[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
171
టి.వి., స్మార్ట్ ఫోన్లే లోకం నేడు
ఎవ్వరి ప్రమేయం అవసరం లేదు యివుంటే
అవసరం లేదు అన్న పానీయాలు
కావాలని వచ్చే అతిథులూ అడ్డమే
172
తెలుగుకు తెగులు పట్టుకుంది
బలవంతంగా ఆంగ్ల పదాలు
కలగా పులగంగానే అర్థమయ్యేది
అలవోకగా అర్థం కావాలంటే ఆంగ్లం ఉండాలి
173
అద్దం మన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది
కదా అని నమ్మవలసిందేగదా
కాదని అనుకోలేములే
లేదని అద్దంలో చూడడం మానేయలేంగదా
174
మనసుతోనే మన ఆటలన్నీ
దానిని కాదని ఏ నిర్ణయమూ ఉండదు
దాని తర్జన భర్జన తర్వాత
కానీ అంతిమ నిర్ణయము అమలౌతుంది
175
రోడ్డు ప్రమాదలను పట్టించుకోరు
నడి రోడ్డు మీద వదిలేస్తారు
వడి వడి గాను వెళతారు
మడి కట్టుకుని చూస్తారు మనకెందుకులే అని
176
కాల చక్రం గిర్రున తిరుగుచున్నది
చలనం లేకుండా చేయాలనే ప్రయత్నం
వల వేసి బంధించాలని
కలలోనైనా సాధ్యపడదే, మరి ఎలాగా?
177
ఆత్మ అంటే మనసే కాదా?
కతలేగా ఆత్మ వున్నదని
మతాల ప్రచారమూ అదే
అంతా నమ్మేది ఉన్నదనే, చనిపోయిన తర్వాత ఏమైనట్లు?
178
జీవి పుట్టుకనుండి బ్రతకాలనే ఆశ
అవిటైనా, కుంటైనా, గ్రుడ్డి అయినా
అవస్థలు పడుతూనైనా సరే
అవసాన దశ వరకు అదే ఆశ
179
ఆశే నడిపించు జీవితాన్ని కడ దాకా
ఆశ లేని జీవితం వుండదు
ఆశ నిరాశలతో నున్న జీవితం
వశమయ్యేనా ప్రాణం నిలుపుకొనుటకు?
180
న్యాయ స్థానాలకు వినిపించేదే ముఖ్యం
కయ్యాల, వియ్యాల వారైనా, ఇద్దరూ సమమే
తయారుగా వున్నవే వింటుంది
రయముగ తీర్పిచు వాదనలతో