్లో చూసాను. చూస్తున్నాను. మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఏది ప్రాసెస్, ఏది రియాలిటీ?”
***
(ఇంకా ఉంది)